భర్తలూ చిన్న పిల్లలే!

Is your husband a kid too - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పసి పిల్లలు తమ తల్లులను చాలా ఒత్తిడికి గురి చేయడం చూస్తూనే ఉంటాము. అయితే భర్తలు కూడా అదే స్థాయిలో తమను ఒత్తిడికి గురి చేస్తున్నారని గృహిణులు అభిప్రాయపడుతున్నారు. కర్తవ్య నిర్వహణలో కూడా మహిళలు ముందుండి వారిని ప్రోత్సాహించాల్సి వస్తోందని టుడే.కామ్‌ అనే వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఏమిటా సర్వే..?
మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తు‍న్న అంశాలేమిటి అని 7000 మందికి పైగా తల్లులను ఆ వెబ్‌సైట్‌ ప్రశ్నించింది. ఇంట్లో ఉ‍న్న పలు పనులను భర్తతో పంచుకోవడం ఎలా ఉందని అడిగారు. అలాగే ఇంటి పనులు, పిల్లల పెంపకం, భర్తను చూసుకోవడం ఎలా ఉందంటూ పలు కోణాల్లో ప్రశ్నలను అడిగారు. 

కనుక్కున్నదేమిటంటే..... !
ఈ ప్రశ్నలకు గృహిణులు ఇచ్చిన సమాధానాలు షాకింగ్‌గా ఉన్నాయి. తమ పిల్లల కంటే భర్తలే ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తున్నారని 46 శాతం మంది తల్లులు చెప్పారు. పిల్లలకు చేసినట్లే చాలా పనులు భర్తకూ చేయాల్సి వస్తోందని వాపోయారు. అత్యధిక ఒత్తిడిని (10 పాయింట్లలో 8.5 పాయింట్లు) తల్లులు అనుభవిస్తున్నారని ఈ సర్వేలో బయటపడింది. 

తల్లులు ఎందుకిలా భావిస్తు‍న్నారు..?
సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు పిల్లలను చూసుకోవడంతో పాటు ఇంటి పనంతా తామే చేయాల్సిరావడం వల్ల ఇలా భావించామన్నారు. ప్రతీ అయిదుగురిలో ఒకరు తమ భర్త ఇంటి పనుల్లో చిన్న సహాయం కూడా చేయట్లేదని అన్నారు. ఇది మాత్రమే గాక పనుల్లో చిన్న ఆలస్యమైనా కోప్పడుతున్నారని బాధపడ్డారు. 

ఇప్పుడేం చేయాలి..?
ఒకవేళ మీ భర్త చిన్న చిన్న పనులకే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాడని అనిపిస్తే వెంటనే ఈ విషయాన్ని సావధానంగా అతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఒత్తిడి ఎక్కువైతే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానితో పాటు పిల్లల పెంపకం మీదా, వారి చదువుల మీదా, ఇంటి పనుల మీద అది ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి భర్తలే ముందడుగు వేసి రోజువారి పనులను సమానంగా పంచుకోవడానికి ప్రయత్నించాలి. భర్త అంటే భరించేవాడు అన్న విషయాన్ని పురుషులు గుర్తుంచుకోవాలి. 

ఈ ఆధునిక యుగంలో కూడా మహిళలను వంటింటికే పరిమితం చేయాలనుకోవడం సరైనది కాదు. భాగస్వామి చేయాల్సిన పనులన్నింటినీ చేయకపోయినా కొద్దిగ తోడ్పాటును వారికి అందిస్తే మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top