మోసం చేసినట్టు చెప్పకు! | story about cheating and help | Sakshi
Sakshi News home page

మోసం చేసినట్టు చెప్పకు!

Sep 18 2016 12:14 AM | Updated on Aug 20 2018 3:56 PM

మోసం చేసినట్టు చెప్పకు! - Sakshi

మోసం చేసినట్టు చెప్పకు!

ఖలీఫా అల్ మామూన్ దగ్గర ఓ అందమైన అరబ్ గుర్రం ఉంది.

ఖలీఫా అల్ మామూన్  దగ్గర ఓ అందమైన అరబ్ గుర్రం ఉంది.

ఓమా అనే వ్యక్తి దానిని కొనుక్కోవాలనుకున్నాడు. అందుకు సాటిగా అనేక ఒంటెలు, బోలెడంత డబ్బూ ఇస్తానని చెప్పాడు. అయినా మామూన్ అందుకు ఒప్పుకోలేదు.

కానీ ఓమా ఆరు నూరైనా ఆ గుర్రాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.  అల్ మామూన్ గుర్రం మీద స్వారీ చేసే మార్గంలో ఓ రోజు ఓమా మురికి పట్టిన బట్టలతో బోర్లా పడుకున్నాడు.

ఆ మార్గంలో వచ్చిన అల్ మామూన్ రోడ్డు పక్కన పడి ఉన్న అతనిని చూసాడు. గుర్రం మీద నుంచి దిగి అతని వద్దకు వచ్చి లేపి కూర్చోబెట్టాడు.

అయ్యా! పలు రోజులుగా పస్తులున్నాను. ఆకలితో శోష వచ్చి పడిపోయాను. నడవలేని స్థితిలో ఉన్నాను. నేను లేచి నిల్చోలేని స్థితిలో ఉన్నాను అంటూ గొణిగాడు ఓమా.

ఆ మాటలు విని జాలిపడిన మామూన్ ఓమాను నెమ్మదిగా నడిపించి ఎలాగోలా అతనిని గుర్రం మీద కూర్చోబెట్టాడు.

మరుక్షణమే ఓమా గుర్రాన్ని వేగంగా పోనిచ్చాడు.

మామూన్ విస్తుపోయాడు.

అంతలోనే తమాయించుకున్న మామూన్ అరిచేసరికే ఓమా వేగంగా వెళ్ళిపోయాడు.

ఆగు....ఒక్క క్షణం ఆగు...నేను చెప్పేది విను. ఆ తర్వాత వెళ్ళిపో...నేను నిన్ను ఆపడం లేదు అన్నాడు మామూన్.

ఓమా గుర్రం మీదే వెనక్కు వచ్చాడు.
మామూన్ వంక చూసాడు.
ఏమిటో చెప్పు త్వరగా అన్నాడు ఓమా.

నీకు ఈ గుర్రం నీకు ఎలా లభించిందో ఎవరికీ చెప్పకు. ఇలా నన్ను మోసం చేసినట్టు చెప్పకు...ఒకవేళ నిజంగానే శోష వచ్చి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాసరే ఇప్పటి నుంచి ఇంకెవరూ అలా పడిపోయిన వారికి సాయం చెయ్యక పరిపరి విధాలా ఆలోచిస్తారు....సాయం చేయడానికి వెళ్తే ఏం ముప్పు ముంచుకొస్తుందో అని భయపడతారు... అన్నాడు మామూన్.

తన గుర్రం దొంగతనానికి గురైనందుకు బాధ పడలేదు మామూన్.

కానీ ప్రజల మధ్య ఇలా మోసపోయిన తీరు గానీ వ్యాపిస్తే ఇతరులకు సహాయం చెయ్యాలి అనే వారు కూడా పునరాలోచనలో పడతారు కదా అని ఆయన ఆలోచించి ఓమాకు తాను మోసపుచ్చి గుర్రాన్ని పొందినట్టు ఎవరితోనూ చెప్పవద్దని సూచించాడు మామూన్.
- మహిమ

Advertisement
 
Advertisement
Advertisement