ఆదర్శప్రాయుడు ‘కాసు’

Article On Kasu Brahmananda Reddy  - Sakshi

నేడు 110వ జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీహెచ్‌ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, హిందుస్థాన్‌ కేబుల్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర దిగ్గజ సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించి రాష్ట్రం పారిశ్రామికంగా సుసంపన్నం కావడానికి దోహదపడిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 110వ జయంతి నేడు. ‘నాలుగు కోట్ల ఆంధ్రుల మనఃఫల కంబుల కాసు వంశ భూపాలుని పేరు ముద్రపడి భాసిల్లుచున్నది తెల్గురాణి...’ అంటూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చేసిన ప్రశంసకు ఆయన అన్నివిధాలా అర్హులు. తెలుగుజాతికి చేసిన సేవలు అటువంటివి మరి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్లలో వెంకటకృష్ణారెడ్డి, శాయమ్మ దంపతులకు 1909 జూలై 28న జన్మించిన బ్రహ్మానందరెడ్డి తిరువనంతపురం వర్సిటీలో న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఆ వృత్తిలోకి ప్రవేశించారు. అచిర కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. జిల్లా బోర్డుకు 1936లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

స్వాతం త్రోద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు అరెస్టయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మహాత్మా గాంధీని స్వయంగా కలుసుకున్నాక ఆయన స్ఫూర్తితో ఖద్దరు వస్త్రధారణకు మారారు. 1964 ఫిబ్రవరి 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రాన్ని బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దారు. బాలికా విద్యకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. వారికి సెకండరీ స్థాయి వరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు. అంతేకాదు... బాలికల కోసం విస్తృతంగా ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు... జిల్లా పరిషత్తులకు సంపూర్ణ అధికారాలిచ్చారు. బీసీల రిజర్వేషన్లు అమలుచేసి, మున్నూరు కాపుల్ని ఆ జాబితాలోకి తీసుకొచ్చారు. ఎస్టీ వర్గాల పురోగాభివృద్ధికి కృషిచేశారు. ఆ రోజుల్లో రూ.10 కోట్లు ఎల్‌ఐసీ రుణంతో బలహీన వర్గాలకు తొలిసారి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 

స్వయానా క్రీడాకారుడైన ఆయన సీఎంగా క్రీడలకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియం ఆయన హయాంలోనే నిర్మాణమైంది. బ్రహ్మానందరెడ్డి 1964 మొదలుకొని 1971 వరకూ ఏడేళ్లపాటు సీఎంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రత కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆరో ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధీ రాజీనామా చేసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయనతో ఇందిరాగాంధీకి విభేదాలు తలెత్తి ఇందిరా కాంగ్రెస్‌ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే 1980లో తన నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఆయన ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. 1994 మే నెలలో కన్ను మూసిన బ్రహ్మానందరెడ్డి చివరివరకూ విలువలకు కట్టుబడి జీవించారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తింపుగా స్మృతివనం ఏర్పాటుచేస్తే సముచిత నివాళి అర్పించి నట్టవుతుంది. 
-వందవాసి అవంతి, గుంటూరు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top