
రాబిన్‌హుడ్ ఆర్మీ!
పెద్దలను దోచి పేదలకు పెట్టు’ అనేది రాబిన్ హుడ్ సిద్ధాంతం. అయితే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘రాబిన్ హుడ్ ఆర్మీ’
ఆదర్శం
‘పెద్దలను దోచి పేదలకు పెట్టు’ అనేది రాబిన్ హుడ్ సిద్ధాంతం. అయితే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ సభ్యులు ఆ సిద్ధాంతాన్ని సవరించినట్లున్నారు. వారు చేస్తున్న మంచి పనులను చూస్తుంటే ‘పెద్దలను అడిగి పేదలకు పెట్టు’ అనేది వారి సిద్ధాంతమనిపిస్తుంది.ఇరవై ఏడేళ్ల ఆనంద్ సిన్హా పోర్చుగల్ కేంద్రంగా పని చేస్తున్న ‘రీ-ఫుడ్ ఇంటర్నేషన్’ అనే స్వచ్ఛందసంస్ధ గురించి చదివి ప్రభావితమయ్యాడు. ఆహారం వృథా కానీయకుండా, మిగులు ఆహారాన్ని ఆకలితో అలమటించే పేదలకు అందించడమే లక్ష్యంగా ‘రీ-ఫుడ్ ఇంటర్నేషనల్’ పని చేస్తుంది. ‘ఆ పని ఇక్కడ ఎందుకు చేయకూడదు?’ అనుకున్నాడు ఆనంద్.
తన ఆలోచనను మిత్రులతో పంచుకున్నాడు. అలా అందరూ కలిసి ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ (ఆర్‌హెచ్‌ఏ)ను ప్రారంభించారు. ఆరుగురితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడొక ఉద్యమంలా మారింది. మన దేశంలోని ప్రధాన పట్టణాల్లోనే కాదు పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌లలో కూడా ఆర్‌హెచ్‌ఏ సేవలు కొనసాగుతున్నాయి.‘ఆర్‌హెచ్‌ఏ మొదలు పెట్టినప్పుడు మేము ఆరుగురు సభ్యులమే. ఇప్పుడు ఇది ఎన్నో రాష్ట్రాల్లో విస్తరించి ఒక సైన్యంలా మారింది’’ అంటాడు ఆనంద్ సిన్హా. ‘‘రెస్టారెంట్లతో టచ్‌లో ఉండటానికి మా ఫేస్‌బుక్ పేజీ ఉపకరిస్తుంది.
మా పోస్ట్‌లు ఎందరినో కదిలించి సేవామార్గం వైపు నడిపిస్తున్నాయి’’ అంటాడు పాకిస్థాన్‌లో ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ప్రారంభానికి తోడ్పడిన ఆఫ్రీది అనే యువకుడు.వివిధ ప్రాంతాల్లో యువత చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ వాలంటీర్స్‌గా పని చేస్తుంటారు. తమ ప్రాంతంలోని రెస్టారెంట్ యజమానులతో మాట్లాడి మిగిలిపోయిన ఆహారాన్ని తమకు డొనేట్ చేయమని అడుగుతారు. ఆ ఆహారాన్ని నిలువ నీడ లేనివారికి, అనాథలకు అందిస్తారు. గుర్‌గావ్‌లోని ‘కెబాబ్ ఎక్స్‌ప్రెస్’ రెస్టారెంట్ వంద తాజా వడపావ్‌లు, మరో రెస్టారెంట్ తాజా ఖిచిడీ, పరోటాలను ఉచితంగా అందిస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు ఎన్నో రెస్టారెంట్లు పయనిస్తున్నాయి.
ఢిల్లీలో 30 రెస్టారెంట్లు ‘రాబిన్ హుడ్ ఆర్మీ’ ప్రాజెక్ట్‌కు సహకరిస్తున్నాయి. మిగులు ఆహారాన్ని మాత్రమే కాకుండా తాజా ఆహారాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాయి. కొందరు రెస్టారెంట్ యజమానులయితే పంపిణీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.పెళ్లిళ్ల సీజన్‌లో జరిగే ఆహార వృథా ఇంతా అంతా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేటరర్‌ల సహకారంతో విందుల్లో మిగిలిపోయే ఆహారం వృథా కాకుండా ప్రయత్నిస్తోంది రాబిన్‌హుడ్ ఆర్మీ. హైదరాబాద్ వాలంటీర్లు ఒక పెళ్లి విందులో మిగిలిపోయిన ఆహారంతో 970 మంది ఆకలి తీర్చగలిగారు!
ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ ‘ఆర్‌హెచ్‌ఏ’ కోసం పని సమయం వెచ్చించడం చూసేవాళ్లకు ‘కాస్త కష్టమైన పని’ అనిపించవచ్చు. తోటి ఉద్యోగులు తమ విరామ సమయాన్ని వినోదానికి వెచ్చిస్తుంటే తాము మాత్రం ఎండలో రోడ్ల మీద గడపాల్సి రావచ్చు. అయితే ‘ఇది కష్టమైన పని’ అనిగానీ, ‘వ్యక్తిగత సమయాన్ని కోల్పోతున్నాం’ అనే విచారంగానీ ఆర్‌హెచ్‌ఏ వాలంటీర్లలో కనిపించదు. ‘నలుగురి కోసం ఒక మంచి పని చేస్తున్నాం’ అనే భావనే వారిని నడిపిస్తోంది. ‘మార్పు గురించి అదేపనిగా ఆలోచించడం కంటే... ఎవరికి వారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆ మార్పు కచ్చితంగా కనబడుతుంది’ అని నమ్ముతుంది రాబిన్‌హుడ్ సైన్యం. ఇది కాదనలేని సత్యం.