మేలుకో! మేలుకో!

bhuvana chandra song special - Sakshi

పాటతత్వం  

భువనచంద్ర గీత రచయిత

చిత్రం: సంతానం (1955) 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
రచన: అనిసెట్టి 
గానం: ఘంటసాల

‘సంతానం చిత్రంలో, చిన్న పిల్లలు తప్పిపోయిన సన్నివేశంలో చిత్రీకరించిన ఈ పాట అంటే నాకు ప్రాణం.  కనుమూసినా కనిపించే నిజమిదేరా! ఇల లేదురా నీతి! ఇంతేనురా లోకరీతి!అంటూ మానవత్వాన్ని నిద్రలేపుతున్న పాట ఇది. ఈ మేలుకొలుపు పాటను నా చిన్నతనంలో మా అమ్మగారు నాకు నేర్పారు. ఇది పాడినప్పుడల్లా నాన్నగారు నన్ను మెచ్చుకునేవారు. మా నాన్నగారు గతించిన దుఃఖంలో నుంచి బయటపడేలా నన్ను ఓదార్చిన పాట. నా బాల్యంలో చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితి మాది. కష్టపడటం తెలిసినవాడు ఎన్నిసార్లు కిందపడ్డా లేస్తాడు.‘మానవులంతా నీతి నియమాలు లేకుండా జీవిస్తున్నారు. అది సరి కాదు. మానవులంతా జ్ఞానమార్గంలో పయనించాలి’ అంటూ ఉత్తేజపరిచే మేలుకొలుపు పాట ఇది.నిద్ర నుంచి జాగరూకతలోకి ఒక మేలుకొలుపు. నిద్ర అనే అజ్ఞానం, చీకటుల నుంచి మెలకువ అనే వెలుగు, జ్ఞానాలలోకి పయనించమని బోధించడమే ఈ పాట అనిపిస్తుంది నాకు. సుఖదుఃఖాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు. ఒకనాడు సుఖంగా ఉంటే, మరొకనాడు దుఃఖానికి లోనవుతాం. ఒకనాడు దుఃఖంగా ఉంటే మరొకనాడు సుఖసంతోషాలతో జీవిస్తాం. రెండు దుఃఖాల మధ్య వచ్చే సుఖం.. మనిషికి కావలసినంత సుఖాన్నిస్తుంది. రెండు సుఖాల మధ్య వచ్చే దుఃఖం... మనిషిని కుంగతీసేంత దుఃఖాన్నిస్తుంది. ‘కనుమూసినా కనిపించే నిజమిదేరా’ అంటూ ‘అనిసెట్టి’ చెప్పిన వేదాంతం ఇదే.కలకాలం ఈ కాళరాత్రి నిలువదోయి మేలుకో...అనే వాక్యంలో ఈ విషయాన్నే విశదపరిచారు రచయిత. ‘సుఖం వలన కలిగే సుఖం విలువ’ తెలియాలంటే దుఃఖాలు అనుభవించాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు పగలు, రాత్రి లాగ ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సమతుల్యత పాటించాలి.

ఉదయకాంతి... మదికి శాంతి...రాత్రి విరజిమ్మిన చిమ్మచీకట్లు, ఉదయం సూర్యుడు ఉదయించగానే మటుమాయమవుతాయి. జీవితంలో అందరికీ ఒక ‘మేలుకొలుపు’ కావాలి. మనం కులమతాల పేరు మీద దెబ్బలాడుకుంటున్నాం, ఎన్ని లక్షలమందో పుడుతున్నారు, ఎంతోమంది శరీరాన్ని వదులుతున్నారు. మనం ఈ లోకానికి అతిథిగా వచ్చాం, అలాగే వెళ్లిపోతాం. జీవితంలోని ఆశలు అనేవి మెరుపుల్లాంటివి.. చావు అనివార్యం. చిట్టచివరి క్షణంలో నా వాళ్లకి ఇంత ఇవ్వాలి అని ఆలోచించకుండా ఉండాలి.భ్రమలు గొలిపే మెరుపులేరా జగతిలో ఆశలు...మనమందరం ఇద్దరు తల్లుల ఒడిలో పెరుగుతాం. మొదటిది కన్నతల్లి కడుపులో. అందులో నుంచి బయటకు వచ్చాక ఇక లోపలకు Ðð ళ్లలేం. ఆ తరువాత మనం భూమి తల్లి ఒడిలో పడతాం. ఆ తల్లి ఒడిలో నడయాడుతాం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ భూమి తల్లి ఒడిలోనే. చివరగా ఆ తల్లి ఒడిలోకి వెళ్లాక ఇక బయటకు రాలేం. ఈ పాటలోని ఒక్కో అక్షరం ఆణిముత్యం. జీవిత సత్యం. ప్రతి ఒక్కరూ జీవితం గురించి అర్థం చేసుకోవాలని పలికే పాట ఇది.
– సంభాషణ: డా. వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top