నవ్వు ముఖం

Funday horror story of the week - Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్‌’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’  అడిగాడు డాక్టర్‌ తరుణ్‌.

సైకియాట్రిస్ట్‌ ఎదురుగా కూర్చొని ఉంది అన్విత. ‘‘చెప్పండి’’ అన్నాడు సైకియాట్రిస్ట్‌ గట్టిగా గుండె లోపలికి గాలి పీల్చుకుని.అన్వితకు పాతికేళ్ల వరకు ఉంటాయి. పెళ్లి కాలేదు కాబట్టి పద్దెనిమిదేళ్ల అమ్మాయిలా ఉంది. ఆయన ఎందుకంత గాఢంగా గుండె లోపలికి గాలి పీల్చుకోవలసి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. బీపీ చెక్‌ చేసే డాక్టర్‌లా ఈ సైకియాట్రిస్ట్‌లు దేహం లోపలి విపత్తుల్ని, విలయాలను సంకేతపరిచే ఫీలింగ్స్‌ ఏవో అప్పుడప్పుడూ పెడుతుండటం గురించి ఆమెకు తెలుసు. ఇప్పుడీ సైకియాట్రిస్ట్‌ కూడా ఏ కారణమూ లేకుండానే అదే విధమైన ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చెయ్యడానికి గుండె లోపలికి గాలిని పీల్చుకొని ఉండి ఉండొచ్చని ఆమె అనుకుంది. ‘‘మీవన్నీ అనవసర భయాలు’’ అన్నాడు డాక్టర్‌ తరుణ్‌.ఆ నగరంలో పేరున్న సైకియాట్రిస్ట్‌ అతను. మనిషి డాక్టర్‌లా ఉండడు. దెయ్యాలు పట్టేవాడిలానో, దెయ్యాల పనిపట్టేవాడిలానో ఉంటాడు. కానీ నవ్వు ముఖం. దెయ్యాల భయం ఉన్నవారికి అతడిని చూస్తే మందు చీటీ రాయకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ‘దెయ్యాల్ని మించినవాyì  దగ్గరికే వచ్చాం’ అన్న దగ్గరి భావం ఏదో అతడి పట్ల కలుగుతుంది రోగికి. అయితే అలాంటి భావం అన్వితకు కలిగినట్లు లేదు. ‘‘ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అన్నాడు డాక్టర్‌ తరుణŠ . అతడికో అలవాటుంది. వచ్చినవాళ్లు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకోడానికి ముందే.. ‘మీవన్నీ అనవసర భయాలు, ముందసలు మిమ్మల్ని మీరు ఒక రోగి అనుకోవడం మానండి’’ అంటుంటాడు. ఇప్పుడు అన్వితతోనూ ఆ రెండు మాటలు అన్నాడు. 

అన్విత ఆశ్చర్యంగా చూసింది.‘‘నన్ను నేను రోగి అనుకోవడం లేదు డాక్టర్‌. భయపడుతున్నానంతే. ఆ భయమే రోగం అని మీరు అంటే కనుక.. ‘అప్పుడు.. ధైర్యం కూడా రోగమే అవ్వాలి కదా డాక్టర్‌’ అని నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి సంకోచించను’’ అంది అన్విత. ఆ మాటకు నివ్వెరపోబోయి ఆగాడు డాక్టర్‌ తరుణ్‌. ‘‘మీ లాజిక్‌ బాగుంది. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌ అయి ఉంటారని నాకు నమ్మబుద్ధేస్తోంది’’ అన్నాడు. ‘‘నమ్మబుద్ధి కావడం ఏంటి డాక్టర్‌?’’ అని ప్రశ్నించింది అన్విత విస్మయంగా. ‘‘నా ఉద్దేశం.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌నని నాతో చెప్పుకున్నారనీ, మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌లా నాకు అనిపించకపోయినప్పటికీ.. మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌ అని నాకు నమ్మబుద్ధేస్తోందని చెప్పడం కాదు మిస్‌ అన్వితా’’ అన్నాడు తరుణ్‌. ‘‘మరి!’’ అంది అన్విత.‘‘మీరు ఫిలాసఫీ స్టూడెంట్‌ అయి ఉండడం అన్న  నా ఫీలింగ్‌ని మీతో షేర్‌ చేసుకుంటున్నాను. అంతే.’’ ‘‘ఓకే.. డాక్టర్‌. నా సమస్య భయమూ కాదు, ధైర్యమూ కాదు. జస్ట్‌ సమస్య. ఆ సమస్యను నేను మానసిక ఆరోగ్యమనీ, మానసిక అనారోగ్యమనీ అనుకోవడం లేదు. దానర్థం చికిత్స కోసం నేను మీ దగ్గరకు రాలేదని కాదు. నేనూ మీతో కొన్ని ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అంది. చెప్పమన్నట్లు చూశాడు తరుణ్‌. ‘‘నాకు తెలిసిన వ్యక్తి ఒకరు నన్ను ఫాలో అవుతున్నారు డాక్టర్‌’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీ సమస్యేమిటీ?’’ అడిగాడు డాక్టర్‌ తరుణ్‌. అన్విత అందంగా ఉంటుంది. తెలిసిన వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులకు కూడా ఆమెను ఫాలో అవ్వాలని అనిపించడానికి అవకాశాలు లేకపోలేదు. ‘‘ఒకప్పుడు నేనతన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రేమించే స్థితిలో లేను. తను మాత్రం నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు’’‘‘చివరిసారి మిమ్మల్ని ఎప్పుడు ఫాలో అయ్యాడు?’’ అడిగాడు తరుణ్‌. ‘‘చివరిసారి, మొదటిసారి అనేం లేదు డాక్టర్‌. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా నన్ను ఫాలో అయ్యాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఫాలో అయి ఏం చేస్తాడు?’’‘‘నువ్వంటే ఇష్టం అంటాడు. నువ్వు లేందే బతకలేనంటాడు. నీతో పాటు వచ్చేస్తానంటాడు’’‘‘హెడ్డేక్‌గా తయారయ్యాడంటారు. అంతేనా?’’అన్నాడు తరుణ్‌. ‘‘లేదు లేదు. అలాంటిదేం లేదు’’ ‘‘మరేంటి’’? ‘‘మా నాన్న నాకు వేరే సంబంధం తెచ్చారు. మా ఇద్దరికీ ఉన్న ప్రేమబంధం గురించి చెప్పాను. ‘వాణ్ణి చంపేస్తాను’ అని పెద్దగా అరిచారు. ‘వద్దు నాన్నా.. నా ప్రేమను చంపుకుంటాను. అతన్ని చంపకు’ అని నాన్న కాళ్లు పట్టుకున్నాను.

నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ‘నా మాట విను. నీ జీవితం బాగుంటుంది’ అన్నాడు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న మాట వింటే నా జీవితం బాగుంటుందా, బాగుండదా అని నేను ఆలోచించలేదు. నాన్న మాట వినదలచుకున్నాను. నాన్న కోసం.. అతనిపై నాకున్న ప్రేమను చంపుకోడానికి నేను తయారైపోయాను కానీ, నాపై ఉన్న ప్రేమను చంపుకోడానికి అతను సిద్ధంగా ఉంటాడా అని ఆలోచించలేకపోయాను’’ అంది అన్విత. డాక్టర్‌ తరుణ్‌ మౌనంగా వింటున్నాడు. ఈ అమ్మాయి తన సమస్యను ఎక్కడికి తెచ్చి ఆపుతుందా అని అతడు ఎదురుచూస్తున్నాడు. ‘‘అతను నాకు సమస్య కాదు డాక్టర్‌. నేనే అతనికి సమస్యగా మారానేమోనని సందేహంగా ఉంది’’ అంది అన్విత.తరుణ్‌ నివ్వెరపోయాడు. మనసులోని విషయం గ్రహించినట్లే మాట్లాడింది అనుకున్నాడు. ‘‘అతన్ని చూడాలని అనిపించినప్పుడు అతనికి కనిపించకుండా దూరం నుంచి చూడొచ్చు. కానీ నేను అతన్ని చూస్తున్నప్పుడు అతను నన్ను చూడాలన్న కోరిక అతనికి నేను కంటపడేలా చేస్తోంది. ఆవెంటనే అతను నా వెంటపడుతున్నాడు’’ చెప్పింది అన్విత. ‘‘ఇందులో మీకొచ్చిన సమస్యేమీ కనిపించడం లేదు అన్వితా. అతను మిమ్మల్ని ఫాలో అవడం మీకూ సంతోషమే కదా. నిజానికి మీరే అతన్ని మీ వెంటపడేలా చేసుకుంటున్నారు’’ అని నవ్వాడు తరుణ్‌. ‘‘నా భయం కూడా అదే డాక్టర్‌. నా సంతోషం కోసం అతన్నేమైనా నేను దుఃఖంలో ముంచేస్తున్నానా అని. ఆ ఫీలింగ్‌ని షేర్‌ చేసుకోడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను’’ అంది అన్విత. ‘‘కానీ.. నాదొక సందేహం అన్వితా. మీ నాన్నతో అన్నారు కదా. అతనిపై మీకున్న ప్రేమను చంపుకుంటానని. మళ్లీ ఇదేమిటి?’’ అన్నాడు తరుణ్‌. ‘‘అవును డాక్టర్‌.అయితే ప్రేమను చంపుకోవడం కష్టమని నాకు తర్వాత తెలిసింది’’. ‘‘తర్వాత అంటే?’’‘‘ఆత్మలు మనుషుల మీద ప్రేమను చంపుకోలేక ఆ మనుషుల చుట్టూ తిరుగుతున్నట్లే.. ఆత్మలు కనిపించినప్పుడుమనుషులూ ఆత్మల మీద ప్రేమను చంపుకోలేక ఆ ఆత్మ చుట్టూ తిరుగుతారని నాకు తెలిశాక’’.. చెప్పింది అన్విత.డాక్టర్‌ తరుణ్‌ది నవ్వు ముఖం.అన్విత అలా చెప్పాక.. ముఖం మాత్రమే మిగిలింది. 
- మాధవ్‌ శింగరాజు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top