సాయి తేజ స్వరూపం

sai pataham Antarvedam 25th story - Sakshi

సాయిపథం – అంతర్వేదం 25

ఏదీ తగిన ప్రమాణం ఆధారం లేకుండా దీన్ని మీరు నమ్మి తీరాల్సిందే! అనే తీరు ధోరణి సాయి చరిత్రలో కనిపించనే కనిపించదు. ఆ దృష్టితోనే అలాంటి సాక్ష్యాలతో కూడిన సంఘటనలతో సాయి.. ఈ అనంత పృథ్వినీ జలాన్నీ తన అధీనంలోకి వినయంతో.. భక్తితో.. గౌరవంతో మాత్రమే... తెచ్చుకోగలిగాడని నిరూపించుకుని తెలుసుకున్నాం. ఈ క్రమంలో తేజస్సు అనే పంచభూతాల్లోని మూడవదాన్ని ఎలా అదుపులోనికి తెచ్చుకోగలిగాడో చూద్దాం!

శాంతించు!
ప్రతిరోజూ మసీదులో ఉన్న ధుని(అగ్నిహోత్రస్థలం)లో భక్తులు తెచ్చిన కట్టెలని వేస్తూనే ఉండేవాడు సాయి. భక్తులు కూడా ధునికి ప్రదక్షిణాన్ని చేస్తూ భక్తి గౌరవ ప్రపత్తులతో కట్టెలని వేస్తూ ఉండేవారు. ఆ అగ్నిహోత్ర కార్యక్రమం చూడటానికి నయన మనోహరంగా ఉంటూ ఉండేది. కేవలం కట్టెల్ని తగలబెట్టడం దీని లక్ష్యం కాదనీ, మన పూర్వజన్మపాపకర్మలని అగ్నిలో ఎవరికి వారు దహించివేసుకోవడమనేది దీని లక్ష్యమనీ సాయి భక్తులందరికీ బోధ చేస్తూ ఉండేవారు వివరంగా. అయితే కిందిస్థాయి పామరునికి కూడా అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. దాంతో విశేషసంఖ్యలో భక్తులొస్తూ నిత్యం ధుని కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు.

ఇలా ఉండగా ఓ వేసవి కాలంలో.. అందునా మిట్ట మధ్యాహ్నపువేళ ధునిలో కట్టెల్ని అందరూ క్రమంగా వేస్తూ ఉంటే మంటలు మరింత అయ్యాయి. కొద్ది ఎత్తు తక్కువగా ఉన్న ఆ మసీదులో దూలాలు కొద్ది కిందుగానే ఉన్న కారణంగా ఎక్కడ ఆ మంటలు ఆ దూలాలకి అంటుకుని ఏ ఉపద్రవాన్ని తెచ్చిపెడతాయోనని భక్తులు కట్టెలని వేయడం తగ్గించారు. ఓ దశలో మానేసారు కూడా. అందరి దృష్టి పూర్తిగా అగ్నికారణంగా మసీదు పైకప్పుకి మంటలు వ్యాపిస్తాయేమోననే ఆలోచనతో ఉండిపోయింది గానీ, దాదాపుగా ఆధ్యాత్మిక భావం ఎవరిలోనూ లేదు. పోనీ ఆ దశలో సాయి కూడా వెనక్కితగ్గచ్చుగా కర్రలని ధునిలో వేయకుండా. ఆయన కట్టెలని ఎగదోస్తూ కర్రలని వేస్తూ ఇంకా అగ్నిహోత్రం విజృంభించేలానే చేస్తూ ఉండటం భక్తులందరికీ ఆవేదనని కలిగించింది. ఆయనతో మాట్లాడలేక.. పరిస్థితిని వివరించలేక.. ఒక పక్క కొన్ని నీటి బిందెలని సిద్ధం చేసారు. మరో పక్క కట్టెలమోపులోని కట్టెలని కొన్నింటిని పక్కకి జరిపేసారు.

ఇంతలో సాయి ఆ ధునిలోని అగ్ని జ్వాలలని గమనించి మరింత ఎత్తుగా మసీదులోపలి కప్పుకి అగ్ని అంటుకోబోతోందని గ్రహించి భక్తులతో ఆ నీటిబిందెలని తేవలసిందని అనలేదు. అగ్నిని చూస్తూ తన చేతిలోని సటకాతో ఆ పక్కనున్న స్తంభం మీద కొడుతూ.. ‘‘అగ్నిదేవా! శాంతించు! శాంతించు!! దిగిపో! దిగు! దిగు!!’’ అనడం మొదలెట్టాడు. సటకాతో కొట్టిన ఒక్కొక్క దెబ్బకి  కొంచెం కొంచెం తప్పున జ్వాల తగ్గుతూ తగ్గుతూ మొత్తం అగ్ని శాంతించింది. భక్తుల ఆశ్చర్యానికి అవధి లేదు. కట్టెలని  తగ్గించుకుండానూ, ఏ నీళ్లో పోయకుండానూ మంటలు అదుపులోకి రావడమంటే సామాన్య విషయమా? ఈ కారణంగా సాయి.. అగ్నిత (తేజస్సు నిప్పు)ని కూడా తన అదుపులో ఉంచుకోగలగాడని అర్థమయింది భక్తులకి. దైవశక్తి విజృంభించిన వేళ మనుష్యశక్తి (నీళ్లు పోయడం.. కట్టెల్ని తగ్గించడం..) ఏ విధంగానూ ప్రయోజనపడదని దీని ద్వారా గ్రహించాలి. ఇంతకీ అగ్ని సాయికి ఎందుకు అధీనుడై ఉన్నాడో మరో సంఘటనని కూడా తెలుసుకున్నాక వివరించుకుందాం!

వేడి వంటపాత్రలో చేయిపెట్టి....
చక్కగా వెలుగుతున్న దీపంలో ఎక్కడా చీకటి అనేది ఎలా కనిపించదో... బాగా తృప్తిగా  భోజనం చేసిన వ్యక్తిలో ఎలా ఆకలి అనేది మచ్చుకైనా ఉండదో... అలా సాయి  చేసే ఏ చేష్టలోనూ ఏ దోషమూ ఉండదు సరికదా! నేర్చుకోవలసిన అంశమే ఉండి తీరుతుంది. తాను భోజనాన్ని చేయడం కంటే పదిమందికి అన్నాన్ని పెట్టడంలో చెప్పలేని తృప్తినీ, ఆనందాన్నీ పొందుతూ ఉండేవాడు సాయి. భోజనాన్ని పెట్టడంలో కూడా ముందుగా కుంటి, గుడ్డి, కుష్ఠిరోగస్థులూ, ఇతర రోగులూ, అతి వృద్ధాప్యం కారణంగా ఆకలికి ఆగలేనివారూ, అంగవికలురూ ఉంటే వారికి పెట్టేవాడు. ఆ మీదట మాత్రమే అందరికీ భోజనం. ఎప్పుడూ ఒక్కడే దొంగలాగా తినరాదంటూ ఉండేవాడు. పశుపక్షి, క్రిమికీటకాలకి ఓ సమయమంటూ ఉండదు కాబట్టి ఎప్పుడూ వాటికి ఆహారాన్ని ఓ స్థలంలో వేస్తూనే ఉండాలంటూ ఉండేవాడు. సాయి వద్ద రెండే రెండు వంటపాత్రలుండేవి. ఒకటి వందమందికి ఆహారాన్ని వండగలిగేదీ.. మరోటి 50 మందికి సరిపోయేలా వండగలిగేదీను. ఎప్పుడూ భక్తజనుల సంఖ్యని గమనించి తానే వండి వడ్డించేవాడు. దాంట్లో అపరిమితానందాన్ని పొందుతుండేవాడు.

ఇలా ఉండగా ఓ సారి దాదాకేల్కర్‌ అనే తన భక్తుడ్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికిందో లేదో పరీక్షించి చెప్పు అన్నాడు. జాతికి బ్రాహ్మణుడైన కేల్కర్‌ ఆ పలావు గిన్నె మూతని కూడా తీయడానికి ఇష్టం లేనివాడౌతూ.. సాయి దగ్గరకొచ్చి బాగానే ఉందని సమధానం చెప్పాడు. దాంతో సాయి నవ్వుతూ.. ‘‘మూత తీయలేదు. వాసన చూడలేదు. దాని పదునుని పరిశీలించలేదు. నాలుకతో రుచి చూడలేదు. ఎలా బావుందని చెప్పావు?’’ అంటూ కేల్కర్‌ ఎందుకు చూడలేదో గమనించి మరోమారు నవ్వుకున్నాడు.వెంటనే తనకి తానే ఆ మరుగుతున్న పలావు డేగిసాలో తెడ్డు పెట్టకుండా తన చేతినే పెట్టి కలయదిప్పుతూ.. ఇప్పుడు డేగిసాలోని పదార్థాలన్నీ ఒకటికొకటి కలిసి మంచి రుచిని ఇయ్యబోతున్నాయనడమే కాకుండా కేల్కర్‌ చేతిని పట్టుకుని డేగిసాలో పెట్టించాడు కూడా. ఏ విధంగానూ ఇద్దరి చేతులూ కాలకపోవడాన్ని గమనించిన భక్తజనమంతా ఆశ్చర్యపడ్డారు.కేల్కర్‌ బ్రాహ్మణత్వాన్ని కించపరచడం సాయి లక్ష్యమే కాదు. మరోమారు ఆ విశేషాన్ని గమనిద్దాం! ఈ సంఘటనలో అగ్ని సాయికి అధీనుడై ఏ మాత్రమూ గాయపరచలేదు. సాయినే కాదు కేల్కర్‌ను కూడా. అగ్ని ఎందుకు సాయికి సహకరిస్తూ సాయికి అధీనుడయ్యాడో తెలుసుకోబోయే ముందు అగ్ని బాధకి సాయి గురైన ఓ సంఘటనని కూడా తెలుసుకోవాల్సి ఉంది.

కాలిన చేతితో సాయి
ఓ సంవత్సరంలో అది దీపావళి రోజు. సాయికి పరమభక్తులైన మాధవరావు, దేశపాండే, తాత్యా మొదలైన ఎందరో సాయి చుట్టూ ఉన్నారు. సాయి ఆ ధునిలో కట్టెలని చేతితో పైకి ఎగదోస్తూ ‘అల్లాహ్‌ హో మాలిక్‌’ (అల్లాయే నిజమైన నా యజమాని) అంటూ పరవశించిపోతూ ధునిని ప్రజ్వరిల్లజేస్తూ ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా తన చేతిని తానే ఆ మంటలో పెట్టి క్షణకాలంలో పైకితీసుకున్నాడు. కణకణమండే ఆ కట్టెల మంటకి సాయి చేయి కాలింది. నల్లగా కమిలిపోయింది.సాయి మాత్రం ఏ మాత్రపు బాధా లేకుండా ఉంటే.. మాధవురావు మాత్రం గట్టిగా కేకలు వేస్తూ.. ‘‘బాబా! ఏమిటీ పని? అగ్నిహోత్రానికి నీ చేతిని కానుకగా ఇయ్యలనుకున్నావా? మా భక్తుల పరిస్థితిని గమనించవా?..’’ అని అరుస్తూ ఉన్నాడు. భక్తులందరికీ ఏమీ తోచలేదు.సాయి నిదానంగా.. ‘మాధవరావూ! ఏ ప్రమాదమూ లేదయ్యా! నా చేతికి నిప్పు అంటుకుని గాయమైన ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేని పక్షంలో మాడి మసి అయిపోయేవాడు’ అన్నాడు. ఎవరికీ ఏమీ అర్థం కాకపోతే సాయే వివరించాడు వృత్తాంతాన్ని. ‘‘ఇనుప పనిని చూస్తూ ఇనుప వస్తువులని తయారు చేసే కమ్మరివాడొకడున్నాడు. కమ్మరి వాళ్లెందరు లేరు? అయితే ఆ కమ్మరికి అసూయ లేదు. తెగ సంపాదించెయ్యాలనే అత్యాశ లేదు. అన్నింటికీ మించి ‘సర్వం దైవ అనుగ్రహమయం’ అనే చక్కని బుద్ధి అతనిది. మంచి జరిగినా, చెడు కలిగినా అదంతా దైవదత్తమే.. దైవకల్పితమే.. అనుకునే ఉత్తమ లక్షణం అతనిది. ఇక్కడికి 300 మైళ్ల దూరంలోని చిన్న పల్లెలో ఉంటున్న అతనికి సుస్తీ (అనారోగ్యం) చేస్తే అతని కమ్మరి పనిలో గాలి తిత్తి కొలిమిని అతడి భార్య వేయడం మొదలెట్టింది. కణకణమండే నిప్పులకొలిమి సమీపంలో కూచుని తిత్తిని వేస్తుంటే పిల్లవాడు పాలకి ఏడ్చాడు. వాడ్ని ఒళ్లో వేసుకుని తిత్తివేస్తూ అనారోగ్యంతో ఉన్న భర్త పిలవగానే.. అతనికి ఎలా ఉందో, ఏమయిందోనని హఠాత్తుగా లేవగానే ఒళ్లోని బిడ్డ కొలిమిలో పడిపోయాడు. వాడు ‘సాయీ! బాబా!!’ అన్నాడు. అంతే! చేతిని చాచి బయటికి తీశాను. అపాయం లేకుండా ఒళ్లు కాలకుండా బయటికి వచ్చాడు. నా చేయి కాలితే ఏమైంది?’’ అన్నాడు సాయి.ఇదేదో కట్టుకథ కాదు. విచారించగా అక్కడివాళ్లు వచ్చి నిజమని చెప్పిన సత్యకథ. అయితే ఇక్కడ మనకో సందేహం రాక మానదు. ‘మరి సాయి పంచభూతాలకీ అధికారి అనీ, వాటిని తన అధీనంలో ఉంచుకున్నాడనీ అన్నారు గదా మరి అగ్నిదేవుడు సాయి చేతిని ఎందుకు కాల్చాడు? అని. నిజమే కదా!

కర్మానుభవం
ఎవరికి వ్యాధి వస్తే వాళ్లే బాధని అనుభవించవలసినట్లుగానూ, వ్యాధి వచ్చిన వారికి దగ్గరివాళ్లూ, బంధువులూ, ఆప్తులూ, మిత్రులూ ఎవరి స్థాయిలో వాళ్లు సహాయపడటం వరకు మాత్రమే చేయగలిగేటట్లూ ఎవరి పాపకర్మని వాళ్లు మాత్రమే అనుభవించక తప్పదు. ఏ మహనీయుల్నో మనసా–వాచా–కర్మణా(త్రికరణశుద్ధిగా) నమ్మి ఆరాధిçస్తున్న పక్షంలో వాళ్ల సహాయం సకాలంలో తీరుతుంది. ఇదీ ఇక్కడి రహస్యం. కాబట్టి కమ్మరికీ, కమ్మరివాని భార్యకీ, అతడి పుత్రునికీ సంబంధించిన పాపఫలానికి అనుగుణంగా ఆ మానసిక ఆందోళననీ, ఆ వ్యాధి బాధనీ ఆ దంపతులు పొందవలసివస్తే, ఆ పుత్రుడు తాత్కాలిక అగ్ని బాధకి గురి కావలసిన సందర్భం రావడం, అంతలోనే అతడు నమ్మిన సాయి రక్షించడమనేవి జరిగాయి. చివరికి మోక్షాన్ని పొందినా భారతంలో ‘భీష్ముడూ’, శ్రీమద్రామయణంలో ‘అహల్యా’, భాగవతంలో ‘పరీక్షిత్‌’ ఎలా తీవ్రమైన మనో వ్యథకీ, అవమానాలకీ, అపనిందకీ గురయ్యారో ఇదీ అలాంటిదే. ఆ కర్మఫలాన్ని ఆ పుత్రుని నుండి తాను తీసుకోదలిచాడు కాబట్టీ, ఆ కర్మఫలం సిద్ధుడైన సాయిది కాదు కాబట్టీ తప్పక తానూ సాధారణ వ్యక్తిలా అగ్ని బాధకి గురికావలసే వచ్చాడు. రుణమంటూ ఒకరి వద్ద చేసాక దాన్ని తీర్చడం తప్పనిసరి. ఆ రుణాన్ని తానే తీర్చనక్కరలేదు తనకి సహాయకునిగా ఉన్న ఎవరైనా కూడా తీర్చవచ్చు. ఆ తీర్చడానికి కావలసిన ఇబ్బంది ఏదైనా ఉంటే పడవలసింది కూడా రుణాన్ని తీర్చదలచిన వ్యక్తే. ఏది ఏమైనా రుణం మాత్రం తీర్చబడాల్సిందే! అందుకే సాయి చేతికి అగ్ని గాయమయిందనేది సమాధానం.

లో రహస్యం
శ్రీమద్రామాయణ భారత భాగవతాల్లో మనం ‘అస్త్రా’లనే పేరిట కొన్నింటిని గూర్చి చదువుతాం. వింటాం. శస్త్రమంటే కేవలం ఎదుటి శత్రువుని వధించడం కోసం వాడే మారణాయుధం. అదే మరి అస్త్రం అన్నట్లైతే ఆ శస్త్రానికే మంత్రశక్తిని జోడించి ప్రయోగించబడేది అని అర్థం. ఏ పేరున్న అస్త్రమైతే ఆ దైవానికి సంబంధించిన మంత్రాన్ని జపించి.. జపించి.. ఆ శక్తిని ఆ శస్త్రంలోనికి నింపితే ఆ పేరిటి అస్త్రమౌతుందన్నమాట.ఆ క్రమంలో అగ్నిదేవుని మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో ప్రవేశపెడితే అది ఆగ్నేయాస్త్రంగా అవుతుంది. ఈ ఆగ్నేయాస్త్రపు మంటలనీ, జ్వాలలనీ, వేడిమినీ ఎదుర్కోని నిలిచేందుకు వరుణుని (జలానికి అధిష్ఠాన దేవత) మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని శస్త్రంలో నింపితే ఆ అస్త్రం వారుణాస్త్రం అవుతుంది. అగ్నిని ఆర్పేంతటి నీటిధారని పంపగలుగుతుంది. దేవతలే ఇలాంటి అస్త్రాలని వాడారనుకోకూడదు. భారతయుద్ధంలో ఎందరో యోధులు ఇలాంటి అస్త్రాలని ప్రయోగించినవారే. అదే తీరుగా సాయి కూడా శస్త్రం (మారణాయుధం) అనేదాన్ని తీసుకోకుండా తనదైన మంత్రాన్ని మననం చేసి.. చేసి.. ఆ శక్తిని వారుణాస్త్ర శక్తితో సమానంగా చేసుకున్న కారణంగానే ఆ వేడితో ఉడుకుతున్న వంట డేగిసాలో చేతిని పెట్టినా ఆయనకి ఏమీ కాలేకపోయింది. అంటే వేడిమిలో వేడితనం లేకుండా పోయిందన్నమాట.

వెనుక భాగంలో నీళ్లలో ఉండే సహజధర్మమైన చల్లదనం అక్కడ పోయి వేడిమితనం కలిగి దీపాలు వెలిగినట్లే, ఇక్కడ కూడా నిప్పులో ఉండే ఆ వేడిమితనం పూర్తిగా పోయి నీటికుండే చల్లదనమే ఆ తేజస్సు (అగ్ని)లో ప్రవేశించిందన్నమాట. సిద్ధుడైన వ్యక్తికి పంచభూతాల్లోని పదార్థాలకుండే సహజధర్మాన్ని తాత్కాలికంగా తొలగించగల శక్తి ఉంటుందనేది సోదాహరణంగా అర్థమౌతోంది కదా!శ్రీమద్రామాయాణంలో ఆంజనేయుని తోకకి నిప్పు అంటించబడింది. ఆంజనేయునికి చల్లగా అనిపించి, కొంతసేపటికి గాని ఆ విషయమేమంటే సీతమ్మ తన పాతివ్రత్యశక్తి ద్వారా అగ్నిదేవుడ్ని ప్రార్థించి నిప్పులో ఉండే వేడిమిని తొలగించి నీటికుండే చల్లదనాన్ని ఆ అగ్నిలోనికి నింపి ఉంచడమే! మరొకరి తోకకి అంటుకున్న నిప్పుని కూడా చల్లబరచగల శక్తి ఉన్న సీతమ్మని చితిలో ప్రవేశించవలసిందని రాముడనగానే ఈ ఆలోచన లేని, రానీ వాళ్లంతా రాముడ్ని తిట్టిపోస్తారు తమ అజ్ఞానాన్ని గ్రహించుకోలేక కొందరు స్త్రీలైతే మరీను. ఎంతగా రాముడ్ని నిందిస్తే ఆ స్థాయి అవివేకం అజ్ఞానం ఉన్నట్లే కదా అర్థం.మరో ఉదాహరణం కూడా ఈ సందర్భంలో చెప్పుకోక తప్పదు. హనుమ లంకాదహనాన్ని ప్రారంభించి చేస్తుంటే లంకలో ఉన్న అన్ని ఇళ్లు దాదాపుగా తగులబడుతూ కనిపించాయి గానీ.. ఒక్క విభీషణుని ఇల్లు మాత్రమే.. అగ్నికి గురి కాలేదు. దానికి కారణం కేవలం మంత్రమనన శక్తి విభీషణుని ధర్మబద్ధవిధానం, రామానుగ్రహమున్నూ అతడే కాదు అతని భార్య ‘సరమ’ కూతురు ‘అనల’ కూడా విభీషణుని త్రోవలోనే ఉండటం కూడా వాళ్ల ఇల్లు అగ్ని నుంచి రక్షింపబడటానికి కారణం.

ఆదిశంకరులవారి మీది కోపంతో ఆయన జ్ఞాతులూ ఇంకకొందరూ (దాయాదులూ మొదలైనవారూ ఆ దేశ రాజభటులు కూడా) ఆయన పార్థివ శరీరాన్ని ఒకచోట దాచి ఉంచితే దాన్ని చితి మీద పెట్టి దహించబోయారు. ఆ విషయాన్ని గ్రహించిన ఆదిశంకరుల వారు లక్ష్మీనరసింహ కరావలంబస్తోత్రాన్ని ఆశువుగా పఠిస్తూ తన పార్థివ శరీరం దహింపబడకుండా రక్షించుకున్నారు. ఒకవేళ ఆ అసూయాపరులు పగ సాధించుకోవాలనుకున్న వారూ చితి మీద పెట్టిన ఆదిశంకరుల శరీరానికి అగ్నిని ముట్టింపబోయినా ఆ అగ్ని తనలోని దాహకశక్తిని (మండించే గుణాన్ని) కోల్పోయి చల్లగానే ఉండబోతాడు వారి మంత్ర మనన శక్తి కారణంగా.ఇలా పంచభూతాలలోని సహజధర్మాన్ని పంచభూతాలూ కోల్పోయిన సందర్భాలు అనేకం గోచరిస్తాయి పురాణాల్లో. అవన్నీ కేవలం మంత్రమనన శక్తి కారణంగానే.సాయి అంతటి వారితో పోల్చదగిన మంత్ర శక్తి కలవాడా? అనుకోనక్కరలేదు. భూత భవిష్యద్‌ వర్తమానాలు మూటినీ గమనించుకుంటూ వ్యాఖ్యంగా ఆ విశేషాలని బహిరంగంగా చెప్తూంటే ఇంకా సాయిని విశ్వసించక పోవడమా?‘షిర్డీలో ముందు నాటికి భవంతులెన్నో వస్తాయి. భక్త జనం లక్షల సంఖ్యలో నుండి కోటికి వెళ్తుంది. షిర్డీలో ఉచితాన్నదానం నిరంతరం జరుగుతుంది. దేవాలయాలు కూడా సాయికి ఎన్నో ఎన్నో ఎన్నో రాబోతాయి’ ఇవి భవిష్యత్తుని సంబంధించిన సాయి మాటలు. నిజమయ్యాయా? లేదా?‘కమ్మరి భర్య – పుత్రుడు కొలిమిలో పడిపోవడం.. సాయి రక్షించడమనేది చేయికాలిన కాలంలో అంటే వర్తమానంలో జరిగిన విషయం నిజమయిందా? లేదా?తనకి ఎవరెంత దక్షిణగా ఇస్తామని లోగడ మొక్కుకున్నారో మొక్కుకుని కూడా తీర్చకుండా ఉన్నారో ఆ విషయాన్ని చెప్పడం (గోవా భక్తుడు 15 రూపాయలిస్తానని మొక్కుకుని తీర్చలేదు) భూత కాలానికి (ఒకప్పటి లోగడ విషయం కదా!) సంబంధించిన విషయం నిజమయిందా? లేదా? కాబట్టి సిద్ధపురుషుడైన సాయిని కేవలంధర్మబద్ధంగా వ్యవహరించడం అగ్ని హోత్రాన్ని నిరంతరం చేయడం అనే లక్షణాల కారణంగా అగ్ని కూడా స్వాధీనుడయ్యాడనేది లో రహస్యం.  ఇక నాలుగూ ఐదూ అయిన వాయువూ ఆకాశమూ కూడా ఎలా సాయికి అధీనులయ్యారో తెలుసుకుందాం!సశేషం.
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top