జ్ఞాపకాల దిబ్బ

The Congress will Be Fall - Sakshi

జీవన కాలమ్‌
కాంగ్రెసు మా తరానికి– ఇంకా వెనుక తరాలకి కేవలం రాజకీయ పార్టీ కాదు. ఒక ఉద్యమం. ఒక జాతిని మేల్కొలిపిన మహా యజ్ఞం. స్వాతంత్య్రం వచ్చాక చదువు, సంధ్యతో ప్రమేయం లేని వారంతా పదవుల్లో, మంత్రులయ్యారుగానీ ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న మహానుభావులంతా ఇంగ్లండులో బార్‌–ఎట్‌–లా చదివిన మేధావులు. ఆ రోజుల్లోనే లక్షల ఆస్తిని– కోరుకుంటే సంపాదించగల సమర్థులు. అయినా చదువునీ, ఒంటిమీద మిల్లు బట్టలనీ, భవిష్యత్తునీ కట్టగట్టి అటకెక్కించి– తమ ఉద్యమానికి ఒక పేరు పెట్టుకున్నారు–అదీ కాంగ్రెసు.

తిలక్, మాలవీయ– వీరంతా గాంధీ ఆఫ్రికా నుంచి వచ్చే నాటికి ఉద్యమాన్ని నడుపుతున్నారు. గాంధీ అప్పటికే బ్రిటిష్‌ వారి తలలను ఆఫ్రికాలో దించిన కథలు తిలక్‌ చదివి ‘ముందు ఉద్యమంలో దిగాలంటే– నీకు ఈ దేశం ఏమిటో తెలియాలి. ఈ మనుషులెవరో తెలియాలి. ఎవరికి, ఎందుకు స్వాతంత్య్రం కావాలో తెలియాలి. దేశాన్ని చూడు’ అని సలహా ఇచ్చారు. గాంధీ ఆ పని చేశాడు.

ప్రస్తుత నేత సోనియా గాంధీకి 10 జన్‌పథ్‌ తప్ప ఏదీ తెలీదు. జన్‌పథ్‌లో ఆమె దర్శనానికి పర్మిషన్‌ అవసరం. తనని కాల్చే మనిషి తన సమక్షంలో నిలవగలిగే స్వేచ్ఛ ఉన్న గాంధీ వ్యవస్థలో రెండు దశాబ్దాలు తమ నాయకులకే అందకుండా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత– ఆఖరి నెహ్రూ వారసురాలిది. ఇక ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ. ఇండియా పటంలో కర్ణాటకని చూపమంటే వెదికేపాటి కమిట్మెంట్, చొరవ ఉన్నవాడు. ఆ పార్టీ నిండా డబ్బుని నొల్లుకునే అవకాశవాదులు, బడుద్దాయిలు (క్షమించాలి– ఇంత చక్కటి మాటని వాడుతున్నందుకు). ఢిల్లీలో ముఖ్య బాధ్యతని వెలగబెడుతున్న తండ్రి పదవిని చెన్నైలో సొమ్ము చేసుకుంటున్న ఓ కొడుకు ఘనత ఈ మధ్యనే పేపర్లలో చదువుకున్నాం.

కాంగ్రెస్‌ ప్రస్తుతం అడుక్కుతినే దశ లోనూ లేదు. కొన్ని తరాల చరిత్రకు, ఈ దేశ వైభవానికి ప్రతీకగా నిలిచిన కాంగ్రెస్‌ ఆఖరి రాష్ట్రం నిన్న కూలిపోయింది. రాహుల్‌ 11 స్థానాల్లో ప్రసంగించారు. ఆ 11 స్థానాల్లోనూ అభ్యర్థులు ఓడిపోయారు. మోదీ 14 స్థానాల్లో ప్రసంగించారు. ఆ 14 స్థానాల్లోనూ గెలిచారు.

 రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన గత 6 నెలలలో ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకుపోయింది. 2019 నాటికి ‘ప్రధాని’ అయ్యే కలకి ఇక్కడే, ఇప్పుడే గండి పడింది. మన అదృష్టం.కాంగ్రెస్‌ పేరు చెప్పగానే భక్తిగా దండం పెట్టుకునే తరం నుంచి వచ్చినవాడిని. ఇక్కడితో కాంగ్రెస్‌ ఒక ‘జ్ఞాపకాల దిబ్బ’గా మారుతోందన్న నిజాన్ని గమనిస్తూ బాధ, కోపం, నిస్సహాయత, కసితో ఈ కాలమ్‌ రాస్తున్నాను. కాంగ్రెస్‌కి ఇక ఈ దేశంలో ఏం మిగిలింది? మన యువరాజా ఏం మిగిల్చాడు?

ఎక్కడ తిలక్‌లు? ఎక్కడ అజాద్‌లు? ఎక్కడ లాల్‌ బహదూర్‌లు? కాంగ్రెస్‌కి ఏమి ఈ దరిద్రం? ప్రముఖ పాత్రికేయులు కంచి వాసుదేవరావు ‘బాపూజీ కడపటి సంవత్సరం’ అని ఒక పుస్తకాన్ని రాశారు. అందరూ చదవవలసిన గ్రంథమది. ఒకచోట ఆయన అంటారూ... 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుక్షణమే– అక్కడక్కడా ‘విరివిగా’ అవినీతి ఛాయలు కనిపిస్తున్నాయని మహాత్మాగాంధీ వాపోయారట. ఏం? మనం చూడని చాలా విషయాలు, నిజాలు ఆయన అప్పటికే చూడడం ప్రారంభించారా? ‘స్వేచ్ఛ’గా జవాబుదారీ లేకుండా సమాజానికి సేవ చేయాలంటే– మన జాతి ‘సామాన్య’ లక్షణం చాలదని ఆయన గుర్తుపట్టారా?

రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పే ప్రయత్నమిది. ఈ దేశం వచ్చిన ప్రతీ మహానుభావుడూ దర్శనం చేసుకునే మొదటి ఆలయం– రాజ్‌ఘాట్‌. వెళ్లేలోగా ఒక్కసారయినా ఈ దేశపు గొప్ప ‘త్యాగశీలత’కీ, ఆరాధనా భావానికీ సమాధి కట్టిన రాహుల్‌ గాంధీ వంటి ప్రభృతులు నివసించిన ‘జ్ఞాపకాల దిబ్బ’ని కూడా ఒకసారి దర్శించుకోవాలని నా కోరిక.

ఓ కవి జీవితమంతా కవితలో దారి తప్పుతున్నాడట. చూసే వాస్తవం గజిబిజిగా కనిపిస్తోంది. అతనికి కారణం ఆలస్యంగా అర్థమయింది. ముఖాన్ని తుడుచుకోవడానికి బదులు, జీవితమంతా అద్దాన్ని తుడుస్తున్నాడు. సరిగ్గా ఈ పనే కాంగ్రెస్‌ గత 70 సంవత్సరాలుగా చేస్తోంది. ఇప్పుడు ఆఖరి తుండుగుడ్డ రాహుల్‌ గాం«ధీ చేతుల్లో ఉంది. 

గొల్లపూడి మారుతీరావు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top