స్టాచ్యూ ఆఫ్‌ స్వేచ్ఛకు సంకెళ్లు

Woman climbs base of the Statue of Liberty - Sakshi

థెరీస్‌ ఒకౌమా

అమెరికాలో అందరికీ తెలిసిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’.ఆ స్టాచ్యూని ఎక్కి అమెరికాలో నేనున్నాను అని తెలిపిన సాహస మహిళ థెరీస్‌ పెట్రీషియా ఒకౌమా. ఆమెకిప్పుడు జైలు శిక్ష పడబోతోంది. ఆమెకు శిక్ష పడడం అంటే స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీకే సంకెళ్లు పడడమే!  

ఆఫ్రికాలోని కాంగోనదికి పశ్చిమాన ఉన్న కాంగో రిపబ్లికన్‌లోని బ్రాజవిల్‌లో పుట్టి అమెరికాకి వలస వచ్చి అక్కడే స్థిరపడిన 45 ఏళ్ల థెరీస్‌ పెట్రీషియా ఒకౌమా పేరు సాధారణంగా అయితే అమెరికా ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఇప్పటికీ చాలామందికి ఆ పేరు తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వలస విధానాలకు వ్యతిరేకంగా థెరీస్‌ చేసిన సాహసోపేత నిరసనని మాత్రం అమెరికా ప్రజలే కాదు, పసిబిడ్డల పట్ల ప్రేమ ఉన్న ఏ దేశ మహిళా మర్చిపోదు.

మర్చిపోలేదు. కారణం.. అమెరికా చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసం ఆమె చేశారు. ప్రపంచ దేశాల ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న ట్రంప్‌ సహన శూన్యతకు (‘జీరో టాలరెన్స్‌’) వ్యతిరేకంగా థెరీస్‌ గత ఏడాది 2018, జూలై 4 న అమెరికా పోలీసులు కళ్లు గప్పి న్యూయార్క్‌ సిటీలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని వడివడిగా ఎక్కేసారు. థెరీస్‌ ఎన్నుకున్న ఈ తరహా ధిక్కారాన్ని ఆమెరికా అంతకు మునుపెన్నడూ ఎరగదు.

అయితే ఆనాటి ఆమె సాహసోపేత నిరసనకు ఆమె చెల్లించబోతోన్న మూల్యం 18 నెలల జైలు శిక్ష! మార్చి 5 వ తేదీన అమెరికా ట్రయల్‌ కోర్టు ఇవ్వబోయే ఈ తీర్పుకి ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఎక్కడాన్ని పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ, అది క్షమార్హం కాని నేరంగా భావించింది మన్‌హాట్టన్‌ జిల్లా కోర్టు. ఆమెపై మోపిన నేరారోపణలకు గాను ఒక్కోదానికి ఆరు నెలల చొప్పున 18 నెలలు శిక్ష పడొచ్చని భావిస్తున్నారు. 

దుర్మార్గంపై ధర్మాగ్రహం
థెరీస్‌ పెట్రీషియా ఒకౌమా.. ట్రంప్‌ జీరో టాలరెన్స్‌ విధానంతో పసిబిడ్డలను కుటుంబాలనుంచి వేరు చేయడం దారుణమని పని అని ఆమె భావించారు. మెక్సికో సరిహద్దు నుంచి యు.ఎస్‌లోకి వలస వస్తున్న కుటుంబాలలో చివరకు పాలుతాగే పిల్లలని సైతం తల్లుల నుంచి దూరం చేయడం వల్ల ఆ చర్య దీర్ఘకాలంలో పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఆమె అంతరంగాన్ని కల్లోల పరిచింది. ఈ అమానుషత్వాన్ని వ్యతిరేకించడం ఒక మహిళగా తన బాధ్యతని ఆమె అనుకున్నారు. జీరో టాలరెన్స్‌లోని దుష్ప్రభావాన్ని సమాజం దృష్టిలోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచించారు. థెరీస్‌కు స్వతహాగా చిన్నప్పటినుంచి ఎల్తైన ప్రదేశాలను అధిరోహించడం ఇష్టం.

ప్రధానంగా ఎల్తైన ఇళ్లు ఎక్కడం ఆమెకెంతో ఇష్టమైన పని. ఆమె సోదరులు సైతం ఆమెతో పోటీపడేవారు కాదు. అందుకే ట్రంప్‌ వలస విధానానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించడానికి స్వేచ్ఛకి ప్రతీక అయిన లిబర్టీఆఫ్‌ స్టాచ్యూని ఎక్కడమే మార్గం అనుకున్నారు. తమది కూడా అమెరికాకి వలస వచ్చిన కుటుంబమే కనుక తను ట్రంప్‌ వలస విధానాన్ని వ్యతిరేకించడం లేదని, అది తన బాధ్యతగా భావించాననీ ఆనాడే చెప్పారు థెరీస్‌. 

సొంత వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, బతకడాన్నీ ఇష్టపడే థెరీస్, 2016 లో ప్రవేశపెట్టిన ట్రంప్‌ వలస విధానాన్ని నిరసించి తొలిసారి ప్రపంచానికి కొద్దిగా పరిచయం అయ్యారు. అంతకుముందు ఆమె ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేసేవారు. అమెరికా వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో థెరీస్‌ ఒక విధంగా ఒంటరి సైనికురాలు. అప్పటివరకు ఆమె తనదైన శైలిలో వివిధ అంశాలపైన ఒంటరిగా నిరసన ప్రదర్శనలు జరిపినా, 2017లో న్యూయార్క్‌లోని రైజ్‌ అండ్‌ రెసిస్ట్‌ యాక్టివిస్ట్‌ గ్రూప్‌లో సభ్యులుగా చేరాక తన ఉద్యమప్రస్థానాన్ని విభిన్నంగా మలుచుకున్నారు.

మెరుపులా ఎక్కేశారు
స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఎక్కడానికి ఒకరోజు ముందు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వద్ద రైజ్‌ అండ్‌ రెసిస్ట్‌ ఆర్గనైజేషన్‌ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. న్యూయార్క్‌ పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న సందర్భంలో థెరీస్‌ అక్కడి నుంచి అదృశ్యమై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ  20 అడుగులపైకి ఎగబాకి స్టాచ్యూ పాదాల వద్దకి చేరుకున్నారు. 3 గంటల ప్రయత్నం తరువాత న్యూయార్క్‌ పోలీసులు ఆమెను చేరుకోగలిగారు. ఈమె సాహసోపేత నిరసనని అమెరికా మీడియా విస్తృతంగా కవర్‌ చేసింది. ప్రసిద్ధ ‘ఎల్‌’ పత్రిక థెరీస్‌ చర్యను ‘‘2018లో అత్యంతశక్తిమంతమైన మహిళా కార్యక్రమంగా’’ పేర్కొన్నది. స్ట్రీట్‌ ఆర్ట్‌ తో కూడా థెరీస్‌ పరాక్రమ ప్రదర్శన ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top