స్వచ్ఛ భారతీయం

స్వచ్ఛ భారతీయం


‘పరిసరాల పరిశుభ్రత’పై క్లాస్ రూముల్లో చదువుకోవడమే కాదు... దాన్ని ఆచరించి చూపుతున్నారు జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ విద్యార్థులు. పనిలో పనిగా ‘వేస్ట్ మేనేజ్‌మెంటూ’ ఎంచక్కా చేసేస్తున్నారు. రోజూ పాఠశాల పరిసరాల్లోని చెత్తను శుభ్రం చేసి ‘స్వచ్ఛ భారత్’కు బాటలు వేస్తూనే... అదే చెత్తను పోగేసి.. సేంద్రియ ఎరువుగా మార్చి సేద్యం చేస్తున్నారు.

 

 ‘పచ్చదనం... పరిశుభ్రత’... భారతీయ విద్యాభవన్‌లోకి అడుగు పెట్టగానే  ఆహ్లాదకర దృశ్యం కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. స్కూల్ నుంచి చెత్తనేదే బయటకు వెళ్లదు. రెండు వేల మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నా... రోజుకు దాదాపు 20 కిలోల చెత్త వస్తున్నా... ఎక్కడా అపరిశభ్రత కనిపించదు. ఈ చెత్తంతా ఎటు పోతుంది..! సేకరించి... కిచెన్, గార్డెనెంగ్, ప్లాస్టిక్, ఈ వేస్ట్‌గా విభజించి కంపోస్ట్, రీసైక్లింగ్ చేస్తున్నారు. బడిలోనే కాదు.. ఎల్‌కేజీ బుడతడి నుంచి ఇంట్లో కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు విద్యార్థులు.

 

బయోగ్యాస్ ఉత్పత్తి...

 పోగుచేసే చెత్తద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసి హాస్టల్‌లో వంటకు ఉపయోగించారు. ఉత్పత్తి సామరా్థ్యాన్ని పెంచాలని ఆవుని కొనుగోలు చేశారు. దాని ద్వారా వచ్చే పేడతో బయోగ్యాస్ తీశారు. ప్రస్తుతం ఈ ఆవుల సంఖ్యకు ఐదుకు పెరగడమే గాక గ్యాస్‌స్థాయీ రెట్టింపయ్యింది.

 - మహి

 

 కంపోస్ట్ ఇలా...

 -    కంపోస్ట్ తయారీకి ఆగా బిన్‌లను ఎంచుకున్నారు. వీటి వాడకం     వల్ల వ్యర్థాల నుంచి దుర్వాసన రాదు.

-     వెదర్ ప్రూఫ్. ఇరవైయ్యేళ్ల వరకు ఇవి మన్నికగా ఉంటాయి. ఒక్కో బిన్‌లో 300 కిలోల చెత్త పడుతుంది.

-     వీటిల్లో కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు వేస్తారు.

  -   ఈ బిన్స్‌లో వేసిన కిచెన్ వేస్ట్‌కు కోకోపీట్ కలుపుతారు.

 -    ఉష్ణోగ్రత పెంచేందుకు వీలుగా ఐదు రోజులకోసారి యాగ్జిలేటర్‌ను కలుపుతారు.

 -    బిన్ నిండాక 15 రోజుల్లో వేస్టంతా కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది.

- దీన్ని బిన్ నుంచి తీసి మొక్కలకు సేంద్రీయ ఎరువుగా వాడుతున్నారు.

-     ఇవిగాక డిస్పోజబుల్ గ్లాస్‌లు, టీ కప్స్, పాలిథిన్ కవర్లను నెలకోసారి రీసైక్లింగ్ చేస్తారు.

 

 మనందరి కర్తవ్యం...

 పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. అందువల్లే స్కూల్‌లో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి స్చచ్ఛ భారత్ ఉద్యమం తోడైంది. విద్యార్థులందరూ దీనిపై అవగాహన పెంచుకుని ఆచరిస్తుండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. 100 శాతం వే స్ట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాం.

 - రమాదేవి, ప్రిన్సిపాల్

 

 ప్రకృతికి మేలు...

 వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రకృతికి మేలు చే సినవాళ్లమవుతాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ, స్కూల్ యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా ఆచరించాలి. అప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ ఆవిష్కృతమవుతుంది.

 - అరుణ శేఖర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌‌స ఆర్గనైజర్

 

 మా వంతు సహకారం...


 స్కూల్‌లో చెత్త సేకరించి పరిశుభ్రంగా చేయడం మా బాధ్యత. చెత్తతో కంపోస్ట్ చేసి ఇక్కడ పెంచుతున్న మొక్కలకు వాడుతూ సమాజ పరిశుభ్రత కు మా వంతు తోడ్పాటు అందిస్తున్నాం.

 - విశిష్ట, విద్యార్థిని

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top