ఈ సిద్దప్పనాయుడికి...ప్రజాసేవ అంటే కసి...కసి!

ఈ సిద్దప్పనాయుడికి...ప్రజాసేవ అంటే కసి...కసి!


అవును మరి. సిద్దప్పనాయుడు అంటే మాటలు కాదు. 35 బెల్ట్‌షాపులకు ఓనరు. ఎమ్మెల్యే కావాలని సిన్సియర్‌గా ఫిక్సై పోయాడు. ఎందుకంటే...ఆయనకు పెజాసేవ అంటే కసి..కసి!


 తన శత్రువును ఉద్దేశించి...


 ‘వాడ్ని చంపాక


 తల ఒక్కటి తీసుకురా


 ఆ హెడ్డుకి వెయిటు ఎక్కువ’ అని నిప్పులు కక్కగలడు.


 శత్రువు తమ్ముడిని దగ్గరకు తీసి...


 ‘తమ్ముడూ... నువ్వు ఉండాల్సింది  కాళ్ల దగ్గర కాదు... కౌగిళ్లలో’ అంటూ చాప కింద నీరులా కుట్రకు రచన చేయగలడు.


 ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో సిద్దప్పనాయుడిగా అభిమన్యుసింగ్ భయపెట్టాడు. భయపెడుతూ భయపెడుతూనే... నవ్వకుండానే నవ్వించాడు.


 కొంచెం వెనక్కి వెళితే...


 రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’లో ఈ అభిమన్యుసింగ్ బుక్కారెడ్డిగా వణుకు తెప్పిస్తాడు.


 బుక్కారెడ్డి ఎవరు?


 వర్మ గొంతుతోనే స్వయంగా విందాం...


 ‘‘అతడు రాజకీయ నాయకుడు కాదు.


 రాక్షస నాయకుడు. అతని గురించి విన్నవాళ్లెవరైనా సరే...


 ‘అసలు భూమ్మీద ఇలాంటి మనిషి ఉంటాడా!’ అని స్టన్ అయిపోతారు’’


 ‘రక్తచరిత్రలో’ బుక్కారెడ్డి పాత్రను భయంకరంగా పండించి ‘ఉత్తమ విలన్’ అని వర్మ చేత అనిపించుకున్నాడు అభిమన్యు.


 ‘బుక్కారెడ్డి పాత్రకు సోల్ ఇచ్చావు’ అని మెచ్చుకున్నాడు వర్మ.


 ఇప్పుడంటే అభిమన్యుసింగ్ వయిలెంట్ విలనిజం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాంగానీ...


 ఒకప్పుడు? అక్కడికే వెళదాం. 


 అభిమన్యుసింగ్ స్వస్థలం బిహార్‌రాజధాని పట్నా. ‘బాలీవుడ్’ కలలతో ముంబైకి చేరుకున్నాడు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ బొంగరంలా తిరిగాడు. కొంచెం కూడా ఫలితం కనిపించలేదు. ‘థియేటర్’ రూట్ నుంచి వెళితే...ప్రయాణం కాస్త సులువవుతుంది అనుకొని మకరంద్ దేశ్‌పాండే థియేటర్ గ్రూప్ ‘అంశ్’లో చేరాడు.


 మొదటి రోజు...

‘‘నటన అంటే ఇదీ’’ అని చెప్పలేదు మకరంద్.  ‘‘చీపురు అంటే ఇదీ’’ అన్నట్లుగా మూలకు ఉన్న చీపురును అభిమన్యుకు చూపి...ఫ్లోర్ ఊడ్చమన్నాడు. ‘నేను వచ్చింది నటన నేర్చుకోవడం కోసం. ఊడ్చడం కోసం కాదు’ అభిమన్యులో కోపం కెరటమై లేచింది. అయితే నటన మీద ప్రేమ... ఆ కోపాగ్నిపై నీళ్లు చల్లింది. అలా....చీపురుతో ఫ్లోర్ ఊడ్చాడు అభిమన్యు. ‘ఇగో మెల్టింగ్’ పూర్తయ్యాక... అభిమన్యుకు నటనలో ఓనమాలు దిద్దించాడు మకరంద్. ‘అంశ్’ థియేటర్ గ్రూప్‌లో కె.కె. మీనన్, అనురాగ్ కశ్యప్‌లు అభిమన్యుకు సీనియర్లు. ‘బాగా నటిస్తున్నాడు’ అని పేరైతే వచ్చిందిగానీ... సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదు. తన రూమ్‌లో ఒంటరిగా ఏడ్చిన రోజులెన్నో ఉన్నాయి.



పట్నాలో ఉన్నప్పుడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. కట్ చేస్తే... రాకేష్ మెహ్ర ‘అక్స్’లో పోలీస్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. అయితే... ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర నిరాశపరచడంతో... అభిమన్యు కెరీర్‌కు ఉపయోగపడలేదు. మళ్లీ స్ట్రగుల్....‘లక్ష్య్’ ‘డోల్’ ‘జన్నత్’ సినిమాల్లో నటించాడుగానీ... కెరీర్ స్పీడ్ అందుకోలేదు. అయితే... ‘గులాల్’ సినిమాతో కెరీర్ టర్నింగ్ తీసుకుంది. ప్రముఖుల దృష్టిలో పడే అవకాశం వచ్చింది. ‘రక్తచరిత్ర’తో దక్షిణాది సినిమాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. చెడు పాత్రలను ‘ఎంత మంచిగా చేశాడు’ అనిపించుకోవడం అంత తేలికేమీకాదు... అందుకే అభిమన్యు సింగ్ ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top