ప్రేమికుడు

Funday story of the world 05-05-2019 - Sakshi

కథా ప్రపంచం

కూనిరాగం తీసుకుంటూ సతురా ఇంటి దారి పట్టాడు. సూర్యుడు అస్తమించనున్నాడు. అతను అనంతపూర్‌ వెళ్లి వస్తూ, తను ఉంటున్న ఊరికి మరీ దూరంగా లేడు. కేవలం ఆరు మైళ్లే ఇంకా నడవాల్సి ఉంది. ఝండ సాహి చేరుకుంటాడు. ఆహార పదార్థాలు గాని, ఇతర వస్తువులు గాని ఆ ఊరి వారికి దూరంగా ఉన్న బంధుగణానికి తీసుకెళ్లి అందజేస్తూ ఉంటాడు. ఆ సేవలకుగాను వారు ఇతడికి తృణమో పణమో ముట్టజెబుతూ ఉంటారు. అదే మహద్భాగ్యంగా భావిస్తుంటాడు. గత పదిహేనేళ్లుగా సతురా ఈ పనినే వృత్తిగా చేసుకున్నాడు. నిజానికి ఈ వృత్తి వల్ల ఆ ఊరి జనం అందరికీ ఇతను ప్రీతపాత్రుడయ్యాడు. చిల్లరపనుల విషయంలో కేంద్రబిందువు అయ్యాడు. సతురా ఆ ఊరి వారికీ వారి బంధువులకూ మధ్య  వారధిలాంటి వాడు. అమాయకుడు, మృదుభాషి. ఏ చిన్న పనికైనా ముందుంటాడు. నమ్మకస్తుడు, బోళాశంకరుడు. ఎవరు ముందు పిలిస్తే వారి పనిని ముందు చేసి పెడతాడు.దుర్గాపూజ, హోలీ వంటి పండుగ సందర్భాల్లో అతడికి మంచి గిరాకీ ఉంటుంది. అందరూ తమ పిండివంటలూ, పళ్లూ బంధుమిత్రులకు అందించమని పురమాయిస్తుంటారు. వారి అభ్యర్థనలతో అతడు ఉక్కిరిబిక్కిరై మహదానందపడిపోతూ ఉంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఊరి వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు. సతురా ఆ ఊరి వారి బంధువులకు చిరపరిచయస్తుడు. అతడు వారిని మెచ్చుకునే విధానం కూడా అభూత కల్పనలా ఉంటుంది. ‘‘అయ్యా! ఫలానా మీ బంధువు చాలా గొప్ప మంచిమనసు గలవాడయ్యా! నాకు పిండివంటలతోనూ పదిరకాల కూరలతోనూ భోజనం పెట్టాడు. నిజంగా వారి ఇంటికి వెళ్లటం నా పూర్వజన్మ సుకృతం..’’ ఇలా సాగుతుంది అతడి వర్ణన.సతురాకు నలభయ్యేళ్లుంటాయి. పొట్టిగా త్వరగా కదులుతూ ఉంటాడు. అతడి కంఠస్వరం కొంచెం బొంగురుగా ఉంటుంది. జనం అతడిని మందమతిగా పరిగణిస్తుంటారు. మెతకతనం వల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటాడు. కాని మంచితనంతో చాకచక్యంగా బయటపడుతూ ఉంటాడు. ఎంత దూరం, ఏ ప్రాంతం వెళ్లినా తనను పంపించిన వారిని కూడా గొప్ప అతిశయోక్తులతో స్తోత్రం చెయ్యడం మరచిపోడు.

గత పదిహేనేళ్లుగా ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో చేరువగా ఉన్నాడు. కాని వారెవరికీ అతడి గత జీవితం గురించి ఏమీ తెలియదు. అతడి స్వభావం కూడా లోపల్లోపల అతత్యంత గంభీరమైనది. ఎవరికీ అంతు చిక్కనిది, చొరశక్యం కానిది. ఎవరూ అతడి వ్యక్తిగత వివరాల జోలికెళ్లరు. ఒకవేళ అతడి కుటుంబ గురించి ఎవరైనా ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పలేక తడబడిపోతుంటాడు. అతనిలో ఒక శూన్యం ఆవరించినట్లవుతుంది. కళ్లలో నీరు ఉప్పొంగి చెక్కిళ్ల మీదుగా ప్రవహిస్తుంది. ఎదుటివారికి దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆ స్థితిలో ప్రశ్నించిన వారే సతురా పట్ల సానుభూతి చూపిస్తారు. అంతలోనే అతడు అక్కడి నుంచి ఖిన్నవదనంతో, విషాదమైన చూపులతో నిష్క్రమిస్తాడు.సతురా స్వగ్రామం సునాపూర్‌. పదిహేనేళ్ల కిందట సొంత ఊరినీ ఇంటినీ బంధువులనీ విడిచి వచ్చేశాడు. సునాపూర్‌లో అతడిది ప్రధాన్‌ కుటుంబం. మంచి స్థితిపరులూ మర్యాదస్తులూ కావడం వల్ల ఆ ఊర్లో అందరూ వారిని గౌరవంగా చూస్తారు. అతడి తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సాంతియా, చిన్నవాడు సతురా. ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పెళ్లయి అత్తవారింటికి వెళ్లింది. కుమార్తెకూ సాంతియాకూ పెళ్లి చెయ్యడానికి ముసలాయన బాగా అప్పులు చేశాడు. కాని తన మరణానికి ముందే అప్పులన్నీ తీర్చేశాడు. కొడుకులిద్దరికీ కలిపి ఒక ఎనిమిదెకరాల మాగాణి భూమి మిగిల్చిపోయాడు. తండ్రి చనిపోయాక అన్ననూ వదినెనూ సతురా భయభక్తులతో చూసుకునేవాడు. తల్లిదండ్రులుగానే భావించేవాడు. వారి మాటను ఏనాడూ జవదాటి ఎరుగడు. వదినెకు కూడా పిల్లలు కలగలేదు. కాబట్టి ఆమె మరిదిని గారాబంగా చూసుకునేది. 

తండ్రి చనిపోయిన ఏడాది తర్వాత సతురాకు పెళ్లయింది. ఆమె అద్భుత సౌందర్యరాశి. కాబట్టి కొద్ది కాలంలోనే అందరి మన్ననలూ పొందింది. అందరి మనసులనూ గెలుచుకుంది. కాని ఆశ్చర్యకరంగా పెళ్లయిన నెలరోజులకే ఆమె కన్నవారింటికి చేరుకుంది. ఆమె తన వారందరితోనూ భర్త తన పట్ల సుముఖంగా లేడని చెప్పడం ప్రారంభించింది. అతడికి అన్నా వదినెలే ప్రాణమని, భార్యను పట్టించుకునే పోకడే లేదని ప్రచారం చేసింది. సూటిగా చెప్పాలంటే సతురాతో కాపురం చెయ్యడానికి ఆమె తిరస్కరించింది. అతడితో ఉండటం కన్నా చావే నయమని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి సతురా ప్రపంచం తల్లకిందులైంది. హాయిగా సాగే అతడి జీవనస్రవంతి కల్లోల సముద్రంగా మారిపోయింది. ఆరునెలల తర్వాత సతురా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వధువు తులసి, అనుకూలంగానే ఉండేది. ఒక నూతనోత్తేజంతో జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాడు. బతుకు గులాబీల బాటగా మారింది.కాని పెళ్లయిన నాలుగు నెలల తర్వాత సంసార జీవితంలో మరో విస్ఫోటం జరిగింది.ఒకరోజు మొక్కజొన్న తోటలో బాగా శ్రమించిన సతురా ఇంటికి చేరాడు. అప్పటికే అతడు అలసి హారతి కర్పూరమైపోయాడు. మిట్టమధ్యాహ్నం. పశువులశాలలో గెడ్డపారను విడిచిపెట్టాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. మధ్య ద్వారాన్ని దాటి వెళ్లబోతున్నాడు. తన అన్న గది తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే వదినె తన కన్నవారింటికి వెళ్లి ఉంది.లోపలి నుంచి గుసగుసలు వినపడుతున్నాయి. ఒక గొంతు అన్నది, రెండో గొంతు తన భార్య తులసిది. ఒక్కసారిగా అవాక్కయి ఆగిపోయాడు. హతాశుడైపోయాడు. తల తిరగడం మొదలుపెట్టింది.‘‘నీకేమీ భయం లేదు. ఈ సంపదంతా నాదే. ఈ ఇల్లూ ఈ ఆస్తీ అన్నీ నావే. ఆ ఆడంగి వెధవ ఊరు వదిలి పోయేట్టు చేస్తాను’’ తన అన్న తన భార్య తులసితో అంటున్నాడు. ‘‘మనిద్దరి ఈ సంబంధం అతడికి తెలిస్తే?’’ తులసి అనుమానం వ్యక్తం చేస్తోంది.

‘‘తెలీదు. ఆ శుద్ధ బుద్ధావతారానికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా నోరు మూసుకోక తప్పదు. లేకపోతే వాణ్ణి తంతాను.. లేక..’’‘‘లేక?’’ ఆమె అడుగుతోంది.‘‘నిద్రలో ఉండగా వాడి తల నరికేస్తాను. ఈ ఊర్లో నన్ను అడిగేవాడెవ్వడు?’’ తన అన్న స్పష్టంగా చెప్పాడు.సతురాకు ఆ కుట్రలోని తీవ్రత, ప్రమాదస్థాయి అర్థమయ్యాయి. అతడి వెన్నెముకలో భరించలేని భయోత్పాతం ఉప్పెనలా వచ్చింది. తన అన్న అన్నంత పనీ చేయగలడు. అన్న పట్ల సతురాకున్న గౌరవ భావం పటాపంచలైంది. కళ్లవెంబడి నీరు ప్రవహించింది.ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్టుబట్టలతో ఇల్లు విడిచి బయల్దేరాడు. మైళ్ల కొద్దీ ప్రయాణం చేశాడు. చివరికి ఈ ఝండసాహి గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ ఊరు అతడి స్వగ్రామం సునాపూర్‌ నుంచి ముప్పయి మైళ్ల దూరంలో ఉంటుంది. మధ్యలో కొండలూ వాగులూ ఉంటాయి. గత పదిహేనేళ్లుగా ఈ ఊళ్లోనే స్థిరపడిపోయాడు.గడుస్తున్న కాలం అతడి జుత్తు నెరిసిపోయేట్టు చేసింది. ఇల్లు వదిలిన నాటి నుంచి అన్నగాని, దగ్గరి బంధు మిత్రులుగాని సతురా గురించి విచారించలేదు.ఎక్కడున్నాడని వాకబు చెయ్యలేదు. అసలు పట్టించుకోనేలేదు. ఇదీ అతడి గతం.ఇప్పుడు సాయంకాలమైంది. సతురా ఊరి చివర ఉన్న తన నిరాడంబరమైన పూరిగుడిసెకు చేరుకున్నాడు.బరువులు భుజాన మోసే వెదురు కావడి బద్ద ఒక పక్కన చేరవేశాడు. లోపలి వైపు చూస్తూ ఇలా పిలిచాడు: ‘‘ఓయ్‌ ప్రియతమా! తలుపు తెరు. నేను పూర్తిగా అలసిపోయాను. ఎంత పని చేశానో తెలుసా? ఎన్ని ఊళ్లు తిరిగానో తెలుసా? వింటున్నావా?’’లోనుంచి జవాబు రాలేదు.కొంచెం ఆగి అతడే అన్నాడు: ‘‘ఎందుకు మాట్లాడవు? నీకేమైనా జ్వరంగా ఉందా? అయ్యో! నడిచి నడిచి నొప్పెడుతున్న నా మోకాళ్లను మర్దన చేస్తావనుకున్నానే? పోనీలే నీకు ఒంట్లో బాగాలేదు కనుక మరి నేను అరవను.’’తలుపు తాళం తీసి లోనికి ప్రవేశించాడు. దీపాన్ని ముట్టించాడు. తన సంచిలోంచి నాలుగు మట్టి గాజులు తీశాడు. సంతోషంతో ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు: ‘‘చూడు! ఈ గాజులెంత నాజూకుగా ఉన్నాయో! నీకు నచ్చాయా లేదా? చెప్పు మరి. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అరె! ఎందుకు మాట్లాడవు? ఓహో! జ్వరంగా ఉండి మాట్లాడలేకపోతున్నావా? సరేలే! మరి నిన్ను ఇబ్బంది పెట్టను. నీరు తేవాలి. పొయ్యి ముట్టించాలి. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ముందు ఈ గాజులు నీ చేతికి తొడుక్కో...’’సరిగా అదే సమయంలో నారీ మాస్టరు ఇంటి నుంచి అదేపనిగా పిలవసాగాడు: ‘సతురా! సతురా! ఓయ్‌ సతురా!’’చేతిలో ఒక మట్టి కుండతో సతురా గుడిసె బయటకు వచ్చాడు. 

‘‘ఓయ్‌! సతురా! నీ రహస్యం ఈరోజే తెలిసింది. ఈ విషయం నాతో మాట మాత్రంగానైనా ఎప్పుడూ అనలేదు. పోనీలే. పెళ్లి చేసుకుని మంచి పనే చేశావు. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కావు. నాకొక్క విషయం అర్థం కావడంలేదు. అసలు పెళ్లి ఎప్పుడు జరిగిందో చెప్పనేలేదు.’’ నారీ మాస్టరు అంటున్నాడు.సతురా అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. మౌనంగా తల దించుకున్నాడు. పూర్తి నిస్సహాయుడిగా నిలుచుండిపోయాడు.నారీ మాస్టరు ఊరుకోలేదు. మళ్లీ గుచ్చి గుచ్చి అడిగాడు:‘‘నా ప్రశ్నకు జవాబు చెప్పవేం? సతురా! పెళ్లెప్పుడు చేసుకున్నావు? చెప్పడానికి సిగ్గుపడుతున్నావా?’’ రెట్టిస్తున్నాడు.పొరుగునే ఉన్న బిసియా జెనా అనే ఆయన నారీ మాస్టరు వద్దకు వచ్చాడు. ‘‘ఏంటి విషయం?’’ అని అడిగాడు.‘‘ఏంలేదు బిసియా! సతురా పెళ్లి సంగతి.. అతడెప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే. మరేమీ లేదు..’’‘‘మాస్టారూ! సతురా పెళ్లి చేసుకున్నాడని మీకెందుకనిపించింది?’’ బిసియా అడిగాడు.‘‘నేను ఇంటి బయటి నుంచి భార్యతో అతడి సంభాషణ విన్నాను. గాజులు తొడుక్కొమ్మంటున్నాడు. సుస్తీగా ఉన్నది కనుక వచ్చి సేవ చేస్తానని ఊరడిస్తున్నాడు. నిజంగా సంతోషకరమైన జంట.’’ నారీ మాస్టరు మెచ్చుకున్నాడు.సతురా బయట నిర్జీవంగా నిలుచున్నాడు. బిసియా ఇంటి లోపలికి ఆమెను చూడటానికి మాస్టర్ని తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్నామోను మాస్టరు ఆసక్తి చూపలేదు. కాని బిసియా ఒత్తిడి చేశాడు. మాస్టరు అయిష్టంగానే అంగీకరించి వెళ్లాడు. సతురా బయటనే ఉండిపోయాడు.నారీ మాస్టరు అసుర సంధ్య, అర్ధకాంతిలో మంచం మీద దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ఆకృతిని చూశాడు. బిసియా దుప్పటి తొలగించాడు. ఆ దృశ్యాన్ని చూసి మాస్టరు అచేతనుడయ్యాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఆ ఆకృతి స్త్రీ కానేకాదు. పల్లె రైతులు వ్యవసాయ సమయంలో వినియోగించే తాటాకు గొడుగు. మనిషి ఆకారంలో ఉన్నది. దుప్పటి కప్పడంతో మనిషి నిద్రపోతున్నట్టుంది.

బయట సతురా వెక్కివెక్కి ఏడవడం మాస్టరుకు వినిపించింది. ఒక ఉద్వేగంతో మాస్టరు అతడిని నెమ్మదిగా పిలిచాడు. కాని సతురాని ఓదార్చడం సాధ్యం కాలేదు. పదిహేనేళ్ల కిందట అతని నిజ జీవితం కకావికలమైంది. ఇప్పుడు అతడు పదిలంగా కాపాడుకుంటున్న కల్పనాలోకం కూడా ఇతరులకు తేటతెల్లమై ఛిన్నాభిన్నమైంది. నారీ మాస్టరు సునాపూర్‌లో గర్భవతిగా ఉన్న తన కుమార్తెకు పిండివంటలు అందచెయ్యవలసిందిగా సతురాని కోరాడు. సతురా ఇల్లు వదిలిన తర్వాత ఆ ఊరివైపు చూడలేదు. అతనికి భార్య తులసి తలపులు దెయ్యంలాగ వెంటాడుతున్నాయి. ఆమె తన అన్నతో అన్న మాటలు గుండె మీద సుత్తితో కొడుతున్నట్టే ఉన్నాయి. అయిష్టంగానే సునాపూర్‌ వెళ్లడానికి అంగీకరించాడు. ఊరు చేరే సరికి సాయంకాలమైంది. గ్రామం అతడిని సాదరంగా ఆహ్వానించలేదు. తను పుట్టి పెరిగిన ప్రదేశంలో ఈరోజు అతడికి గుర్తింపు లేదు. సగం మనస్సుతో ఏదో అంతర్మథనంతోనే ఆ ఊళ్లో అడుగుపెట్టాడు. ఆకస్మికమైన సతురా రాక ఆ గ్రామస్తులకు చర్చనీయాంశమైంది. ఎన్నో ప్రశ్నలు వేశారు.అతని అన్నకూ భార్యకూ గల వ్యవహారం అందరికీ తెలుసుననీ, అందుకే చంపించి ఉంటాడని అనుకున్నామనీ చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. 

సతురా అందరి మాటలనూ ఓపికగా వింటూనే నారీ మాస్టరు కుమార్తె ఇంటికి నేరుగా చేరుకున్నాడు. ఆ ఇంటి ముసలామె కబుర్లు వినడంలో మునిగిపోయాడు. ఆమె చాలా అంశాలను స్పృశించింది.సాంతియా తులసిని ఏవిధంగా ఉంపుడుగత్తెగా చేసుకున్నదీ, సతురాను అన్న చంపించినట్లు ఊళ్లో పుకార్లను గురించి చెప్పింది. సాంతియా ఇద్దరు భార్యలతో తొమ్మండుగురు సంతానాన్ని కనడాన్ని గ్రామస్తులు చీదరించుకున్నారని వివరించింది. మూడు సంవత్సరాల కిందటే చివరి బిడ్డను ప్రసవించలేక తులసి చనిపోయిందని సమాచారమిచ్చింది. ముసలామె ఇంకా చెప్పసాగింది: సతురా ఇల్లు వదిలిన తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి. సాంతియా వాతరోగంతో మంచం పట్టాడు. ఇద్దరు భార్యలూ ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్లు. వరదలూ కరువుల వల్ల నష్టం వాటిల్లింది. గంపెడు కుటుంబాన్ని పోషించడానికి సాంతియా అప్పుల్లో కూరుకుపోయాడు. కొంత భూమినీ అమ్మివేశాడు. ఒకప్పటి ప్రధాన్‌ కుటుంబం ఇప్పుడు సర్వనాశనమైంది.సతురా ఈ విషయాలన్నీ రెప్పవెయ్యకుండా విన్నాడు. నిజానికి అతడికి ఇక్కడి ఈ అంశాలపైన ఏమాత్రం ఆసక్తి లేదు. కాని అన్న ఆరోగ్యస్థితి తెలిసిన తర్వాత అతడి కోపమంతా చల్లారిపోయింది. అతడిని కలుసుకోవడానికి పరుగెత్తాడు.సాంతియా ఏడుస్తూ సతురాను ఆలింగనం చేసుకున్నాడు. ‘‘తమ్ముడా! నేను మహాపాపిని. నిన్ను నేనే చంపించానని జనం ఆడిపోసుకున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? చెప్పు.’’సతురా మాట లేకుండా నిలుచున్నాడు.వదినె కూడా ఎంతో ఆర్ద్రతతో స్వాగతించింది. గద్గద స్వరంతో పిల్లల దయనీయ స్థితిని వివరించింది. సతురా ఒక్క క్షణం గతాన్ని మరచిపోయి విలపించాడు. ఆ స్థితిలో సతురా వెంటనే ఝండాసాహికి తిరుగుముఖం పట్టలేకపోయాడు. అక్కడే ఉండిపోయాడు. అన్నకు మంచి వైద్యం ఏర్పాడు చేశాడు. మిగిలి ఉన్న భూమి వ్యవసాయ పనులు తనే చేపట్టాడు. కాని ఒక్కోసారి చెప్పుకోలేని వేదనని అనుభవించేవాడు. తనకంటూ ఏమీలేని ఒక శూన్యం అతడిని బాధించేది. తులసి పిల్లల పట్ల ప్రేమకన్నా ద్వేషమే ఎక్కువ కలుగుతున్నది గ్రహించాడు. ఒక్కోరోజు రాత్రి ఒంటరితనపు యాతనతో అతడు తల్లడిల్లిపోయేవాడు. 

గుండెలో చెలరేగిన అలజడి వల్ల అతడికి నిద్ర పట్టేదికాదు. పరుపు మీద ప్రాణమున్న దుంగలా దొర్లేవాడు. ఈ విధమైన అశాంతితో కొద్దిరోజులు గడిపాడు. సాంతియాకు అంచెలంచెలుగా నయమైంది. ఇప్పుడు తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు.సతురా నిద్రలేని కళ్లను చూసి ఒకరోజు వదినె అడిగింది. ‘‘మరిదీ! నువ్వు బాధపడుతున్నట్టుగానూ నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నట్టుగానూ ఉంది. ఎందుకలా ఉన్నావు? ఝండసాహిలో నీ భార్య వదిలి వచ్చినందువల్లనేనా? చెప్పవయ్యా!’’సతురా పెదాలపై ఒక నిర్జీవమైన నవ్వు కదలాడింది. ఆ మరుసటి రోజు అతడు వరిపొలంలో తన పనులన్నీ ముగించుకున్నాడు. తన వెదురు కావడి బద్దను అందుకుని భుజాన వేసుకున్నాడు. బయల్దేరబోతుంటే సాంతియా అడిగాడు: ‘‘సతురా! ఎక్కడికెళుతున్నావు?’’‘‘ఝండాసాహి’’‘‘ఎందుకు?’’సతురా సమాధానం చెప్పలేదు. నిజానికి అతని వద్ద సమాధానం లేదు. చలనం లేకుండా నిలుచున్నాడు. సాంతియా, అతడి భార్య విచారించారు. వారించారు. పిల్లలు కూడా వారి పినతండ్రి చేతులు పట్టుకున్నారు.సతురా వారికి భరోసా ఇచ్చాడు. ‘‘విచారించవద్దు. నేను తిరిగి వస్తాను. నేనిప్పుడు నారీ మాస్టరును కలవాలి. ఆయన పని మీదనే నేనిక్కడికి వచ్చాను. తిరిగి సరైన సమయంలో వెళ్లకపోతే అతడు ఆందోళన చెందుతాడు. ఇప్పుడు మాత్రం వెళ్లక తప్పదు. ఆమె కూడా జ్వరంతో బాధపడుతోంది.’’ ‘‘ఎవరామె? జ్వరంతో బాధపడుతున్నదెవరు?’’ వదినే అడిగింది.సతురా జవాబు చెప్పలేదు.‘‘అయ్యో! ఆమె బాధపడుతోంది. నన్ను వెళ్లనివ్వండి’’ అని మాత్రమే అనగలిగాడు.అన్నా వదినా మారు మాట్లాడలేకపోయారు.‘‘నేను వెళుతున్నాను. మరి సెలవు’’ సతురా వదిన పాదాల వద్ద వంగాడు.లేచి తటాలున బయటకు వచ్చాడు. త్వర త్వరగా అడుగులు వేశాడు.
ఒడియా మూలం : రజనీకాంత మొహంతి
అనువాదం: టి.షణ్ముఖరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top