ఆచార్యా మజాకా!

Some of the scenes in the film are the main characters - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, అన్నపూర్ణ, జయలక్ష్మి...ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసికట్టుగా వచ్చినట్లున్నది అక్కడి పరిస్థితి.‘‘తక్షణం ఇల్లు ఖాళీ చేయాల్సిందే’’ అని ఒంటికాలి మీద లేచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నాడు  ఇంటోనరు (ఇల్లు+ ఓనరు).‘‘ఒక్క పదిరోజులు ఆగండి’’ అన్నది ఆ ఇల్లాలు భయం భయంగా.‘‘వీల్లేదు. ఈ క్షణం ఖాళీ చేయాల్సిందే. నన్ను వెధవ అనుకుంటున్నాడా....దద్దమ్మ అనుకుంటున్నాడా...చవట అనుకుంటున్నాడా....వాజమ్మ అనుకుంటున్నాడా...అసలు ఏమనుకోవడం లేదా’’ అంటూ కేకలేస్తున్నాడు ఓనరు.అనుకున్నాడో లేదో తెలియదుగానీ ‘‘నమస్కారం గురూ’’ అని ఒక న‘మస్కా’ర బాణం విసిరాడు అద్దెదారు ఆచార్య. ఆచార్యను చూడగానే మరింత ఎత్తు ఎగిరాడు  ఇంటోనరు.‘‘ఏం పెద్దమనిషివయ్యా బుద్ధిలేదా’’ అని తిట్టాడు.
ఉందా లేదా అని చెప్పలేదుగానీ ‘‘చదువుకున్నావు బుద్ధి లేదు.

పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావా! వెళ్లి కాఫీ పట్రా’’ అని అరిచి ‘‘లోనికి రండి సార్‌’’ అని ఇంటి యజమానిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఆచార్య.ఇక్కడ మనం ఆచార్య గురించి చెప్పుకోవాలి. కాస్త అటు ఇటుగా ‘కన్యాశుల్కం’లో గిరీశంలాంటి వాడు. మండు వేసవిలో కూడా చలికోట్లను బ్లాక్‌లో అమ్మగల నేర్పరి.‘‘ఏంటి సార్, ఆపరేషన్‌ చేయించుకున్నాక ఇలా అయ్యారు. ఏనుగులా ఉండేవారు పీనుగులా అయ్యారు’’ సానుభూతిగా అన్నాడు ఆచార్య.‘‘నీ మాటల్లో పడడానికి నేనేమైనా పిచ్చొడ్ని అనుకుంటున్నావా! అద్దెయ్యా....మూడు నెలల అద్దెయ్యా...మార్యాదగా ఇస్తావా లేకపోతే ఖాళీ చేస్తావా!’’ కరాఖండిగా,  కఠినంగా అరిచాడు ఇంటి యజమాని.‘‘ఎందుకు సార్‌ అంత గట్టిగా అరుస్తారు. పాపం మీకు అసలే బ్లడ్‌ప్రెషర్‌. పొరపాటును మీకు గుండె నొప్పి వచ్చిందనుకో...ఫినిష్‌’’ అంటూ ఇటీవల ఎవరెవరు హార్ట్‌ ఎటాక్‌లతో చనిపోయింది పేర్లు, వృత్తితో సహా లిస్ట్‌ చదివాడు.ఈ దెబ్బకు ఇంటి ఓనరు భయంతో బిక్కచచ్చాడు.‘‘అన్నట్లు మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారు కదా... మీకు అభ్యంతరం లేకపోతే మీ చెయ్యిని ఒకసారి ఇవ్వండి’’ అడిగాడు ఆచార్య.‘‘దానికేం...తప్పకుండా చూడు’’ అని చెయ్యి ఇచ్చాడు  ఇంటి యాజమాని.

‘‘మీరు కొత్త ఇంట్లోకి వెళ్లి ఎన్నాళ్లయింది?’’‘‘మహా అయితే ఆర్నెల్లు అవుతుంది’’‘‘మరో ఆరు నెలల్లో నువ్వు పోతావు గురూ...’’ఇంటి యజమాని గుండెల్లోకి పిడుగు నేరుగా దూరింది. 60 లీటర్ల కన్నీరయ్యాడు.‘‘బావి ఎక్కడ తవ్వారు?’’‘‘మూలలో...’’‘‘ఏ మూలా? దక్షిణంలోనా....దానికి శాంతి చేయాలోయ్‌. ఓ పనిచెయ్‌. ఇప్పుడు నువ్వు వెళ్లిపో. నీ వెనకాలే నేను వస్తాను. నీ ఇంట్లో అన్నీ చూస్తాను. శాస్త్రోక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేస్తాను’’‘‘త్వరగా వచ్చేస్తావుగా’’ భయంభయంగా అన్నాడు ఇంటి యజమాని.‘‘నీ పని తప్ప నాకు వేరే ఏ పని ఉందోయ్‌... ఇదిగో ఒక పదిరూపాయలు ఉంటే ఇవ్వు’’ అడిగాడు ఆచార్య.వేరే సందర్భంలో అయితే ఎలా స్పదించేవాడో తెలియదుగానీ... ఇప్పుడు మాత్రం ఇరౖవై రూపాయలు తీసి...‘‘ఇరవై రూపాయల నోటే ఉంది’’ అన్నాడు ఇంటి యజమాని.‘‘ఉంటే ఏమవుతుంది! పూజకు మొత్తం 180 అవుతుంది. 20 రూపాయలు పోగా....160 మిగులుతుంది. ఆ డబ్బులు నువ్వు నాకు బాకీ అన్నమాట. ఫరవాలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంటికి వచ్చి తీసుకుంటాలే’’ అన్నాడు ఆచార్య.కళ్ల ముందు భయం తప్ప యజమానికి ఏదీ కనిపించడం లేదు.

‘‘ఏమిటో’’ అనుకుంటూ వచ్చిన దారిన వేగంగా వెనక్కి వెళ్లాడు యజమాని.పాలవాడిని చూడగానే ఆచార్య బుర్ర బంపర్‌ ఐడియాతో మురిసిపోయింది.‘‘ఏమోయ్‌ నారాయణ ఇట్రా’’ అని పిలిచాడు.‘‘ఏమిటి బాబూ’’ అడిగాడు నారాయణ.‘‘ఏమిటయ్యా ఇది. నీ దగ్గర నేను బాకీ ఉన్నాను. నువ్వు అడగవు. నా దగ్గర తీసుకోవు’’ అన్నాడు ఆచార్య.‘‘మీలాంటి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది బాబూ’’ మర్యాదగా అన్నాడు నారాయణ.‘‘పోయేది పెద్దల దగ్గరేనోయ్‌. ఇదిగో ఈ ఇరవై రూపాయలు తీసుకో’’ అని డబ్బు చేతిలో పెట్టాడు ఆచార్య.ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడనే అమాయకత్వంతో ‘‘16 రూపాయలే బాబూ’’ అన్నాడు నారాయణ.

‘‘అయితే ఏమిటి! మిగిలిన నాలుగు రూపాయలతో...గేదెలున్నాయి కదా....వాటికి బ్రహ్మాండమై గడ్డి వేయించు’’ అన్నాడు ఉదారంగా నారాయణ.నారాయణ కళ్లు ఆనందంగా మెరిసాయి.‘‘ఒకమాట...నీ గేదెలను ఎవరో బందెలదొడ్లో పెట్టారని విన్నాను’’ అడిగాడు ఆచార్య.‘‘అవును బాబూ...రెండు వందలు కడితేగానీ వాటిని విడిపించుకోవడానికి లేదు’’ దీనంగా అన్నాడు నారాయణ.‘‘రెండొందలా!’’‘‘అవును బాబూ’’‘‘రెండొందలా!!!’’‘‘అవును బాబు’’‘‘ఒక యాభై రూపాయలు ఇవ్వు. వాటిని విడిపించేస్తాను’’ నమ్మకంగా అన్నాడు ఆచార్య.‘‘అంతకంటేనా బాబూ!’’ అని అడిగిన యాభై ఆచార్య చేతిలో పెట్టాడు నారాయణ.

‘‘సాయంత్రం అయిదు గంటలలోపు నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయి. ఇదిగో జున్నుపాలు దొరుకుతాయా...ఆ...ఎందుకు దొరకవు...మా  ఆవిడకు చాలా ఇష్టం. సాయంకాలం పట్రా’’ అని ఆర్డర్‌ వేసి...భార్యను కేకేసి...‘‘ఏమోయి మేరీ...నీ పుట్టిన రోజు ప్రెజెంటేషన్‌. ఈ యాభై రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన చీర తీసుకో. ఇదిగో చూడు...సాయంత్రం నిన్ను రిసీవ్‌ చేసుకోవడానికి నేను రాలేను. మన హౌస్‌ఓనరు ఇంట్లో శాంతి చేయాలి....ఆ నారాయణ గేదెలు విడిపించాలి. ఈరోజు ఫుల్‌బిజీ’’ అంటూ హడావిడి పడతున్నాడు  ఆచార్య.
(జవాబు 38వ పేజీలో)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top