సూపర్ స్మార్ట్‌గా...

సూపర్ స్మార్ట్‌గా...


స్మార్‌ఫోన్లు మరింత చౌకయ్యాయి..

మొబైల్ సమాచారం ఇక భద్రం...

వీధిదీపాలే... సెల్‌ఫోన్ టవర్లు. నేటితో ముగియనున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ మోసుకొచ్చిన కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలివి.ఏటా జరిగే ఈ అంతర్జాతీయ మొబైల్ ఫోన్, టెక్నాలజీ ప్రదర్శనలో శాంసంగ్, నోకియా, సోనీ వంటి దిగ్గజాలు తమతమ కొత్త ఉత్పత్తులను పరిచయం చేయగా... కొన్ని సంస్థలు వినూత్న టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చాయి.


 

వీధి దీపాలే సెల్‌ఫోన్ యాంటెన్నాలు!



మహానగరాల్లోనైనా, మారుమూల పల్లెల్లోనైనా సెల్‌ఫోన్ సిగ్నళ్లు ఎప్పుడూ సమస్యే. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎక్కువవుతున్న ఈ కాలంలో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఫిలిప్స్, ఎరిక్‌సన్ కంపెనీలు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా వీధిదీపాల్లోని ఎల్‌ఈడీ లైట్లలోనే మొబైల్‌ఫోన్ సంకేతాలను ప్రసారం చేయగల యాంటెన్నాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా సెల్‌ఫోన్ టవర్ల ఏర్పాటును తగ్గించుకోవచ్చు. అదే సమయంలో వీధులన్నింటిలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి. తాము అందించే ఈ కొత్త వీధిదీపాలు మామూలు వాటితో పోలిస్తే సగం విద్యుత్తునే వాడతాయని ఫిలిప్స్, ఎరిక్‌సన్ అంటున్నాయి. అటు విద్యుత్తు ఆదాతోపాటు సెల్‌సిగ్నళ్ల సమస్య ఒకేసారి తీరుతుందన్న మాట.

 

బ్లాక్‌ఫోన్‌తో సమాచారం భద్రం!



ఇంటర్నెట్ ప్రపంచంలో సమాచారం అంటే... డబ్బే! ఎన్నో కంపెనీలు ఇతరుల సమాచారాన్ని సేకరించి లాభాలకు అమ్ముకుంటూంటాయి. దీంతో మనం దాచుకోవాలనుకున్న సమాచారం కూడా అందరికీ తెలిసిపోతూం టుంది. అమెరికా లాంటి దేశాలు నెట్ సమాచారంపై నిఘా పెట్టాయన్న సంగతీ తెలిసిందే. మీ ఫోన్ కాల్స్‌తోపాటు, అందులోని సమాచారం, ఫొటోలు, వీడియోలు అన్నీ ఎవరికీ చిక్కకుండా భద్రంగా ఉండాలంటే..? తమ బ్లాక్‌ఫోన్‌ను వాడాల్సిందే అంటోంది ఓ కంపెనీ. ఆండ్రాయిడ్ ఫోన్‌కే కొన్ని అదనపు హంగులు, అప్లికేషన్లను జతచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేశారు. ప్రైవేట్ ఓఎస్ అనే స్కిన్... ఫోన్‌లో నిక్షిప్తమయ్యే సమాచారం మొత్తాన్ని రహస్య సంకేతాలుగా మార్చేస్తే... సెలైంట్ సర్కిల్, డిస్‌కనెక్ట్‌మీ వంటి సర్వీసులు అనవసరమైన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. వీటితోపాటు బ్లాక్‌ఫోన్‌లోని కొన్ని సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లు థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్ల ద్వారా మీ వ్యక్తిగత సమచారమేదీ లీక్ కాకుండా అడ్డుకుంటాయి.

 

ఫైర్‌ఫాక్స్ చౌక స్మార్ట్‌ఫోన్!



మొజిల్లా కార్పొరేషన్ గురించి మీరు వినే ఉంటారు. ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లను అభివృద్ధి చేసే స్వచ్ఛంద సంస్థ ఇది. ఆండ్రాయిడ్, ఆపిల్ ఆపరేటింగ్ వంటి ఖరీదైన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు పోటీ వచ్చేందుకు తాజాగా ఈ సంస్థ సరికొత్త ఓఎస్‌ను తయారు చేసిందీ సంస్థ. తద్వారా స్మార్ట్‌ఫోన్ల ధరలను గణనీయంగా తగ్గించవచ్చునన్నది మొజిల్లా అంచనా. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మొజిల్లా కార్పొరేషన్ ఫైర్‌ఫాక్స్ ఓఎస్‌తో పనిచేసే ఓ నమూనా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది కూడా. పట్టుమని రూ.1500 కూడా ఖరీదు చేయని ఈ ఫోన్‌ను వేర్వేరు సంస్థల ద్వారా తయారు చేయించేందుకు మొజిల్లా ప్రయత్నాలు చేస్తోంది. మొజిల్లాతోపాటు టైజెన్, ఉబంటూ వంటి సంస్థలు అటు స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పనిచేయగల ఆపరేటింగ్ సిస్టమ్‌ల తయారీకి ప్రయత్నాలు సాగిస్తూం డటం విశేషం.

 

రెండు తెరల యోటా ఫోన్!



స్మార్ట్‌ఫోన్లలో ఒక స్క్రీన్ ఉండటం మనకు తెలుసు. కానీ రష్యన్ కంపెనీ యోటా డివెజైస్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసిన సరికొత్త యోటా 2 స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం ముందు, వెనుక రెండు తెరలు ఉంటాయి. ఒకవైపు అత్యంత స్పష్టమైన రెజల్యూషన్ గల ఎల్‌ఈడీ స్క్రీన్ ఉంటే... మరోవైపు ఎలక్ట్రానిక్ ఇంక్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడుతుంది కాబట్టి బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుందన్నమాట. ట్విట్టర్ మెసేజ్‌లు, ఇతర మెయిళ్లు చూసుకోవడంతోపాటు, కొన్ని గేమ్స్ కూడా ఇదే స్క్రీన్‌పై ఆడుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ పూర్తిగా డిస్‌ఛార్జ్ అయినా... ఎలక్ట్రానిక్ ఇంక్ డిస్‌ప్లేలో మాత్రం కొద్దిసేపు సమాచారం అందుకుంటూనే ఉండ వచ్చు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top