డోలీ

sunday story in this week - Sakshi

ఈవారం కథ

సాయంత్రం... చిన్నారి పెళ్ళి కూతురు కన్నీరు పెడుతున్న వేళ. సన్నగా చినుకులు మొదలయ్యేయి. కొండమీద నుంచి పశువులతో పాటు మనుషులు కూడా వూరు చేరడంతో అలికిడి అప్పుడే మొదలయ్యింది. నులక మంచాలకింద కుంపట్లు ఒళ్ళువిరుచుకుంటున్నాయి. అప్పుడే... అంతదాకా కుక్కిమంచమ్మీద ముతక దుప్పటిలో మూలుగుతున్న సింగన్న పడాల్‌ భళ్ళున వాంతి చేసుకున్నాడు. అతడి వయసు పద్నాలుగేళ్ళు. చినుకులు వానగా మారాయి. ఈదురు గాలి తోడై రొజ్జకొట్టింది. బ్రేక్‌ రావడంతో కొందరు పడాల్‌ వైపు చూసేరు. మరికొందరు ఇది మామూలే అన్నట్టు ముందుకే చూస్తూ వుండిపోయేరు. మొగలిరేకులు మొదలయ్యింది. వార్తల్లో కొత్త రాజధాని మెరిసి మాయమయ్యింది. జోడీ కట్టిన జంటలు ఢీ కొట్టేయి. పడాల్‌కి వాంతులు ఎక్కువయ్యేయి. పిల్లలు ఎక్కడివాళ్లు అక్కడే నిదరపోయేరు. ‘‘ఎప్పుడు కాసి అవుతున్నాయి.?’’ పడాల్‌ పక్కకి చేరి అడిగేడు రామన్నదొర. అడిగేడు కానీ అతనికీ తెలుసు పడాల్‌ మంచమెక్కి మూడు రోజులయ్యిందని. ‘‘నిన్నటి కాసే...’’ మంచం కింద వాంతిని నీళ్ళతో కడిగి కింద కుంపటి సరి చేస్తూ చెప్పింది తల్లి. ‘‘ఏటేనే తిన్నాడా?’’ 

లేదన్నట్టు తలవూపింది. కానీ అతనికి తెలుసు మొన్న అతనేమి తిన్నాడో. మూడురోజుల క్రితం పందిముక్కు దుంపలు తవ్వి తెచ్చేడు అడవిలోంచి. అవి ఉడకబెట్టి తిన్నాడు. అంతవరకూ బాగుంది కానీ అవి సరిగ్గా ఉడక్కపోవడమే వచ్చింది సమస్య. ఆ రోజు రాత్రే మేక మాంసం కూడా తినేయడంతో...మళ్ళీ వాంతి చేసుకున్నాడు పడాల్‌. గడపలో నీచు కంపు మరింత ముదిరింది. పడాల్‌  ఆపసోపాలు పడిపోతున్నాడు. కుంపట్లో గుగ్గిలం గుండ వేయడంతో గడప వాసన మారింది. ‘‘నాగరాజు దగ్గిరకెల్లి మాత్రలున్నాయేటో సూడుమీ’’ పంపించేడు రామన్నదొర పక్కింటి యువకుడ్ని. వాడు వెళ్ళొచ్చేడు. ‘‘లేవట మామా! కిందిటి నెల యేయెన్నెమ్‌ ఇచ్చిన మాత్రలు అయిపోయినాయట’’ అని తూలుతూ రాటకి చేరబడ్డాడు. ఆ మాటతో వెంటనే సెల్‌ తీసి ఏదో నంబర్‌ డయల్‌ చేసేడు. ఫోన్‌లో రింగ్‌ని వింటూనే రాటవైపుకి చూసేడు. వాడు తాగి వున్నాడని తెలిసిపోతూనే వుంది. చదువుకున్నవాడే కానీ తాగుడుకి బానిసైపోయేడు. ‘వూర్లో మాత్ర కంటే మందే సులభంగా దొరకడం! ...ప్చ్‌!’‘‘హలో?’’ ‘‘చెప్పు దొరన్నా!’’ అటునుంచి ఏయెన్నెం గొంతు వినపడింది. ‘‘పడాల్‌కి వాంతులవుతున్నాయి’’ ‘‘నేనిచ్చిన మాత్రల్లో డొమెస్టాల్‌ అని చిన్న మాత్ర వుంటాది తీసి వెయ్యించండి’’‘‘ఏ మాత్రలూ లేవట’’ ‘‘అదేటీ అన్నీ అయిపోయ్యా?’’

‘‘అయిపోనాయీ... లేకపోతే మాకేటి సరదాయేటి...?’’‘‘హలో?’’‘‘హలో??’’‘ఈ రోజు ఐటీ అనగానే ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఏ మూల నుంచైనా తెలుగువాడు గర్వపడేలా రాజధాని నిర్మాణం చేస్తున్నాం. అందుకు మీరందరూ సహకరించాలి’ టీవీ ముందు ఎవ్వరూ లేకపోయినా దానంతటదే వాగుతోంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడాల్‌  మంచం చుట్టూ వున్నారు. ‘‘ఇప్పుడేటి సేస్తామైతే?’’ సందేహం వెలిబుచ్చాడు నడి వయసులోవున్న వ్యక్తి. వాన పెరిగింది. పడాల్‌ వాంతుల్లాగే.‘‘ఎజ్జోడికి పిలండి’’ వెనక నుంచి ఎవరో అన్నారు. ‘‘కాదు. ఆస్పిటల్‌కి తీసికెల్దుమ’’ చదువుకున్న రామన్న దొర అన్నాడు. అతని వైపు అందరూ ఆశ్చర్యంగా చూసేరంతా.ఎందుకంటే...వాన. ఆపై రాత్రి. వూరు దాటాలంటే బురద దారిలో కొండ దిగాలి. మధ్యలో గెడ్డ దాటాలి. ఒకవేళ తీసుకు వెళ్ళాన్నా తెల్లవారే సాధ్యంగానీ ఇప్పుడు సాధ్యం కాదని అందరికీ తెలుసు.  ‘కిందకి దించకపోతే లాభం లేదు’ తనలో తాను అనుకున్నా అది బయటికి వినపడింది. అతను హాస్పిటల్‌కి చేరకపోతే మొన్న జరిగిన చావులాగే ఇదీ జరగొచ్చు.
అంతదాకా దుఃఖాన్ని గొంతులో నొక్కిపెట్టి ఆపుకున్న తల్లి ఆ మాటతో ఒక్కసారి ఏడుపందుకుంది. అందరూ బిక్కచచ్చిపోయేరు. వూర్లో వున్న మిగతా గడపలు ఉలిక్కిపడ్డాయి. ఏదో కీడు శంకించేరు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుతున్నారు. వాన మరింత ముదిరింది. గాలి విసిరికొడుతోంది. కొడుకు పక్కనే చుట్ట కాలుస్తూ నేల చూపులు చూస్తూ వుండిపోయేడు పడాల్‌ తండ్రి సోమన్నపడాల్‌. అతడి ముఖంలో ఏ భావమూ కనిపించడం లేదు. ఏమి చెయ్యాలో తోచక ఎజ్జోడి రాక కోసం ఎదురు చూస్తూ వుండిపోయేడు. 

రామన్న దొర నలుగురు కుర్రాళ్ళని కూడదీసేడు. రెండు కర్రల్ని తెప్పించేడు. గట్టి దుప్పటి నాలుగు చివర్లనీ రెండు కర్రలకి ముడి వేసేడు. డోలీ కట్టిస్తున్నాడని అందరూ అక్కడి ఏర్పాట్లని చూస్తూ వుండిపోయేరు. ఇది సాధ్యమా కాదా అని అందరిలోనూ ప్రశ్న. రామన్న దొర తన పని తాను చేసుకుపోతున్నాడు. దొర వూరిలో డిగ్రీ చదివిన మొదటి కుర్రాడు. అతని తర్వాత డిగ్రీ చేస్తున్న వాళ్ళున్నా కొందరు వూర్లో వున్నారు. మరికొందరు హాష్టళ్ళలో వుంటున్నారు. సెలవులకే వూరు చేరుతారు.   ‘ఏటిప్పుడు డోలీ మీద దించీగలమనే ఇదంతా సేస్తున్నావేటి?’’ అడిగేడు ఒక నడివయసాయన. ‘‘లేకపోతే ఈడినిలాగే ఒదిలేస్తమా?’’ డోలీ కడుతూనే సమాధానమిచ్చేడు రామన్నదొర.‘‘వాన సూస్తే ఇలగుంది. డోలీ అని తయారైపోతున్నారు. ఎలాగవుద్దివోయ్‌?’’ మరోసారి అనుమానం వ్యక్తం చేసేడు. ‘‘గొడుగులున్నాయిగదా? తియ్యండి’’ ఎలాగైనా పడాల్‌ని కొండదించడానికే నిర్ణయించుకున్నట్టు అన్నాడు. ‘‘గొడుగులుంతే? దారి కనపడొద్దేటి?’’ మరొక అనుమానం తెరలేపేడు. ‘‘టార్చీలైటుంది గదా అడగండి కొసాయింటి మంగన్న దగ్గర?’’‘‘ఉంది. గానీ బేటరీల్లేవు’’‘‘సెల్‌ఫోన్లు పట్టండి... ఏది ఏటైనా ఈడినీ రాత్రి కొండ దించాల’’ అని నిలబడ్డాడు. ‘‘ఒద్దు బాబు...!’’ అని నిలబడింది పడాల్‌ తల్లి ఉన్నట్టుండి. 
అందరూ ఆమె వైపు చూసేరు. ‘‘పోతే ఇక్కడే నా ఇంటి కాడే పోనీ గానీ..’’ అని గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆమె వయసు నలభై దాటి వుంటుంది. డెబ్బైయ్యేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎదిగిన ఏ నగరాన్నీ చూసి వుండదు... దగ్గర్లోని సంతని తప్ప. మొదటిసారి నగరానికి తన కొడుకుని ఈ స్థితిలో తీసుకు వెళ్ళడం ఆమెకు నమ్మకం కలగడం లేదు. బోరున ఏడుస్తోంది వర్షంలా.‘‘నువ్వొల్లకోయే ఏటైపోయిందని ఏడిసెత్తున్నావు’’ అని కసురుకున్నారు. రామన్నదొర ఇవేవీ పట్టించుకునేలా లేడు. తన పనేదో తాను చేసుకుపోతున్నాడు. మరికొందరు సెల్‌ఫోన్‌లో సిగ్నల్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. గడపలో టీవీ మాత్రం అదే పనిగా వాగుతోంది. ఇంకా పడుకోని పిల్లలు రిమోట్‌ కంట్రోల్‌తో చానల్స్‌ మారడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టు ఒకదాని తర్వాత మరొకటి మారుస్తూనే వున్నారు. డోలీ సిద్ధమైంది. చినుకుల ఉధృతి కాస్త తగ్గినట్లైంది. పడాల్‌ని మంచం మీది నుంచి డోలీకి మార్చేరు. పడాల్‌ తల్లి శవాన్ని ఎత్తినట్టు భావించిందేమో గొల్లున మరొక్కసారి ఏడుపందుకుంది. అందరూ ఆమెను ఓదార్చి ఇంట్లోకి తీసుకుపోయేరు. గొడుగూ, గిడుగులతో...రెండు కర్రలకూ నాలుగు వైపులా నలుగురు మోస్తూ...సెల్‌ఫోన్‌ వెలుతురులో... ఆకాశం ఉరుముతుండగా...డోలీ కొండ దిగుతోంది.ముందు నడుస్తున్న వాళ్ళ చేతుల్లో కర్రలున్నాయి ఆపదొస్తే ఆయుధాల్లా ఉపయోగించడానికి. డోలీ ఊరు దాటిందో లేదో కళ్ళు జిగేల్మనేలా మెరుపు మెరిసింది. అందరి కళ్ళూ బైర్లు కమ్మినట్లైంది. ఒక్కసారి ఆగి మళ్లీ కదిలింది డోలీ.

అలవాటైన దారే. కానీ ఆకాశం ఇలాగున్నపుడు దారి ఎలా మారిపోతుందో ఎవ్వరికీ అంతు చిక్కదు. వానలో కొండదారి ఉనికిని మార్చుకుంటూ వుంటుంది. అక్కడక్కడా రాళ్లు జారిపోతుంటాయి. మట్టి కరిగి కొండనీటికి కొత్త దారినిస్తుంటాయి. దారి కాలువైపోతుంటుంది. పట్టు తప్పితే ప్రమాదం పొంచి వుంటుంది. అందరూ గుడ్డిగా నడుస్తున్నారు. నడుస్తున్న దారి ఇప్పటిది కాదు. తాము పుట్టి బుద్దెరిగిన నుంచీ నడుస్తున్న దారి. తామే కాదు తాతలు నడిచిన దారి కూడా. ఈ దారి మీద ఎన్ని తరాలు నడిచేయో! ఇంకెన్ని తరాలు నడవాల్సి వుంటుందో?!  సెల్‌ఫోను లైటు కన్నా వెయ్యకుండా వుంటేనే కాస్త వెలుతురు వున్నట్టు గమనించేరు. అందరూ చీకట్లో నిశ్శబ్దంగా నడుస్తున్నారు. కొందరు సిగ్నల్‌ తగులుతుందేమోనని అక్కడక్కడా ఆగి సెల్‌ఫోన్‌ని ఆన్‌ చేసి చూస్తున్నారు. డోలీలో పడాల్‌ ఊపిరి మాత్రమే తీస్తున్నాడు.
చినుకులు ఆగేయి. మబ్బులు పల్చబడ్డాయి. దారి ముందుకన్నా స్పష్టంగా కన్పిస్తోంది. రాళ్ళున్న చోట జాగ్రత్తగా దిగుతూ, నీరు పారుతున్నచోట డోలీని ఎత్తి నడుస్తూ ముందుకు సాగుతున్నారు. కొండ దిగిపోయింది డోలి. ఇప్ప చెట్ల కింద నుంచి మామిడి మాను తోటలోకి దారి దూరింది. ఎవరిదో సెల్‌ఫోన్‌ బ్లింక్‌ అయింది. సిగ్నల్‌ అందిందన్న ఆనందంతో అందరి ఫోన్లూ చెక్‌ చెసుకుంటున్నారు. కానీ....ఎదురుగా వాగు. గర్జిస్తోంది. రెండు కొండల నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాటడం కష్టం. ‘‘నీను సెప్పినానా లేదా?’’ అంటూ ముందుకొచ్చేడు మండింగి సిమ్మడు. ‘‘దాటలేమురా అంతే ఇన్నారా?.. ఇప్పుడు పడండి. ఇంటికాడుండుంతే వానకైనా తడకుండుందుము’’ అన్నాడు. డోలీ భుజాలు మారింది. మోసినోళ్ళ కాళ్ళు వణుకుతున్నాయి. ఎక్కడా దించకుండా నడవడం వల్లేమో అందరూ గట్టిగా వూపిరి తీస్తున్నారు. చినుకుల్లో చెమట. డోలీలో పడాల్‌ వాంతితో దుప్పటి మరింత కంపు కొడుతోంది. 

‘‘ఏటి సేద్దుమంతే ఏటిసేద్దుమని వల్లకుండా ఏదో ఒకటి సెయ్యండ్రా! ఇలాంటివి మనకేటి కొత్తా యేటి?’’ అసహనాన్ని ప్రదర్శించేడొకరు. ‘‘గొల్లు సెయ్యకండ్రా! ఏయేనమ్మకి ఫోనురింగవుతుంది...హలో?’’‘‘హలో?’’‘‘మీమిప్పుడు పడాల్ని డోలీ యేసి పట్టుకొచ్చీసినాము హాస్పిటల్‌కని... గానీ ఇక్కడ వాగు బాగా పారుతుంది. ఏటి సెయ్యడము?’’‘‘నీనేటి సెయ్యగలను? హాస్పిటల్‌కి తెచ్చేస్తే ఎదో ఒకటి చేద్దాం.. ఈ లోగా నీను నూటెనిమిదికి ఫోను చేస్తాను’’ అంటూ పెట్టేసింది. వాగు...ఇక్కడ ఒక కాజ్‌వే కట్టండని ఎన్నిసార్లు కాగితాలు పెట్టేమో గుర్తొచ్చింది రామన్న దొరకి. ఈ దారి గుండా నాలుగూర్లు నడకదారి సాగుతుంటుంది. ఎన్నిసార్లు దీని పేరు పెట్టుకుని... ఇక్కడ ఇది కట్టిస్తానని ప్రెసిడెంట్లు ఎంతమంది మారేరో గుర్తుకొచ్చింది. ఎంతమందికి అధికారులకీ, ఎమ్మెల్యేలకి దండాలు పెట్టేమో గుర్తొచ్చింది. వాన పడితే వాగు పొంగుతుంది. వాగు పొంగితే దారి ఆగిపోతుంది. ఈ దారి దాటుతూ ఎంతమంది ప్రాణాలొదిరేరో!? ఎన్ని పశువులు ఇక్కడ జారిపడి కొట్టుకుపోయాయో?!ఈ రాత్రివేళ డోలీ దాటించడమెలాగో ఆలోచిస్తున్నాడు రామన్న దొర. అదే సమయంలో అతన్ని ఆడిపోసుకుంటున్నారు.. ఈ వానకి గెడ్డ పొంగుతాదని తెలీదా అని. అందరికీ ఒక్క గసురు గసిరి తిరిగి తిట్టేడు. దారి ఎలాగైనా దాటించి వీడిని డాక్టరు దగ్గరకి చేర్చకపోతే వీడు చచ్చిపోతాడని మందలించేడు. ఊర్లో జరిగిన చావుల్ని గుర్తు చేసేడు. వాటికి కారణాల్ని విశ్లేషించేడు. కారణం ఆలస్యమని చెప్పేడు. ‘‘బాగుందిరా దొర! ఈ గెడ్డెలగ దాటిస్తావో అది ముందు సెప్పు’’ అందరూ ప్రశ్నించేరు. 

‘‘ఒరే నాగన్నా! గొడ్డలి తెచ్చేవుగలా?’’ అంటూ నాగడి వైపు చూసేడు. ‘‘అర్దమైందిలే! గానీ ఈ యేలప్పుడు ఏ సెట్టు కొట్టెస్తావూ? ఎలగ కొట్టెస్తావు?’’ అతని వ్యూహం అర్థమైనా సాధ్యాసాధ్యాల గురించి అడిగేడు భుజమ్మీది గొడ్డలి చేతిలోకి తీసుకుంటూ నాగడు. వాగు దూరం ఇరవై నుంచి ముప్పై అడుగుల పొడవుంటుంది. నీటి ప్రవాహం ఉదృతంగా వున్నా మధ్యలో నాలుగడుగుల వెడల్పున్న రాయి కనిపిస్తోంది. అక్కడికి ఒక చెట్టు నరికి అడ్డంగా వేస్తే అక్కడి నుండి అదే చెట్టు అవతలకి వేసి దాన్ని పట్టుకుని దాటొచ్చనేది దొర వ్యూహం. చాలాసార్లు అలాగే గెడ్డ దాటింది వూరు. కానీ అంత పొడవున్న చెట్టు నరకాలంటే ఎంత సమయం పడుతుంది? నాగడు అప్పటికే ఒడ్డుకి పదడుగుల దూరంలోనున్న గుగ్గిలం మాను కొట్టడం మొదలెట్టేడు. ఆ గొడ్డలి అలికిడికి దగ్గర్లోని పక్షులు, జంతువులు అలికిడి చేస్తూ పరిపోయేయి. కొంతమంది అటు వైపు నడిచేరు సాయంగా. మరికొందరు సెల్‌ఫోన్‌తో తెలిసిన వాళ్ళకి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నారు. డోలీ కిందికి దించేరు. మరికొందరు పారుతున్న వాగు వంక పరిశీలనగా చూస్తున్నారు... వేగం తగ్గితే దాటడానికి వీలు పడుతుందేమోనని. మరికొంతమంది దొరని తిట్టుకుంటున్నారు... చెప్తే విన్నాడు కాడని. అందరికీ తెలుసు, ఆ గెడ్డ ఎంతో సేపు అలా పారదని. ఒక గంటో గంటన్నరలోపే తగ్గిపోతుంది. కానీ వాన తగ్గాల. చీకట్లో...అంతా ఎవరికి అనువైన ప్రదేశాల్లో వాళ్ళు...కూర్చుని ఎదురు చూస్తున్నారు. చెట్టు కూలిన శబ్దం. కొండ ప్రతిధ్వనించింది. చెట్టు మీద నిద్రిస్తున్న పక్షుల గుంపులు గోల చేసుకుంటూ ఎగిరిపోయేయి. చుట్టు ప్రక్కల జంతువులేవో అక్కడి నుండి పారిపోయిన అలికిడి. మొత్తంగా అక్కడ ఒక చెట్టు కూలిన సవ్వడి కొండకి దడ పుట్టించింది. ఇంత చేసినా ఆ చీకట్లో చెట్టు ఇక్కడికి మొయ్యగలమా? మోసినా అది సరిగ్గా గెడ్డ మద్య రాయి మీదకి సరిగా వేయగలమా?

సందేహాలతో తర్జనభర్జన పడుతుంటే పడాల్‌ మరోసారి వాంతి చేసుకున్నాడు. ఆకాశం మరొక్కసారి ఉరిమింది. ఆ వెలుగులో గెడ్డ మధ్య రాయి ముందుకంటే స్పష్టంగా కనపడింది. అంటే వరద తగ్గినట్టే. కొట్టిన చెట్టునలాగే ఒదిలేసి వాగు దాటింది డోలీ.  రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల నడక దారి. నూటెనిమిది ఇంత లోపలికి రాదు. రోడ్డు మీదికొచ్చేయండి మీ ప్రాణాలకి మేము అడ్డుంటామని అంటారు. గానీ రోడ్డుకి రావడమంత తేలిక కాదన్న సంగతి నూటెనిమిదోలకి తెలీనిదా?డోలీ దుప్పటిని మరోసారి కర్రలకి బిగించి కట్టి పడాల్‌ని మోసుకుపోతున్నారు. చీకటి... ఆపై బురద. దారి స్పష్టమవదు. నడక తరిగిపోదు. ఈ నడక ఎన్నాళ్ళు నడిచేరో ఆ వూరి వాళ్ళు! ఈ దారి ఎన్నేళ్ళుగా ఆ వూరి దరఖాస్తులమీద నడిచెళ్ళిందో! ఎంత మంది నాయకులకు ఓట్ల కోసం ఉపయోగపడిందో! రోడ్డు చేరేసరికి నూటెనిమిది వాహనం ఎదురు చూస్తోంది. ఏయెన్నెం ఫోన్‌ చేసిందన్నమాట. మండల కేంద్రంలోని ఆసుపత్రికి చేరేసరికి రాత్రి అర్ధరాత్రిగా మారింది. బద్దకంగా లేచిన డాక్టరు ఎగాదిగా వూరి వాళ్ళందరి వైపూ చూసాక పేషెంట్‌ నాడి పట్టుకోకుండానే ‘ఏమైందని’ అడిగేడు. చెప్పేరు. ‘ఏమి తిన్నాడు’ అడిగాడు. చెప్పలేదు. ఎందుకంటే తిడతారని. అయినా రామన్నదొర ముందుకొచ్చి నిజం చెప్పేడు. డాక్టరు కష్టమని అన్నాడు. గతుక్కుమన్నారు అంతా. ఏమని అడిగితే ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని అన్నాడు. గంట ముందు తీసుకొస్తే బాగుణ్ణని అన్నాడు. బతిమాలితే ఇక్కడ లాభం లేదు, జిల్లా హాస్పిటల్‌కి తీసికెళ్ళండని సలహా ఇచ్చేడు. ఇక్కడికి రావడమే గగనం. అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోతున్నారు. ‘‘ఇప్పటికే బాడీలో నీటి శాయం బాగా తగ్గిపోయింది...స్లైన్‌ ఎక్కడం కూడా కష్టమవుతోంది... మీరు లేట్‌ చేస్తే మీకే ఇబ్బంద’’ని అన్నాడు. 

‘ఎలా?’ అని ఆలోచించేలోగానే మరో డాక్టరు గారొచ్చేరు. ‘ఏమైంద?’ని మళ్ళీ అడిగేరు.అందరూ మౌనం వహించేరు. డాక్టర్లిద్దరూ పక్కకెళ్ళి మాట్లాడుకున్నారు. ఏమి చెయ్యాలో తెలీక ఏయెన్నెవ్‌ు వైపు చూసేరు జనం. ఆమె తిరిగి డాక్టరు గారి వైపు చూసింది... ఏదో ఒక దారి మీరే చూపించండని అన్నట్టు. మళ్ళీ నూట ఎనిమిదిని పిలిచేరు. ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది. నగరం వైపు పరుగులు తీస్తూ... పడాల్‌ అపస్మారక స్థితిలో.చేరేసరికి వాన నెమ్మదించింది. హాస్పిటల్‌కి చేర్చి నూటెనిమిది వాహనం వచ్చిన దారినే వెళ్ళిపోయింది. డ్యూటీ డాక్టరు పేషెంటుని చూడడం కంటే అక్కడున్న మిగతా వారినే గమనించడం తెలుస్తూనే వుంది వాళ్ళకి. గదిలోకి స్టెచ్రర్‌మీద తీసుకెళ్ళేరు. పడాల్‌ని పరీక్షించేడు. ఆశ్చర్యంగా చేతులు దులుపుకుంటూ బయటికొచ్చేడు. ‘‘ఇతను ఎప్పుడో చనిపోయాడు’’ అన్నాడు. గతుక్కుమన్నారు అంతా. అందరి గుండెల్లో రాయి పడింది. ఆడోళ్ళు ఏడుపు అందుకున్నారు. పడాల్‌ తల్లినయితే ఎవరూ ఆపలేకపోతున్నారు. ‘‘నీనప్పుడే సెప్పినానా? నా కొడుకు ఇంటి కాడైనా...’’ అనిరాగమందుకుంది. మగాళ్ళు మాత్రం మౌనంగా గుండెల్లొ బాధని దాచుకుని అనుకున్నారు... ‘‘వూరి చావు మరొకటి, అయితే అది వూరి బయట’’ అని. రామన్నదొరకి ఏమీ పాలు పోలేదు. ఇప్పుడేమి చెయ్యాలో అర్ధంకాలేదతనికి. వెంటనే డాక్టరు గదిలోకి వెళ్లాడు. ‘‘సార్‌! ఇప్పుడెలా తీసుకెల్లాలి?’’ ఆడిగాడు. ‘‘నేనెలాగా చెప్తానయ్యా?’’ అతని ముఖంలో విసుగు కనిపిస్తోంది. అతని డ్యూటీ దిగిపోయే సమయమని చూసేవాళ్ళకి తెలిసిపోతుంది. ‘‘అంబులెన్సుంటాది గలా చూడండి సార్‌!’’ బతిమాలేడు.

‘‘హాస్పిటల్‌లో ఏంబులెన్సులుంటే ఎప్పుడో బాగుపడిపోనువోయ్‌... అదిగో అటు చూసేవా? అదే మా అంబులెన్సు. దాన్ని పట్టికెల్తావా?’’ అంటూ బయట చుట్టూ గడ్డిమొలిచి తుప్పు పట్టిన వాహనాన్ని చూపించేరు. సరిగ్గా అప్పుడే తుప్పు పట్టిన వాహనం పక్కకొచ్చి నిలబడింది ఒక కొత్త వాహనం. అది చూసిన దొర ‘‘సార్‌...!’’ అంటూ డాక్టరు దగ్గరికి పరిగెత్తాడు. ‘‘ఆ బండేదో ఒచ్చినట్టుంది సార్‌!’’ అని అడిగాడు. దానివైపు డాక్టరు గారు చూస్తూ ‘‘అదా! అందులో పేషెంటున్నారయ్యా!’’ అని డాక్టరు చిరాగ్గా లోపలికి వెళ్ళిపోబోయేరు. అందరూ అటువేపు చూసేరు.  నిజమే ఆ ఏంబులెన్స్‌లో పేషెంటున్నాడు. అతడు ఖరీదైన మనిషని తెలిసిపోతూనే వుంది. ఎవరికీ నోట మాట రాలేదు. ఏమి చెయ్యాలో తోచలేదు. డాక్టరు కాళ్ళమీద పడిపోయేడు రామన్నదొర. హటాత్పరిణామానికి డాక్టరుకి కోపమొచ్చింది. అతను కాళ్లు విదిలించేడు. దొర కింద పడిపోయేడు. అప్పుడే ఎవరో కొత్త వ్యక్తి లోపలికొచ్చేరు. అతని కాళ్ళకడ్డం పడ్డాడు దొర. ‘‘అరరె...!’’ అంటూ దొరని పైకి లేపేడు. ‘ఏమైంద’ని అడిగాడు. దొర ఒంటికంటిన దుమ్ముని దులుపుకుంటూ జరిగింది చెప్పాడు. అతను డాక్టరు వైపు అడుగులేసేడు.  ‘‘డాక్టరు గారూ! చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళంతా అమాయకులని. పైగా చావు. మీరే ఎలాగో ఒకలాగ వెహికల్‌ అరేంజ్‌ చెయ్యొచ్చు కదండీ’’ బతిమాలేడు. 

దానికి అతనికి కోపమొచ్చింది. ‘‘వీళ్ళు అమాయకులా? నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు అమాయకులా?’’ అంటూ స్వరం హెచ్చించి మాట్లాడేరు. ‘‘నో సార్‌! వాళ్ళ ఉద్దేశం అది కాకపోవచ్చు...  అర్ధం చేసుకోండి సార్‌’’ ముందుకు నడిచిపోతున్న డాక్టరు వెనక పడ్డాడతను. ఆ మాటకీ ఆగలేదు డాక్టరుగారు. ‘‘గిరిజనులంటే అంత చులకనా మీకు డాక్టరు గారూ!’’ స్వరం పెంచి గట్టిగా అరిచాడు. అంతా అతని వైపు చూసేరు.‘‘అతనేమీ ప్రాణాపాయ స్థితిలో లేడు. వీళ్ళా శవంతో వున్నారు. చేతిలో డబ్బులూ లేవు. ఏంబులెన్సు ఏర్పాటు చెయ్యలేరా?’’ అని డాక్టరు గారిమీదికి ఉరికేడు. అతనెవరో వీళ్ళకి తెలీదు. ‘‘పోనీ... ఇందాక నూటెనిమిదికి పిలిపించండి సార్‌!’’ దొర బతిమాలేడు. ‘‘అది పేషెంట్లకే గానీ శవాలకి కాదయ్యా’’ అని డాక్టరు గారు స్టెత్‌ వూపుకుంటూ ముందుకు కదిలిపోయారు. వెళ్తూ వెళ్తూ ‘మీరు త్వరగా శవాన్ని ఖాళీ చెయ్యాలయ్యా’లని చెప్పి వెళ్లిపోయేడు. ఆ ప్రక్కనే వున్న నర్సులు దగ్గరికొచ్చేరు.  ‘‘మీరు ఇక్కడ ఎంత బతిమాలినా ఏమీ ఫలితముండదువోయ్‌. బయటకెల్లి ప్రైవేటు అంబులెన్సులుంటాయి తీసికెల్లండ’ని ఉచిత సలహా ఇచ్చేరు. అక్కడ అడిగి చూసేరు. ఆ డబ్బు చెల్లించాలంటే వూరోలందరి చింత చెట్లు సంవత్సరం పాటు షావుకారికిచ్చేయాలి. 

వచ్చిన కొత్త మనిషి ‘‘డాక్టర్ల నిర్లక్ష్యం... నశించాలి... నశించాలి’’ అని నినాదాలు చేస్తున్నాడు. అతని వెనక్కి మరికొంత మంది వచ్చి చేరేరు. దొర కూడ అక్కడే వుండి నినాదమై అరుస్తున్నాడు. పరిస్థితి అర్ధమైపోయింది... వూరి జనానికి. శవాన్ని చాపలో చుట్టి కట్లు ఇర్రించి కట్టేరు. ఎప్పటిలాగే రెండు కర్రలకి డోలీని సరిచేసేరు. శవాన్ని డోలీలోకెక్కించి హాస్పిటల్‌ దాటి రోడ్డుమీదికొచ్చేరు. ఎవరో మీడియాకు కూడ సమాచారమిచ్చినట్టుంది. సెల్‌ఫోనుల్తో కొంతమంది వెనకా ముందు నుంచి బంధిస్తున్నారు. వెనుక నుంచి అరుపులు నినాదాలూ వినపడుతున్నాయి.మలుపు తిరిగింది డోలీ.నాలుగు రోడ్ల కూడలి... ట్రాఫిక్‌ స్థంబించి పోయుంది. అన్ని వాహనాలతోపాటూ నడుస్తున్న డోలీ కూడా ఆగిపోయింది. కారణాలు వాళ్ళకి తెలీలేదు. ముందుకు తలెత్తి చూసేరు. రోడ్డు మధ్యలో టెంట్లు వేసి వున్నాయి. చాలామంది... టెంటు నీడలో కుర్చీల ముందు నిలబడి.... కుడి చెయ్యిని ముందుకు చాపి నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారు. ప్రతిజ్ఞ మైకుల్లో ప్రతిధ్వనిస్తూండగా.... డోలీ దారి చేసుకుంటూ ముందుకు కదిలిపోయింది. 
జగదీశ్‌ మల్లిపురం 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top