టారో

tarot astrology - Sakshi

16 డిసెంబర్‌ నుంచి 22 డిసెంబర్‌ 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పని ఒత్తిడి నుంచి కొంత విరామం దొరుకుతుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. కొందరికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. మీ నిజాయితీ, నిబద్ధతలే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళతాయి. అదనపు బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. జీవితాన్ని మలుపు తిప్పే మార్పులు ఉంటాయి. కుటుంబంపై శ్రద్ధ పెంచాల్సిన పరిస్థితులు ఉంటాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రియతముల మధ్య అనురాగం గాఢమవుతుంది. 
లక్కీ కలర్‌: గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా సంయమనం పాటించడమే మంచిది. వివాదాలకు పోకుండా కొంత లౌక్యం పాటిస్తే సమస్యల నుంచి గట్టెక్కే సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి అనుకోని కానుకలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. సృజనాత్మక రంగాల్లోని వారికి ఉన్నతికి దారితీసే మంచి అవకాశాలు దక్కుతాయి. ఏకాంతంలో ఆత్మావలోకనం చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇతరులపై మీరు పెట్టుకున్న అంచనాలు వాస్తవమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిలోనే ముందుకు సాగండి. అనవసరంగా ఇతరులను మెప్పించే ప్రయత్నాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. చికాకు పెట్టే మనుషులు తారసపడే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి కారణంగా అలసట చెందుతారు. ఏకాగ్రత క్షీణిస్తుంది. పని మీద విరక్తి పెంచుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని పోటీ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
భవిష్యత్‌ అవసరాల కోసం వనరులను సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. కొత్తగా ప్రేమలో పడతారు.
లక్కీ కలర్‌: పసుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవన ప్రస్థానంలో మరింత ముందుకు సాగుతారు. సుదూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. లాభసాటి కొత్త వ్యాపారావకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. అదనపు పనిభారాన్ని తగ్గించుకోవడం మంచిది. బాధ్యతలను ఇతరులతోనూ పంచుకోవడమే మంచిది. ప్రేమికుల మధ్య అభద్రతాభావం తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
సుస్థిరత కోసం, సురక్షిత వాతావరణం కోసం మీరు సాగించే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నిలకడగానే కొనసాగుతూ పురోగతి సాధిస్తారు. త్యాగాలు సార్థకమైన సందర్భాలు ఉద్విగ్నతను కలిగిస్తాయి. మీకు గల ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు ఉపయోగంలోకి వస్తాయి. భారీ లక్ష్యాల సాధనకు మాత్రం కొంత నిరీక్షణ తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. గురువులను, పాత మిత్రులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
కొంత విశ్రాంతి తర్వాత నూతనోత్తేజాన్ని సంతరించుకుంటారు. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. ఉద్యోగులు కొత్త పనులేవీ తలకెత్తుకోకుండా జరుగుతున్న తతంగాన్ని గమనిస్తూ ఉండటమే మంచిది. కొత్త మిత్రబృందం ఏర్పడే సూచనలు ఉన్నాయి. భావసారూప్యత గల వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. అర్ధంతరంగా నిలిపివేసిన పనులను పూర్తి చేస్తారు. ప్రేమికులతో కలసి సుదూర విహారయాత్రలకు వెళతారు. 
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సత్ఫలితాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న స్థానానికి చేరుకోగలుగుతారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇతరమైన పనుల కంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. వివాదాస్పద పరిస్థితుల నుంచి లౌక్యంగా బయటపడతారు. లక్ష్య సాధన వైపు నుంచి దృష్టి మళ్లించే పరిస్థితులు ఏర్పడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: జేగురు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పని మీద ఎంత వ్యామోహం ఉన్నా, కొంత విశ్రాంతి అవసరమనే విషయాన్ని గుర్తిస్తారు. మిత్రులతో కలసి ఆటవిడుపుగా విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో ముందంజలో ఉంటారు. అసూయాపరుల కారణంగా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. మిత్రుల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయడంలో అమిత ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రేమికుల మధ్య స్తబ్దత నెలకొంటుంది. ఇంటి అలంకరణల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురు గోధుమరంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. పని ప్రదేశంలోని మిత్రులతో ఆలోచనలను పంచుకుంటారు. వ్యాపార పారిశ్రామిక రంగంలో వారికి లాభాలు నిదానంగా, నిలకడగా చేతికందుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఎన్నడూ లేనంతగా ప్రేమానురాగాలు లభిస్తాయి. ఒంటరి వారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: సూర్యకాంతి రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు బాగానే ఉంటాయి. అయితే, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాల కోసం ప్రేమికులతో ఆర్థిక భాగస్వామ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కలలను సాకారం చేసుకుంటారు. ప్రగాఢ వాంఛల్లో ఒకటి నెరవేరుతుంది. నిజాయితీ, నిర్భీకతతో పని ప్రదేశంలో మీదైన ముద్ర వేస్తారు. కళాకారులకు గుర్తింపు తెచ్చిపెట్టగల అవకాశాలు అందివస్తాయి. సమస్యలు వాటంతట అవే సద్దుమణిగి పోతాయి. దైవానుగ్రహం బాగుంది.
లక్కీ కలర్‌: బంగారు రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఒక విచిత్రమైన సమాచారం ద్వారా ఆర్థిక లాభం పొందే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి దశ తిరుగుతుంది. చిరకాల నిబద్ధతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విద్యలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కళాసాధన వైపు దృష్టి సారిస్తారు. జీవితంలో ఎదగాలంటే అనుబంధాల కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని గుర్తిస్తారు. అనుబంధాలకు బందీగా ఉండే బలహీనతను అధిగమించలేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top