బ్రెస్ట్‌ కేన్సర్‌తో హార్ట్‌ ఫెయిల్యూర్‌

World Cancer Day Special Story - Sakshi

కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మహమ్మారి

రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల విజృంభణ

దేశంలోనే హైదరాబాద్‌లో గొంతు, దంత కేన్సర్లు అధికం   

నేడు ప్రపంచ కేన్సర్‌ డే  

సాక్షి, సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్లతోను, పట్టణ మహిళలు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్‌ మసాలాలు అధికంగా వాడడంతో పురుషులు స్టమక్, నెక్‌ అండ్‌ మౌత్‌ కేన్సర్ల బారిన పడుతున్నట్టు ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో నమోదైన కేసులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. నేడు ‘ప్రపంచ కేన్సర్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో ఎంతో మంది చిన్నతనంలోనే పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. అతిగా మద్యం తాగడం, ధూమపానం, గుట్కా, పాన్‌ మసాలాలు అధికంగా వాడటంతో పురుషులు స్టమక్, నెక్‌ అండ్‌ మౌత్‌ కేన్సర్ల బారిన పడుతుండగా,  వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భాశయముఖ ద్వార కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎక్కువగా రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో 2017లో కొత్తగా నమోదైన కేన్సర్‌ కేసులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. ఆ ఏడాది మొత్తం 1,1000 కేన్సర్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 2200 లుకేమియా, 1800 స్టమక్, 1600 హెడ్‌ అండ్‌ నెక్,  1500 గర్భాశయ ముఖ ద్వారం, 1000 రొమ్ము, 800 ఎముక సంబంధ, 500 కాలేయం, 220 బ్రెయిన్, 100 కిడ్నీ సంబంధ కేన్సర్లు నమోదయ్యాయి.

ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం..
గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద కేన్సర్‌ చికిత్సల సమాచారాన్ని పరిశీలిస్తే 49 శాతం మహిళలు దీని బారిన పడగా, ఇందులో రొమ్ము కేన్సర్‌ చికిత్సలు 18.70 శాతం. గర్భాశయ ముఖద్వార చికిత్సలు 30.25 శాతం ఉండడం గమనార్హం. రొమ్ము కేన్సర్‌లో హైదరాబాద్‌ 7,528 కేసులతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా గర్భాశయముఖ ద్వార కేన్సర్‌లో వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 10064 చికిత్సలు జరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నది నిరుపేదలే.  

‘లక్షణం’గా గుర్తించుదాం..నివారించుదాం
కేన్సర్‌పై పోరాటంలో తొలి అడుగు దానిని గుర్తించడం. అలా జరగాలంటే దాని లక్షణాలపై మనకు సరైన అవగాహన అత్యవసరం. ముందస్తుగా దీనిపై అవగాహన పెంచుకోవాలి అంటున్నారు అపోలో క్లినిక్స్‌కు చెందిన రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ పి.విజయ్‌ కరణ్‌రెడ్డి.  
అప్పుడప్పుడూ దగ్గు వచ్చి తగ్గడం సహజమే. 3 వారాలు అంతకు మించి ఏకధాటిగా దగ్గు ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించి ఓ ప్రధాన లక్షణం. అన్ని దగ్గులూ కేన్సర్‌కి దారి తీస్తాయని చెప్పలేం గానీ,  ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌ ద్వారా పరీక్షలు చేయించుకోవడం మంచిది.  
పేగుల కదలికలు సులభంగా ఉండకపోవడం, తరచూ డయేరియా, మలబద్ధకం వంటివి జీర్ణాశయ కేన్సర్‌ లక్షణాలుగా సందేహించవచ్చు. చాలా రోజుల పాటు ఆకలి వేయకపోవడం, లేదా కడుపు నిండుగా ఉన్నట్టు ఉండడం వంటి లక్షణాలు కూడా జీర్ణకోశ అన్నవాహిక సమస్యలకు కారణం కావచ్చు. ఇలాంటి లక్షణాలు గమనిస్తే తప్పనిసరిగా ఎండోస్కొపీ/కొలనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.  
మూత్రవిసర్జన సమయంలో ఇబ్బందులు, తరచూ రక్తం పడడం, నొప్పి వంటివి /కిడ్నీ/బ్లాడర్‌/ప్రొస్టేట్‌ కేన్సర్‌ లక్షణాలు కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా పరీక్ష చేయించి నిర్ధారించుకోవాలి.  
కొత్తగా పుట్టు మచ్చల వంటివి కనపించడం, లేదా అప్పటికే మనకి ఉన్న పుట్టుమచ్చలు పెద్దవిగా లేదా మరే రకంగానైనా రూపు మారడం వంటివి స్కిన్‌ కేన్సర్‌ లక్షణాలు. ఇవి గమనిస్తే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించాలి. అన్నీ మెలనోమాకు సూచనలు  కాకపోవచ్చు.  
ఏదైనా గాయం  తర్వాత పుండ్లు ఏర్పడి, 3 వారాలు దాటినా మానకపోవడం నయం కాకపోవడం జరిగితే.. ఈ పుండ్లు కేన్సర్‌గా పరిణామం చెందే అవకాశాలు న్నాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.
మహిళల్లో సాధారణ రుతుచక్ర సమయానికి అనుకోని ప్రదేశం నుంచి రక్తస్రావం కావడం అనేది గర్భాశయ ముఖద్వార/గర్భాశయ కేన్సర్‌కు లక్షణాలు. పురుష నాళం నుంచి రక్తస్రావమైతే అది పెద్ద ప్రేవు కేన్సర్‌ లక్షణం. అలాగే దగ్గుతో పాటు రక్తం, వాంతిలో, ఉమ్మిలో రక్తపు మరకలు కూడా సందేహాస్పదమే.  
అకస్మాత్తుగా, మన ప్రమేయం లేకుండా బరువు తగ్గిపోతే అది కణితి లేదా కేన్సర్‌ వల్ల కావచ్చు. ఏదైనా సమయంలో కణితి ఏర్పడి అది రూపుమారుతూ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అలాగే రొమ్ములలో గడ్డలు రొమ్ము కేన్సర్‌ లక్షణాలు.  తరచూ అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, మింగుతున్నప్పుడు నొప్పి కలగ డం అనేవి మెడ అన్నవాహిక కేన్సర్‌ లక్షణాలు కావచ్చు.  
కొంత వయసు మీద పడిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అతిగా శ్రమించినప్పుడు కూడా ఇది జరుగుతుంటుంది. కానీ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరితిత్తుల కేన్సర్‌లక్షణాలుగా అనుమానించాలి.   

ఏడాదికి 50 వేల కేసులు
ఖైరతాబాద్‌: కేన్సర్‌ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని   గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ డి.మధు తెలిపారు. కేన్సర్‌ సంబంధిత సమస్యలతో దేశంలో ఏటా 7లక్షల మంది మరణిస్తున్నట్లు తెలుస్తోందని, 2035 నాటికి 17లక్షల కేసులు నిర్ధారణ అవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 50వేల కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు.   డాక్టర్‌ డి.మధు

బ్రెస్ట్‌ కేన్సర్‌తో హార్ట్‌ ఫెయిల్యూర్‌
విభిన్న రకాల కేన్సర్‌లలో ప్రస్తుతం నగర మహిళలకు అత్యధికంగా బాధిస్తున్న బ్రెస్ట్‌ కేన్సర్‌ నివారణకు తరచు వైద్య పరీక్షలు తప్పనిసరని జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్‌కు చెందిన  గైనకాలజీ/ఆబస్టెట్రిక్స్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ లక్ష్మీరత్న అభిప్రాయపడ్డారు. బ్రెస్ట్‌ కేన్సర్‌ తర్వాత హార్ట్‌ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీయవచ్చునని డానిష్‌ పరిశోధన తేల్చిందన్నారు. బ్రెస్ట్‌ కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న మహిళలు ఆట్రియల్‌ ఫైబ్రిల్లేషన్‌ అనే గుండె సంబంధ వ్యాధికి గురై తద్వారా స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం నుంచి హార్ట్‌ ఫెయిల్యూర్‌ దాకా తెచ్చిపెట్టే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. బ్రెస్ట్‌ కేన్సర్‌ బాధిత మహిళలు అట్రియల్‌ ఫైబ్రిల్లేషన్‌ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం అత్యంత ప్రధానమైన విషయమని, హై కొలెస్ట్రాల్‌ ప్రమాదాన్ని రిస్క్‌ని మరింత పెంచుతుంది కాబట్టి బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ తీసుకుంటూ రోజువారీగా వ్యాయామం చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు.   

మహిళల్లో గైనిక్, రొమ్ము కేన్సర్లు..
జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పదే పదే సుఖవ్యాధులు సోకడం, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం వల్ల మహిళలు గర్భాశయ ముఖద్వార కేన్సర్ల బారినపడుతున్నారు. పుట్టిన పిల్లలకు పాలివ్వక పోవడం వల్ల అనేక మంది రొమ్ము కేన్సర్ల బారినపడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కేన్సర్‌పై విస్తృతంగా అవగాహన
కల్పించడం, 9 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించడం, రొ మ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లను గుర్తించడానికి నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వడం ద్వారా కేన్సర్‌ను గుర్తించవచ్చు.          – డాక్టర్‌ సాయిరామ్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి

పురుషుల్లో దంత, నోటి కేన్సర్లు 
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌ గుట్కా, జర్దా, పాన్‌మసాలా, బీడీ, సిగరెట్‌ వినియోగం ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే అనేక మంది వీటికి అలవాటు పడుతున్నారు. చదువుకున్న వారితో పోలిస్తే చదువుకోని యువకులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా వీటికి అలవాటుపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులను నోటిలో నమలడం వల్ల దంత, నోటి కేన్సర్లకు కారణమవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నగరంలో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం వల్ల కేన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు.  – చంద్రకాంత్, దంతవైద్య నిపుణుడు, మహావీర్‌ ఆస్పత్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top