తుడుచుకోగానే ప్రాణం లేచి వస్తుంది

Verity Towels Special Story - Sakshi

థోర్‌థు

చిన్నప్పుడు అమ్మమ్మ తలంటి పోసి తాతయ్య టవల్‌ను తలకు చుట్టిన జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు. తెల్లగా,  మెత్తగా, తేలిగ్గా ఉండే టవల్‌ను తలకు కప్పి,జుట్టు కింద వరకు చుట్టి మెలితిప్పగానే తలలోని నీటిని పీల్చుకుని టవల్‌ ముద్దయిపోయేది, జుట్టును క్షణాల్లో పొడిబార్చేది. తల తుడుచుకుని తీగ మీద ఆరేయగానే నిమిషాల్లో ఆరిపోయేది. వాడడం సులభం,ఉతకడం సులభం, ప్రయాణాల్లో పెట్టెలో తక్కువ జాగాలో ఇమిడిపోయేది కూడా.

‘‘ఇప్పుడలాంటివి కనిపించడం లేదు. పలుచగా ఉంటే తేమ పీల్చవు, తేమను పీల్చే క్లాత్‌ కోసం చూస్తే తలకు చుట్టుకుంటే మెడ మోయలేనంత బరువు, మెడ నొప్పి వచ్చేస్తోంది..’’ ఈ మాటలు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించే ఉంటాయి. అయితే ఇందు మెనన్‌ విని ఊరుకోకుండా.. కేరళలో ఆ టవళ్లను నేసే నేత కారుల దగ్గరకు వెళ్లారు. వారి జీవితాలను గ్రంథస్థం చేయడం కోసమే ఆమె ఈ పని చేశారు. అయితే అక్కడి నేత మగ్గాలను, మార్కెట్‌ లేని చేనేత వస్త్రాల మీదనే బతుకు వెళ్లదీయాల్సిన వందల కుటుంబాలను చూసిన తర్వాత ఆమెలోని పరిశోధకురాలు నిద్రలేచింది. కూతురు చిత్రతో కలిసి ‘కారా వీవర్స్‌’ పేరుతో  కేరళ చేనేతలకు ఒక బ్రాండ్‌ను సృష్టించగలిగారు ఇందు మెనన్‌.

ఇందు మెనన్, కూతురు చిత్ర
మన తువ్వాలే వారి థోర్‌థు
అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌లో పరిశోధకురాలు అయిన ఇందు మెనన్‌ ఇటీవల ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత సొంతూరులో స్థిరపడడానికి కేరళకు వెళ్లిపోయారు. ఆ తరవాత ఆమె ‘ఉమెన్‌ వీవర్స్‌’ గురించి పుస్తకం రాస్తున్న మిత్రురాలికి సహాయంగా, సహ రచయితగా ఎర్నాకుళంలోని చేనేత కుటుంబాలను స్వయంగా కలిశారు. ఆ టవల్‌ను మలయాళంలో ‘థోర్‌థు’ అంటారు. థోర్‌థు మన తువ్వాలే. ‘‘కేరళ థోర్‌థు తయారీలో దాగిన కళ చేనేత మహిళలతో మాట్లాడినప్పుడే తెలిసింది. ఇంత సౌకర్యవంతమైన క్లాత్‌ను తయారు చేసే ప్రక్రియ ఆగిపోకూడదనిపించింది’’ అన్నారు ఇందు మెనన్‌.

‘‘అదే క్లాత్‌ని ఇప్పటి అవసరాలకు తగినట్లు మార్చుకుంటే మంచి ఫ్యాబ్రిక్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. మా అమ్మాయి చిత్ర గ్రాఫిక్‌ డిజైనర్‌. నా ప్రాజెక్ట్‌లో సహాయం చేయడానికి ఒప్పుకుంది. చిత్ర ఇచ్చిన స్టయిలిష్‌ డిజైన్‌లను చేనేత మహిళలు చక్కగా ఆకళింపు చేసుకుని నేశారు. ఇప్పుడు స్టార్‌ హోటళ్లకు టేబుల్‌ నాప్‌కిన్స్‌ నుంచి స్విమ్మింగ్‌ పూల్‌ టవల్స్‌ వరకు సప్లయ్‌ చేస్తున్నాం. అమెరికా, యూరప్‌లలో బీచ్‌ టవల్‌గా కూడా కేరళ థోర్‌థులనే వాడుతున్నారిప్పుడు. ముఖ్యంగా చంటిపిల్లలకు పక్కకు వేయడానికి, కప్పడానికి చిన్న చిన్న దుప్పట్లు ఇదే మెటీరియల్‌తో చేస్తున్నాం. వీటితోపాటు కేరళ సంప్రదాయ ముండు (ధోవతి)తో కుర్తా కుట్టడం అనే ప్రయోగం కూడా సక్సెస్‌ అయింది. మూడేళ్ల కిందట బెర్లిన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ మీద మోడల్స్‌ కేరళలో మహిళా నేతకారులు నేసిన వస్త్రాలను ప్రదర్శించారు. మేము చొరవతో చేసిన ఒక ప్రయత్నం విజయవంతమైంది. ఇప్పుడు ఈ పనిలో ఐదు వందల చేనేత కుటుంబాలు, ఎనభై మంది టైలర్లు, నాలుగు వందల మంది ఇతర సపోర్టింగ్‌ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు’’ అని సంతోషంగా చెప్పారు ఇందు మెనన్‌.– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top