
సాక్షి,న్యూఢిల్లీ: పొగతాగే అలవాటుకు పొగపెట్టేందుకు జపాన్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీ వినూత్న ఒరవడిని అనుసరించింది. తమ సంస్థలో పొగతాగని ఉద్యోగులకు ఏడాదిలో అదనంగా ఆరు రోజుల హాలిడేను ప్రకటించింది. పొగరాయుళ్లలాగా సిగరెట్ తాగేందుకు తరచూ బ్రేకులు తీసుకోకుండా బుద్ధిగా పనిచేసుకునే వారికి ఈ నజరానా ప్రకటించింది. పొగతాగే కొలీగ్‌ల కంటే తాము అధికం సమయం పనిచేస్తున్నామని నాన్ స్మోకర్లు ఫిర్యాదు చేయడంతో వారికి వేతనంతో కూడిన అదనపు సెలవును పియాలా ఇంక్ అనే మార్కెటింగ్ కంపెనీ ప్రకటించింది. పొగతాగే అలవాటును మానివేసేందుకు తాము ప్రకటించిన ఇన్సెంటివ్ ఉపకరిస్తుందని కంపెనీ సీఈవో ఆశాభావం వ్యక్తం చేశారు.
పొగతాగే అలవాటును మాన్పించేందుకు, పొగతాగేవారికి వ్యతిరేకంగా కఠిన నిబంధనలను జపాన్ ఇటీవల ప్రవేశపెట్టింది. 2020 వేసవి ఒలింపిక్‌ల నేపథ్యంలో జపాన్ నగరాలను స్మోక్ ఫ్రీ సిటీస్‌గా మార్చాలని అధికార యంత్రాగం భావిస్తోంది. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఈ దిశగా ఇటీవల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.