పండ్లు తింటే  ప్రమాదమా?

Funday health councling - Sakshi

సందేహం

గర్భిణీ స్త్రీలు తినాల్సిన పండ్ల గురించి తెలియజేయగలరు. ఏ పండ్లలో విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి? కొన్ని రకాల పండ్లు తినడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదమని నా ఫ్రెండ్‌ చెప్పింది. ఇది నిజమేనా? – బి. సుజాత, విజయనగరం.
ప్రెగ్నెన్సీ సమయం లో అన్ని రకాల పండ్లు తినవచ్చు. ఇందులో ముఖ్యంగా ఆపిల్, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, పుచ్చకాయ, కివి వంటివి అందరూ తీసుకోవచ్చు. అధిక బరువు ఉండేవాళ్లు, ఫ్యామిలీలో షుగర్‌ వ్యాధి ఉంటే కొంచెం తియ్యగా ఉండే అరటిపండు, సపోటా, మామిడి పండ్లు వంటివి తక్కువగా, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం మంచిది. వీరిలో ఇవి రోజువారిగా తీసుకోవడం వల్ల కొందరిలో బరువు ఎక్కువగా పెరగడం, ప్రెగ్నెన్సీలో షుగర్‌ వ్యాధి వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొందరు ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి పండు తినకూడదు, దాని వల్ల అబార్షన్‌ అవుతుంది అని అనుకుంటారు. ఇది అపోహ మటుకే! బాగా పండిన బొప్పాయి పండులో విటమిన్‌ సీ, ఈ, ఫోలిక్‌ యాసిడ్, పీచు వంటివి ఉంటాయి. దీనివల్ల మలబద్ధకం లేకుండా ఉంటుంది. కొంతమంది పైనాపిల్‌ తినకూడదనే అపోహలో ఉంటారు. పైనాపిల్‌లో ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్‌ సీ, బీ, మెగ్నీషియమ్, మ్యాంగనీస్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇది మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా తీసుకోవచ్చు. పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. పండ్లను బాగా కడిగిన తర్వాత తాజాగా తీసుకోవాలి. ముక్కలు కోసిన వెంటనే తినాలి.

నాకు అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తుంటాయి. ఫిట్స్‌ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చడం ప్రమాదమని ఒకరిద్దరు అన్నారు. ఒకరేమో గర్భం దాల్చిన తరువాత ఫిట్స్‌ తగ్గుతాయని అంటున్నారు. ఏది నిజం? నేను బిడ్డను కనవచ్చా?  – డి.శ్రీదేవి, రంగంపేట.
ఫిట్స్‌ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, మామూలు వాళ్ల కంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్‌ ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత కొంతమందిలో ఫిట్స్‌ మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో రాకపోవచ్చు. అది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్స్‌ని బట్టి మానసిక, శారీరక ఒత్తిడి, ఫిట్స్‌కు వాడే మందులు, వాటి మోతాదు, అవి శరీరంలో ఇమిడే దాన్ని బట్టి ఉంటుంది. ఫిట్స్‌కు వాడే మందుల వల్ల 4–6 శాతం వరకు పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా వెన్నుపూస, గుండె, గ్రహణం మొర్రి, చెయ్యి, కాళ్ల వేళ్లకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత, వికారం, వాంతులు వంటి ఇబ్బందుల వల్ల ఫిట్స్‌ మందులు శరీరంలోకి ఇమడకుండా బయటకు వచ్చెయ్యడం వల్ల కూడా ఫిట్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భం దాల్చిన తర్వాత తరచుగా ఫిట్స్‌ రావడం వల్ల, బిడ్డకు ఆ కొద్దిసేపు ఆక్సీజన్‌ సరఫరా లేకపోవడం, బిడ్డ మెదడుపై ప్రభావం చూపడం, బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు, బరువు ఎక్కువగా పెరిగిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం, బీపీ పెరగడం, మాయ విడిపోవడం, కాన్పు సమయంలో, తర్వాత రక్తస్రావం అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు గర్భం దాల్చక ముందే ఫిజీషియన్‌ డాక్టర్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో బిడ్డలో దుష్ప్రభావాలు అతి తక్కువగా కలిగించే ఫిట్స్‌ మందులను సరైన మోతాదులో వాడుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడుకోవాలి. గర్భం దాల్చిన తర్వాత, క్రమం తప్పకుండా చెకప్‌లు చెయ్యించుకుంటూ, మందులు సరిగా వాడుకోవాలి. మూడవ నెలలో ఎన్‌టీ స్కాన్, ఐదవ నెలలో ఒఫా స్కాన్, ఫీటల్‌ ఎకో స్కాన్‌ వంటివి చెయ్యించుకోవడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఏమైనా ఉంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా డాక్టర్‌ సలహాలు పాటిస్తూ ఉంటే 90 శాతంపైనే పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు. 

నేను ప్రెగ్నెంట్‌. పుట్టబోయే బిడ్డపై గ్రహణాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని విన్నాను. మొన్నటి చంద్రగ్రహణం ప్రభావం వల్ల కడుపులో బిడ్డకు చెడు జరిగే అవకాశం ఉందా? నేను ఉపవాసాలు చేస్తాను. ఈ సమయంలో చేయడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా? – పి.విశాలక్షి, సంగారెడ్డి.

గ్రహణాల వల్ల బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనేదానికి ఎటువంటి సైంటిఫిక్‌ ఆధారాలు లేవు. అది కేవలం అపోహ మటుకే! చంద్రగ్రహణంలో సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి, చంద్రుడిని మూసేస్తుంది. సూర్య గ్రహణంలో భూమికి , సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని కప్పేస్తుంది. దానివల్ల బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే మాటలకు అడ్డు చెప్పకుండా, ఆరోజు బయటకు వెళ్లకుండా, ఇంట్లో అందరితో కాలక్షేపం చెయ్యవచ్చు. అలా అని కదలకుండా బోర్లా పడుకునే ఉండాలి, ఏమీ తినకూడదు, తాగకూడదు, అనే నియమాలు ఏమీ లేవు. రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం చెయ్యడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి బిడ్డకి, తల్లికి బాగా ఇబ్బంది కలుగుతుంది. ఆరోజు నేరుగా కళ్లతో ఆకాశంలోకి చూడకుండా, బయట తిరగకుండా ఉంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం ఒకేసారిగా కాకుండా, కొద్దికొద్దిగా 3–4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. అలాంటిది రోజంతా ఉపవాసం ఉండి ఎప్పుడో రాత్రికి తినడం బిడ్డకి, తల్లికి మంచిది కాదు. తల్లిలో అసిడిటీ, అజీర్ణంతో పాటు షుగర్‌ లెవెల్స్, బీపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా సమయానికి పోషకాలు వెళ్లకపోవడం వల్ల బిడ్డకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఉపవాసాలు ఉండటం వల్ల దేవుడు కరుణించడు. మంచి మనసుతో, ఇతరుల మనసు నొప్పించకుండా ఉంటే మంచి కలుగుతుంది. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top