పోలీసు శాఖ అప్రమత్తం

Tight Security At Returning Office - Sakshi

రిటర్నింగ్‌ అధికారుల  కార్యాలయాల వద్ద గట్టి భద్రత

నామినేషన్‌ పత్రాల స్వీకరణకు భారీబందోబస్తు

మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనుమతి నిరాకరణ

నేడు వేములవాడకు  మంత్రి హరీశ్‌రావు

వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియల తొలికీలక ఘట్టం.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించారు. దీంతో పోలీసులు ముందస్తుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

కార్యాలయం చుట్టూ పహారా..
వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం చుట్టూ పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. సబ్‌డివిజన్‌లోని పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ వెంకటరమణ స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిషత్‌ ఆవరణలోకి వస్తున్న వారిని ప్రశ్నిస్తూ వదిలిపెడుతున్నారు.

3 గంటల తర్వాత నోఎంట్రీ..
ఎన్నికల కార్యాలయమైన స్థానిక తహసీల్దార్‌ ఆఫీసులోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు మినహా మిగతా వారినెవ్వరినీ అనుమతించడం లేదు. నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు వచ్చేవారిని పూర్తి వివరాలు అడిగి తెసుకుని నిర్ధారించుకున్నాకే లోనికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లోకి కేవలం నామినేషన్‌ పత్రాలు సమర్పించే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు డీపీఆర్వో కార్యాలయం సిబ్బంది మీడియాకు అందజేస్తున్నారు. 

నేడు వేములవాడకు మంత్రి హరీశ్‌రావు 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు వేములవాడకు వస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు తెలిపారు. ఉదయం 9 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30కు రుద్రంగిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి కథలాపూర్‌ మండలం సూరమ్మ చెరువును పరిశీలిస్తారు. తిరుగు పయనంలో చందుర్తి మండలం మల్యాలలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top