ఔషధం కురిసే వేళ..

Ayurvedic Tips For Rainy Season - Sakshi

వానాకాలంలో వచ్చే జబ్బులకు ఆయుర్వేద చిట్కాలు

• కవర్‌ స్టోరీ
వానాకాలం వచ్చేసింది. మిగిలిన కాలాలతో పోలిస్తే వానాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఈ కాలంలో మరింతగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. మామూలు జలుబు, దగ్గులతో మొదలుకొని దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలోని చల్లదనం వల్ల దీర్ఘకాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కీళ్లనొప్పులు మరింతగా ఇబ్బందిపెడతాయి. వానాకాలంలో సహజంగానే అరుగుదల తక్కువగా ఉంటుంది. కడుపులో ఇబ్బందులు మొదలవుతాయి.

కాసేపు ఎండ, కాసేపు వాన.. కొన్నాళ్లు తెరిపి లేకుండా కురిసే వానలు.. వాతావరణంలో ఇలాంటి తేడాల వల్ల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంటి వద్దనే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో వచ్చే చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇంటిపట్టునే పాటించదగ్గ కొన్ని చిట్కాలు మీకోసం...

జలుబు, దగ్గులకు...
వానాకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టేవి జలుబు దగ్గులే. జలుబు మొదలైతే ఏ పని చేయాలన్నా తోచదు. ముక్కుదిబ్బడతో సరిగా ఊపిరాడదు. ఇక గొంతులో గరగర మొదలై దగ్గు కూడా పట్టుకుంటుంది. ఈ పరిస్థితి నుంచి తేలికగా ఉపశమనం పొందాలంటే...
జలుబు దగ్గుల నుంచి ఉపశమనానికి మిరియాల కషాయం చాలా ప్రశస్తమైన మార్గం. మిరియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే... మిరియాలను బాగా దంచుకుని పొడి చేసుకోవాలి. టీస్పూన్‌ మిరియాల పొడిని రెండుకప్పుల నీళ్లలో వేసి నీరు సగానికి సగం ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల తేనె కలుపుకొని, గోరువెచ్చగా అయిన తర్వాత మెల్ల మెల్లగా తాగాలి. మిరియాల కషాయం తీసుకోవడం వల్ల జలుబు దగ్గుల నుంచి తేలికగా ఉపశమనం లభిస్తుంది.
దాల్చినచెక్క పొడి, శొంఠిపొడి సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ పొడి మిశ్రమం ఒక టీస్పూన్‌ తీసుకుని, రెండు టీస్పూన్ల తేనెతో కలుపుకుని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
టీస్పూన్‌ నిమ్మరసంలో రెండు టీస్పూన్ల తేనె, పావు టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే జలుబు, ముక్కు దిబ్బడల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
పిప్పళ్లను, బెల్లాన్ని సమభాగాలుగా తీసుకోవాలి. పిప్పళ్లను పొడిగా తయారు చేసుకుని, అందులో బెల్లం కలిపి చిన్న చిన్న ఉసిరికాయల పరిమాణంలో ఉండల్లా తయారు చేసుకోవాలి. జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిని బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది.
అర టీ స్పూన్‌ కరక్కాయ పొడిని ఒక టీ స్పూన్‌ తేనెలో కలిపి తీసుకుంటే, దగ్గు నుంచి, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముక్కుదిబ్బడ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వేడినీట్లో కొన్ని చుక్కల నీలగిరి తైలాన్ని, చెంచాడు పసుపును వేసి, ఆ నీటి ఆవిరిని పట్టించడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. జలుబు దగ్గులకు తోడు తలనొప్పి కూడా ఉంటే, గుప్పెడు నీలగిరి ఆకులను ముద్దలా నూరి ఒక గుడ్డలో వాటిని మూటలా కట్టి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
తులసి రసం అర టీస్పూన్, అల్లం రసం అర టీస్పూన్‌ కలిపి ఒక టీస్పూన్‌ తేనెతో తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే రావి చిగుళ్ల రసాన్ని తేనెలో కలుపుకుని తీసుకున్నా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చర్మ సమస్యలకు
వానాకాలంలో వాతావరణం స్థిరంగా ఉండదు. కాసేపు ఎండ, కాసేపు వాన.. వాతావరణంలో పెరిగే తేమ.. చర్మం తీరులో నానా మార్పులకు దారితీస్తాయి. కొందరికి ముఖం జిడ్డుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకయితే ముఖంపై చర్మం కూడా మరింత పొడిబారిపోయి కాంతిహీనంగా తయారవుతుంది. సరైన చెప్పులు లేకుండా వాననీరు పారుతున్న నేలపై ఎక్కువకాలం నడవాల్సి వస్తే, కాలి వేళ్లు ఒరిసిపోయి ఇబ్బంది పెడతాయి. 
చర్మం జిడ్డుగా మారుతున్నట్లయితే, సబ్బుబదులు సున్నిపిండిని స్నానానికి వాడటం మంచిది. ఆయుర్వేద సున్నిపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసలు, మినుములు సమభాగాలుగా తీసుకుని పొడి మూకుడులో దోరగా వేయించుకోవాలి. బావంచాలు, గంధకచ్చూరాలు, నాలుగు పసుపుకొమ్ములు వీటికి జతచేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. వానాకాలంలో స్నానానికి ఈ పొడిని ఉపయోగంచడం క్షేమం.
తెరిపిలేని వానల వల్ల బయటి వాతావరణం మరీ చల్లగా ఉన్నట్లయితే, స్నానానికి గంట ముందు ఒంటికి ఆవనూనె పట్టించి, ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయడం మంచిది. ఇలా చేస్తే బయట ఎంత ముసురు పట్టినా, అంతలోనే ఎండ వచ్చినా చర్మం తాజాగా ఉంటుంది.
ముఖం జిడ్డుగా మారి, మొటిమలు వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నట్లయితే, గుప్పెడు వేపాకులు, నాలుగైదు పసుపుకొమ్ములు కలిపి నూరుకోవాలి. ఇలా నూరుకున్న ముద్దకు చెంచాడు నిమ్మరసం జోడించి, ఫేస్‌ప్యాక్‌లా ముఖానికి పట్టించుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని తేలికపాటి పొడి కాటన్‌ టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. 
వర్షాకాలంలో వీలైనంత వరకు సాక్స్‌ బిగించి, షూస్‌ ధరించకపోవడమే మంచిది. నీటి మడుగులను తలపించే రోడ్లపై నడవాల్సి వస్తే, షూస్‌లోకి నీరు చేరి, సాక్స్‌ పూర్తిగా తడిసిపోతాయి. దీనివల్ల పాదాల వేళ్లు ఒరిసిపోయి, ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వేళ్లు ఒరిసిపోయినట్లయితే, ఒరిసిపోయిన చోట వేపాకు, పసుపు ముద్దను పట్టించి, అరగంట తర్వాత పాదాలను గోరువెచ్చని నీట్లో కడిగి, పొడిగా ఆరనివ్వాలి. పాదాలకు గాలి ఆడే చెప్పులు ధరిస్తే వేళ్లు ఒరిసిపోయేంత పరిస్థితి రాదు.
ముఖం పొడిబారి కాంతిహీనంగా తయారవుతున్నట్లయితే, తాజా వేపాకులు, కలబంద ఆకులు ముద్దగా నూరుకుని ఫేస్‌ప్యాక్‌లా ముఖానికి పట్టించండి. ఆరగంట సేపు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి. దీనివల్ల ముఖంపై తేమ ఆరిపోకుండా ఉంటుంది.
బాగా వానలో తడిసిపోయే పరిస్థితులు ఎదురైతే, గోరువెచ్చని నీటితో సున్నిపిండి ఉపయోగించి స్నానం చేయండి. ఒంటిని జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

జుట్టు సమస్యలకు
వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం కొంచెం కష్టమే. తరచు తడిసే పరిస్థితులు ఉంటే తలకు చుండ్రు పట్టడం, జుట్టు బాగా రాలిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. జుట్టు బలహీనపడి, కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాపాడుకోవాలంటే వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్‌ తీసుకువెళ్లాల్సిందే. అయినప్పటికీ కొన్ని సమస్యలు తప్పవు. 
తలస్నానానికి రసాయనాలతో తయారైన షాంపూల బదులుగా కుంకుడుకాయలను వాడండి. తలస్నానానికి గంట ముందు భృంగామలక తైలంతో జుట్టు కుదుళ్లకు పట్టేలా నెమ్మదిగా మర్దన చేయాలి. స్నానం తర్వాత తలను బాగా తుడుచుకుని, పొడిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి.
జుట్టుకు చుండ్రు పట్టినట్లయితే తాజా వేపాకులు, మెంతులు, ఉసిరికాయలు మెత్తగా నూరుకుని, అందులో చెంచాడు నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారానికి కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తలస్నానం చేయాలి. చుండ్రు నివారణ కోసం తలస్నానానికి ముందు నువ్వులనూనెలో కొన్నిచుక్కల వేపనూనె కలిపి తలకు పట్టించుకోవాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేయాలి.
తలకు చుండ్రుపట్టి ఇబ్బందిగా ఉన్నట్లయితే, తలస్నానానికి గంట ముందు కాస్త పెరుగులో నిమ్మరసం పిండుకుని తలకు బాగా పట్టించాలి. తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి.
అనుకోకుండా వర్షంలో తడిసినట్లయితే, కేవలం జుట్టు తుడిచేసుకుని అక్కడితో వదిలేయకుండా, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. జుట్టు బాగా ఆరిన తర్వాత కొద్ది చుక్కల వేపనూనె కలిపిన నువ్వులనూనె లేదా ఆమ్లాతైలాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య దాదాపు దరిచేరదు. 
జుట్టు పొడిబారి రాలిపోతున్నట్లయితే, తలస్నానానికి అరగంట ముందు జుట్టుకు తాజా కలబంద గుజ్జును పట్టించండి. కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయండి. తలకు మామూలు నూనెల బదులు భృంగామలక తైలాన్ని వాడండి. జుట్టు దృఢంగా, కాంతివంతంగా తయారవుతుంది.
జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు వానాకాలంలో ఇబ్బందిపెడుతుంటే, వస కొమ్ములతో చక్కని పరిష్కారమార్గం ఉంది. వసకొమ్ములను రాత్రంతా నానబెట్టి, తర్వాత వాటిని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఒక టీస్పూన్‌ వస కొమ్ముల పొడిని కప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి.

జీర్ణ సమస్యలకు
వర్షాకాలంలో వాతావరణంలోని హెచ్చుతగ్గుల వల్ల జీర్ణప్రక్రియ కొంత మందగిస్తుంది. వర్షం కురుస్తుంటే చాలామంది జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేక వేడివేడి బజ్జీలు, పకోడీలు వంటివి ఎక్కడపడితే అక్కడ లాగించేస్తూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు మరింతగా ఇబ్బందిపెడతాయి. జీర్ణప్రక్రియను సజావుగా కాపాడుకుంటే, వర్షాకాలాన్ని ఆనందంగా ఆస్వాదించవచ్చు.
వర్షాకాలంలో వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడమే మేలు. విపరీతంగా మసాలాలు, ఎక్కువ నూనె వాడి తయారు చేసే వంటకాలకు దూరంగా ఉంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, ఉడికించిన గింజలు వంటివి తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు.
జీర్ణప్రక్రియ మందగించి, ఆకలి తగ్గిపోయినట్లయితే, భోజనం చేసేటప్పుడు అన్నంలోని మొదటి ముద్దలో నేతిలో దోరగా వేపిన చెంచాడు వాముగింజలను కలుపుకుని తినండి. వానాకాలంలో దొరికే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకోండి.
శొంఠి, మిరియాలు, పిప్పళ్లు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోండి. ఈ పొడిని ఒక టీస్పూన్‌ తీసుకుని, అందులో అంతే పరిమాణంలో బెల్లం, నెయ్యి కలుపుకుని మధ్యాహ్న భోజనంలో మొదటి ముద్దను తీసుకోండి. రాత్రివేళ భోజనం తర్వాత త్రిఫలా చూర్ణం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి. దీనివల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.
కడుపు ఉబ్బరం ఇబ్బంది పెడుతున్నట్లయితే, పలచని మజ్జిగలో తగినంత ఉప్పు, టీ స్పూన్‌ మెంతిపొడి కలిపి తీసుకున్నట్లయితే ఉపశమనంగా ఉంటుంది. అల్లం కషాయం తీసుకున్నా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆకలి మందగించి కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్లలో ఈ పొడిని కలుపుకొని సేవిస్తే ఉపశమనంగా ఉంటుంది.
రాత్రి నీట్లో నానబెట్టిన ఖర్జూరాలు లేదా ఎండుద్రాక్షలను ఉదయాన్నే అల్పాహారానికి ముందు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనానికి ముందు అరగ్లాసు పుదీనారసంలో, చెంచాడు అల్లం రసం కలిపి తాగితే జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఆకలి మందగించినట్లయితే పసుపు, శొంఠిపొడి, ఉప్పు, నెయ్యి అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తిన్నట్లయితే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఒంటి కీళ్ల నొప్పులకు
దీర్ఘకాలంగా కీళ్లనొప్పులతో బాధపడేవారికి వానాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉండేవారిని సైతం ఈ కాలంలో సర్వసామాన్యంగా వచ్చే జలుబు దగ్గులు జ్వరాలతో పాటు ఒంటినొప్పులు బాధిస్తాయి. వయసు మళ్లినవారికైతే ఈ నొప్పులు మరింతగా బాధిస్తాయి. 
మార్నింగ్‌ వాక్‌ అలవాటున్న వారు బయట వర్షం కురుస్తున్నప్పుడు వాక్‌కు బ్రేక్‌ చెప్పేస్తారు. దీనివల్ల కీళ్లు పట్టేసినట్లవుతాయి. ఉదయపు నడక సాగనప్పుడు ఇంటి పట్టునే వ్యాయామాలు, యోగా వంటివి చేయడం ద్వారా కీళ్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
వానాకాలంలో ఒంటినొప్పులు బాధిస్తున్నట్లయితే అశ్వగంధ, తానికాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని, ఆ చూర్ణాల మిశ్రమంలో అంతే పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుముఖం పడతాయి.
శొంఠి, మిరియాలను సమభాగాలుగా తీసుకుని, వాటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక టీ స్పూన్‌ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
అశ్వగంధ వేరును మెత్తగా పొడిలా తయారు చేసుకుని, కప్పు నీరు లేదా కప్పు పాలలో వేసి అవి సగానికి సగం ఇగిరేలా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ రెండుపూటలా తీసుకున్నట్లయితే నడుం నొప్పి, వెన్నునొప్పి తగ్గుతాయి.
ఇంగువ, పసుపు ఒక్కో టీస్పూన్‌ చొప్పున తీసుకుని, బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మిశ్రమంగా మారిన ఈ పొడిని కాగితంలో వేసి కాల్చి, ఆ వాసనను పీలిస్తే వానాకాలంలో వేధించే పార్శ్వపు తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పావులీటరు నీటిలో గుప్పెడు పారిజాతం ఆకులను వేసి, ఆ నీటిని సన్నటి మంటపై మరిగించాలి. సగానికి సగం ఇగిరిపోయేలా నీరు బాగా మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టుకుని, ఆ నీటిలో అర టీస్పూన్‌ శొంఠిపొడి, ఒక టీస్పూన్‌ పటికబెల్లం కలిపి రోజూ తాగుతున్నట్లయితే నడుంనొప్పి, వెన్నునొప్పి, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
మునగాకులను, నీలగిరి ఆకులను సమభాగాలుగా తీసుకుని ఒక కప్పు ఆముదంలో మగ్గించి, ఆ మిశ్రమంతో నొప్పులు ఉన్న చోట కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top