దొంగల రావిడి

Funday new story of in this week - Sakshi

కొత్త కథలోళ్లు

మా ఊరి మల్లి బీములో మెరుకు. నూరుమందిలో ఉన్నా ఏరుపడి పోతుంది. ఎబ్బుడో కాలంలో మనట్లా ఆడా మగా ఈ సంసారం ఎల్నీద లేక దేవుడ్ని ఏడుకున్నారంట. సామీ నెలకొక దినం తిండి,మూడు పూట్లా నీళ్లు పోసుకునేటట్టు వరం యిచ్చింటే ఏమి, మూడుపూట్లా తిండి పెట్టడంవలన మా కడుపులకి ఏమీ సాలడం లేదు అని. ఆ వరం సగం తిరగేసి మల్లక్కకు దక్కినట్టుంది. నెలనొక్కనాడే నీళ్ళబోసుకునేది. అది ఆయమ్మకి వరసాపిని.  తాటికాయ వర్ణం ఒంటి రంగు. ఆకాశంలో నల్లమేఘం తెల్లమేఘం కలిసిపోతే ఎట్లుంటయో అట్లుంటాయి ఆ యమ్మ ఒంటిమింద గుడ్లు. రైక్కి కుడిరెక్కన అంత మసి ఎడమరెక్కన అంత మసి.  నగితె ఒక్కాకు ఏసిన పండ్లు. నొస్నపావలా బిల్లంత ఎర్ర కుంకుమబొట్టు. ఇంగ ఆయమ్మ దావన నడిసిందంటే ముంతడు సారాయి తాగినోల్లు దావంత ఇసరతా  ఇసరతా నడస్తారే అట్లుంటుంది ఈ యమ్మ దినామూ చేసే పని అద్దడు గిద్దడు బత్యమేసి ఒండుకొని తినేది, మొగునికంత పెట్టేది. మొగుడు గొర్ల కాడికి, ఈయమ్మ ఆవులకాడికి మేపను బొయ్యేది. ఈ యమ్మకి మూడు గొడ్లుండాయి. ఒకటి దొంగగొడ్డు. ఈ గొడ్డు కంట్లో కనుపాపను ఏమార్సి దొంగ గడ్డిని మేస్తుంది. రెండోది సిర కొమ్ములది. దాని రెండు కొమ్ములు ఒక్కొక్కటి చెయ్యి పొడుగు ఉండి తమర్లు ఉన్నట్లు ఉంటాయి. ఆ కొమ్ములు చూసి దాని దగ్గరికి ఎవరూబోరు, కుమ్ముతుందని బయపడతారు. కానీ అది ఎవర్నీ కుమ్మదు. మూడోది బొడుగ్గొడ్డు. అది ఎంత మేసినా దానికి ఒళ్ళు రాదు. మా ఊరికి దక్షినంగా  ఉండే ఎర్రగుంట్లకల్ల  చెరుగుదోటలు ఈడవలు ఈడవలుగా ఏసున్నారు. అక్కడికి ఈ మూడింటినీ మేతకు తోలుకుని పాయె మా మల్లి.

ఆ పొద్దు మిట్ట మద్యానం అయ్యింది. ఆ యాలకాడ ఊర్లో మగోల్లు ఒకరూ లేరు. ఊర్లో పిల్లోల్లు కాకుండా ఊరంతా దేవినా అల్లబల్లగా ముసిలి ముతక, ఆడోల్లు అంతా ఒక పదిమందిమి ఉంటాము.అట్లాంటబుడు మల్లి  పరిగెత్తుకుంటా వచ్చి తొట్ట తొలీత ఓట్నోరు రామక్కతో సెప్పింది ఏమని...‘నేను ఎర్రగుంట్ల చెరకుదోటలకల్లా ఆవులు మేపతా ఉంటే  పదిమంది మొగోల్లు  ఏట కొడవల్లు ఎత్తుకొని చెరుకు దోటల్లోకి పోయిరి, వాళ్ళు ఎట్లుండారంటే చెయెత్తు మనుషులు, వాళ్ళ కనుగుడ్లు ఎర్రగా చింతనిప్పులగతం పట్టెడు పట్టెడు ఉన్నాయి. మీసాలు పురి తిరిగినాయి.  నేను వాళ్ళను జూసి పరిగెత్తితి, వాళ్ళు తోటల్లోకి దూరిరి అనే.  దాంతో ఓట్నోరు రామక్క ఆ ఈదికి ఈ ఈదికి పొయ్యి ‘ఒసే నా బట్ట ముండల్లారా, ఇండ్లల్లో ఉండేవాళ్లంతా బయటకు రండి, మనూర్లోకి దొంగలు వస్తా ఉండారంట  ఊరి చుట్టూ ఉండారంట.  ఎక్కడెక్కడకు పోయినోళ్లందరినీ  పిలసండి అనే. మేము ఇండ్లల్లో ఉండే వాళ్లంతా పరిగెత్తుకుని వచ్చి ఒక తావన  ఉడ్డ జేరితిమి.  దూరం బోయిండే వాల్లకు పోన్లు చేసి అరిజెంటుగా రమ్మంటిమి. చుట్టుపక్కల దగ్గరగా కూలికి పోయిండే వాళ్ళను జతలు జతలుగా మేమే పొయ్యి పిలుసుకువస్తిమి. టౌనుకు పొయ్యినోళ్లందరూ టెన్సన్‌ గా ఆజరైరి.  ఊర్లోని మగోళ్లందరూ  కత్తోడు కత్తి, దొన్నోడు దొన్నిఎత్తుకొని ఊరు సుట్టుపక్కల, చేరుకుదోటలంటి బస్తీ కాస్తా తారాడతా ఉండారు. ఆడోళ్లమంతా ఉడ్డజేరుకొని వుండాము. వీళ్ళ సందులో ఊర్లోటి తాగుబోతులు అయితే ఫుల్లుగా  తాగి గట్టిగా అరిసేది.దొంగలరావిడి కన్నావీళ్ళ రావిడి ఎక్కువయ్యింది .‘తాగినోడు తమాషా ఎరగడని’ ఈ బాధ కూడా ఆనందమే వాళ్లకి.  మా మల్లి   మొగుడు తాగితే వానికి దమ్మిడీ ఆలి ఉండదు.  వాడు కూడా ఫుల్లుగా తాగి రెట్టలు ఎగదీడతా ‘ఎవర్రా దొంగలు నేను సిమ్మం ఊర్లో ఉంటే  ఎన్ని గుండ్లు రా ఊర్లోకి వచ్చేదానికి, ఏటకొడవలెత్తుకొని ఏటు కొకరిని నరకతా, రాండరా మీకు ధైర్నం ఉంటే నా ముందుకి’ అని అరిసేది. ఉడ్లగా ఉండే వాళ్ళదగ్గరకు పొయ్యి మీ కేమీ బయం లేదు ఈ సిమ్మం ఊర్లో ఉంది ఇండ్లకు పొయ్యి పడుకోండి ధైర్నంగా అనేది. ఆ యప్పను ఎవరన్నా అట్లా తోసితే తొంబై ఆమడ దూరం  పడేది.  ఈ తాగుబోతోళ్ళ అవంతరంతో మాకు అరదము పొద్దుబోయేది. ఆ పొద్దు రేయంతా కంటిమింద రెప్పఎయ్యకుండా కావిలి కాసినారు.

ఆ మరుసటి దినం పోవిడి పెడితే మా పక్క పల్లెలోని మగోళ్ళు ఆ దావింటి అడివికి కొడివిండ్లు ఎత్తుకొని కట్లెకు బోయరని తేలింది. మా మల్లి  వాళ్ళను జూసి ఒకటికి నాలుగు కలేసి జెప్పిందని ఊర్లో వాళ్ళందరూ చెడామడా తిట్టి ఇదేమి జెప్పినా నమ్మకూడదు. అన్నీ గచ్చులే జెప్పేది అని అప్పట్నుంచి ఆయమ్మ కి గచ్చుమల్లి అని పేరుపడింది. దీనికి తోడు ‘జల్లోని మాటలకు ఉత్తోడు జామీను’ అన్నట్టు ఈ ఓట్నోరుది ఊరికే ఉంటుందా, గోరంత జరిగితే కొండంత జేసింది.గచ్చుమల్లి చెప్పిందనే  కాదు ఈ దొంగల రావిడితో ఇరవై ఏండ్ల నుంచి ప్రతి సంవత్సరం ఎదో ఒక పుకారుతో మేము భయపడుతూనే ఉన్నాము. ఆ పుకారు కూడా ప్రతి సంవత్సరం ఆవిటిగాలి కాలమే వస్తుంది.  ఆవిటి గాలికి ఏనుగులు అరిసినా వినబడదంట. మాఅవ్వ అనేది ‘ఆవిటి గాలికి మనుషులకి ఆకిలెక్కువంట గెరిసల్లోని బత్యం, కుంటలోని నీళ్లు ఈ గాలికి ఆవిరై పోతాయంట’ అని. ఈ గాలి కాలం వచ్చిందంటే దొంగల రావిడి కూడా ఎక్కువే. రకరకాల పుకార్లతో బయపడతా ఉంటారు ఊరుజనం. ఈ సారి వచ్చిన పుకారు ఏందంటే  నడి జామ కాడ యాభై మంది దొంగలొస్తారంట. తొలీత ఊర్లో ఒక మనిషిని లేపతారంట. మనకు  అనుమానం రాకుండా ఆ మనిసి ద్వారా ఇంటింటికి వచ్చి అందరినీ లేపించి  బెదిరించి మెల్ల మింద  కత్తి పెట్టి  వాళ్లకి దొరికింది దోచుకొని, కంటికి ఇంపుగా కనపడిన ఆడోల్లనైతే చెరిసి తిరగబడితే సంపేస్తారంట, ఇట్లా  పలానా ఊర్లో లో జరిగిందంట. అడివి మార్గాల్లో ఉండే ఊర్లు యావి అని పోవిల్లు పెట్టుకొని  మరీ వస్తారంట అని.  

అవన్నీవిని ఊర్లో ఆడ మగా పగలంతా కూలీలకు పోవాలన్నా ఒంటి సంటిగా పొయ్యేది లేదు. గుంపులు గుంపులుగా పొయ్యేది, రాత్రి పూట పొద్దు గూకకనే ఆడోల్లు అన్నం కూర చేసుకొని తినేసి మా ఈది లోని వాళ్లంతా ఒకింటికి వచ్చి ఉడ్ల ఉడ్లగా పనుకునేది భయపడి. మేము ఒంటికి పోయను కూడా బయటకు పోకుండా  లబ్బరు బిందెలు ఇంట్లోనే పెట్టుకొని పిల్లోల్లను దాంట్లో ఒంటేలుకు పోయించేవాల్లము. మా దగ్గర కారప్పొడి డబ్బాలు, కట్లు  పెట్టు్టకున్నాము. ఆ రోజు మా పెద్దమ్మ కొసుకు దగ్గు దగ్గతా ఉంది. మేమందరం ఆ యమ్మని ఉప్పు సట్టిలో ఉండే ఉప్పురాళ్లను మింగమనేది, ఆయమ్మ ఉప్పంతా మింగి ఉప్పురోసి కి తనుకులాడేది. దగ్గినబుడల్లా నోటిలో గుడ్డ దురుపుకోమనేది శబ్దం కాకుండా. ఆయమ్మ అవస్థ చూసి మళ్ళీ నవ్వుకునేది.ముందయితే ఊర్లో ఎన్నో ఇండ్లకు తలుపులకు లోగెల్లులేవు. రాత్రి పూట రాకిండ్లు తలుపుకు ఆనించేవాళ్ళు. ఎబుడు  ఈ దొంగల రావిడి మొదలయ్యిందో అబుడు నుండి ప్రతి ఇంటికి లోగెల్లు తగిలించుకున్నారు. మగోళ్ళు కట్లు పట్టుకొని ఊరు సుటకారం గస్తీ తిరగతా ఉంటారు. వాళ్ళల్లో ఒక జుట్టు పోలిగాడు ఎవరికీ తెలియకుండా గుంపులోనుంచి పక్కకు పోయి ఇండ్ల మిండ రాళ్ళేసి మళ్ళీ వాడే గుంపులోకొచ్చి రాళ్లు ఆడ పడుతున్నాయి ఈడ పడుతున్నాయి అని అరుస్తాడు. దొంగలు ఆడ కొచ్చారు ఈడకొచ్చారు అని ఇంగా భయపెడతాడు. కాలం కాలం గడవగా మల్లి బయట పెడతారు ఇట్లా చేసినామని ... మగోళ్ళు రెయ్యి మేలుకొని పగలు నిద్రబోయ్యేవాళ్ళు. ఆ పద్దన్నే గుంపులు గుంపులుగా మాట్లాడుకునేది. నక్కలోడు దుడ్లు, పెండ్లాముసొమ్ములు ప్లాస్టిక్‌ కవర్లో పెట్టి గుంత తవ్వి గుంతలో పూడ్సి పెట్టినాడంట, పాసిన కొండమ్మ మూడేండ్ల నాటి మురగబెట్టిన కందులు, సద్దలు, అలసందులు గెరిసలోటివి  తీసి మూటలు కట్టి తలదిండులో పెట్టిందట, మన సామల బిత్తిరి రెయ్యంతా వాడ సందులో పొయ్యి పనుకునిందట, ద్యాపట్లనాగి సీమెండి కడియాలు, సిడతనబంగారు కమ్మలు, మెడగజ్జెలు ఒలుచుకొని మూటకట్టి సవరంలో పెట్టుకొని కొప్పెసుకునింది కనపడకుండా అని ఇట్లా రెయ్యింబగళ్లు ఎవరెట్లా బయపడినారని పనులకాడ   కతలు కతలు గా చెప్పుకుని నవ్వుకొనేది. 

ఈ మాదిరిగా ఉంటే ఆమరుసనాపొద్దు టౌనుకి పోదామని తెల్లారి బస్సెక్కితి. ఆ బస్సులో తొలగదబ్బను సందులేదు. పొరుగూరు వొగాయమ్మ నిలబడికొనే తూగతా ఉంది. డైవోరు బ్రేకేసే  కొందికి ఇసరకొచ్చి జనాల మింద బడే. అదరా బదరా కండక్టర్‌ లేసి ఎమ్మా ఈయాలకే తూగుతున్నావు అనే. ఏమిజేప్పేదన్న రెయ్యంతా  దొంగలరావిడి. రెయ్యి నిద్రలే, పగలు  తీరికలే అనే. నేను మాఊర్లోనే కాదు అన్ని ఊర్లల్లో ఇట్లే ఉందే అనుకుంటి. ఈ దొంగల రావిడి  సద్దుమణిగే దాకా మాకు ఈ తిప్పలు తప్పవు. అందుకే గచ్చుమల్లి చెప్పింది కూడా ఎనకా  ముందు ఆలోచన సెయ్యకుండా నమ్మాల్సి వచ్చింది.  అయినా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంటారు అట్లా మా దగ్గర ఏముంది కాకపోతే  పానబీతి అంతే!

అర్థాలు
గచ్చు –అబద్ధాలు / మెరుకు –వడ్లగింజ 
ఎల్నీద  – బయటకి రాలేక / వరసాపిని– అలవాటు 
తమర్లు – ఠి ఆకారం లో ఉండటం 
బొడుగు – సన్నగా 
ఓట్నోరు– దాసుకోకుండా బయట చెప్పేది 
ఆలి  – బలం / రావిడి –పోరు
పోవిడి – విచారణ 
వాడ – ధాన్యాలు నిల్వ బెట్టుకునే గెరిసె 
రాకిండ్లు –దంపుకునే రాకిండ్లు 
సిడతన – కాకిబంగారం / పాసిన – పిసినారి 
ఎండపల్లి భారతి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top