అమ్మానాన్న.. వందల ప్రేమలేఖలు!

Vakulanayaks artist formulates the songs for realism - Sakshi

ఉత్తరాల పరిమళం

వకుళానాయక్‌ చిత్రకారిణి. అందమైన భావం ఆమె కుంచె నుంచి అద్భుతంగా ఆవిష్కారమవుతుంది. వాస్తవికతకు గీతల్లో రూపమిస్తుంది. ‘ఇది చిత్రకారులందరూ చేసే పనే కదా! కొత్తగా ఏదైనా చేయాలి’ అని వకుళానాయక్‌ అనుకుంటుండగా.. ఆ అన్వేషణలో యాదృచ్ఛికంగా జరిగిందో సంఘటన. వాళ్ల నాన్నగారు, వాళ్ల అమ్మకు రాసిన ప్రేమలేఖలు వకుళానాయక్‌ కంటపడ్డాయి. ఆయన ఉత్తరాల్లోని భావుకత, అక్షరాల్లో ఒలికించిన ప్రేమ భావం గొప్పగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని క్షుణ్నంగా చదివారామె. ఆ ఉత్తరంలో వ్యక్తమైన భావానికి రూపమిచ్చారు. అలా ఆమె వేసిన బొమ్మలతో బెంగుళూరులో ప్రదర్శన కూడా పెట్టారామె.

భావాల బొమ్మలు
నీటి ఉపరితలం మీద పడవ ప్రయాణిస్తుంటుంది. రెండు చేపలు నీటి లోపల ఈదుతూ ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఆరాధనాభావంతో చూసుకుంటూ ఉంటాయి. పడవలో నుంచి ఒక ఎర చేపల మధ్య వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఎరకు కొసన ప్రేమచిహ్నం ఉంటుంది. మరో చిత్రంలో ఒక రాకెట్‌ ఆకాశం నుంచి నేల వైపు పయనిస్తుంటుంది. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక జెండా. ఆ జెండా మీద ప్రేమ చిహ్నంగా ఎర్రటి హృదయం బొమ్మ. మరో చిత్రంలో ప్రేమగా ముక్కులు రాసుకుంటున్న రెండు రామచిలుకలు. ఇంకో చిత్రంలో రెండు గోరువంకల మధ్య ఫోన్‌ రిసీవర్‌ వేళ్లాడుతూ ఉంటుంది. రెండు ప్రేమ పక్షులు చెరొక కాఫీ కప్పులో కూర్చుని ఒకదానిని మరొకటి చూసుకుంటుంటాయి. 

రోజుకో ప్రేమలేఖ!
‘‘మా అమ్మానాన్న ఉద్యోగరీత్యా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప తరచూ కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన మా అమ్మకు తరచూ ఉత్తరాలు రాసేవాడు. కొన్ని ఉత్తరాల మీద తేదీలను చూస్తే రోజుకొక ఉత్తరం రాసిన రోజులూ ఉన్నాయి వాళ్ల జీవితంలో. ఇప్పటిలా ఫోన్‌లు ఉన్న రోజులు కావవి. టెలిఫోన్‌ ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ‘ఫలానా రోజు ఫోన్‌ చేస్తాను’ అనే సంగతి కూడా ఉత్తరంలో సమాచారం ఇచ్చుకోవాల్సిన రోజులవి. అప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించిన నేస్తాలా ఉత్తరాలు.

అందులో ఆయన రాసిన విషయాలకు నేను బొమ్మలు వేశాను. నాన్న పోయాక ఆయన వస్తువులు చూస్తున్నప్పుడు ఈ ఉత్తరాలు దొరికాయి’’ అని వివరించారు వకుళా నాయక్‌. ఉత్తరాలే కాదు ఏ రకమైన పాత కాగితం కనిపించినా దానికి నప్పే బొమ్మ వేసి ఆ బొమ్మలో ఈ కాగితాన్ని ఇమడ్చడం ఆమె ప్రత్యేకత. పాత దస్తావేజులు, సరుకులు కొన్న చీటీలు, సంగీతం నోట్స్‌... ఏదైనా సరే... ఆ కాన్సెప్ట్‌కు తగినట్లు బొమ్మ వేసి ఒక డెకరేటివ్‌ పీస్‌గా మారుస్తారు వకుళ. ఈ ఆర్ట్‌ను వింటేజ్‌ లవ్‌ లెటర్స్‌ ఎగ్జిబిషన్‌ అంటారు.
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top