సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో.. | Snacks Varieties On Funday | Sakshi
Sakshi News home page

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

Jul 7 2019 12:02 PM | Updated on Jul 7 2019 12:02 PM

Snacks Varieties On Funday - Sakshi

మార్మాలాడే చికెన్‌ బాల్స్‌
కావలసినవి: పాలు – పావు కప్పు, బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, బోన్‌లెస్‌ చికెన్‌ – అర కిలో (మెత్తగా ఉడికించుకుని, చల్లారిన తర్వాత ముద్దలా చేసుకోవాలి), వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్, అల్లం పేస్ట్‌ – అర టీ స్పూన్, ఉల్లికాడల తరుగు – 1 టేబుల్‌ స్పూన్, కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, సోయా సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి – కొద్దిగా, నువ్వుల నూనె – ఒకటిన్నర టీ స్పూన్, ఆలివ్‌ నూనె – ఒకటిన్నర టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, ఆరెంజ్‌ జామ్‌ – ముప్పావు కప్పు, ఎండుమిర్చి – 3 (కచ్చాపచ్చాగా దంచుకుని పొడిలా చేసుకోవాలి), హోయాసిన్‌ సాస్‌ – పావు కప్పు
తయారీ: ఒక బౌల్‌ తీసుకుని చికెన్‌ ముద్ద, పాలు, బ్రెడ్‌ పౌడర్, అర టీ స్పూన్‌ వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్‌ అల్లం పేస్ట్, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తురుము, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని ఓవెన్‌లో ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాత్రలో నువ్వుల నూనె, ఆలివ్‌ నూనె వేసుకుని వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చీ పౌడర్, అర టీ స్పూన్‌ అల్లం పేస్ట్,  ఆరెంజ్‌ జామ్, హోయాసిన్‌ సాస్‌ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కాస్త దగ్గర పడగానే అందులో చికెన్‌ బాల్స్‌ వేసుకుని గరిటెతో నెమ్మదిగా తిప్పి.. బాల్స్‌కి సాస్‌ మొత్తం పట్టిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

నోట్‌:
ఆరెంజ్‌ జామ్‌ తయారు చేసుకునే విధానం :
మొదట ఆరు లేదా ఎనిమిది ఆరెంజెస్‌ని మిక్సీ పట్టుకుని వడకట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాత్రలో ఆ జ్యూస్‌ వేసుకుని.. గరిటెతో తిప్పుతూ మరగనివ్వాలి. మధ్యలో ఒక కప్పు పంచదార వేసుకుని.. బాగా తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే నిమ్మరసం కూడా వేసుకుని దింపుకుంటే.. దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.
హోయాసిన్‌ సాస్‌ తయారు చేసుకునే విధానం : ఒక బౌల్‌ తీసుకుని అందులో.. అర కప్పు సోయాసాస్, పావు టీ స్పూన్‌ వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్‌ ఎండుమిర్చి గుజ్జు, అర టీ స్పూన్‌ నువ్వుల పేస్ట్, 2 టీ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని ఆ మిశ్రమం మొత్తం సగానికి పైగా తగ్గి దగ్గరపడేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది.

డేట్స్‌ పకోడా
కావలసినవి:  ఖర్జూరం(డేట్స్‌) – 15, శనగపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – అర టేబుల్‌ స్పూన్, మొక్కజొన్న పిండి – అర టేబుల్‌ స్పూన్, ఉప్పు – తగినంత, పంచదార – 2 టీ స్పూన్లు, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఖర్జూరాల్లోని గింజలు తొలగించి, శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, పంచదార కొద్దిగా నీళ్లు వేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఖర్జూరాన్ని ఆ మిశ్రమంలో ముంచి మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

బానానా హల్వా
కావలసినవి:  అరటిపండ్లు(బనానా) – 3, లవంగాలు – 4, పంచదార – 10 టీ స్పూన్లు, నెయ్యి – 3 టీ స్పూన్లు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్, నీళ్లు – 2 కప్పులు
తయారీ: ముందుగా అరటిపండ్లను చక్రాల్లా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి బౌల్‌ పెట్టుకుని.. అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాస్త వేడికాగానే.. నెయ్యి, లవంగాలు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు పంచదార వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అరటిపండు ముక్కలు కూడా వేసుకుని గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఉడకనివ్వాలి. అరటి పండు బాగా పండినదే అయితే 20 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే 30 నిమిషాలు ఉడికించాలి. నీళ్ల శాతం తగ్గుతున్న సమయంలో ఏలకుల పొడి కూడా వేసుకుని జాగ్రత్తగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమంలోని నీళ్లు బాగా మరిగి.. దగ్గరపడగానే స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే సరిపోతుంది.
సేకరణ:  సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement