వారం రోజుల మందులు  ఒక్క క్యాప్సూల్‌లో | Sakshi
Sakshi News home page

వారం రోజుల మందులు  ఒక్క క్యాప్సూల్‌లో

Published Wed, Jan 10 2018 11:58 PM

A weekly drugs in one capsule - Sakshi

హెచ్‌ఐవీతో బాధపడుతన్న వారికో శుభవార్త. రోజూ బోలెడన్ని మాత్రలు తీసుకోవాల్సిన శ్రమ త్వరలోనే తప్పనుంది. వారం రోజులకు సరిపడా మందులన్నింటినీ ఒకే ఒక్క క్యాప్సూల్‌లోకి చేర్చడంలో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు విజయం సాధించడం దీనికి కారణం. క్యాప్సూల్‌లోని మందులు నెమ్మదిగా విడుదల అవడం ద్వారా హెచ్‌ఐవీ వైరస్‌ నుంచి వారం పాటు రక్షణ కల్పిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గియోవానీ ట్రావెర్సో తెలిపారు. లైండ్రా అనే ఫార్మా కంపెనీ ఇప్పుడు ఈ సరికొత్త క్యాప్సూల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే ప్రయత్నాల్లో ఉంది. వేర్వేరు మందులను ఒక్కచోటికి తీసుకు రాగల టెక్నాలజీ ఒక్క హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగపడుతుందని ట్రావెర్సో అంటున్నారు.

యాంటీ రెట్రోవైరల్‌ మందులు అందుబాటులోకి వచ్చిన తరువాత హెచ్‌ఐవీ మరణాల రేటు గణనీయంగా తగ్గినప్పటికీ, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కొంతమంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో లైండ్రా ఈ సరికొత్త క్యాప్సూల్‌ను అభివృద్ధి చేయడం విశేషం. ఆరు మూలలతో నక్షత్రం ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్‌ ఒక్కసారి కడుపులోకి చేరితే దాదాపు రెండు వారాలపాటు మనగలదు. ఈ కాలంలో ఒక్కో మూలలో ఉండే మందు క్రమేపీ విడుదలవుతూ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఎప్పుడు ఏ మందు విడుదల కావాలో తయారీ సమయంలోనే నిర్ణయించుకోగలగడం ఇంకో విశేషం. 

Advertisement
Advertisement