జాబులందించే జాబ్‌లో | Womens day post office is organized in Delhi on Woman Day | Sakshi
Sakshi News home page

జాబులందించే జాబ్‌లో

May 1 2018 12:06 AM | Updated on May 1 2018 12:06 AM

Womens day post office is organized in Delhi on Woman Day - Sakshi

స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్లకు 2013 మార్చి 8న మహిళ దినోత్సవం రోజున అందరూ మహిళలే నిర్వహించే పోస్ట్‌ ఆఫీసు ఢిల్లీలో ఏర్పాటైంది. కానీ అంతకంటే 30 ఏళ్ల ముందుగానే పోస్ట్‌–ఉమన్‌గా ఎంపికై ఎంతో ధీమాగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు ఇంద్రావతి.  ఇప్పటికీ ఆ బాధత్యలను ఇంకా పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్న ఈ కాలంలోనూ దాదాపు రిటైర్‌మెంట్‌ వరకూ తన పోస్టును విజయవంతంగా నిర్వహించారామె. ఈ మధ్యే  రిటైర్‌ అయిన   ఆమె కథ ఇది.  పోస్ట్‌మ్యాన్‌ అనే మాటనే ఎక్కువగా వింటాం. వాళ్లనే చూసి ఉంటాం. కాని ఇంద్రావతి పోస్ట్‌ ఉమన్‌. ఢిల్లీ ఫస్ట్‌ పోస్ట్‌ ఉమన్‌గా రిక్రూట్‌ అయ్యి సేవలు అందించారామె. ఆడవాళ్లు చేయగలిగే ఉద్యోగాలలో వారి ప్రేవేశానికే ప్రతిబంధకాలు ఉన్న రోజుల్లో ఆడవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని పోస్ట్‌మేన్‌ రంగంలో విజయవంతగా సర్వీసు పూర్తి చేశారామె. ప్రయత్నిస్తే వీలు లేని ఉద్యోగాల్లో కూడా విజయం సాధించవచ్చు అంటారామె.

కష్టాల నుంచి...
హర్యానాలోని చిన్న పల్లెటూరు ఇంద్రావతి స్వస్థలం. అమ్మాయిలను అసలు బడికే పంపని ఊరది. అలాంటి ఊళ్లో ఇంద్రావతి వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాళ్లమ్మ అకస్మాత్తుగా చనిపోవడంతో ఉమ్మడికుటుంబంలోంచి వాళ్లను ఉన్నపళంగా బయటకు పంపించేశారు. దాంతో ఇంద్రావతి వాళ్లు ఆ ఊళ్లో బడిలో తలదాచుకున్నారు. ఆమె అక్కడ అక్షరాలు దిద్దడం నేర్చుకున్నారు. ఆ శ్రద్థను చూసి ఇంద్రావతి తండ్రి ఆమెను బడిలో చేర్పించారు. అలా ఆమె చదువు సాగింది. అందుకే ఒక విషాదమే తన చదువుకు తోడ్పడిందని  చెబుతారు ఇంద్రావతి. ఉద్యోగమూ అంతే. అనుకోకుండా పంపిన దరఖాస్తుతో కొలువు ఖరారైంది. 1982, సెస్టెంబర్‌ 13న పోస్ట్‌(ఉ)మ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘నేను చేరినప్పుడు ఆ జాబ్‌లో అందరూ మగవాళ్లే. అసలు ఆడవాళ్ల వస్తారని అనుకుని ఉండరు. అందుకే ఆ కొలువులో ఆడవాళ్లకు ఓ ప్రాపర్‌ టైటిల్‌ ఇవ్వలేదు. నన్ను కూడా పోస్ట్‌మ్యాన్‌ అనే పిలిచేవారు.’ అని వివరణ ఇస్తారు ఇంద్రావతి. 

ఒక్కోరోజు 70 ఉత్తరాలు... 
 ఇంద్రావతి మొదట్లో హర్యానాలోని రోథక్‌లో ఉండేవారు. ఉద్యోగమేమో ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో. ఢిల్లీకి రోజూ ట్రైన్‌లో వచ్చేవారు.  ఉదయం తొమ్మిదింటికి  డ్యూటీ మొదలయ్యేది. పోస్ట్‌ ఆఫీస్‌కు వచ్చిన ఉత్తరాలన్నిటినీ బస్సు వెళ్లే దారి ప్రకారంగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ రూట్‌ ప్రకారమే బట్వాడా చేస్తారు. వాటిని ఆయా గడపల్లో వేయడానికి రోజుకు కనీసం  ఎనిమిది కిలోమీటర్లు నడిచేవారట  ఆమె. ఒక్కోరోజైతే 70 ఉత్తరాల దాకా ఉండేవట. బట్వాడా కోసం ఎన్నో ఇళ్ల తలుపులు తట్టాలి. వాటిల్లో అపార్ట్‌మెంట్లూ ఉంటాయి. కొన్నిటికి లిఫ్ట్స్‌ ఉంటాయి. కొన్నిటికి ఉండవు. మెట్లెక్కాల్సిందే. ‘ఢిల్లీ ఫస్ట్‌ పోస్ట్‌ ఉమన్‌నే కాదు.. మా ఫ్యామిలీలో గవర్నమెంట్‌ జాబ్‌ దొరికిన ఫస్ట్‌ లేడీని, ఇంకా చెప్పాలంటే మా ఊరి తొలి ప్రభుత్వోద్యోగిని కూడా నేనే. ఈ క్రెడిట్‌ నాకూ ప్రౌడ్‌గానే అనిపిస్తుంటుంది. మా ఊళ్లో వాళ్లూ గొప్పగానే చూస్తారు’ అంటారు ఇంద్రావతి నవ్వుతూ. 

కోడలికీ స్ఫూర్తి..
ఇంద్రావతికి ఇద్దరు పిల్లలు. అమ్మమ్మ, నానమ్మ కూడా అయ్యారు.  కోడలు వచ్చాక ఫక్తు అత్తగారిలా ప్రవర్తించలేదామె. తనకు చదువు విలువ తెలుసు కాబట్టి కేవలం ఇంటర్‌ వరకు మాత్రమే చదువుకున్న కోడలిని ఉన్నత చదువులకై  ప్రోత్సహించారు. ఇప్పుడు కోడలు, కూతురు ఇద్దరూ పోస్ట్‌గ్రాడ్యూయేట్లే.  మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోడలినీ ఉద్యోగస్తురాలిని చేసింది.

వింతగా చూసేవారు... వేధించేవారు కూడా...  
పోస్ట్‌ ఉమన్‌గా తన జీవితం ఎలా ఉంది అని అడిగితే.. ‘మొదట్లో చాలా చాలెంజింగ్‌గా అనిపించేది. యూనిఫామ్‌ వేసుకొని ఉత్తరాలు పంచడానికి వెళ్తుంటే అందరూ వింతగా చూసేవాళ్లు. కొంతమంది గేలి చేశారు. కొంత మందైతే దొంగననుకునే వాళ్లు. ఇంకొంతమంది బిచ్చగత్తెననీ భ్రమపడ్డారు. అ యితే విషయం తెలుసుకున్నాక వాళ్లే గౌరవించడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక తాగుబోతు నాతో మిస్‌ బిహేవ్‌ చేశాడు. కాని మత్తు దిగాక మరుసటిరోజు  నేను పనిచేస్తున్న పోస్టాఫీస్‌కు వచ్చి క్షమాపణ కోరాడు. తాను అలా ప్రవర్తించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. నా జీవితంలో అలాంటి సంఘటన అదే మొదలు, ఆఖరు కూడా.  చదువురాని వాళ్లు  పర్సనల్‌ లెటర్స్‌ను నాతో చదివించుకునేవాళ్లు. ఎంతో నమ్మకం ఉంటేనే కదా.. చదవమంటారు! చిన్న వాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఢిల్లీ ఫస్ట్‌ పోస్ట్‌ ఉమన్‌ని అని  తెలిసీ నాతో సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతుంటారు. వాళ్ల అభిమానం చూస్తుంటే హ్యాపీగా ఉంటుంది.’  అంటారు ఇంద్రావతి. ఇంద్రావతి  తొలిసారి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ దగ్గరలోని గోల్‌ ఢాక్‌–ఖానాలోనే గత నెలాఖర్లో పదవీ విరమణ పొందారు.  ఈ సందర్భంగా ఆ ఆఫీస్‌ సిబ్బంది ఆమెకు  ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు.  ‘యోగా చేస్తాను. నా మనవరాళ్లతో కలిసి స్విమ్మింగ్‌కు వెళ్తాను. నాకిష్టమైన వ్యాపకాలతో రిటైర్మెంట్‌ లైఫ్‌నూ అంతే బిజీగా గడపాలని డిసైడ్‌ చేసుకున్నా’ అంటారు ఇంద్రావతి. 
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement