
ప్రాణం ఎక్కడికీ ఎగిరిపోదు. ఇక్కడే.. భూమిలో నాటుకుపోతుంది. నీడనిచ్చిన భూమి. నివాసమున్న భూమి. పండించిన భూమి. పట్టాలో పేరు లేదంటే ప్రాణం పోయేది.. విత్తనమై భూమిలో మొలకెత్తడానికే. మనిషికీ, భూమికీ ఉన్న బంధమిది. ఈ బంధాన్ని.. డిజిటలైజ్ చేస్తున్నారు షేక్ హసీనా.
పాసు పుస్తకంలో తండ్రి పేరు తప్పుగా ఉంది. మార్చమని ఏడాదిగా తిరిగాడు ఆ రైతు. ఉమ్మడి భూమిలో తన వాటా కొంత ఉంది. దాన్ని పట్టాగా చేయమని ఈ ఏడాదిగా అడుగుతూనే ఉన్నాడు. రెవిన్యూ ఆఫీస్‌లో ఎవరూ కనికరించలేదు. మనస్తాపంతో ఆఫీసు ముందే పురుగుల మందు తాగి చనిపోయాడు. చనిపోయిన కొద్ది గంటల్లోనే తండ్రి పేరును సవరించారు. ఆయన వాటా భూమిని ఆయన కొడుకులకు పట్టా రాసిచ్చారు. ప్రాణాలన్నీ భూమి మీద పెట్టుకుని బతికాడు. ప్రాణాలు తీసి పట్టా పంపిణీ చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లా రైతు ఆయన.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇలాంటివి జరగనివ్వడం లేదు. రైతును గానీ, భూమి ఉన్న వారిని గానీ ఇల్లు కదలనివ్వడం లేదు. ల్యాండ్ మినిస్టర్‌కి చెప్పి ‘యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్’ (ఎ2ఐ) అని ఒక యాప్ తయారు చేయించారు. అందులోకి వెళ్లడం, అప్లికేషన్ నింపడం, సెండ్ కొట్టడం. అంతే. రెవిన్యూ ఆఫీస్‌కు వెళ్లే పని లేదు. అప్లికేషన్ అందినట్లు సమాచారం వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అవుతున్నట్లు సమాచారం వస్తుంది. మీ పేరున పట్టా సిద్ధమౌతోందని సమాచారం వస్తుంది. మీ పట్టాను వచ్చి తీసుకోండని సమాచారం వస్తుంది. ఏ దశలోనూ రెవిన్యూ ఆఫీస్‌కు, దరఖాస్తు చేసినవారికి మధ్య కమ్యూనికేషన్ కట్ కాదు. అంతా క్లియర్ కట్‌గా ఉంటుంది.
వరద ముంపు ప్రాంతాల రైతులకు వరి నారును పంపిణీ చేస్తున్న హసీనా (ఫైల్ ఫొటో)
ఏదైనా తేడా వస్తే! తేడా వచ్చిందని భూమి హక్కుదారు కంప్లెయింట్ చేస్తే ఆ విషయం బంగ్లాదేశ్ భూమి వ్యవహారాల మంత్రి సైఫుజ్జమాన్‌కు వెళుతుంది. ఆయన్నుంచి ప్రజాపాలన మంత్రికి వెళుతుంది. ఆ మంత్రి ఎవరో కాదు.. ప్రధాని షేక్ హసీనా! కీలకమైన రక్షణ, స్త్రీ శిశు సంరక్షణ శాఖలు కూడా ఆమె చేతిలోనే ఉన్నాయి. పట్టా ఇవ్వడం లేదని, పాస్‌బుక్‌లో పేరు తప్పును సవరించడం లేదని, డబ్బులు అడుగుతున్నారని, ప్రభుత్వ సర్వేయర్‌కు భూమి ఎక్కడుందో తెలియడం లేదని, ఆక్రమణకు గురైంది కనుక నువ్వే వెళ్లి ఆక్రమణదారులను బతిమాలుకోవాలని అంటున్నారనీ, లంచం తీసుకుని వేరొకరికి పట్టా రాసిచ్చారనీ ఫిర్యాదు వెళ్లిందంటే... అదే ఆఖరు ఆ రెవిన్యూ అధికారి ‘ప్రజాసేవ’కు. ఆదేశాలు ఇచ్చేశారు షేక్ హసీనా.. కంప్యూటర్‌లో ఎంటర్ కొట్టగానే రెవిన్యూ అధికారుల ముందుకు ముక్క చెక్కకు కూడా బయోగ్రఫీ, బయోడేటా అంతా వచ్చేయాలని. అందులో ఉన్న సమాచారం కాకుండా డబ్బుకు కక్కుర్తి పyì తప్పుడు సమాచారం ఇస్తే వెంటనే పైకి తెలిసిపోతుంది. వెంటనే బాధితులకు న్యాయం జరుగుతుంది. రైతుల భూమాత ఇప్పుడు షేక్ హసీనా.
బంగ్లాదేశ్‌లో ఏడాదికి ఇరవై లక్షల 20 వేలకు పైగా భూ తగాదాలు ఫైల్ అవుతున్నాయి. అవడమే కాదు, ఫైళ్లూ కదులుతున్నాయి. గతంలో ఈ తగాదాలకు ఏం పరిష్కారం దొరికిందో, అసలు దొరికిందో లేదో వెంటనే తెలిసేది కాదు. దాంతో రెవిన్యూ అధికారులకు, సిబ్బందికి తప్పించుకోడానికి ఉండేది. 2017లో జనవరిలో ‘ఎ2ఐ’ యాప్ మొదలయ్యాక ఈ మూడున్నరేళ్లలో రెవిన్యూ శాఖలోని అవినీతి మొత్తం కొట్టుకుపోయింది! ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత కచ్చితంగా జరగని భూ సంస్కరణ ఇది. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా వల్ల సాధ్యమైంది. ఐక్యరాజ్య సమితి బంగ్లాదేశ్‌ను ప్రశంసించింది. ఏటా జూన్ 23న ‘యు.ఎన్. పబ్లిక్ సర్వీస్ డే’ సందర్భంగా ఇచ్చే ‘యు.ఎన్. పబ్లిక్ సర్వీస్ అవార్డు’ను ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు ఇచ్చింది. ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీలా, హసీనా.. రైతు ఫ్రెండ్లీ. కరోనా కష్టకాలంలో రైతుల్ని ఆదుకోడానికి 5000 కోట్ల ‘టాకా’ల ప్యాకేజీ ప్రకటించారు. రైతు మనసుకు బాధకలగకుండా చూసుకుంటే దేశానికి కన్నీరు కార్చే అవసరం ఉండదని హసీనా అంటారు. రైతు సేవే ప్రజాసేవ అని ఆమె నమ్మకం.