చూడవచ్చు నెలవంకను

A story by yamijala jagadeesh - Sakshi

సముద్రమట్టానికి ముప్పై అయిదు వేల అడుగుల ఎత్తున విమానం పోతోంది. ప్రయాణికులకు స్నాక్స్, బిస్కెట్లు, పండ్లరసాలు వంటివి సరఫరా చేస్తున్నారు. మరికాసేపట్లో రాత్రి ఆహారం కూడా సరఫరా చేసే సమయం దగ్గరపడుతోంది. అప్పుడు ఉన్నట్టుండి పైలట్‌ కూర్చున్న సీటుకి దగ్గర్లో ఏదో శబ్దం వినవచ్చింది. వెంటనే వైమానిక సిబ్బంది అక్కడికి పరుగున చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నవారెవరూ మళ్లీ వెనుకకు రాలేదు.  కాసేపటికి స్పీకర్‌ గుండా గరగరమని చప్పుడు వినిపించింది. ఆ తర్వాత.. ‘ప్రయాణికుల దృష్టికి ఒక ముఖ్య విషయం. మనం ఉన్న విమానంలోని ఇంజన్‌లలో ఒకటి దెబ్బతింది. అది బాగుచేస్తున్నాం. ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదు. అంతా సవ్యంగానే జరిగి విమానం సాఫీగానే ముందుకు సాగుతుంది’’ అని వినిపించింది.

ఈ మాటలు వినడంతోనే ప్రయాణికులలో అలజడి మొదలైంది. ఎవరికి వారు తమ ఇష్టదైవానికి దణ్ణం పెట్టుకుంటున్నారు. కొందరు తమ బంధువులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  కొంచెంసేపు అయింది. పైలట్‌ మళ్లీ ఓ ప్రకటన చేశారు. ప్రయాణికులారా, ఇందాక చెప్పిన ఇంజన్‌ని బాగు చేయడం కుదరడం లేదు. ఇలాగే కొనసాగితే కాస్సేపటికి విమానం మా పరిధి దాటిపోవచ్చు. కనుక ముందుజాగ్రత్తగా దగ్గర్లోని ఓ విమానాశ్రయానికి తెలియజేశాం. అక్కడి సిబ్బంది మన సహాయానికి వస్తారు. ఎవరూ కంగారుపడకండి అని! మొదటి ప్రకటనతోనే కంగారు పడుతున్న ప్రయాణికులు ఈ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. ప్రయాణికులు తమకు తోచిన రీతిలో ప్రార్థనలు చేస్తున్నారు. కొందరైతే అరుస్తున్నారు. కిటికీ అద్దంలోంచి కిందకు చూస్తున్నారు. కింద సముద్రం గానీ లేదు కదా అని.

విమానంలో ఇలా అందరూ కంగారుపడుతుంటే ఒక్కరు మాత్రం ఏదీ పట్టనట్లు నిదానంగా తనకిచ్చిన స్నాక్స్‌ ప్యాకెట్టుని తెరచి అందులోంచి ఒక్కో ముక్కా తీసి నోట్లో వేసుకుంటున్నారు.ఆయన మరెవరో కాదు, ఓ జెన్‌ మాస్టరు. ఏ స్థితినైనా.. అంటే అది మంచైనా చెడైనా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించక తప్పదన్నది ఆ జెన్‌ మాస్టరు మాట. అదే మాట తనకు అటూ ఇటూ ఉన్నవారికి చెప్పాడు. ఈ తత్వాన్ని చెప్పే కవిత ఒకటుంది. ‘‘పాక తగలబడింది ఇక చూడచ్చు నెలవంకను....’’ అని. కాసేపటికి ఆ  విమానం.. దగ్గర్లో ఉన్న ఓ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైంది. అక్కడి సాంకేతిక సిబ్బంది చెడిపోయిన ఇంజన్‌ని బాగు చేశారు. మళ్లీ అక్కడి నుంచి విమానం తన గమ్యంకేసి ప్రయాణమైంది. ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

–  యామిజాల జగదీశ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top