డ్రీమ్‌గర్ల్‌! 

Bollywood Heroin Nushrat Bharucha Dream Girl Interview - Sakshi

డ్రీమ్‌గర్ల్‌

‘హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలు చేయడం తప్ప హీరోయిన్‌ కాలేవు’లాంటి వెటకారాలను ఆమె సీరియస్‌గా తీసుకుందో లేదోగాని బాలీవుడ్‌లో పుష్కరకాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌లను రుచి చూసింది నుష్రత్‌ భరుచా. ‘ప్యార్‌ కా పంచ్‌నామా’, ‘ప్యార్‌ కా పంచ్‌నామా–2’ ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు భరుచాకు మంచి గుర్తింపు తెచ్చాయి. త్వరలో ‘డ్రీమ్‌గర్ల్‌’గా అలరించనున్న నుష్రత్‌ అంతరంగ తరంగాలు...

కిట్టీ పార్టీతో...
సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను సినిమాల్లోకి రావడం పేరెంట్స్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా చుట్టాలు పక్కాలలో ‘ప్రొఫెషన్‌’ అంటే ‘మెడిసిన్‌’, ‘ఇంజనీరింగ్‌’ తప్ప మరేదీ కాదు. వీటిలోనే జాబ్‌ సెక్యూరిటీ ఉంటుందనేది వారి నమ్మకం. యాక్టింగ్‌ అనేది ‘రియల్‌ ప్రొఫెషన్‌’ కాదు అని ఖరాఖండిగా చెప్పేవాళ్లు. ఇప్పటికీ ‘‘నేను సినిమాల్లో నటిస్తున్నాను’’ అని చెబితే జాలిగా చూసేవాళ్లు లేకపోలేదు. ఒకసారి టీవీ సీరియల్‌ ‘కిట్టీ పార్టీ’ ఆడిషన్‌కు వెళ్లాను. ఏదో వెళ్లానుగానీ...సెలెక్ట్‌ అవుతానని అనుకోలేదు. ‘మీరు సెలెక్ట్‌ అయ్యారు’ అంటూ వచ్చిన కాల్‌ నన్ను సంతోషంలో ముంచెత్తింది. అదృష్టమేమిటంటే కొద్దినెలల్లోనే బిగ్‌స్క్రీన్‌పై నటించే అవకాశం వచ్చింది. ‘కల్‌ కిస్నే దేఖా’ ‘జై సంతోషి మా’ (2006) సినిమాల్లో నటించాను. ఈ సినిమాలతో పెద్ద గుర్తింపు లభించలేదు. ‘డార్క్‌ లవ్‌ సెక్స్‌ ధోఖా’ సినిమాలో పరువుహత్య బాధితురాలిగా నటించాను. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. టీవిలో నటిస్తున్నప్పుడు ‘నటన’ అంటే ఆషామాషీ కాదని బాగా కష్టపడాలనే విషయం అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

అయినా సరే...
‘ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి’ అని ఎప్పుడూ మడి కట్టుకొని కూర్చోలేదు. ఒక పాత్రలో దమ్ము ఉంటే అది నెగెటివ్‌ క్యారెక్టర్‌ అయినా చేశాను. ‘ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తారు?’ అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చిందా? రాలేదా? అనే దానికంటే నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలనా లేదా? అనేది ఆలోచిస్తాను. ‘ప్యార్‌ కా పంచ్‌నామా’  సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ‘‘ఈ పాత్రను నేను చేయలేను.  ఇలాంటి అమ్మాయిలు నిజజీవితంలో ఉంటారని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘ఇదేమీ నిజజీవిత కథ కాదు... కామెడీ సినిమా చేస్తున్నాను. కామెడీ  సినిమాల్లో క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి... అంతేగాని అమ్మాయిలు ఇలా ఉంటారని చూపడం నా ఉద్దేశం కాదు’’ అని చెప్పాడు డైరెక్టర్‌. అలా ఆయన మాటలతో కన్విన్స్‌ అయి ఆ సినిమాలో నటించాను.

విధిరాత!
గతంలో వీళ్లు వాళ్లు అనేవారు...‘‘నువ్వు హీరోయిన్‌ మెటీరియల్‌ కాదు. నువ్వు ఫ్రెండ్‌ రోల్స్‌ మాత్రమే చేస్తుండాలి’’ బయటివాళ్లే కాదు. కుటుంబసభ్యులు కూడా ‘‘నీ కళ్లు చేప కళ్లు కాదు కాబట్టి నువ్వు హీరోయిన్‌ కాలేవు’’ అనేవాళ్లు. నేను మాత్రం సీరియస్‌గా తీసుకోకుండా తేలిగ్గా నవ్వేదాన్ని. కానీ విధిరాతను ఎవరు మార్చగలరు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top