స్ట్రీట్ ప్లేస్ | Street Place | Sakshi
Sakshi News home page

స్ట్రీట్ ప్లేస్

Mar 23 2015 10:11 PM | Updated on Sep 2 2017 11:16 PM

స్ట్రీట్ ప్లేస్

స్ట్రీట్ ప్లేస్

యోగా, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌తో నగరవాసులకు కావాల్సినంత ఫన్‌ని అందిస్తున్న రాహ్‌గిరి..

యోగా, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌తో నగరవాసులకు కావాల్సినంత ఫన్‌ని అందిస్తున్న రాహ్‌గిరి.. మరో కొత్త థీమ్‌తో రోడ్డెక్కింది. ఆటపాటలతోనే సరిపెట్టక... మార్చి 8న మహిళల పట్ల బాధ్యతను తెలియజెప్పిన రాహ్‌గిరి.. ఇప్పుడు నుక్కడ్ నాటక్ (వీధి నాటకం)కి వేదికైంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సోషల్ మెసేజ్‌నీ పాస్ చేస్తోంది!. నాటకం ఏదైనా వేయండి... ప్రజలను ఆలోచింపజేయాలి. ఆసక్తికరంగానూ ఉండాలి. ప్రదర్శించడం మీకు ఇష్టమైతే... రాహ్‌గిరి వేదిక సిద్ధంగా ఉంది.  
 ..:: కట్ట కవిత

వీధి నాటకాలు... లైవ్ మీడియా. ఎవర్‌గ్రీన్ కూడా. టీవీ, సినిమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్నెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది... ఇంకా వీధి నాటకాలనెవరు చూస్తారు? ఇది చాలా మంది సందేహం. ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. వాటికి తాను వేదికవుతానంటోంది ‘రాహ్‌గిరి’. ఇటీవలే మంథన్ సొసైటీ.. పిల్లలతో పులులను కాపాడాలంటూ సందేశమిచ్చింది. ఈ వారం కొత్తగా...  కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘బేటీ బచావో, బేటీ పడావో’ స్ఫూర్తితో ‘బేటీ హై తో కల్ హై’ వీధి నాటకాన్ని ప్రదర్శించాయి మంథన్ అండ్ లివ్ లైఫ్ ఫౌండేషన్స్. ‘మంథన్’ నుక్కడ్ నాటక్ సొసైటీ... సామాజిక సమస్యలపై మరిన్ని నాటకాస్త్రాలను సంధించడానికి సిద్ధమవుతోంది.

అసలు సత్యం...

వీధి నాటకాలు వేయడానికి థియేటర్స్ అక్కర్లేదు. వీధులు, షాపింగ్ మాల్స్, పార్కులు ప్లేస్ ఏదైనా కావచ్చు. చాలా సింపుల్ కాస్ట్యూమ్స్‌తో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో అందరినీ ఆక ట్టుకోవడమే కాదు... ఆలోచింపజేసేలా ప్రదర్శన ఇవ్వడం కష్టంతో కూడుకున్న పని. దాన్ని సవాల్‌గా తీసుకుని ఆర్టిస్టులకు, ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నాయివి. లింగ వివక్షని ఎత్తి చూపుతూనే పొగ తాగకూడదని చెబుతున్నాయి. వరకట్నం పెనుభూతమని, భ్రూణహత్యలు పాపమని, లంచగొండితనం నేరమనే చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.
 
ప్రవృత్తిగా

అయితే ఈ నాటకాలని ప్రొఫెషనల్ ఆర్టిస్టులే వేయడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు.. వివిధ రంగాల్లో ఉన్నవారు ప్రవృత్తిగా వీటిని ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీ ప్రొఫెషనల్ అనిరుధ్. ‘చుట్టూ ఉన్నవాళ్లు మావైపు చూసేందుకు గట్టిగా అరుస్తాం. నాటకాల్లో ఇది మొదటిఅంశం. దీనికోసం ఎనర్జీతోపాటు ఏకాగ్రత కూడా అవసరం. సినిమాల్లో లాగా రీ టేకులు ఉండవు. ఒకే షాట్‌లో ఓకే అయిపోవాలి. దీనికోసం ఎంతో రిహార్సల్స్ చేస్తాం. మైక్, స్టేజ్ లాంటి లగ్జరీస్ ఏమీ ఉండవు. ప్రేక్షకుల కళ్లముందే ప్రదర్శించాలి. వాళ్లను మెప్పించాలంటే ఎంతో హాస్యం వచ్చి ఉండాలి. చున్ని, టవల్స్ వంటి చిన్నచిన్న ప్రాపర్టీస్‌తో ప్రేక్షకులను నవ్వించాలి. ఈ వీధి నాటకాలకు సంగీతం, డ్యాన్స్ వంటివి కూడా జోడించవచ్చు’ అని చెబుతున్నాడాయన.

అంశమేదైనా... వేదిక మాది...

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సుసంపన్నం చేసిన వాటిలో వీధి నాటకం కూడా ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఉన్న వీధినాటకాలను పునర్జీవింపచేయడానికి, వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడానికి రాహ్‌గిరి కచ్చితంగా సహకరిస్తుంది అంటున్నారు ‘రాహ్‌గిరి’ ప్రతినిధి విశాలరెడ్డి. సామాజిక, రాజకీయ సమస్యేదైనా... వ్యంగ్యంగా, నవ్వులు కురిపిస్తూ ఉత్సాహంగా సాగే ఈ వీధి నాటకాలు కచ్చితంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని చెబుతున్నారు ఎంబార్క్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్
 ప్రశాంత్ బచ్.
 
సమ్‌థింగ్ స్పెషల్


రంగులు, లైటింగ్, మేకప్, ఒక స్టేజీ, కళాకారులు, రిహార్సల్స్.. ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ఇంత సరంజామా కావాలి. పైగా ఏదైనా నాటకాన్ని చూడాలనుకుంటే.. అది ప్రదర్శించే చోటకు వెళ్లాలి. అందరూ అలా వెళ్లలేరు. కాబట్టి వాటి ద్వారా చెప్పదల్చుకున్నది జనంలోకి వెళ్లదు. కానీ, రాహ్‌గిరి వేదిక అందుకు భిన్నం. విద్యార్థులు, ఉద్యోగులు అప్పటికప్పుడు కళాకారులుగా మారిపోతారు. ఇతివృత్తాన్ని అర్థం చేసుకుని తమదైన ‘పాత్ర’ పోషిస్తారు. తాము చెప్పదల్చుకున్నది అందరి మధ్య, ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా చెబుతారు.  తద్వారా అందరికీ సులభంగా సందేశం చేరుతుంది. ఇకపై ప్రతి వారం సామాజిక సమస్యలు ప్రధానాంశంగా స్ట్రీట్ ప్లేస్ ప్రదర్శిస్తామని రాహ్‌గిరి ప్రతినిధులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement