ప్రకృతే ఒక బిజినెస్ స్కూల్! | Nature as a Business School | Sakshi
Sakshi News home page

ప్రకృతే ఒక బిజినెస్ స్కూల్!

Published Sun, May 4 2014 12:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

ప్రకృతే ఒక బిజినెస్ స్కూల్!

ప్రకృతే ఒక బిజినెస్ స్కూల్!

‘‘మనిషిలోనే మ్యానర్స్ ఉండదు గానీ... క్రియేషన్‌లోనే కామర్స్ ఇమిడి ఉందిరా’’ అన్నాడు మా బావ తాత్వికంగా.

 ‘‘మనిషిలోనే మ్యానర్స్ ఉండదు గానీ... క్రియేషన్‌లోనే కామర్స్ ఇమిడి ఉందిరా’’ అన్నాడు మా బావ తాత్వికంగా.
 ‘‘అదేంటి బావా... ఏదో గొప్పగా చెప్పినట్టే అనిపిస్తుంటుందిగానీ నువ్వేం చెప్పావో అర్థం కాదు’’ అన్నాను నేను.
 ‘‘మొన్నెవడో ఓ కూత కూశాడ్రా. నాకు సంపాదన చేత కాదట. బిజినెస్ అంటే తెలియదట. లేకపోతే ఎంతో సంపాదించేవాడినట. వాడో పిచ్చోడు. అసలు బిజినెస్ పుట్టుపూర్వోత్తరాలేమిటో నాకు తెలిసినట్టుగా ఎవడికీ తెలియదు. నీకో విషయం తెలుసా? చెట్లూ, జంతువులూ కలిసి మొట్టమొదటిసారిగా కామర్స్‌ను కనిపెట్టాయి, ట్రేడ్‌ను టేకప్ చేశాయి. బిజినెస్ బిగిన్ చేశాయి’’ అన్నాడు మా బావ ఏడేడు పధ్నాలుగు లోకాల్లోని సమస్త కార్పొరేట్ సంస్థలూ నాలోనే ఇమిడి ఉన్నాయిరా అన్నట్లుగా నా వైపు చూస్తూ.  
 ‘‘కొయ్... కొయ్ చెట్లూ, జంతువులూ కలిసి బిజినెస్ చేయడమేంటి బావా?’’
 ‘‘మనమంతా జన్మించడానికి ఎంతో ముందుగానే ప్రకృతి మాత ఈ బిజినెస్‌ను ప్రసవించిందిరా. ప్రకృతిని కాస్త పరిశీలనగా చూశాక నాకీ విషయం అర్థమైంది. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆహారం తయారు చేసుకుంటాయి. దానికి అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్‌ను మిగతా జంతువులన్నీ తమ శ్వాసక్రియ ద్వారా చెట్లకు అందిస్తాయి. ఇలా వస్తుమార్పిడి విధానంతో జీవిద్దామని చెట్లూ, జంతువులూ ఒక బిజినెస్ అగ్రిమెంటుకు వచ్చాయన్నమాట. బార్టర్ సిస్టమ్ ఆధారంగా ఎన్నో ఏళ్లుగా ఈ గ్లోబల్ కామర్స్ ఇలా కొనసాగుతోందన్నమాట’’.
 ‘‘మరి బిజినెస్ అన్న తర్వాత బ్రోకర్లూ, దళారీలూ, కమీషన్ ఏజెంట్లూ ఉంటారు కదా బావా? నువ్వు గొప్పగా చెబుతున్న ప్రకృతిలో వాళ్లెక్కడ?’’
  ‘‘అవున్రా... ఇక వాణిజ్యం-వ్యాపారం అన్న తర్వాత బ్రోకరూ, కమిషన్ ఏజెంట్లూ ఉండకపోతే ఎలా? అందుకే ప్రకృతి వాళ్లనూ తయారు చేసింది. ఉదాహరణకు ఒక పువ్వు పూసిందనుకో. అది కాయగా మారడానికి సంపర్కం అవసరం. అందుకే పుప్పొడి... అండాశయాన్ని చేరడానికి వీలుగా సీతాకోకచిలుకలనూ, తుమ్మెదలనూ, హమ్మింగ్ పక్షుల వంటి వాటినీ బ్రోకర్లుగా తయారు చేసుకుంది. వాటికి తేనే-మకరందాలను కమీషన్‌గా చెల్లిస్తూ వాటిని చెట్టు తన కమీషన్ ఏజెంట్లుగా చేసుకుందన్నమాట’’
 ‘‘నువ్వెంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. మరి డబ్బు మాటో?’’
 ‘‘ఇందాక నేను చెప్పిన కమిషన్ ఏజెంట్ల పని తర్వాత చెట్టు పండ్లను కాస్తుంది. కానీ ఇలా కాస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ గింజ మళ్లీ వేరే చోట నాటుకునేలా చేయాలి. వాస్తవానికి చెట్టు తన వ్యాప్తి కోసం ఒక్క గింజనే తయారు చేసుకుంటే సరిపోయేది కదా. కానీ అక్కడితో ఆగలేదది. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కార్యక్రమం కింద... తన గింజ చుట్టూ గుజ్జు లాంటిదాన్ని తయారు చేసింది. అది మామిడీ, జామా, దానిమ్మా, నేరేడూ, ఇంకేదైనా కావచ్చు. అలా గింజ చుట్టూ ఉండే గుజ్జును కాసేపు మన మానవ పరిభాషలో డబ్బు అనుకుందాం. దీన్ని ఉడతల్లాంటి జంతువులకూ, మిడతల్లాంటి కీటకాలకూ, పిట్టలకూ పిల్లలకూ ఆశ పెట్టి తన గుజ్జునవి గింజతో సహా తినేలా చేసుకుని... ఎక్కడెక్కడికో తరలించేలా చేస్తుంది. అక్కడ మళ్లీ తన బీజం ఫలించేలా చూస్తుంది. సదరు గుజ్జే సుదూర భవిష్యత్తులో డబ్బు అనే కాన్సెప్ట్‌కు దారితీసేలాంటి ఆలోచన మనిషికి వచ్చేలా చేసిందిరా ప్రకృతి. డబ్బు పుట్టుకకు బాటలు ఇలా పడ్డాయన్నమాట’’
 ‘‘మరి కొందరు కలెక్షన్ ఏజెంట్లు డబ్బులు నొక్కేయడాలూ, చిట్‌ఫండ్సూ, ఫైనాన్సు కంపెనీలు పెట్టి బోర్డులు తిప్పేయడాలూ చేస్తుంటారు కదా... వాళ్లూ ఉన్నారా ప్రకృతిలో?’’
 ‘‘ఎందుకు లేరూ? ఉడతల్లాంటి కొన్ని జీవులైతే మొక్క మొలిచేందుకే వీల్లేకుండా గింజలను కరకరా కొరికి తినేస్తాయి. ఇలాగే మరికొన్ని జీవులూ విత్తుల్ని పరపరా నమిలి మింగేసి, ఎప్పటికీ మొలకెత్తకుండా చేస్తాయి. అంటే... వీళ్లేలాంటివాళ్లూ...? కలెక్షన్స్ గట్రా చేశాక డబ్బును సొంతానికి వాడుకునే వాళ్లూ, వసూళ్లు చేశాక బోర్డు తిప్పేసి డబ్బు నొక్కేసే వాళ్లూ ఈ టైపన్నమాట. ఇప్పుడు చెప్పు... ఈ టాటాలూ, బిర్లాలూ, అంబానీలు నా దగ్గరికి ట్యూషన్‌కు వచ్చి ఒక్క గంట ప్రైవేటు చెప్పించుకుంటే తమ సంస్థలను అద్భుతంగా నడిపించేస్తారా, చెయ్యరా?’’
 ‘‘మరి.. ఇంత తెలిసినవాడివి నువ్వెందుకు బిజినెస్ చేసి సంపాదించవు?’’
 ‘‘ఒరే... కురుక్షేత్రంలో ఆయుధం పట్టని కృష్ణుడికి యుద్ధం తెలియకనా సమరం  చేయనిది? నన్ను బావా అని పిలుస్తూ కూడా ఈ ప్రశ్న అడగడానికి సిగ్గులేదూ?’’ అని నాకింత గడ్డిపెట్టాడు తన ‘ట్రేడ్’మార్క్ నవ్వు నవ్వుతూ మా బిజినెస్ బావ. ప్రపంచంలోని ఫస్ట్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలన్నీ తన నోటిలోనే  కనిపింపజేసేలా ఉందా నవ్వు!
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement