కనబడితే చెప్పరూ..?

కనబడితే చెప్పరూ..? - Sakshi


కథ


హిందీ మూలం: జైనందన్ కుమార్

 అనువాదం: కొల్లూరి సోమశంకర్

 

 శవం కుళ్లిపోయింది. శరీరంలోని అన్ని భాగాలు వికృతమైపోయాయి. ప్రాణం పోయి ఓ వారం రోజులై ఉంటుంది. నాకు వార్త ఆలస్యంగా అందింది. కష్టమొచ్చినప్పుడు కాకుండా, ఆ తర్వాత ఎప్పుడో సానుభూతి కనబరిచే నా శ్రేయోభిలాషులు, హితైషులకి కూడా ఈ వార్త తెలియడంలో ఇంత ఆలస్యమెందుకైందో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందైతే వాళ్లు ఇరవై - ఇరవై ఐదు క్రోసుల దూరంలో పడి ఉన్న అనాథ శవాల గురించి తాజా సమాచారం వెంటనే అందిస్తూండేవాళ్లు.

 

 కుళ్లిపోయి దారుణమైన స్థితిలో ఉన్న ఆ శవాన్ని గుర్తించడం కష్టమైన పని. కాని నా మనసులో ఉన్న కొన్ని గుర్తుల ఆధారంగా, ఆ శవం నిస్సందేహంగా మా ఆయనదేనని నేను పందెం కట్టగలను. రాత్రి షిఫ్ట్‌కి డ్యూటీకి వెళుతూ ఇంటికీ ఫ్యాక్టరీకీ మధ్య ఉన్న నాలుగు మైళ్ల నిర్జన, నిశ్శబ్ద మార్గంలో ఆయన కనబడకుండా పోయినప్పటినుంచీ ఇది పన్నెండో శవం నేను చూడటం. ఇంతకుముందు దొరికిన పదకొండు శవాలనూ నేను చూశాను, వాటిలో ప్రతి శవాన్నీ మా ఆయన శవమేనని వాదించాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీటిల్లో ఏ శవానికీ ముఖం గుర్తుపట్టలేకపోయాను. కానీ ఏ ఒక్క శవాన్నీ నాకు అప్పగించలేదు. అయితే, ఇప్పటికీ నా వాదన పట్ల నాకు ఏమాత్రం సంశయం లేదు. నా మానసిక స్థితి క్షీణించిందని జనాలు అనుకుంటున్నారు. మా ఆయన కనపడకుండా పోయేసరికి, నేను సగం పిచ్చిదానిని అయ్యానని భావిస్తున్నారు. ఓ మనిషికి ఇన్ని శవాలుంటాయనే నా పట్టుదల వారి అభిప్రాయానికి మరింత బలం చేకూరింది. అంతేకాదు, నేను ఇంకా బొట్టు, గాజులు, మంగళసూత్రం తీసేయకపోవడం, రంగు చీరలు కట్టుకోవడం వల్ల నేనో వెర్రిబాగులదాన్ననే అభిప్రాయం నాటుకుపోయేలా చేసింది. పైగా ఒక శవం తర్వాత మరొక శవం నా ఐదోతనాన్ని మరింత బలోపేతం చేయడం వాళ్లకి ఇబ్బందిగా మారింది. ఈ పన్నెండో శవాన్ని చూడటానికి నేను వెడుతున్నప్పుడు మా వాళ్లు ముందే ఊహించారు - ఈసారి కూడా ఆ శవం మా ఆయనదే అంటానని. నేను నిజంగానే అదే మాట అన్నాను.

 

 నా ప్రవర్తన ఉచితమా అనుచితమా  అనేది తేల్చాల్సిందిగా నేను మీ ముందు ఓ విన్నపం ఉంచుతున్నాను. మొదటి శవం ఇక్కడి నుంచి రెండు మూడు మైళ్ల దూరంలో సువర్ణిక నది ఒడ్డున ఓ గోనె సంచిలో కట్టేసి దొరికింది. దాన్ని చూస్తూనే నేను గట్టిగా అరవడం మొదలుపెట్టాను. చాకులతో శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు పొడిచారు ఎవరో. ఇంత క్రూరత్వాన్ని నా కళ్లతో చూడటం అదే మొదటిసారి. శవం రెండు చేతుల పిడికిళ్లు మూసి ఉన్నాయి. మా ఆయన ఎప్పుడూ పిడికిళ్లు బిగించి ఉంచేవారు. శవం నల్ల రంగులో ఉంది, మా ఆయనదేమో తెల్లటి తెలుపు. కానీ ఫ్యాక్టరీలో భగభగమండే ఫర్నేస్ పక్కన పనిచేయడం వల్ల ఆయన శరీరం వివర్ణమవుతూంటుందని నాకు తెలుసు. ఆయన ఛాతి మీద దట్టమైన వెంట్రుకల మధ్య ఓ గాయపు మచ్చ ఉండేది. అది ఈ శవం మీద కూడా ఉంది. ఈ పోలికల ఆధారంగా, ఆ శవం మా ఆయనదేనని అనడంలో అనౌచిత్యం ఏదీ లేదు.

 

 నేనీ గుర్తులు చెప్పిన కాసేపటికే, ఓ వృద్ధ దంపతుల జంట అక్కడికి వచ్చింది. వాళ్లు ఆ శవం చేతివేళ్లని బట్టి, ముఖంలో ఉన్న ఏకైక గుర్తు- ముక్కుని బట్టి ఆ శవం తమ కొడుకుదని వెంటనే అనేశారు. నిజంగానే ఆ శవం వేళ్లు, ముక్కు ఆ వృద్ధుడి ముక్కు, వేళ్లకి నకలులా ఉన్నాయి. వాళ్ల వాదనకి నేనేం అభ్యంతరం చెప్పలేకపోయాను. శవం వాళ్లకి దక్కకపోతే, వారు నిలువునా కూలిపోతారు. వాళ్ల అబ్బాయి సుశిక్షితులైన నిరుద్యోగుల పోరాట సంఘం కార్యదర్శిట. మా ఆయనేమో ఫ్యాక్టరీలో విపక్ష కార్మికుల ప్రమాద నివారణ పోరాట సమితి కార్యదర్శి.

 

 మరి ఇప్పుడు మీరే చెప్పండి ఈ శవం మా ఆయనది కాదా?

 రెండో శవం ఊరికి ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న వాటర్ ట్యాంక్ వెనకాల దొరికింది. ఆ శవం గుండె పన్నెండు తూటాల చిల్లులతో జల్లెడలా ఉంది. నేనక్కడికి వెళ్లేసరికి ఇంకో వ్యక్తి ఆ శవాన్ని తీసుకెళ్లబోతున్నాడు. ఆ శవం తన సోదరుడిదని అంటున్నాడు. ఆ శవం దవడలు బిగుసుకుపోయి ఉన్నాయి. మా ఆయన దవడలు కూడా, అన్యాయం జరిగినప్పుడల్లా అలాగే బిగుసుకుపోతుంటాయి. శవం ఒడ్డూ పొడుగూ మామూలు స్థాయి కన్నా తక్కువగా ఉన్నాయి, తెలిసినవాళ్లందరూ మా ఆయన ఒడ్డూ పొడువూ బాగుండేవని అనేవారు. కానీ అన్యాయం చేతిలో ఓడిపోయినప్పుడు ఆయన ఆకారం కుచించుకుపోతుందని వాళ్లే అంటూండేవారు. మా ఆయనలోను, ఈ శవంలోను ఓ అద్భుతమైన పోలిక ఉంది - ఇద్దరి ఎడమ తొడ మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. మరి ఈ శవం మా ఆయనదనుకోవడంలో అనౌచిత్యం ఏమీ లేదు కదా?

 

 కాని ఆ శవం తన సోదరుడిదంటూ వచ్చిన వ్యక్తి - రెండు సాక్ష్యాలను చూపి శవాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ల అన్నదమ్ములందరికీ బొడ్డు బయటకి ఉంటుందట. మణికట్టు మరీ చిన్నదిగా ఉంటుందట. ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కుతూహలం ఆపుకోలేక, ఊరికే, మృతుని జీవితం గురించి ఏవో ప్రశ్నలడిగాను. ఆ వ్యక్తి ఎప్పుడూ అబద్ధాల కోరులతోను, చెడు సావాసాలు చేసేవాళ్లతోను గొడవ పడుతూండేవాడట. ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉండేదట. మా ఆయనది కూడా అదే తత్త్వం. మరి మీరే చెప్పండి, ఆ శవం మా ఆయనది అని భావించడంలో తప్పేమైనా ఉందా?

 

 మూడో శవం జాడ, ఇక్కణ్నించి పది మైళ్ల దూరంలో, జిల్లా సరిహద్దులకి దగ్గర్లో లభించింది. ఆ శవం ముక్కు, మొహం ఎంతలా చెక్కేసి ఉన్నాయంటే, అసలు గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది. కానీ ఆ పెద్ద కళ్లు రెప్పపాటు లేకుండా చూస్తున్నాయి, మా ఆయనలానే. మా ఆయన ఎప్పుడూ ఎవరితోనూ కళ్లు దించి మాట్లాడేవాడు కాదు. ఎవరైనా భయపెట్టాలని చూస్తే, ఆయన కళ్లు నిప్పులు కురిసేవి. ఆ శవం శరీరం సన్నగా ఉంది, మా ఆయనని ఎరిగినవాళ్లు ఆయనది రెండింతల రూపమనే గుర్తుంచుకుంటారు. నాకు మాత్రమే తెలిసిన ఓ రహస్యం ఉంది, తనకిష్టం లేని పని చేయాల్సివచ్చినప్పుడు ఆయన శరీరం ముడుచుకుపోతుంది. మా ఆయన అరచేతుల్లా, ఈ శవం అరచేతులు కూడా గాయాల గుర్తులతో గరుకుగా ఉన్నాయి. దీన్ని మా ఆయన శవమేనని అనడంలో నాకేం ఇబ్బంది లేదు. కానీ ప్రతిసారిలానే ఈసారి కూడా మరొకరు ఆ శవాన్ని తమదని అంటున్నారు. అతనితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు. వాళ్లందరిలోనూ ఆ శవాన్ని గుర్తించగలిగామన్న ఆత్మవిశ్వాసం కదలాడుతోంది.

 

 ఇంతమంది అభిప్రాయం తప్పని చెప్పడం నాకు కష్టం. చనిపోయిన అతని గురించి మాట్లాడుకుంటూ, అతను దయ, ప్రేమ, కరుణకి ప్రతిరూపం అని చెప్పుకుంటున్నారు. ఎవరైనా దుఃఖంలో ఉంటే వెంటనే వెళ్లి సాయం చేసే లక్షణముందిట అతనికి. నాకాశ్చర్యం కలిగింది - వాళ్లు తమ బంధువు గురించి మాట్లాడుకుంటున్నారా? లేక మా ఆయన గురించా?

 

 మరిప్పుడు చెప్పండి, ఆ పార్థివ శరీరం నా భర్తది కాకుండా ఉంటుందా?

 ఇక్కణ్నించి దక్షిణ దిశగా ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న గ్రామానికి నదిలో ఓ శవం కొట్టుకొచ్చిందని నాకు కబురొచ్చింది. ఆయన కనబడకుండా పోయిన తర్వాత ఇది, నాలుగో శవం. తల, ముఖం పూర్తిగా చితికిపోయి ఉన్నాయి. సాగిన పొడవాటి మెడ, నీటిలో నాని ఉబ్బిన ఛాతి కనబడుతున్నాయి. ఆ శవం నిస్సందేహంగా మా ఆయనదేనని అనిపిస్తోంది. కానీ నాతో ఉన్నవాళ్లు మా ఆయన మెడ చిన్నగా, లావుగా ఉంటుందని అన్నారు. కాని ఆకాశంలోకి చూసేడప్పుడూ లేదా దూరంగా ఉన్నదేన్నైనా గురి చూస్తున్నప్పుడు ఉద్విగ్నతకి గురై మా ఆయన మెడ పొడవవుతుందని నేను వాళ్లకెలా చెప్పను?

 

 ఈ శవం మీద నాకు హక్కుంది అని చెప్పేలోపు, బహుశా, నేను నాకు తెలియకుండానే - ఈ శవాన్ని తమదంటూ పేర్కొనే వేరే హక్కుదారుల కోసం ఎదురుచూస్తున్నానేమో! అలాగే జరిగింది. దడదడ శబ్దం చేస్తూ, ఓ పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. కాసేపయ్యాక తేలినదేంటంటే, నిన్న రాత్రి అపహరణకు గురైన ఓ మంత్రిగారిదట ఆ శవం. ఈయన అత్యంత నిజాయితీపరుడనీ, భ్రష్టులని, అవినీతిపరులని అస్సలు సహించడనీ అందరికీ తెలుసు. తదుపరి శాసనసభ సమావేశాలలో ఎవరో అవినీతి మంత్రి గుట్టు రట్టు చేయాలని అనుకున్నాడట. అప్పట్నించీ ఆయనకి బెదిరింపులు రావడం మొదలయ్యాయిట.

 

 నిశ్చయమైపోయింది, వీళ్లూ మా ఆయన కథే చెబుతున్నారు. ఫ్యాక్టరీలో యాజమాన్యాల, యూనియన్ల, పేరు మోసిన కాంట్రాక్టర్ల కుట్రల పట్ల కలత చెంది, కార్మికులతో ఓ సభ ఏర్పాటు చేసి, అందరి గుట్టూ బహిరంగంగా రట్టు చేస్తానని ప్రకటించగానే, మా ఆయనకి కూడా రోజూ బెదిరింపులు, హెచ్చరికలు వచ్చేవి. మరిప్పుడు మీరే చెప్పండి, ఆ శవం మా ఆయనది ఎందుకు కాకూడదు?

 

 ఇంటి నుండి పన్నెండు మైళ్ల దూరంలో ఓ మెడ లేని శవం జాడ లభించింది. ఆ శరీరంలోని కొన్ని భాగాలను మాంసాహారులైన పక్షులు, జంతువులు తినేశాయి. అయినప్పటికీ, మావి రెండు శరీరాలు, ఒకే ప్రాణం అయినందున మా ఆయన ఆనవాళ్లను సులువుగా గుర్తించగలిగే సామర్థ్యం నాకుంది. మా ఆయన తన చేతి గోళ్లను ఎన్నడూ కత్తిరించుకునేవారు కాదు. వాటిని తన ఆయుధాలుగా భావిస్తూ, జాగ్రత్తగా కాపాడుకునేవారు. ఆయన అరికాళ్లు, మడమలు పగుళ్లు పట్టి ఉండేవి. డ్యూటీ ముగిశాక, చెప్పుల్లేకుండా వట్టి కాళ్లతో ఇంటికి రావడం ఆయనకి అలవాటైపోయింది. కంకర, రాళ్లు, ముళ్లు మనల్ని పోరాటాలకి సన్నద్ధంగా ఉంచే సాధనాలని ఆయన అనేవారు. నేలతో నేరుగా సంబంధం కలిగి ఉన్న పాదాలు, మట్టిలోని సహనశీలతనీ, సారశక్తినీ గ్రహిస్తాయట. మరి అలాంటప్పుడు మా ఆయనని గుర్తించడానికి నేనెందుకు తిరస్కరిస్తాను? ఆ శవం మా ఆయనదే అనే నా ప్రకటనని మా బంధువులు బలపరుస్తూండగానే, విషణ్ణ వదనాలతో వెదుకులాట కొనసాగిస్తున్న ఓ బృందం వచ్చిపడింది. ఆ శవం తమ గ్రామానికి చెందిన ఓ అనాథదట.  వ్యవస్థలోని లోపాలని నిర్భీతిగా ఎత్తి చూపే వ్యక్తిత్వం అతనిదట. దళితులు, పీడితులు, పేదల పక్షాన నిలబడి వాళ్ల బాధల్ని, వేదనలని తిరుగుబాటుగా మార్చగల మాంత్రికుడట. తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఇతరుల కోసమే బతకడంలో ఆనందం అనుభవించేవాడట.

 

 ఈ విధంగా పోరాటం, తిరుగుబాటు అతని చరిత్రలో భాగమైపోయాయట. అప్పుడే వ్యవస్థకు చెందిన శక్తులు అతని శరీరంలో ఏ భాగానికా భాగాన్ని చిన్నాభిన్నం చేసేశాయి.మీరు నమ్మినా, నమ్మకపోయినా - మా ఆయన కూడా ఇలాంటి లక్షణాలతోనే జన్మించాడు. ఆయన తనకొచ్చే జీతంలో ఎవరెవరి అవసరాలు తీర్చాలో ముందే నిర్ణయించేసుకునేవారు. ‘అనిశ్చితి సుడిగుండంలో నిండా మునిగిన నా తోటి లక్షల మంది ప్రజల రేపు కన్నా నా రేపు భిన్నంగా ఎందుకుండాలి?’ అని అంటూండేవారు. నా చిరిగిన బట్టలు చూసినా, మా ఇంటి పరిస్థితి చూసినా మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి - ఈ శవం మా ఆయనదేనని నిరూపించుకోవడానికి నేను ఇంకా ఏం సాక్ష్యాలు చూపించాలి?

 

 క్రూరాదరణ అనే నావలో ప్రయాణం చేస్తూ, సముద్రంలోని సుడిగుండాలలో చిక్కుకున్న దుఃఖితుల మధ్య ఉన్నాను. నావ మునిగిపోయే ముందు బహుశా నాది చివరి ఆర్తనాదం కావచ్చు. పన్నెండవ శవం చూసేసరికి నన్ను యాతన చుట్టుముట్టింది. ఈ శవం చూడటానికి పూర్తిగా దుర్వాసన నిండిన గాలిబుడగలా ఉంది. గద్దలు, కాకులు, వీధికుక్కలకి ఆహారం కాకుండా ఉండేందుకు, ఆ శవాన్ని తాటి ఆకులతో కప్పారు గ్రామస్తులు. బతికున్నప్పుడు ఆ మనిషితో ఎలా ప్రవర్తించినా, విగతుడయ్యాక శవం పట్ల గౌరవం కలుగుతుంది కాబోలు. బహుశా జనాల మనసుల్లో జీవితం యొక్క నిస్సారత, పరలోకం పట్ల ఆలోచనలు పొంగిపొర్లుతాయేమో!

 

 ఇంతకుముందు నేను చూసిన శవాల శారీరక, చారిత్రక స్థితుల ప్రస్తావన చేసినప్పుడు చెప్పిన సూక్ష్మమైన అంశాలు ఈ శవంలోనూ గోచరించాయి. ఈ శవం విషయంలో కొత్త సంగతి ఏంటంటే, నోరు తెరుచుకుని ఉండటం. మా ఆయనకి నోరు మూసుకుని ఉండటం తెలీదు. ఎక్కడ అన్యాయం జరిగినా, వెంటనే దానికి వ్యతిరేకంగా గొంతెత్తి పోరాడుతాడు. ఈ శవాన్ని గుర్తించడంలో నాకెటువంటి సంశయమూ లేదు. మరెవరో వచ్చి ఈ శవాన్ని తమదంటారనే భయమూ ఈసారి లేదు. ఎందుకంటే ఇది వారం రోజులుగా అనాథ శవంగా ఇక్కడే పడి ఉందట.

 

 నా మేలు కోరే నా పరిజనులు శవాన్ని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టమ్, తదితర చట్టబద్ధమైన పనులు పూర్తి చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది.పోలీసులు ఆ శవాన్ని చూశారు. చూస్తూనే, వారి నుదుర్లు ముడతలు పడ్డాయి. తమ పోలీస్ స్టేషన్లో ఉంచిన బందిపోటు ఉద్ధార్‌సింగ్ ఫొటో వాళ్ల కళ్లముందు కదలాడింది. వెంటనే తమ ఫైళ్ల నుంచి ఉద్ధార్‌సింగ్ మొహంతో పోల్చి చూసి, ఆ శవం ఉద్ధార్ సింగ్‌దేనని నిరూపించారు.

 

 డబ్బున్నవాళ్లని దోచి, పేదవాళ్లకి సహాయపడతాడని ఉద్ధార్‌సింగ్ గురించి అందరికీ తెలుసు. అతను నేరమయ ప్రపంచంలో ఉన్నప్పటికీ దళితులు, పీడితులు, శాపగ్రస్తుల పాలిట మహాపురుషుడయ్యాడు. రాజకీయ నేతలు, ఉద్యోగుల దోపిడీని అరికట్టి, అవినీతిపరులకు సింహస్వప్నం అయ్యాడతను. ‘‘మర్యాదగా మారండి లేదంటే... కనబడకుండా పోతారు’’ అంటూ అధికారం చలాయిస్తున్న వారి పేరున ప్రకటనలు విడుదల చేసి బహిరంగంగా సవాలు విసిరేవాడు.

 

 మా ఆయన తన ఫ్యాక్టరీలోని మధ్యవర్తుల యూనియన్లకు, క్రూరులైన యాజమాన్యానికి అడ్డుపడుతూ ఇదే విధంగా బహిరంగ సవాలు విసిరేవాడని నేను రెట్టించి చెప్పనవసరం లేదు. మా ఆయనని కనిపించకుండా చేయడానికి ప్రకటించిన భారీ మొత్తాన్ని వారే పంచేసుకొని ఉంటారు.మరిప్పుడు మీరే చెప్పండి, ఈ శవాన్ని మా ఆయన శవంగా గుర్తించడంలో నాదేమైనా పొరపాటు ఉందా?

 

 ఈ విధంగా ఆరు నెలల్లో పన్నెండు హేయమైన హత్యల దృశ్యాలు చూడాల్సి వచ్చింది. కాని నేను సాధించింది ఏమీ లేదు. ప్రతిసారీ దుఃఖపు వరదలో మరింత తీవ్రంగా కొట్టుకుపోవడం! విధవకి సధవకి మధ్య సంధి స్థితిలో ఉండిపోయాను. మా ఆయన ఇక జీవించి లేరని గ్రహించగలను. కానీ అదే సమయంలో ఆయన వదలివెళ్లిన అడుగుజాడలు, సుగంధం... ఆయనకి మరణం లేదని చెబుతాయి, పన్నెండు చోట్ల లక్ష శవాలు ఎదురైనా సరే!

 

 సోదర సోదరీమణులారా! మీరు న్యాయం కోసం పోరాడేవారి పక్షం వహిస్తుంటే... మీకందరికీ ఇదే నా వినమ్ర విన్నపం. మీ చుట్టుపక్కల ఏదైనా అనాథ శవం కనబడితే - రంగు, రూపం, ఒడ్డు పొడుగూ ఎలా ఉన్నా ఫర్వాలేదు - కానీ ఆ శరీరంలో మీకు విశ్వసనీయత, మర్యాద, సత్యసంధత కనబడితే, ఆ శవానికి చెందిన వారెవ్వరూ రాకపోతే, అది మా ఆయనదేనని నిర్ధారించుకోండి. ఆలస్యం చేయకుండా, నాకు కబురు పెడితే, ఈ అభాగ్యురాలికి మహోపకారం చేసినవారవుతారు.

 

 తెలిసినవాళ్లందరూ మా ఆయన ఒడ్డూ పొడువూ బాగుండేవని అనేవారు. కానీ అన్యాయం చేతిలో ఓడిపోయినప్పుడు ఆయన ఆకారం కుచించుకుపోతుందని వాళ్లే అంటూండేవారు.

 

 మీరు నమ్మినా, నమ్మకపోయినా - మా ఆయన కూడా ఇలాంటి లక్షణాలతోనే జన్మించాడు. ఆయన తనకొచ్చే జీతంలో ఎవరెవరి అవసరాలు తీర్చాలో ముందే నిర్ణయించేసుకునేవారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top