కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ

Country get Benefit in Alliance Governments! - Sakshi

అవలోకనం

ఎందుకనో మన మార్కెట్‌ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి.

‘హంగ్‌ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్‌ మార్కెట్‌ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్‌లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. 

అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. 

లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి.
నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. 

స్టాక్‌ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్‌ బడ్జెట్‌’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్‌ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు.

ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్‌డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్‌ నైనన్‌ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్‌ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్‌ హయాంలో సాధించిన పర్సంటైల్‌ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3.  నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 

2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్‌సభ అమరికతో దీనికి సంబంధం లేదు. 

ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ  ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. 

కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్‌ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్‌’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్‌ విశ్లేషకులు, బిజి నెస్‌ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్‌’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం.
 

- ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top