పెట్టుబడిదారీ స్వర్గధామంలో చిచ్చు

Article in Sakshi on the Protests in Hong Kong

ఆధునిక ప్రపంచంలో బడా ఆర్థిక శక్తులకు, నయా పెట్టుబడిదారీ విధానానికి అత్యంత పరమోదాహరణగా హాంకాంగ్‌ నిలుస్తుంది. ఈ రెండు ప్రభావాల ఫలితంగా 93 మంది బిలియనీర్లు ఉన్న ఈ మహానగరం (ప్రపంచంలో రెండో స్థానం)లోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక అభద్రతతో ఇక్కట్లకు గురవుతున్నారు. పేరుమోసిన నల్ల మందు యుద్ధాల తర్వాత బ్రిటన్‌ 150 ఏళ్లకు పైగా హాంకాంగ్‌ని వలసగా మార్చుకుంది. 1997లో ఈ నగరంపై తన అధికారాన్ని వదులుకోవలసి వచ్చిన తరుణంలో, హాంకాంగ్‌ను స్వయం పాలనా ప్రాంతంగా మార్చడం ద్వారా 50 ఏళ్ల పాటు నగర రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను మార్చకూడదనే షరతుతో బ్రిటన్‌ ఆమేరకు చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

బ్రిట¯Œ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలను కొనసాగించడం అంటే చైనా సామాజీకరించిన వ్యవస్థనుంచి విడివడి హాంకాంగ్‌లో అత్యంత తీవ్రస్థాయిలో పెట్టుబడిదారీవిధానం కొనసాగడమని అర్థం. హాంకాంగ్‌ శాసనసభలో 50 శాతం సీట్లను వ్యాపార వర్గాల ప్రయోజనాలకు కేటాయించారు. హాంకాంగ్‌లో తలదాచుకున్న తీవ్ర నేరçస్తులను తైవాన్, మకావు, చైనా తరలించడానికి న్యాయపరమైన యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి 2019 ఫిబ్రవరిలో హాంకాంగ్‌ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. హాంకాంగ్‌ వాసులు ప్రపంచ వ్యాప్తంగా 46 రకాల తీవ్ర నేరాలకు పాల్పడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయిన నేపథ్యంలోనే చైనా ఈ నేరస్తుల తరలింపు బిల్లును తీసుకొచ్చింది.

ఈ తరలింపు బిల్లుపై వీధుల్లో ప్రదర్శనలు తలపెట్టడానికి నెలల క్రితమే హాంకాంగ్‌లోని బిజినెస్‌ కమ్యూనిటీ ఈ బిల్లును వ్యతిరేకించింది. వైట్‌ కాలర్‌ నేరాలను ఈ తరలింపు బిల్లునుంచి మినహాయించాలని హాంకాంగ్‌లోని రెండు బడా బిజినెస్‌ అనుకూల పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. చైనా ప్రభుత్వం ఆర్థిక నేరాల ఆరోపణ చేస్తూ హాంకాంగ్‌లోని అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసినా, లేక వారిని హాంకాంగ్‌ నుంచి తరలించినా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాల స్వర్గధామంగా హాంకాంగ్‌కు ఉన్న ప్రతిష్ఠ దెబ్బతింటుందని వీరి వాదన.

సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ ఎంటర్‌ప్రైజ్‌ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఈడీ.. ఈ బిల్లు ఆర్థిక స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని, ఆరోపించడమే కాకుండా హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించింది. అమెరికా రాయబార కార్యాలయం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. దారినపోయేవారిపై, పోలీసులపై, మీడియాపై, ఎమర్జెన్సీ పనులు చేస్తున్న వారిపై హింసాత్మక దాడులకు ఉద్యమకారులు తలపెట్టడంతో జూలై 9న హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెర్రీ లామ్‌ ఈ తరలింపు బిల్లును సస్పెండ్‌ చేస్తున్న్టట్లు ప్రకటిం చారు. హాంకాంగ్‌లో అశాం తికి తరలింపు బిల్లు కంటే ఆర్థిక అభద్రతాభావమే ప్రధానకారణం. దశాబ్దాలుగా స్వేచ్ఛా మార్కెట్‌కు పగ్గాలు తెరిచి ప్రజలకు ఏ మేలూ చేయని తరహా విధానాల స్థానంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలు కాపాడే పాలనవైపుగా మారాలని హాంకాంగ్‌ వాసుల డిమాండ్‌.

చైనాలో నయా ఉదారవాదం ఏ స్థాయికి చేరిందంటే 80 శాతం బ్యాంకులు బడా వాణిజ్యవర్గాలకు రుణాలు అందిస్తూ, కార్మికులకు అయ్యే వ్యయంపై కంపెనీలకే రాయితీలను అందిస్తున్నాయి. ఇలా రాయితీలివ్వడం అధర్మ వ్యాపారం అని అమెరికా వాదన.  మరోవైపున పెట్టుబడిదారీ విధానానికి తనదైన  ప్రత్యేక మార్గంలో తలుపులు తెరిచేసిన చైనాలో కార్మికులు వేలాది ప్రదర్శనలు, సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నట్లు నమోదవుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సవాళ్లను, అసమానతల్ని, పర్యావరణ సమస్యలను చైనా ఎలా ఎదుర్కోనుంది అనేది దాని పాలనకు నిజమైన పరీక్షగా నిలుస్తోంది.

బ్రిటన్, అమెరికా, పాశ్చాత్య శక్తులతో హాంకాంగ్‌పై చైనా కుదుర్చుకున్న ఒడంబడిక 2047లో ముగియనున్న నేపథ్యంలో హాంకాం గ్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలని అంతర్జాతీయ వాణిజ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయి.  అమెరికన్‌ డాలర్‌కి, చైనా యువా¯Œ కు మధ్య జరుగుతున్న ఆర్థిక కుమ్ములాటే హాంకాంగ్‌ నేటి ఘర్షణలకు మూలబిందువుగా మారింది. నయా ఉదారవాదానికి చెందిన ఈ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల ఘర్షణలు ఎలా తొలగిపోతాయి అనేది చైనా తన అంతర్గత వైరుధ్యాలను ఎలా పరిష్కరించుకోగలుగుతుంది అనే అంశంపైనే ఆధారపడి ఉంది.  -కె. రాజశేఖరరాజు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top