
‘ఏ కోర్సూ నిన్ను ఆర్కే నారాయణ్ చేయలేదు,’ అంటాడు రచయిత జెఫ్రీ ఆర్చర్. చిన్న మనుషులు, చిన్న సంపాదనలు, చిన్న సమస్యలు... పుస్తకం కూడా చిన్నదిగానే ఉండాలి. రెండొందల పేజీలకు మించకూడదు! ‘స్వామి’ ఎంతుంటాడు! కానీ వాడి ఎత్తు భారతదేశం నుంచి ఆఫ్రికానో, అమెరికానో అందుకునేంత. ఉపాధ్యాయుడిగా మొదట్లో పనిచేసిన ఆర్కే(1906–2001)కు ఆ పనిలో అర్థం కనబడలేదు. దాంతో రచయిత అయిపోదామని వాళ్ల బామ్మ దగ్గర ప్రకటించేసి, ముహూర్తం చూసుకుని మరీ నోట్‌బుక్ ముందేసుకుని కూర్చున్నాడు. ఊహా రైల్వేస్టేషన్ మాల్గుడి తళుక్కుమంది. ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ పరుగెత్తుకుని వచ్చేశారు. అయితే, స్వామి ఇంగ్లీషులో మాట్లాడతాడు.
ఆయన వరకూ అది పరాయిభాష కాదు, పెరిగిన వాతావరణమే అది. పుట్టిన తమిళమంత, పెరిగిన కన్నడమంత అలవోకగా ఇంగ్లీషులో రాశాడు, తొలితరపు భారతీయాంగ్ల రచయిత అయ్యాడు. ప్రతి నాయకుడి పాత్రయినా సరే, దాన్ని నిలబెట్టగలిగేదేదో పట్టుకోవాలి, అంటారాయన. ‘మాల్గుడి డేస్’, ‘ది ఇంగ్లీష్ టీచర్’, ‘ద బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’, ‘మిస్టర్ సంపత్’, ‘ఫినాన్సియల్ ఎక్స్‌పర్ట్’, ‘వెయిటింగ్ ఫర్ ద మహాత్మ’, ‘ద గైడ్’, ‘ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి’, ‘టాకెటివ్ మ్యాన్’, ‘అండర్ ద బన్యాన్ ట్రీ’, ‘మై డేస్’, ఆయన ఇతర రచనలు. ఆత్మకథాత్మకంగా కనబడే ఆయన పుస్తకాలకు, ‘ఈ కథలో ఏముంది? శక్తివంతమైన క్లైమాక్స్ లేదు. అసలు ఎటు తీసుకెళ్దామని దీన్ని?’ లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయినా అదే శైలికి కట్టుబడి ఉండటానికి కారణం, ఇంకోరకంగా నేను రాయలేకపోవడమే, అంటారు.