ఆకుపచ్చ సూర్యోదయం | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Published Sun, May 7 2017 11:52 AM

ఆకుపచ్చ సూర్యోదయం - Sakshi

లంబసింగి–చింతపల్లి రోడ్డు

ఈరోజు యారోజు ఏమిటి– పువ్వుల రోజు/లేలే లేల లేలమ్మారో– ఓలే లేల లేల ....... భూమిదేవికి కట్టిన కోక – ఏమిటి పూలకోక?/భూమిదేవికి కట్టిన కోక– బూరుగుపూలకోక! హఠాత్తుగా ఆగిపోయింది పాట– కర్ణకఠోరమైన ఆ శబ్దానికి. గుప్పుమంటూ ఆ పనసచెట్టు ఆకుల మధ్యకు చొరబడింది – నల్లటి, దట్టమైన పొగ. ఒక్క లిప్తలోనే ఖయ్యమని చెవులు చిల్లులు పడేటట్టు ఇంకోచోట నుంచి తెల్లటి ఆవిరి. ఆ రెండు శబ్దాలతో ఆ కొండలన్నీ ప్రతిధ్వనించాయి. ఆకాశమంతా పక్షుల కలకలం. పాట ఆపేసిన రోడ్డు పని కూలీలంతా అటు తిరిగారు.

ఏవ్‌లింగ్‌ అండ్‌ పోర్టర్‌ కంపెనీ కెంట్‌ ఇంగ్లండ్‌ సంస్థ తయారుచేసిన స్టీమ్‌ రోడ్‌ రోలర్‌ అది. దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు. ఇంకో పన్నెండు అడుగుల పొడవు. ఏనుగులాగే ఉంది. వెనుక రెండు చక్రాలు, మనిషెత్తులో. ముందు నాలుగడుగుల ఎత్తు రోలర్‌. ఆకుపచ్చ, బూడిద రంగులలో ఉంది మొత్తం రోలర్‌.  మన్యంలో నాలుగేళ్లుగా రోడ్డు పనులు సాగుతున్నా, ఈమధ్యనే ఇరవై వేల రూపాయలు పోసి కొన్నారు. స్టీరింగ్‌ కిందే ఉంది గుండ్రటి మీటర్‌. పక్కనే వెదురు చిగుళ్ల మాదిరిగా మీటలు. వాటిలో ఒక మీటనే మళ్లీ ఒత్తాడు అల్ఫ్‌ బాస్టియన్, సరదా తీరక. ముందుకంటే భీకరంగా శబ్దించింది ఇంజన్‌. ‘‘దీనమ్మ! అంతా రైలింజన్‌ లాగే!’’ అన్నాడు బాస్టియన్‌ తెలుగు బూతు పదాన్ని ఇంగ్లిష్‌ వాక్యానికి జోడించి, విశాఖపట్నం నుంచి వచ్చిన రోలర్‌ డ్రైవర్‌ విలియంతో.

‘‘ఇదీ ఆవిరితోనే కదా నడిచేది!’’చిరాకుగా మొహం పెట్టి అన్నాడు విలియం, ఇంగ్లిష్‌లో. మొదటిసారే అలా ఆ మీట నొక్కినందుకు ఒళ్లు మండింది. అక్కడితో ఆగకుండా మరోసారి నొక్కాడు బాస్టియన్‌. ఆ కోపాన్ని రోలర్‌ ఫైర్‌మ్యాన్‌ మీద చూపించాడు విలియం. ‘‘ఏరా! డాగ్‌లా అరుస్తావ్‌. బొగ్గు కొట్టడానికి ఇంతసేపా?’’అన్నాడు వచ్చీరాని తెలుగులో. అసలు బాస్టియన్‌  ప్రవర్తనే విలియంకి వికృతంగా అనిపిస్తోంది. నోరు విప్పితే బూతులు. విలియం రోలర్‌ డ్రైవర్‌. కానీ ఇంగ్లిష్‌ వాడు. బాస్టియన్‌ దొరతనంలో ఉన్నతోద్యోగి. కానీ మద్రాసీ. అందుకేనేమో పెద్దగా ఖాతరు చేయడం లేదు విలియం.

సుత్తితో మరింత వేగంగా కొట్టడం మొదలుపెట్టాడు రోడ్డురోలర్‌ ఫైర్‌మ్యాన్‌. రాక్షసబొగ్గును ముక్కలు చేసి,  రోలర్‌ కొలిమిలో వేయడం, కట్టెలు వేసి వెలిగించడం అతడి పని. ఫైర్‌మ్యాన్‌తో పాటు క్లీనర్‌ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ విశాఖపట్నం వాళ్లే. విలియం తిట్లు బాస్టియన్‌కి ఎక్కడో తగిలాయి. కోపాన్ని దిగమింగుకుంటూ అటు తిరిగాడు విసురుగా. సరిగ్గా దొరికారు కూలీలు. వాళ్ల మీద చూపించాడు, తన ప్రతాపాన్ని. ‘‘దొంగనాకొడకల్లారా! క్షణం అటు తిరిగితే ఇంక పని ఎగదొబ్బీడమే! బయటోళ్లని ఎందుకు పిల్చుకురావటమని నేనాలోచిస్తా ఉంటే, ఇక్కడ ఇదీ ఈళ్ల వరస. ఏమే, అడివి ముండా! నీకు వేరే చెప్పాలా! కదులు.’’ అంటూ భుజం మీదే ఉన్న కొరడా ఝళిపిస్తూ వాళ్ల వైపు పరుగెట్టాడు.   ‘‘అప్పగించింది ఇరవై గొలుసుల దూర ం, ఐదురోజుల గడువు. రెండు రోజులు అయిపోయాయి. పదడుగులు పడలేదు రోడ్డు. ఒరేయ్‌! ఇప్పుడే చెబుతున్నా... పని పూర్తికాలేదో... కూలీగీలీ దేవుడెరుగు... తోళ్లు తీసేస్తాను చెత్తనాకొడకల్లారా!’’ రంకెలు వేశాడు బాస్టియన్‌.

ఆ వీరంగంతో పది నెలల తమ్ముణ్ణి ఎత్తుకుని అక్కడే నిలబడి రోలర్‌ శబ్దాన్ని వింటూ, దాని పొగని వింతగా చూస్తున్న ఆ నాలుగేళ్ల కొండవాళ్ల పిల్ల బెదిరిపోయి దూరంగా పారిపోయింది, ఆయాసపడుతూ. ఐదు నిమిషాల తరువాత మళ్లీ అరిచాడు బాస్టియన్, ‘‘ఒరేయ్‌ కిష్టయ్యా!’’ ఏ మూలన ఉన్నాడో, చటుక్కున ప్రత్యక్షమయ్యాడతడు. పూర్తి పేరు ద్వారం కిష్టయ్య. బాస్టియన్‌ దగ్గర బంట్రోతు. ఖాకీ నిక్కరు, పొట్టి చేతుల చొక్కా వేసుకుని ఉంటాడు. వయసు ముప్పయ్‌ లోపే. అప్పుడే బట్టతల వచ్చేసింది. అతడి అరిచేతులు, పాదాలు ఒక్కసారి చూసినా మరపునకు రావు. బండగా – ఏదో చతుష్పాద జంతువు అవయవాలు గుర్తుకు తెస్తాయి. తనకి అప్పగించిన ప్రధాన బాధ్యత అదే అన్నట్టు కీచుగొంతుతో అరుస్తూ, వీలైనప్పుడల్లా చేయి చేసుకుంటూ ఉంటాడు, కొండవాళ్ల మీద.

‘‘చూడ్రా! ఆ గుర్రానికి నీళ్లు పట్టు.’’ అప్పుడే వచ్చాడు సంతానం పిళ్లై. ‘వణక్కం’ అంటూ. అతడు తమిళుడు. రోడ్డు పని దగ్గర ఓవర్సియర్‌.  కొన్ని తమిళ పదాలు దొర్లినా  తెలుగు బాగానే మాట్లాడతాడు. ‘‘మస్తరు చూశావా?’’ అడిగాడు బాస్టియన్‌. ‘‘ఆమ... పొద్దున్నే చూసి పూడ్చినాను దొర.’’ అన్నాడు ఎక్కడ లేని వినయం ప్రదర్శిస్తూ. ‘‘అంతా ఉన్నారా?... ఎవడైనా....’’  ‘ఎక్కడకి పోతారు దొరా?! ’’ అన్నాడు గుర్రం కళ్లెం విప్పుతున్న కిష్టయ్య. ‘‘పది ముషమ్‌ల (మూరలు) దూరం.... రొంబ నిమ్మిదిగా పని చేస్తుంటిరి’’ పెదవి విరుపుగా అన్నాడు పిళ్లై.  ‘‘తోళ్లు తీసి పని చేయించండి. ఏం ఊరికే చేస్తున్నారా, నా కొడుకులు! కూలి దొబ్బడం లేదా!’’ అరిచాడు బాస్టియన్‌.

ఇలాంటి తిట్లు సర్వసాధారణం. అయినా పని వదిలిపోరు. పారిపోతే పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తున్నారు కూడా. నీళ్లు మోసుకొస్తున్న ఆ లింగేటి మూగయ్య పారిపోయే దుస్సాహసం చేసి, ఫలితం అనుభవిస్తున్నవాడే. అడవిదున్న ఉదరంలా ఉంది ఆ తోలు తిత్తి. నిండా నీళ్లు నింపుకుని అంచె టపా మాదిరిగా మోస్తున్నారు నలుగురు వంతున. ఐదారు అడుగుల బలమైన వెదురు బొంగుకు తలిగించారు తిత్తిని. నాలుగు కిలోమీటర్ల అవతల, నర్సీపట్నం వైపు ఉన్న లంబసింగి నుంచి వస్తున్నాయి నీళ్లు. అక్కడ గప్పీ దొర బంగ్లాకి కొంచెం అవతలే ఉన్న నూతి నుంచి కొందరు నీరు తోడి ఈ తోలుతిత్తులు నింపుతూ ఉంటే, అర కిలోమీటరుకు ఒక బృందం వంతున మోసుకువస్తున్నారు, ఈ కొండగ్రామం చిట్రాళ్లగొప్పుకి. గుర్రం కళ్లెం పట్టుకుని ఎదురైన ద్వారం కిష్టయ్యను చూసి ఆగాడు మూగయ్య. మిగిలిన ముగ్గూరూ కూడా ఆగవలసి వచ్చింది.

‘‘కిష్టయ్య...కిష్టయ్యా! ఓపాలి ఆగు..... దండవెడతాను. నా గొంగడి ఇచ్చేయ్‌ బాబు! ఎలాగూ ఈసారిచ్చే కూలిలో తగ్గించుకుంటారు కదా! నీ కాళ్లకి దణ్ణం!’’ అన్నాడు దీనంగా. భుజం మీద బరువుతో మాట కష్టంగా వచ్చింది. గూడెం ప్రాంతంలోనే  వీరముష్టిపేట గ్రామం మూగయ్యది. యాభై ఏళ్లు. కానీ అరయ్యేళ్ల వాడిలా ఉన్నాడు. కిష్టయ్య అన్నాడు, ‘‘నిన్ననే కదరా గుర్తు చేశావ్‌! మాకు ఏరే పనేంలేదా, నీ చింకి గొంగడి గోల తప్ప?’’ ‘‘చింకిది కాదు, కొత్తది కిష్టయ్యా!’’ అన్నాడు మూగయ్య. ‘‘నోర్మూస్కో. నీ గొంగడి ఊర్కే లాక్కున్నానా ఏంట్రా? అయినా ఒరే, దొరతనమోరి సొమ్ము అలా గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళిపోతే తప్పుకదరా! బేస్టీన్‌దొర మంచోడు కాబట్టి ఇప్పుడిచ్చే కూలిలో తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఈపాటికి నర్సీపట్నం సబ్‌ జైల్లో కూకునేవోడివి.’’

‘‘తప్పు కాయి కిష్టయ్య!  పెద్దోణ్ణి. ఇక్కడ చలి బాద నీకు తెలుసు కదా!’’ చేతులు జోడించి మళ్లీ అడిగాడు మూగయ్య. ‘‘ఔన్రోయ్‌! ఇస్తాలే. రాత్రికి కదా! మాపటేలకే వచ్చెయ్‌రా!’’  నిర్లక్ష్యంగా చెప్పేసి గుర్రంతో ముందుకు నడిచాడు కిష్టయ్య. నీటిబుంగలతో అక్కడ నిలబడి ఉన్నారు ఆడకూలీలు. తిత్తి తాడు వదులు చేసి, నీళ్లన్నీ బుంగలలో నింపేసి మళ్లీ వెనుదిరిగింది మూగయ్య బృందం, ఆలస్యం చేయకుండా. చింతపల్లి, లంబసింగి ప్రాంతాలని చలిగూడెం, పులిగూడెం అంటారు. నిత్యం పగలూ రాత్రీ చలే. చీకటి పడితే పులుల బాధ. మూగయ్యది ప్రస్తుతం దారుణమైన చలిబాధ.
చిట్రాళ్లగొప్పు రోడ్డు పని మొదలైన రోజున, అంటే మొన్న– కిష్టయ్య ఎదురుపడగానే మొదట అడిగింది గొంగడి గురించే. అప్పటికి ముప్పయ్‌ మూడు రోజుల క్రితం కూడా నర్సీపట్నం–చింతపల్లి రోడ్డు ఒక దశ కొంతపని జరిగింది. ఆ సమయంలోనే మూగయ్య గొంగడి లాక్కున్నారు. నిజం చెప్పాలంటే దొరతనం తాకట్టు పెట్టుకుంది, ఆ గొంగడిని. మనిషికి రోజుకి ఆరు అణాల (అణా= ఆరు పైసలు) కూలీ అని చెప్పారు. రోజులను బట్టి పద్నాలుగు కుంచాల వరకు బియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్ని రోజులైనా పని జరిగే చోటే ఉండాలి.

గ్రామ మునసబులూ, ముఠాదారులూ మొదట్లో పోటీలు పడి రోడ్డు పనికి మన్యప్రజలని సమీకరించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు అందరికీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఇప్పటికి ఇక్కడ పని ఆపేస్తున్నామనీ, ఇప్పుడిచ్చే కొంత బియ్యం, కూలీ తీసుకుని వెళ్లి, మళ్లీ మొదలు పెట్టినప్పుడు రావాలనీ చెప్పారు, నెల క్రితం వచ్చినప్పుడు. కానీ, కొందరికి డబ్బులు బకాయి పెట్టారు. ఇంకొందరికి బియ్యం బకాయి పెట్టారు. అప్పుడే నాలుగు కుంచాలే తీసుకోవలసిన మూగయ్య సంచిలో పొరపాటున ఐదు కుంచాలు కొలిచాడు కిష్టయ్య. అది ఇద్దరూ గమనించలేదు. తప్పు కిష్టయ్యదే. చివరికి  ఎవరో చెప్పారు, మూగయ్య సంచిలో ఒక కుంచం అదనంగా పడిన సంగతి. అతడి గురించి వెతికితే కనిపించలేదు. చడీచప్పుడూ కాకుండా పని వదిలేసి మూగయ్య తన ఊరు వెళ్లిపోయాడు. రెండోరోజుకే మూగయ్య ఇంటికి వచ్చాడు బారిక– బేస్టిను దొర  గప్పీదొర బంగ్లాకి రమ్మన్నాడన్న కబురు పట్టుకుని.

నాకేం తెలియదన్నాడు మూగయ్య. పైగా తప్పు నీదైతే నేనేం చేస్తాను అన్నాడు ఎదురు తిరిగి. బంగ్లా స్తంభానికి కట్టేసి, బాస్టియన్‌ ఆదేశంతో కొరడా అందుకున్నాడు కిష్టయ్య. ఒక కర్ర తీసుకుని పిళ్లై దాడిచేశాడు. పిళ్లై కర్రకి తగులుకున్న గొంగడి ఊడొచ్చింది. కిష్టయ్య గావంచా లాగేశాడు. నగ్నంగా ఉన్న మూగయ్య దెబ్బల బాధతో, గావంచా అయినా ఇవ్వమనీ, లేదా చిన్న గోచి గుడ్డయినా ఇవ్వమని, కూలి చేసి గొంగడి తీసుకుంటానని రోదిస్తూ కాళ్లా వేళ్లా పడ్డాడు. చివరికి గావంచా ఇచ్చి, గొంగడి మాత్రం గప్పీ దొర బంగ్లాలో పడేశాడు కిష్టయ్య.
                                                               ===
అది లంబసింగి రోడ్డు నిర్మాణం పని. కాలుతున్న అడవిని అర్పుతున్నంత వేగంగా, అంటుకున్న గుడిసెల మంటలార్పుతున్నంత వడివడిగా కదులుతున్నాయి కూలీల కాళ్లూచేతులూ. నూట నలభై ఒక్క మంది కూలీలు. ఆడవాళ్లు యాభయ్‌ మంది వరకు ఉంటారు. అంతా విశాఖ మన్యవాసులే. చాలామంది మగవాళ్ల మొలలకు చిన్న గుడ్డ తప్ప మరేమీ లేదు. ఆడవాళ్లు సంప్రదాయకంగా చీర ధరించి ఉన్నారు. దాదాపు ఎవరికీ జాకెట్లు గానీ, కాళ్లకు చెప్పులు గానీ లేవు. అక్కడక్కడ కొద్దిమంది తప్ప అందరూ ఎముకల గూళ్లని చెబితే అతిశయోక్తి కాదు. చింతపల్లి–చిట్రాళ్లగొప్పు రోడ్డు పని పూర్తయింది. ఇప్పుడు చిట్రాళ్లగొప్పు గ్రామ శివార్ల నుంచి ఈ దశ రోడ్డు పని మొదలైంది.
                                                                ===
పేగులు లుంగ చుట్టుకుపోతున్నాయి. ఒంటికి పట్టిన కంకర దుమ్ము,  కాళ్లూ చేతులూ కడుక్కోవడం మరిచిపోయినట్టే ఉన్నారంతా. ఆకలి...  నాలుగు ముద్దలు తినడానికి వడివడిగా నడుస్తున్నారు ఆ మామిడిచెట్టు దగ్గరకి. ఏదో ఒక మిషతో మధ్యాహ్నం భోజనం ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు కిష్టయ్య, పిళ్లై. చివరికి పని భారంతో పెద్దవాళ్లు, వయసు చేత పిల్లలు నకనకలాడిపోతున్నారు మెతుకుల కోసం. నిత్యం ఇదే తంతు.
కొండమ్మ వడివడిగా వచ్చింది. మొగుడు ఇంకా రాలేదు. అయినా అతడి కోసం చూడదలుచుకోలేదు తీరా అక్కడి దృశ్యంతో నిశ్చేష్టురాలైపోయిందామె. అన్నం ముంతలు రెండో మూడో పగలగొట్టినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ఎండుటాకుల మీద మెతుకులు, చిందరవందరగా. తను తెచ్చుకున్న ముంత పెట్టిన చోటు చూసింది  కొండమ్మ. అక్కడ లేదు. ముంతలని కొద్దిదూరం వరకు అలమబండలు (కొండముచ్చులు) లాక్కుపోయిన సంగతి అర్థమయింది.

ఆ ప్రదేశమంతా ఎండుటాకుల మీద అన్నం మెతుకులు కనిపిస్తున్నాయి. ఆ అన్నం తన ముంతలోదే. ఉదయం కలిపి తెచ్చుకున్నది. కళ్లంట నీళ్లు ఉబికాయి ఒక్కసారిగా. దూరంగా కనిపిస్తున్న ఆ ముంత దగ్గరగా నడిచిందామె. అక్కడే మరో చెట్టుకింద దట్టంగా ఉన్నాయి  మొతుకులు. వేయించిన పనస గింజలు కలిపిన మెతుకులు– ఎర్ర టి కారం అంటిన తెల్లటి మెతుకులు. నోట్లో నీరు ఊరిపోయింది. నేల మీద ఉన్న రెండు ఎండుటాకులని చేతుల్లోకి  తీసుకుంది కొండమ్మ. వాటినిండా మెతుకులు, చిన్న చిన్న ఇసుకరేణువులతో కలసి. ఆ ఇసుకని ఓపిగ్గా ఊదుకుంటూ వాటిలోని మెతుకులని నోట్లో ఒంపుకుంటోందామె. ‘‘తిన్నది చాలు... రండి...రండి!’’ అప్పటికే అక్కడ కిష్టయ్య అరుస్తున్నాడు.
                                            
‘‘లోతుగడ్డనున్న.....’’ రెండు చేతులతో ఎత్తి పట్టుకున్న గునపాన్ని బలంగా నేలలోకి దింపుతూ పెద్ద గొంతుతో అన్నాడా అడవిబిడ్డ, ఆ పదం. ‘‘వీరభద్రుడా!......’’ రోడ్డు పనిలో ఉన్న దాదాపు నూట నలభయ్‌ మంది కూలీలు అన్నారు ముక్తకంఠంతో. ఆ గునపాన్నే పైకి లాగి మళ్లీ పోటు వేయడానికి ఎత్తి అన్నాడు అతడే, ‘‘లంబసింగినున్న.....’’ ‘‘బాలరాకాసమ్మ....’’ అన్నాయి జనం గొంతులు. విశాఖమన్యంలో వినిపించే కొండరెడ్ల పాట. వివశులైపోతారు అడవిబిడ్డలు ఆటన్నా, పాటన్నా. కానీ ఇప్పుడు ఆ పాట వాళ్ల గొంతుకలలో  సహజంగా పలకడం లేదు. ఈ కష్టం నుంచి నీ బిడ్డలని కాపాడకుండా ఏమిటీ తాత్సారం? అన్న ఆక్రోశం ఆ లయకు తోడైనట్టుంది.

ఆ గిరిజనుడే  అందుకున్నాడు పాట. రెండో పదం జనమంతా కలసి అంటున్నారు.......
‘‘బోడికొండనున్న ...’’       –  ‘‘శాంబరమ్మ...’’
‘‘మాడుగులనున్న ....’’      –  ‘‘మత్స్యకంబేరమ్మ....’
‘‘కొండకంబేరున్న...’’        –  ‘‘నీలకంఠుడా!’’
‘‘దమ్మము సావడి....’’        – ‘‘ మనము చేరవాలె....’’
‘‘ఎటు వెళ్లినారో.....’’          –  ‘‘పంచపాండగూలు....!’’
పాట అర్థం కాకున్నా, అందులోని లయనీ, ఆ లయకు తగ్గట్టు వేగంగా కదులుతున్న కొండజనాన్ని తదేకంగా శ్రద్ధగా గమనిస్తున్నాడు రోలర్‌ డ్రైవర్‌ విలియం. పనిలో వేగం అతడిని విస్తుపోయేటట్టు చేస్తోంది. ఎక్కడి నుంచో మరి, అప్పుడే వచ్చాడు బాస్టియన్‌. అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది గుర్రం– నిర్మిస్తున్న రోడ్డుకు ఒక పక్కగా. అంతే వాళ్ల గొంతుల్లో ఊపు తగ్గిపోయింది. పనిలో మాత్రం అదే వేగం. అదే నచ్చదు బాస్టియన్‌కి. శరవేగంగా సాగాలంటాడు. ఈ 1922 సంవత్సరాంతానికల్లా మన్యంలో రోడ్లన్నీ సిద్ధమైపోవాలి.   శారీరక శ్రమనే కాదు, గాయాల సలుపుని కూడా ఆ పాట మరిపింపచేస్తోంది. పది రెట్ల శక్తిని ఇస్తోంది. కొందరు తట్టలతో తెచ్చి ఎర్ర కంకర చిమ్ముతుంటే, ఆ కంకర మీద కడవలతో, బుంగలతో నీళ్లు తెచ్చి అరచేతిని అడ్డం పెట్టి లాఘవంగా తడుపుతున్నారు కొందరు. మరుక్షణంలో దిమ్మెసాలు వచ్చి నర్తిస్తున్నాయి.

ఒకచోట నిలిపాడు గుర్రాన్ని బాస్టియన్‌. కాస్త పరిశీలనగా చూసిన తరువాత అర్థమైంది అతడికి, ఆ లోటు. కొండవాళ్లు వంకర గునపాలని పిలుచుకునే క్రౌబార్లు ఇరవై వరకు తెప్పించాడు బాస్టియన్‌. ఒక కొస ఒంపు తిరిగిన గద్ద ముక్కులా ఉంటుంది. రెండో వైపు అర్థచంద్రాకారపు బద్ద ఉంటుంది. వాటితో రాళ్లను పెళ్లగించే పని నలుగురైదుగురే చేస్తున్నారు. ‘‘కిష్టయ్యా!’’ అరిచాడు బాస్టియన్, గుర్రం మీద నుంచే. ఏ మూల నుంచో వచ్చి నిలబడ్డాడు కిష్టయ్య. ‘‘ఏరా! క్రౌబార్లు ఇంకలేవా?’’ ‘‘మిగిల్నియ్యి పాడైయ్యాయి కదా దొర!’’ అన్నాడు కిష్టయ్య. ‘‘రెండ్రోజులైంది చెప్పి, ఇంకా బాగుచేయించలేదా? ఆడెవడికో చెప్పాం.... మర్రిపాలెం వాడెవడో......!’’ పేరు గుర్తుకు రాలేదు బాస్టియన్‌కి. గుర్తు చేశాడు కిష్టయ్య, ‘‘ఎర్రేసు దొర, బూతా ఎర్రేసు.’’ ‘‘పిలు, చెత్త నాకొడుకుని!’’ పళ్లు నూరుతూ అరిచాడు బాస్టియన్‌.  ఓ చోట గొప్పు తవ్వుతున్న ఎర్రేసుని గమనించి, చేతులు ఊపి రమ్మని సైగ చేశాడు కిష్టయ్య. పాట ఆగిపోయింది. ప్రతి అడవిబిడ్డ గుండె కీడు శంకించింది.

చేతిలో పలుగుని అక్కడే నేలకు గుచ్చి, తలకు చుట్టుకున్న తుండుగుడ్డ విప్పుకుని మెడలో దండలా వేసుకుంటూ గబగబా వచ్చాడు బూతా ఎర్రేసు భయపడుతూనే. పాతికేళ్లుంటాయి. బలంగానే ఉన్నా, డస్సిపోయి కనిపిస్తున్నాడు. అతని రెప్పల చివరి వెంట్రుకల మీద, మాసిన గడ్డం మీద  కూడా కంకర దుమ్ము. దీనితో మరీ నీరసంగా కనిపిస్తున్నాడు. ‘‘నీయమ్మ....! వంకర గునపాలు ఎందుకు పట్టుకెళ్లలేదురా? ఎవరి చంక నాకుతున్నావ్‌?’’ ఉరిమాడు బాస్టియన్‌. ‘‘పొద్దున్న కూడా అడిగాను దొర. రేప్పోవచ్చులే అన్నాడు కిష్టయ్య.’’ విషయం చెప్పాడు తడబడుతూ ఎర్రేసు. ‘‘నన్నెప్పుడడిగావురా? దొర చెప్పాక, నన్ను అడగడం దేనికిరా? చెప్పు తీసుక్కొడతాను నాయాలా!’’ అడ్డంగా బొంకాడు కిష్టయ్య.

సర్రున గుర్రం దిగి, ఎర్రేసు మెడలోని తుండు గుడ్డ రెండు కొసలను తటాల్న అందుకుని, మళ్లీ అంతే వేగంతో గుర్రం ఎక్కాడు బాస్టియన్‌. బలంగా లాగడంతో కెవ్వున అరిచాడు ఎర్రేసు. అప్పటికే అతడి పీక∙గుర్రం మెడకు తాసుకుపోయింది. ఉరికొయ్యకు వేలాడుతున్నట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.‘‘ఎక్కడున్నాయిరా ఆ క్రౌబార్లు?’’గట్టిగా అడిగాడు బాస్టియన్‌. ఇది ఇంతకు దారి తీస్తుందన్న సంగతి కిష్టయ్య కూడా ఊహించలేదు. అందుకే తడబడిపోతూ అన్నాడు. ‘‘అక్కడే దొర.... మన సామాన్లన్నీ పెడతాం కదా... ఆ మామిడి చెట్టు కిందే ....!’’ ‘‘చల్‌...!’’ గుర్రాన్ని అదిలించాడు బాస్టియన్‌. ఆ ముఖంలో ఏదో కసి. గుర్రం కదలబోతోంది.....

Advertisement
Advertisement