గోప్స్..c/o కబుర్స్ - గాసిప్స్
ఈ సంభాషణలేవీ ఒకదానికొకటి పొంతన లేనట్లనిపిస్తోంది కదూ! సంభాషణలు పలికిన పాత్రలన్నీ అపరిచితంగా కనిపిస్తున్నాయి కదూ!...
	క్యాంపస్ కహానీ: ఈ సంభాషణలేవీ ఒకదానికొకటి పొంతన లేనట్లనిపిస్తోంది కదూ! సంభాషణలు పలికిన పాత్రలన్నీ అపరిచితంగా కనిపిస్తున్నాయి కదూ!... అలానే అనిపిస్తుంది. ఎందుకంటే, ఇవేవీ నాటకంలోని సంభాషణలు కావు. పలికిన వారు పాత్రధారులూ కారు. వారంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. తరగతులు ముగిశాక క్యాంపస్‌లోని ‘గోప్స్’ వద్ద కాలక్షేపం చేస్తారు. చాయ్, కాఫీ, బిస్కట్, సమోసా వగైరాలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. విద్యార్థులంతా ఒకచోట గుమిగూడాక ఇక చెప్పేదేముంటుంది? అంతా సందడే సందడి. వారి మాటల్లో అన్ని విషయాలూ దొర్లుతాయి. ‘గోప్స్’ అంటే చెప్పనేలేదు కదూ! సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చాలాకాలంగా నడుస్తున్న గోపాలరావు షాపునే ఇక్కడి స్టూడెంట్స్ ముద్దుగా ‘గోప్స్’ అని పిలుచుకుంటారు. ‘గోప్స్’లో చాయ్ బడ్డీ, బేకరీ, జ్యూస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కిరాణా దుకాణం ఉన్నాయి. ఇదే సెంట్రల్ వర్సిటీ స్టూడెంట్స్ అందరికీ అడ్డా.
	 జిలుకర రాజు, సెంట్రల్ వర్సిటీ
	 
	  తమిళనాడు గవర్నమెంట్ స్టూడెంట్స్‌కు లాప్‌టాప్‌లు ఇస్తుంటే, ఇక్కడ డెస్క్‌టాప్‌లు ఇచ్చే దిక్కులేదు.
	  రీసెర్‌చ హాస్టల్‌లో ఫుడ్ చెత్తగా ఉందిరా అశోక్.. నిన్న సూపర్‌వైజర్‌కీ నాకు పెద్దగొడవరా బాబు!
	 స్నేహితులు పరిచయమయ్యేది ఇక్కడే. సెంట్రల్ వర్సిటీలో ఏ పరిచయాలైనా ఎక్కువగా ‘గోప్స్’లోనే ఏర్పడతాయి.
	 - స్వాతి, ఇంటిగ్రేటెడ్ ఎంఏ
	 
	 సీనియర్‌స తమ అనుభవాలను చెబుతుంటారు. ఏయే పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు ఎలా సిద్ధపడాలో సూచనలిస్తారు. రాజకీయాలు, ధరల పెరుగుదల వంటి విషయాలపై కూడా ఇక్కడ చర్చించుకుంటుంటాం.
	 -గురజాడ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ
	 
	 
వివిధ విభాగాల అమ్మాయిలమంతా ఒకేచోట చేరి చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం. ఆలోచనలు పంచుకోవడానికి ఈ ‘గోప్సే’ మా అడ్డా.
	 -శిరీష, ఇంటిగ్రేటెడ్ ఎంఏ
	 
	 పాగల్‌గాని లెక్క  మాట్లాడకు. ఆమె నిన్ను  ఇష్టపడుతోంది రా...
	 ....
	 ఏమోరా నాకైతే  ఏమీ సమజైతలేదు.
	 స్కార్‌ఫ కట్టుకుని మా గైడ్ సార్ పక్కనే నిలబడ్డా.. నన్ను గుర్తుపట్టలే తెలుసా!
	 ....
	 ఆయన మనల్ని మామూలుగానే గుర్తుపట్టడు.. స్కార్‌ఫ కట్టుకుంటే ఏం గుర్తుపడతాడు!
	 
	 నాలుగు సమోసాలు, మూడు ఎగ్‌పఫ్‌లు, పది చాయ్‌లు చెప్పు కాకా!....
	 మీదేం పోతుందిరా భయ్!...   నా జేబుకే చిల్లు.
	 ‘నెట్’ ఎగ్జామ్‌ని ఆబ్జెక్టివ్ చేసి ఆగం చేశారు.
	 ...... ఏమీ ప్రిపేర్ కాకుండా రాసే మాలాంటి వాళ్లకు ఇలాంటి పద్ధతే బాగుంటుంది.
	 అధికారంలోకి ఎవరొచ్చినా ఏంజేస్తరు... నిరుద్యోగం మాత్రం పెరుగుతూ పోతుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
