లైట్‌ హౌస్‌

Funday story of the world 19-05-2019 - Sakshi

కథా ప్రపంచం

మేం లైట్‌హౌస్‌ వద్దకు చేరే సరికి లోనికి పోయే మార్గానికి గేటు మూసి ఉంది. నేను కారు దిగి గేటు వైపు నడిచాను. ‘‘లైట్‌హౌస్‌ ఎక్కడుంది నాన్నా? మనం లోనికెళ్దాం పద.’’ అంటూ నా భార్య ఇంకా కారు దిగకుండానే పాప నన్ను ముందుకు నెట్టింది.  శ్రీలంకకు దక్షిణాగ్రాన దోండ్రా హెడ్‌ అనే చోట ఒక లైట్‌హౌస్‌ ఉందనీ, దాని నుంచి వచ్చే సంకేతాలతోనే నావికులు పెద్ద ఓడలను సముద్రంలో నడుపుతూ ఉంటారనీ, అది చూడటానికి అద్భుతంగా ఉంటుందనీ పాపకు వాళ్ల టీచరు చెప్పింది. బడి నుంచి ఇంటికి వచ్చిన మరుక్షణం నుంచి పాప దాని గురించి సవాలక్ష ప్రశ్నలు సంధించింది. ఎలాగైనా తీసుకెళ్లి చూపించమని మారాం చెయ్యడం మొదలుపెట్టింది.  శ్రీలంక మ్యాప్‌లో చూస్తే దోండ్రా హెడ్‌ సముద్రంలోంచి ఒక బొబ్బలాగ పొడుచుకు వచ్చి ఉంటుంది. దోండ్రా అంటే దేవతల నగరం అని అర్థం. ఇది ఆగ్నేయాసియాలోనే అత్యంత ఎత్తయిన లైట్‌హౌస్‌ అని చెబుతారు. ఈ వివరాలన్నీ ఆ చిన్ని తలలో ఎంతో ఆసక్తి రేపేటట్టు టీచరు చెప్పి ఉంటుందని నాకు అర్థమైంది. పాప దాని గురించి ఒక అందమైన దృశ్యాన్ని మనసులో చిత్రించుకుంటోంది.

అక్కడకు మూడు నాలుగు నెలల తర్వాత నాకు దక్షిణాదికి వెళ్లవలసిన పని పడింది. పనిలో పనిగా పాప కోరిక తీర్చడం కూడా కార్యక్రమంలో పెట్టుకున్నాను. మేం అక్కడకు వెళుతున్నామని విన్నప్పటి నుంచి పాప ఉప్పొంగిపోతోంది. ఇంకా రకరకాల ప్రశ్నలు వేస్తోంది. కాని తీరా అక్కడకు చేరుకునే సరికి లోనికి వెళ్లే గేటు మూసి ఉండటం వల్ల ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అసహనంగా నన్ను కుదుపుతూ ‘‘లైట్‌హౌస్‌ ఎక్కడుంది నాన్నా!’’ అని అడుగుతోంది. చుట్టూ చూశాను. ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని మార్గం కనిపించింది. ఆవరణ అంతా పచ్చగడ్డితో నిండి ఉంది. ఆమార్గం తాటి చెట్ల మధ్య నుంచి ఒక గుట్ట శిఖరానికి పోతోంది. కేవలం ఒక భవనం మాత్రమే కనిపిస్తోంది. కాని లైట్‌హౌస్‌ కనబడటం లేదు.మనుషుల అలికిడి కోసం కళ్లు చికిలించి చూశాను. ప్రాణి సంచారమే లేదు. మా పాప నిరాశపడుతుందని భయపడ్డాను. అక్కడ ఆగి ఉన్న మా కారులాగానే పరిసరాలన్నీ స్థిరంగానూ చలనరహితంగానూ ఉన్నాయి. లయబద్ధమైన సాగర ఘోష తప్ప వేరేమీ వినబడటం లేదు. ఉదయం తొమ్మిది గంటలైనప్పటికీ, ప్రశాంతత రాజ్యమేలుతోంది. సూర్యకిరణాలు సముద్రం మీదా, చుట్టూ ఉన్న వృక్ష సంపద మీదా పడి ప్రతిఫలిస్తున్నాయి. నీటి మీద నుంచి నేల మీదకు వీచే చల్లని గాలులు శరీరాలకు మృదు స్పర్శనిస్తున్నాయి. అలలు రాళ్లను తాకి తెల్లని తుంపరలుగా మారి ఒక నీలి తివాచీకి అంచుగా ముత్యాల కుచ్చెళ్లు ఉన్నట్లు రూపిస్తున్నాయి. తరంగాలు తీరాన్ని తాకి ఆట నుంచి నిష్క్రమిస్తున్న పిల్లల మాదిరిగా వెనక్కు మళ్లుతున్నాయి. 

‘‘ఎలాగైనా లోనికెళ్దాం నాన్నా!’’ పాప నన్ను ముందుకు నెడుతోంది. నా కాళ్లు పరిసరాలను గాలించడం మొదలుపెట్టాయి. దూరంగా ఆ ఆవరణలోనే సరిహద్దు పిట్టగోడను ఆనుకుని ఒకే ఒక్క చిన్న ఇల్లు కనిపించింది. దాని తలుపులు కూడా మూసి ఉన్నాయి. మేం ముందుకు నడిచాం. ఇంటి పక్కనే పిట్టగోడ మీద కూర్చుని సముద్రంవైపు నిశ్చలంగా తదేకంగా చూస్తున్న ఒక అమ్మాయి నా దృష్టిలో పడింది. చిరునవ్వుతో ముందుకెళ్లాను. మా రాకను గమనించి తనూ నవ్వుతో మా వైపు తిరిగింది. సుమారు పదేళ్లుంటాయి. ముచ్చటగా జడ వేసుకుని, మాసిన వెలిసిపోయిన గౌను వేసుకుంది. ఆమె అమాయకమైన సిగ్గరి ముఖంలో ఒక తాజాదనం, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నాకు గోచరించాయి. లైట్‌హౌస్‌ వైపు చూపిస్తూ, ‘‘పాపా! అక్కడెవరూ లేరా?’’ అని అడిగాను.‘‘ఉంటారు. కాని ఇప్పుడే పియదాసా మామయ్య గేటు మూసి లోనికెళ్లాడు’’ అంది. ఆమె ఇంకా పిట్టగోడపైనే తన రెండు చేతుల్నీ వెనక్కు ఆనించుకుని ఉంది.దగ్గర్లోనే ఒక నేవీ గోపురం కనిపించింది. ‘‘లోపల నేవీ వాళ్లు ఉంటారా?’’ అని అడిగాను.‘‘నేవీ వాళ్లు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. కాని లోపల ఇక్కడి వాడే ఒకతను కాపలా కాస్తుంటాడు’’ అని చెప్పింది. ‘‘మేం లోపలికి వెళ్లాలంటే ఏం చెయ్యాలి?’’‘‘ఆ గేటు దూకి లోనికి వెళ్లండి. మేం కూడా అదే పని చేస్తుంటాం.’’ కాని నా వయసు వాడు అనుమతి లేకుండా గేటు దూకి ఒక ప్రదేశంలో ప్రవేశించడం ఇబ్బందిగా తోచింది. ‘‘మేమంతా గేటు దూకడం కష్టం కదమ్మా! నువ్వు కాస్త లోపలికి వెళ్లి ఎవర్నైనా పిలిచి, గేటు తెరిపించగలవా?’’ అని అడిగాను.మరో మాట లేకుండా ఆ అమ్మాయి పిట్టగోడకు రెండో వైపు దూకింది. లైట్‌హౌస్‌ లోనికి వెళ్లింది. ఆ ఇంటి వారి మాట తీసుకోకుండా చిన్నమ్మాయిని లోనికి పంపించడం నాకే నచ్చలేదు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించక ముందే, ఆమె తిరిగి వస్తే నయమని భావించాను. కొద్ది సేపట్లోనే ఒక ముసలామె ఒక చేత్తో కత్తీ, మరో చేత్తో వంటచెరకు ముక్కా పట్టుకుని బయటకు వచ్చింది. మమ్మల్ని పట్టించుకోకుండానే, ఒక పెద్ద దుంగ మీద ఆ ముక్కను పెట్టి కత్తితో ముక్కలు చెయ్యసాగింది.ముందుగా నేనే మాట్లాడాను.‘‘అమ్మా! మేం ఆ లైట్‌హౌస్‌ చూడటానికి వచ్చాం.’’ అన్నాను. అప్పుడు తలెత్తి మావైపు చూసింది. కాస్త దగ్గరకు వచ్చింది. ఆమెకు నా మాట స్పష్టంగా వినిపించినట్లు లేదు. కొంచెం బిగ్గరగానే అదే మాట మళ్లీ చెప్పాను. 

‘‘అలాగా!’’ ఆమె ముడుతలు పడిన ముఖం మీద ఒక చిరునవ్వు వ్యాపించింది. ‘‘ఇంతసేపూ ఇక్కడున్న చిన్నమ్మాయి నీ మనవరాలేనా అమ్మా!’’‘‘ఏదీ? ఇప్పుడా అమ్మాయి ఎక్కడకు వెళ్లింది?’’ ఒక్కసారిగా కలవరపాటుతో అడిగింది. నా ప్రశ్న ఆ అమ్మాయి ఉనికి గురించి గుర్తు చేసినట్లుంది. వెంటనే చిన్నది ఎక్కడికి వెళ్లిందో ఏదమైందో తెలుసుకోవాలనుకుంటోంది. కొంచెం జంకుతోనూ, ఆ అమ్మాయి నేరమేమీ లేదన్నట్టుగానూ నేనే సంజాయిషీ ఇచ్చాను. ‘‘అమ్మా! నేనే ఆమెను లోనికెళ్లి ఎవర్నైనా పిలవమని పంపాను.’’‘‘ఏమంటున్నావు బాబూ!’’ చెవి దగ్గర చెయ్యి పెట్టి అడిగింది. నా మాటని మళ్లీ చెప్పాను.‘‘అవును. అక్కడ పియదాసా అనే వాడుండాలి. కాని అసలు కాపలా మనిషి ప్రస్తుతం లేడు. నగరంలోకి వెళ్లాడనుకుంటాను.’’ అంది. మేమీ లైట్‌హౌస్‌ పరిసరాలకు వచ్చినప్పటి నుంచి పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపించింది. ‘‘మరి ఇక్కడ ఉండేవారు ఎవరమ్మా?’’ వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో అడిగాను.‘‘ఇక్కడెవరుంటారు నాయనా? నేనూ నా మనవరాలూ మాత్రమే ఉంటాం..’’ నిట్టూర్పుతో జవాబిచ్చింది. ముసలామె మా వైపు నిదానంగా చూసింది. ఆ తర్వాత వాడిన తన ముడుతలు పడిన ముఖాన్ని సముద్రం వైపు తిప్పింది.  ఇంక నేను వివరాలేమీ అడక్కుండానే ఆ చిన్నమ్మాయి గెంతుకుంటూ వచ్చింది. ఆమె వెనుకనే ఒక నడి వయస్కుడు లుంగీ బనియన్‌తో వచ్చాడు. ఆ వ్యక్తితో లైట్‌ హౌస్‌ చూడటానికి అనుమతి గురించి మాట్లాడాను. ఈలోగా ముసలామె నా భార్యతో మేం ఎక్కడి నుంచి వచ్చామో మొదలైన వివరాలు అడగటం వినిపించింది.

‘‘లైట్‌ హౌస్‌ నిర్వాహకుడు ఈ ఉదయమే గాలేకు ఒక ప్రభుత్వ పని మీద వెళ్లాడు. మీరు పై అంతస్తుకి వెళ్లి చూడటానికి వీలు పడదు. కాని లోనికెళ్లి కింద భాగం వరకు చూడొచ్చు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా చూడొచ్చు.’’ అన్నాడు పియదాసా. ఆ చిన్నమ్మాయి వైపు చూపుతూ ముసలామెతో, ‘‘అమ్మా! ఈ చిన్నారిని మాతో లోనికి తీసుకెళ్లవచ్చునా?’’ అన్నాను.ఎందుకో ఆ పాప గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘‘అమ్మాయీ! వీరితో వెళ్లిరా.’’ అంది ముసలామె. అంటూనే ఆమె వైపు జాలిగా చూసింది. ఆ ఇద్దరి మధ్య మాటలకందని విషాదమేదో ఘనీభవించి ఉన్నదని నాకు తోచింది. ఈ లైట్‌ హౌస్‌ పరిసరాలకు వచ్చినప్పటి నుంచి నాలో ఒక వింత అనుభూతి చోటు చేసుకుంది. అది ఈ సరికి వివరణకు అందని వ్యాకులతగా రూపాంతరం చెందింది. కాని దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మొదట ఆ చిన్నమ్మాయి మాతో రావడానికి సంకోచించింది. కాని నా భార్యా నా కుమార్తె ఒత్తిడి చేసిన మీదట అంగీకరించింది. నడుస్తూ ఉండగా నేనడిగాను: ‘‘నీ పేరేమిటమ్మా!’’‘‘సామంతిక!’’ తరగతి గదిలో టీచరు ప్రశ్నకు విద్యార్థి బదులు చెప్పినట్టుగా వెంటనే చెప్పింది.లైట్‌ హౌస్‌ పూలతోట నిజంగా చాలా సుందరంగా ఉంది. ఒక్క కలుపు మొక్క కూడా లేదు. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పచ్చగడ్డి ఆకుపచ్చని తివాచీలా పరుచుకుని ఉంది. పూదోటని దాటి ఇటుకలూ చిన్న గులకరాళ్లూ పేర్చిన సన్నని దారి గుండా మేం ఆ గుట్ట పైకి ఎక్కాం. కొద్ది దూరం కొబ్బరి చెట్ల మధ్యగా నడిచాం.ఇంకొంచెం ముందుకెళ్లగానే లైట్‌హౌస్‌ కనిపించింది. అది అతి పెద్ద రాకెట్‌ ఆకాశం వైపు సంధించినట్టుగా ఉంది.  నా కుమార్తె ఎంతో సంబరపడిపోయింది. ‘‘అదిగో లైట్‌ హౌస్‌’’ అంతూ గంతులేసింది.సామంతిక కంటే మా పాప ఒకటి రెండు సంవత్సరాలు చిన్నగా ఉంటుంది. ప్రారంభంలో పాప సామంతికతో చనువుగా ఉండలేదు. బహుశ లైట్‌ హౌస్‌ని చూడాలనే ఆమె కాంక్ష ముందు మిగతావేవీ పట్టించుకునే స్థితిలో లేదు. సామంతికకు ఒంటరితనపు భావన రాకుండా, ఆ ఇద్దరినీ చేరువ చేసే ఉద్దేశంతో నా కుమార్తె అడిగిన ప్రశ్నలకు సామంతిక వైపు తిరిగి జవాబులు చెప్పేవాణ్ణి. నేనే స్వయంగా సామంతికను మాటల్లోకి దించాను.

‘‘సామంతికా! రాత్రి పూట ఈ వైపు నుంచి చాలా కాంతివంతంగా ఉంటుందనుకుంటాను’’ అన్నాను.‘‘నిజమే. వాస్తవంగా ఇక్కడ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ సమయంలో లైట్‌హౌస్‌ శిఖరంలో ఉన్న దీప స్తంభం ఆకాశంవైపు ఎక్కువ కాంతిని ప్రసరిస్తుంది. మా ఇంట్లోనికి చీకటి రానే రాదు. ఎల్లప్పుడూ మిట్ట మధ్యాహ్నంలా ఉంటుంది. వెన్నెల రాత్రుల్లో మాత్రం కాంతి పుంజం అంత స్పష్టంగా కనబడదు. చీకటి రాత్రుల్లో కాంతి దూరంగా సముద్రం వైపు పడుతుంది. అప్పుడు ఈ ప్రదేశమంతా స్వర్గంలా ఉంటుంది.’’సామంతిక ఏదో పరవశంతో చెప్పుకుపోతోంది. లైట్‌హౌస్‌ ఈ ప్రాంతాన్ని వెలుగులతో నింపడానికే అని భావిస్తోంది. ఇక్కడి నుంచి కాంతి సంకేతాలు పంపుతారనే విషయం బహుశ ఆమెకు తెలీదు.‘‘ఎక్కడ చదువుతున్నదో సామంతికను అడుగమ్మా!’’ అన్నాను మా పాపతో. ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభించాలని నా కోరిక. పాప అడిగింది.‘‘నేనిప్పుడు బడికి వెళ్లడం లేదు’’ చాలా తేలిగ్గా తీసుకుంది సామంతిక.‘‘ఎందుకు?’’ నేనడిగాను.‘‘మా నాన్నని పోగొట్టుకున్న తర్వాత నేను బడి మానేశాను’’ అన్నది. ఈ మాట విని మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. కొద్దిసేపు అతి నిశ్శబ్దంగా నడిచాం. సామంతిక ఒక కర్ర ముక్క తీసుకుని పూల గుత్తుల్ని కదిలించడం మొదలుపెట్టింది. ఒక సీతాకోక చిలుకలాగాసామంతిక ఎగురుతూ ఉంది. అంటే తనకు సంభవించిన ఆపద తీవ్రతనీ, భవిష్యత్తులో తనకు ఎదురు కాబోయే సమస్యలనీ అర్థం చేసుకునే వయస్సూ, పరిణతీ ఆమెకు లేదని నేననుకున్నాను.ఈ ఆలోచన రాగానే ఆమె పట్ల నా మనస్సు మరింత జాలితోనూ, ఆర్ద్రతతోనూ నిండిపోయింది.‘‘మరి మీ నాన్నని ఎలా పోగొట్టుకున్నావమ్మా!’’‘‘ఒకరోజు సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లాడు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు.’’‘‘అతడు వెళ్లిన పడవ దొరికిందా?’’‘‘మా గ్రామస్తులు కొన్ని వారాల పాటు వెతికారు. వారికేమీ దొరకలేదు. మా నాన్నమ్మ ఇలా చెప్పింది: ‘ఏదో ఒక రోజున మీ నాన్న వస్తాడు. అంతవరకు ఓపికగా ఎదురు చూడక తప్పదు అన్నది.’’‘‘మీ నాన్నని పోగొట్టుకుని ఎన్నాళ్లయింది?’’ అడిగాను. సామంతిక మాటల్లో ‘నాన్నని పోగొట్టుకున్నాను’ అంటున్నప్పుడుఅతడుచనిపోయాడు అన్న ధ్వని లేదు. ‘కేవలం సముద్రంలోనికి వెళ్లి తిరిగి రాలేదు’ అన్న అర్థం వచ్చేట్లు మాట్లాడుతోంది. నేనూ అదే వైనాన్ని కొనసాగించాను.‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లు’’‘‘ఇప్పుడు నీ వయసెంత?’’‘‘పదేళ్లు’’ అన్నది.‘‘మీ నాన్న పడవలో మరో దేశం వైపు వెళ్లి ఉండొచ్చు. కలత చెందకు. అతను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు.’’ అన్నాను కాస్త అనునయించే ధోరణిలో. సామంతిక మళ్లీ తన ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోయింది. 

‘‘అప్పుడు నేను మా నాన్నతో కొలంబో వెళ్లి జూ చూస్తాను. ఆ రోజుల్లో నాతో నాన్న కొలంబో తీసుకెళ్లి జూ చూపిస్తాను అంటుండేవాడు. అక్కడ మేం నగరమంతా తిరుగుతాం. అన్నీ చూస్తాం. ఎంతో బావుంటుంది’’ ఆమె ఇంకా బాల్య చాపల్యంలోనే ఉంది. ‘‘ ఆ రోజుల్లో ప్రతిరోజూ బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆ పిట్ట గోడపైనే కూర్చునే దాన్ని. మా పడవ వచ్చే వరకు ఎదరు చూసే దాన్ని. పడవని దూరంగా చూడగానే మా అమ్మని బిగ్గరగా పిలిచేదాన్ని. మేమిద్దరమూ లైట్‌ హౌస్‌ రెండో వైపునున్న బీచ్‌ వైపు పరుగెత్తే వాళ్లం. నాన్న తీరానికి చేరే వరకు వేచి ఉండే వాళ్లం. నాన్న ఇసుక మీద అడుగు పెట్టగానే నన్ను పట్టుకుని మీదకు ఎత్తుకునే వాడు. ప్రతిరోజూ ఇలా అడిగేదాన్ని: ‘‘నాన్నా! మనం ఈరోజు జూ చూడ్డానికి వెళ్దామా?’ నాన్న ఇలా చెప్పేవాడు: ‘‘వచ్చే వారం వెళ్లి జూ చూద్దాం. సరేనా?’’ అనేవాడు. తర్వాత నా చేతికొక చేపని ఇచ్చేవాడు. అప్పుడు అమ్మా నేనూ ఇంటికి వచ్చేవాళ్లం. అమ్మ వంట మొదలుపెట్టేది. నేను సహాయం చేసేదాన్ని. నాన్న కూడా ఇంటికి చేరిపోయేవాడు. నేను నాన్న ఒడిలోకి ఎక్కి కూర్చునే దాన్ని. నాన్న నాకు తినిపించేవాడు.’’ ఇలా సామంతిక కబుర్లు చెప్పుకుంటూ పోతోంది. బహుశ ఇలా ఆమెను గుర్తించి, అభిమానించి, ఆమె జీవితం గురించి శ్రద్ధాసక్తులను కనపరచిన వారు ఈ మధ్య కాలంలో ఎవరూ ఉండి ఉండరు. అందువల్లనే మా మధ్య ఇంత తక్కువ సమయంలోనే స్నేహ వాతావరణం ఏర్పడింది. సముద్ర జలాల్లోకి వేటకు వెళ్లి ఆచూకీ తెలియకుండా పోయిన ఎందరో మత్స్యకారుల గురించి విన్నాను, చదివాను. కొందరిని ఇతర దేశాల వారు ముందు రక్షించి, ఆ తర్వాత వారి మాతృ దేశానికి అప్పగించే సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని సార్లు అతి ఘోరమైన విషాదకరమైన సంఘటనలు కూడా పత్రికల్లో కనపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య సామంతిక తండ్రి సురక్షితంగా ఇంటికి చేరాలనే కోరుకుంటున్నాను. లైట్‌ హౌస్‌ చుట్టూ తిరిగాం. భవనంలో నేల భాగం అంతా చూశాం. అక్కడి నుంచి చూస్తే మూడు వైపులా అనంతమైన మహా సముద్రం కనిపిస్తుంది. ఉవ్వెత్తున లేచిపడే రాకాసి తరంగాలు కనిపిస్తాయి.నా ఆలోచనలు సామంతిక తండ్రి వైపు మళ్లాయి. అతడికి ఏమై ఉంటుంది? పొట్ట కూటి కోసం అనంత సాగరంతో తలపడటానికి వెళ్లాడు. అతని పడవ తుఫానులో చిక్కుకున్నదా? లేక ఏమైనా మంచుకొండకు గుద్దుకున్నదా? అతణ్ణీ, అతడి సహచరులనీ అగాథమైన సముద్రం కబళించిందా? వారు విగత జీవులై సముద్రం అడుగు భాగానికి చేరిపోయారా? వద్దు.. వద్దు.. అలా జరగకూడదు. సామంతిక తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. కుమార్తెను ఆనందంతో ఆలింగనం చేసుకోవాలి.. అని నా మనసు కోరుకుంటోంది. 

గేటు పక్కనే సముద్రానికి చేరువగా పరిచి ఉన్న పచ్చగడ్డి పొరపై మేం కొంతసేపు నిలుచున్నాం. పిల్ల తెమ్మెరల్లోని చల్లదనం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.  అందరమూ ఒకేసారి అర్ధంతరంగా సామంతికను విడిచి రావడం సరికాదనిపిస్తోంది. లైట్‌ హౌస్‌ నీడలో సముద్రానికి చేరువగా ఏకాంతంగా గడుపుతున్న సామంతిక గాలివాటుకు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై ఇబ్బంది పడింది. ‘‘మనం రెండోవైపు పోదామా? ఇక్కడ నీటి తుంపర్లు ఎక్కువగా ఉన్నాయి’’ అంది సామంతిక.‘‘ఫరవాలేదమ్మా! కాసేపు ఇక్కడే ఉందాం’’ కూర్చుంటూ అన్నాను.నా భార్యా, పాప కూర్చున్నారు. సామంతిక కూడా మాతో పాటు కూర్చుంది. మాతో తెచ్చిన కేకుల్ని పంచుకుని, టీ తాగాం. ఎక్కువగా ఒత్తిడి చెయ్యకుండానే సామంతిక కూడా మాతో కలిసి తీసుకుంది.‘చూడండి నాన్నా! అక్కడ బోలెడన్ని ఆల్చిప్పలు ఉన్నాయి.’’ అంది మా పాప.సామంతిక పిట్టగోడ పైనుంచి ఒక్క తృటిలో దూకి బీచ్‌ వైపు పరుగెత్తింది. ఒక్కొక్క రాతి మీద నుంచి గెంతుతూ ఆల్చిప్పలను ఏరుతోంది. మా పాప కూడా వెళ్లి ఆమెతో చేరిపోయింది. ఇద్దరూ ఒకరికొకరు చేరువైపోయారు. దూరం నుంచి తీరంలో ఎగురుతున్న సీతాకోక చిలకల్లా కనిపించారు. కాసేపు చెట్టాపట్టాలేసుకుని పరుగెత్తారు. మాకు కనిపించనంత దూరం పోయారు. నేను వారిని వెతుకుతూ వెళ్లాను.ఒక్కసారి ఏదైనా రాకాసి అల వచ్చి, వారిని లోనికి లాక్కుపోవచ్చని భయపడ్డాను. మా పాపకు ఇష్టం లేకపోయినా నీటికి అందనంత దూరం చేయి పట్టి లాగాను. నిజానికి నీటిని వదిలి తీరంలోని ఇసుక పైకి చేరుకోవడం సామంతికకు ఇష్టం లేనట్టుంది. తెల్లబోయి విచారంగా చూసింది.  మేం బయల్దేరబోయాం. సామంతిక బరువుగా చూసింది. ముసలమ్మకు కృతజ్ఞతలు చెప్పాం. సామంతిక వల్లనే లైట్‌ హౌస్‌ చూడటం సాధ్యమైందని మరీ మరీ చెప్పి కదలబోయాం.‘‘బాబూ! ఈ చిన్నది పరుగెత్తడం, సంతోషంగా గెంతులెయ్యడం నేనూ వంటగది కిటికీలోంచి సంతృప్తిగా చూశాను. పాపం ఈమె ఎవరితో ఆడుకోగలదు? దగ్గర్లో ఇళ్లు లేవు. ఈ వయసు పిల్లలూ లేరు. ఈ పిట్టగోడ మీద రోజంతా ఒంటరిగా కూర్చుంటుంది. ఓపిగ్గా సముద్రం వైపు వాళ్ల నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.’’ అంటూ ముసలామె బాధపడింది.
‘‘సామంతిక తల్లి ఇంటి వద్ద ఉండదా?’’ ఈ ప్రశ్న వెయ్యడానికి కాస్త తటపటాయించాను. ఒక వేళ తల్లి చనిపోయి ఉంటే గాయాన్ని మరింత రేపినట్టవుతుందని భయపడ్డాను.‘‘లేదు బాబూ! ఆమె ఇంకొకరితో లేచిపోయింది. ఇది జరిగి ఏడాదవుతోంది. ఆమె లేకపోవడమే మాకు బావుంది. ఈ చిన్నదానికి అసలు వాళ్లమ్మతో చేరికే లేదు. ఎప్పుడూ నాన్నతోనే గడిపేది. నా శక్తి మేరకు బుట్టలు తయారు చేసి అమ్ముతుంటాను. ఆ డబ్బుతోనే నేనూ ఈ పిల్లా కష్టంగా బతుకుతున్నాం.’’ అంటూ ముసలామె నిట్టూర్చింది. ‘‘నా బాధంతా ఒక్కటే బాబూ! నేను కన్ను మూసిన తర్వాత ఈమె అనాథ అయిపోతుంది.’’ అన్నది. ఈ మాటలన్నీ ఆమె సామంతిక సమక్షంలోనే పైకి చెప్పింది. నిజానికి మనవరాలి వద్ద దాచవలసిన అంశాలేవీ ఆమెకు లేవు. ప్రస్తుతం ఇద్దరి జీవితాలూ పెనవేసుకుని ఉన్నాయి. 

ఇవన్నీ విన్న తర్వాత ఆ అభాగ్యులను తక్షణమే వదిలి వెళ్లడం కష్టంగా తోచింది. నోట మాట రాక చాలాసేపు మౌనంగా నిల్చుండిపోయాను. నా భార్య నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ‘‘సామంతికా! మాతో వస్తావా? మేం నిన్ను కొలంబో తీసుకెళ్తాం. జూ చూపిస్తాం.’’‘నేను రాలేనమ్మా! మా నాన్న తిరిగి వచ్చేవరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుండాలి.’’ అన్నది సామంతిక అప్రయత్నంగా.\నిజానికి నేనే ఇటువంటి సూచన చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నా భార్య ప్రతిపాదనను బలపరచాలనుకున్నాను. ‘‘అమ్మా! సామంతికను మాతో తీసుకెళ్లనిస్తావా? మేం ఈమెను చక్కగా చూసుకుంటాం. చదివిస్తాం.’’అన్నాను.‘‘అమ్మో! కుదరదు బాబూ! ఈ చిన్నది కూడా లేకుండా నేనెల బతగ్గలను? నా ప్రాణం, నా ఆశ ఈ పిల్లే కదా బాబూ! నాకా వయసు పైబడింది. ఈ దశలో నేను ఈమెను విడిచి ఉండటం వీలు కాదు.’’ అన్నది ముసలమ్మ. ఇప్పుడు అటువంటి ప్రతిపాదన చేసినందుకు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. బాధపడ్డాను కూడా. ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం అక్కడ ఏర్పడింది. సముద్రపు అలల శబ్దం మాత్రమే వినిపిస్తోంది.సామంతిక నానమ్మకు దగ్గరగా వెళ్లి ఆమెను ఆలింగనం చేసుకుని, చుట్టుకున్నది. బహుశ ఆ చిన్నదానికి కావలసిన వెచ్చదనం ముసలామె ఒడిలోనే లభించవచ్చు. లేదా మేం బలవంతంగా తీసుకుపోతామని భయపడి ఉండవచ్చు. ఏది ఏమైనా మేం ఇప్పుడు వారి నుంచి విడిపోయి బయల్దేరడానికి మార్గం సుగమమైంది. అంతేకాదు, కాస్త మనసు గట్టిపడింది. మేం ముగ్గరం కారెక్కిపోయాం. కారుని రోడ్డు వైపు తిప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. చేతులు ఊపి వీడ్కోలు చెప్పాలనుకున్నాను. కాని ఆ సరికే ముసలమ్మ తిరిగి కట్టెని ముక్కలు చెయ్యడంలో నిమగ్నమై ఉన్నది.సామంతిక పిట్టగోడపై కూర్చుని సముద్రంవైపు విషాదంగా చూస్తున్నది. లైట్‌ హౌస్‌ని చూసిన ఆనందంలో మా పాప అదేపనిగా వాగుతోంది.నాకు మాత్రం మనసనే నిశ్చలమైన సరస్సుని ఎవరో బలవంతంగా కెలికినట్టుంది. సామంతిక తన పాలిపోయిన ముఖంతో పిట్టగోడ మీద కూర్చుని సముద్రంవైపు విషాదంగా చూస్తున్న చిత్రం వెంటాడుతోంది.లైట్‌ హౌస్‌ నీడలో నివసిస్తున్న ఆ చిన్నారి జీవితంలోనికి ఎప్పటికైనా ఆ దీపస్తంభం తన కాంతిపుంజాన్ని ప్రసరించగలదా అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది. పదే పదే నా ఆలోచనలకు భంగం కలిగిస్తోంది.
  
సింహళ మూలం : పి.ఎన్‌. కిశోర్‌ కుమార్‌ 
అనువాదం: టి.షణ్ముఖరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top