టచ్‌ రచ్చ

టచ్‌ రచ్చ


కవర్‌ చెయ్యాల్సిన బట్టలే కేక పెట్టిస్తే?

అందం తెచ్చేవే.. అల్లాడిస్తే?!

ఇక ఏం వేసుకుంటాం? ఏం పూసుకుంటాం?

అన్నీ స్కిన్‌కి ప్రాబ్లమే.

ఎలర్జీ... అమ్మో...

టచ్‌ చేస్తే రచ్చ చేసే స్కిన్‌ ఎలర్జీలు ఇవి!




మనం రోజూ వాడే వస్తువులే కొందరికి ఏ మాత్రం సరిపడకుండా చర్మానికి చేటు తెస్తుంటాయి. మనకు సరిపడని వస్తువు తెచ్చే అనర్థాన్ని అలర్జీలుగా పేర్కొంటాం. తినడం ద్వారా వచ్చే అలర్జీలను పక్కన పెడితే... ఇక్కడ చెప్పుకునేవన్నీ చర్మాన్ని ఏదో అంటుకోవడం వల్ల వచ్చే అలర్జీలు. ఇలా వచ్చే సమస్యను ‘కాంటాక్ట్‌ డర్మటైటిస్‌’ అంటారు. వీటిలో కొన్ని చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. ఆందోళన కలిగిస్తాయి. అలాంటి కొన్ని అలర్జీల గురించి తెలుసుకొంటే, వాటితో బాధపడేవారు, దాన్ని పెద్ద సమస్యగా పరిగణించకుండా... అవగాహన పెంచుకొని,

తగిన చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం.



రకరకాల డర్మటైటిస్‌లు (చర్మ అలర్జీలు)

సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌తో  కొందరిలో సబ్బులు, షాంపూలు,  డిటర్జెంట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా అలర్జీలు వస్తుంటాయి.గాజులు, గొలుసులు, ఆభరణాలతో :  తయారైన పదార్థాన్ని బట్టి కొందరు మహిళలకు గాజులు కూడా సరిపడవు.  అవి అంటి ఉండే ప్రాంతం సాధారణంగా మణికట్టు. కానీ అది గాజు కావడంతో... మణికట్టు నుంచి ముంజేతి వరకూ కదులుతూ ఉండటం వల్ల ఆ మొత్తం ప్రాంతం ప్రభావితమవుతుంది. అలాగే మెడలో వేసుకొనే గొలుసులు, చైన్లు, నెక్‌లేస్‌లతోనూ ఇదే ప్రభావం ఉంటుంది. కొందరిలో ఇయర్‌ రింగ్స్‌కు ఉపయోగించే లోహం కారణంగానో డర్మటైటిస్‌ వస్తుంటుంది.



వృత్తులతో :  మన వృత్తుల్లో ఉపయోగించే రకరకాల పదార్థాలతో అలర్జీలతో తమ జీవనోపాధి సైతం ప్రభావితమయ్యేలా సమస్య రావచ్చు. ఉదాహరణకు సిమెంట్, పెయింట్స్‌ వంటి వాటిలో ఉండే రసాయనాలతో ఒంటికి అలర్జీ ఏర్పడితే ఆ వ్యక్తి ఆరోగ్య జీవితమే గాక... కుటుంబ సభ్యుల ఆర్థిక జీవనమూ ప్రభావితమవుతుంది. అలాగే కొందరికి ఫొటోగ్రాఫిక్‌ రసాయాలు, వారి వృత్తిలో భాగంగా ఉపయోగించే పదార్థాలతోనూ రావచ్చు. ఇక లోహాలతో నికెల్‌తో చేసిన ఉత్పాదనలు హెయిర్‌డ్రస్సింగ్, నర్సింగ్, కేటరింగ్, నికెల్‌ ప్లేటింగ్, వస్త్ర పరిశ్రమలో ఎక్కువ. కాబట్టి ఈ లోహపు ఉత్పాదనలతో వ్యవహరించే వృత్తుల్లో ఉన్నవారికి ‘నికెల్‌ డర్మటైటిస్‌’ ఎక్కువ.



రైతులకు : కొందరు రైతులకు తాము ఉపయోగించే ఎరువులు, పురుగుమందులలోని రసాయనాలతో అలర్జీలు వస్తే అది కూడా వారి జీవితాన్ని దుర్భరం చేస్తుంది.



సౌందర్య సాధనాలతో : ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. కొందరికి బొట్టుబిళ్లలతో అలర్జీ రావడం కనిపిస్తుంది. దీనికి కారణం బొట్టు బిళ్ల వెనక అంటించేందుకు ఉపయోగించే గమ్‌లోని రసాయనం సరిపడకపోవచ్చు. చాలామందిలో హెయిర్‌డై సరిపడదు. దానిలో ఉండే పారాఫినైల్‌యెనిడయామైన్‌ వంటి రసాయనాలు అటు వాసన పరంగానూ, ఇటు తమ స్వభావపరంగానూ చాలా ఘాటుగా ఉండటమే కారణం. కొందరిలో షేవింగ్‌ క్రీమ్స్, షేవింగ్‌ లోషన్స్‌లోని రసాయనాల వల్ల చెంపలు, గదమ (చుబుకం) దెబ్బతింటాయి. సౌందర్యసాధానాలలోని రెసార్సిన్, బాల్సమ్‌ ఆఫ్‌ పెరూ, పర్‌ఫ్యూమ్స్‌లో వాడే రసాయనాలు, వాటిలో స్వల్పంగా ఉండిపోయే తారు వంటి పెట్రోలియమ్‌ వ్యర్థాలతో అలర్జీ కలిగి కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ వస్తుంటుంది.



కంటి సౌందర్యసాధనాలతో : కొందరికి ఐ–షాడోస్, మస్కారా వంటి వాటితో అలర్జీలు వస్తాయి. ఇక కంటికి ఉపయోగించే మందులైన నియోమైసిన్, క్లోరాంఫెనికాల్, సల్ఫోనమైడ్స్‌తో పాటు అవి దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగించే పారాబెన్స్‌ వంటి సరాయనాలు కనురెప్పకు అలర్జీ కలిగించి ‘ఐలిడ్‌ డర్మటైటిస్‌’కు దారితీయవచ్చు.  



ఉల్లి, వెల్లుల్లి, వంటింటి దినుసులతో : వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తుండటం, ఉల్లి తగలడం వంటివి జరిగినప్పుడు కూడా అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఒలిచే వారిలో గోరు మూలం లేదా వేలికీ, గోటికీ మధ్యనున్న చర్మం త్వరగా ప్రభావితమై మంట రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వెల్లుల్లి లేదా ఉల్లిలోని అలిసిన్‌ అనే రసాయనం సరిపడకపోవడమే ఇందుకు కారణం. కొన్ని కూరగాయలు కోస్తున్నప్పుడు లేదా వాటిని హ్యాండిల్‌ చేస్తున్నప్పుడు సరిపడకపోవడంతో వచ్చే అలర్జీలను అందరికీ తెలిసే సాధారణ పరిభాషలో ‘వెజిటబుల్‌ డర్మటైటిస్‌’ అంటారు.



లక్షణాలు

ఎగ్జిమాగా పేర్కొనే అలర్జీలు దురదతో కనిపిస్తాయి. కొన్ని అలర్జీతో ప్రభావితమైన ప్రాంతం నుంచి నీళ్లలా స్రవిస్తుండటం, ఆకృతిలో చర్మం పగుళ్లు బారడం, పొట్టు రాలుతున్నట్లుగా ఉండటం, గాయం విస్తరిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలికంగా ఉండే అలర్జీలలో అర్టికేరియా (చర్మంపై ర్యాష్‌లా) వస్తుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవన్నీ అలర్జిక్‌ రియాక్షన్‌ తీవ్రతను బట్టి ఉంటాయి. కాంటాక్ట్‌ డర్మటైటిస్‌లోని లక్షణాలు అన్నీ ఒకేలా ఉండవు. తీవ్రతను బట్టి, అలర్జీ కలిగించే పదార్థాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్రభావితమైన చర్మం ప్రాంతంలో కొందరికి ఏదో కుట్టిన ఫీలింగ్‌ ఉంటుంది. మరికొందరికి దురద, తరచూ నొప్పి ఉంటాయి. ఇక చర్మంపై ఏర్పడే మచ్చలు ఎర్రబారడం మొదలుకొని చిన్న పగుళ్లు, గుల్లలు, దద్దుర్లు, తీవ్రమైన గాయాల్లా కనిపించే పగుళ్ల వరకు కనిపిస్తాయి. మరికొందరిలో చర్మం కాలినట్లుగా కావచ్చు.



నివారణ

మనకు ఏదైనా అలర్జిక్‌ రియాక్షన్‌ కనిపించగానే దానికి నిర్దిష్టంగా ఫలానా వస్తువు వల్లనే అనే నిర్ధారణకు వచ్చేయడం సరికాదు. చాలా సునిశితంగా కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం రోగి ఇంటి దగ్గర ఉపయోగించే వస్తువుల జాబితాను డాక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది.  అలర్జీకి గురైన వ్యక్తి పనిచేసే చోట ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే సౌందర్యసాధనాలు, రెజిన్‌ ఉత్పాదనల గురించి ఆరాతీయాల్సి ఉంటుంది.



కొన్ని సూచనలు...

మనకు ఏ పదార్థంతో అలర్జీ వస్తుందో దాని నుంచి దూరంగా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ప్రక్రియ. ఉదాహరణకు డిటర్జెంట్స్‌తో అలర్జీ ఉన్నప్పుడు చేతులు కేవలం నీళ్లతో మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి.  ఒకవేళ దాని అవసరం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలతో దాన్ని వాడాలి. ఉదాహరణకు హెయిర్‌–డై తో చేతులకు అలర్జీ వస్తుంటే మంచి గ్లౌస్‌ ధరించి దాన్ని వాడుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి మనం తగిన మెళకువలను అనుసరిస్తూ ఈ సమస్యను అధిగమించాలి. సమస్య వచ్చిన చోట తక్కువ మోతాదులో లేదా ఓ మోస్తరు మోతాదులో (మైల్డ్‌–మాడరేట్‌) కార్టికోస్టెరాయిడ్‌ ఉన్న మోమ్యాటోసోన్‌ ఫ్యూరోయేట్‌ వంటి  క్రీమ్స్‌ రాస్తుండాలి. అయితే దీని మోతాదును కేవలం చర్మవైద్య నిపుణుల సిఫార్సు మేరకే వాడాలి.

 

చేతులకు డర్మటైటిస్‌ వచ్చినప్పుడు నాన్‌–పర్‌ఫ్యూమ్‌ హ్యాండ్‌ క్రీమ్‌ వాడవచ్చు. చేతులను శుభ్రపరచడానికి చర్మాన్ని పొడిబార్చని మైల్డ్‌ సోప్‌ వాడటం మేలు. తీవ్రమైన, శక్తిమంతమైన డిటర్జెంట్లు వాడటం మానేస్తే మంచిది. మనకు సరిపడని వస్తువులతో పనిచేయాల్సి వచ్చినప్పుడు డబుల్‌ గ్లౌజ్‌ వేసుకోవడం ఒక మంచి నివారణ ప్రక్రియ. షాంపూ, హెయిర్‌ డై వంటివి ఉపయోగించే సమయంలోనూ డబుల్‌ గ్లౌజ్‌ వాడటం మంచిదే. హెయిర్‌ ఆయిల్స్, స్టైలింగ్‌ జెల్స్‌ వంటివి రాసుకునేప్పుడు నేరుగా ఉత్తిచేతులతోనే రాసుకోవడం అంత సరికాదు. బత్తాయిలు, నారింజపండ్లు ఒలుస్తున్నప్పుడు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటి పొట్టు తీసుకున్నప్పుడు అది మనకు సరిపడకపోతే చాలాసేపు ఆ పనిని చేయడం సరికాదు.



చికిత్స

లక్షణాలను, వాటి తీవ్రతను బట్టి దాన్ని తగ్గించే చికిత్స అందించాల్సి ఉంటుంది. స్థూలంగా అలర్జీ వస్తువుల నుంచి దూరంగా ఉండటం, స్టెరాయిడ్స్, లక్షణాలను బట్టి చికిత్స అనే మూడు అంశాల మీదే ఈ సమస్యకు చికిత్స ఉంటుంది.  తక్షణం కనిపించే డర్మటైటిస్‌లకు క్రీములు, దీర్ఘకాలిక సమస్యలకు ఆయింట్‌మెంట్స్‌ ఉపయోగించాల్సి రావచ్చు. మందుల ఎంపిక ప్రక్రియలో అలర్జీ ఏ మేరకు వచ్చిందన్న అంశంతో పాటు, ఏ ప్రదేశంలో వచ్చింది, తీవ్రత ఎంత అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఒకింత ఆధునిక చికిత్సలైన పూవా, గ్రెంజ్‌ రేస్, ఇమ్యూనోసప్రెసివ్‌ డ్రగ్స్, కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్‌ను కూడా డాక్టర్లు వాడుతుంటారు.

డాక్టర్‌ స్వప్న ప్రియ

కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌ కేర్‌ హాస్పిటల్స్,

బంజారాహిల్స్,  హైదరాబాద్‌  




మెటల్‌ అలర్జీలు

బటన్స్, నాణేలు, బకిల్స్‌ వంటి వాటితో : మన జేబులో ఉండే చిల్లర నాణేలతో కూడా కొందరికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ప్యాంట్‌ బటన్‌ / బెల్ట్‌ బకిల్‌లో ఉండే నికెల్‌ లోహం తాకి ఉండే పొట్ట భాగంలోనూ అలర్జీ రావచ్చు. అది బటన్‌ / బెల్ట్‌బకిల్‌ ఒరుసుకుపోవడం వల్ల వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ సాధారణంగా నాణేలు లేదా బటన్స్‌ లేదా బకిల్‌లో ఉండే నికెల్‌ లోహం వల్ల ఆ అలర్జీ వస్తుంది. ఈ లోహం ఉండే రిస్ట్‌వాచీలు, కళ్లజోళ్ల ఫ్రేమ్‌లతోనూ అవి తగిలే ప్రాంతంలో డర్మటైటిస్‌ వచ్చే అవకాశం ఉంది.  మిగతా అన్ని లోహాలతో పోలిస్తే కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ను ప్రేరేపించే శక్తి నికెల్‌ లోహానికి చాలా ఎక్కువ. మహిళలు చెవి కమ్మలు, చెవి దుద్దులు, ఇతర ఇయర్‌ రింగ్స్‌ ధరిస్తారు కాబట్టి పురుషులతో పోలిస్తే  ‘నికెల్‌ డర్మటైటిస్‌’ ప్రమాదం వారికే ఎక్కువ.



క్రోమియం లోహంతో : మన భూమి ఉపరితలం (క్రస్ట్‌)లో అత్యధికంగా లభ్యమయ్యే  లోహాలలో అత్యంత ముఖ్యమైనది క్రోమియం. సాధారణంగా ఏదైనా సరిపడకపోవడం వల్ల కనిపించే డర్మటైటిస్‌లలో ‘క్రోమియం సెన్సిటివిటీ’ కేసులు ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం వాడే డిటర్జెంట్స్, బ్లీచింగ్‌ ఏజెంట్లు, షేవింగ్‌ క్రీములు, షేవింగ్‌ లోషన్లలో క్రోమియం ఎక్కువ. కొన్ని చర్మపు ఉత్పాదనల  (ముఖ్యంగా షూస్‌) ప్రాసెసింగ్‌లో దీన్ని వాడతారు. అలాగే పసుపుపచ్చ, నారింజ రంగులో ఉండే ఇంటి పెయింట్స్‌లో, ప్రింటింగ్‌ పరిశ్రమలో, ఫొటోగ్రఫీలో, ఏదైనా లోహం తుప్పు పట్టకుండా వాడేందుకు ఉపయోగించే పూతల్లో (యాంటీ రస్టింగ్‌ ఏజెంట్స్‌)లో క్రోమియం ఎక్కువ. పై ఉత్పాదనలను వాడే వారు తమకు ఏదైనా సమస్య వస్తే అది క్రోమియంతో కావచ్చని భావించి జాగ్రత్తగా ఉండాలి.



కోబాల్ట్‌ లోహంతో : దీన్ని సాధారణంగా నికెల్‌తో కలిపి తయారు చేసే చాలా ఉత్పాదనల్లో ఉపయోగిస్తారు. లోహాలన్నింటిలో నికెల్‌ చాలా ఎక్కువగా అలర్జీలను కలగజేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే నికెల్‌తో పాటు కోబాల్ట్‌ కలిసే ఉత్పాదనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.  కోబాల్ట్‌ కారణంగా హెయిర్‌ డైలు ఉపయోగించేవారిలో, చాలా కఠినమైన లోహాలతో తయారయ్యే డ్రిల్లింగ్‌ టూల్స్‌ ఉపయోగించేవారిలో, సెరామిక్‌ పరిశ్రమలోని వారిలో, గ్లాస్, మెటల్‌ అల్లాయ్స్, పింగాణీ వంటి పాత్రల తయారీ రంగాలలో ఉన్నవారికి అలర్జీలు వచ్చే అవకాశాలు  ఒకింత ఎక్కువ.



అల్యూమినియంతో : ఈ లోహం చాలావరకు సురక్షితం. అయితే కొన్ని సందర్భాల్లో అల్యూమినియం ఉన్న కొన్ని పూత మందులు వాడినప్పుడు చాలా అరుదుగా డర్మటైటిస్‌ రావచ్చు.



పాదరసంతో : ఇది జింక్, తగరం, వంటి లోహాలతో ఎక్కువగా కలుస్తుంది. ఆ ఉత్పాదనలను పంటికి వేసే సిమెంట్‌ తయారీలో ఉపయోగిస్తారు. అది కొందరికి అలర్జీక్‌ రియాక్షన్‌ను కలిగించవచ్చు.



బంగారంతో : ఈ లోహం చాలా మందికి ప్రియమైనది. దాదాపు ఆభరణాల్లో చాలావరకు దీనితోనే తయారవుతాయి. దీనితో వచ్చే అలర్జిక్‌ రియాక్షన్‌ చాలా అరుదే అయినా... కొందరిలో బంగారం కూడా అలర్జీక్‌ రియాక్షన్‌ను కలిగించవచ్చు. ఆభరణాలతో పాటు దీన్ని పంటిపైన వాడే తొడుగులు (క్రౌన్స్‌), డెంటల్‌ ఫిల్లింగులు, దంత చికిత్సలో వాడే చాలా వస్తువుల్లో కూడా బంగారాన్ని వాడుతుంటారు. వాటి వల్ల కొందరిలో అలర్జిక్‌ రియాక్షన్‌ కనిపిస్తుండవచ్చు.  ఇక్కడ పైర్కొన్న లోహాలతో పాటు ప్లాటినమ్, జింక్, రాగి వంటి వాటితోనూ కొన్ని సందర్భాల్లో అలర్జీలు కనిపిస్తాయి.



రబ్బర్‌ డర్మటైటిస్‌ : మనం వాడే చాలా ఉత్పాదనల్లో రబ్బర్‌ ఉంటుంది. చేతి తొడుగులు (గ్లౌవ్స్‌), షూస్, మాస్కులు, స్లిప్పర్లు ఇంకా ఎన్నెన్నో రబ్బర్‌తో తయారవుతాయి. రబ్బర్‌తో  అలర్జీ ఉన్నప్పుడు సాధారణంగా చర్మం ఎర్రబారడం మొదలుకొని చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్‌ మొదలుకొని తీవ్రంగా పగుళ్ల వరకు ఈ అలర్జిక్‌ రియాక్షన్‌ తీవ్రత ఉంటుంది. రబ్బర్‌తో వచ్చే రియాక్షన్‌లో చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం వంటి లక్షణాన్ని గమనించనప్పుడు అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్‌ రబ్బర్‌ హ్యాండ్‌ / ఫీట్‌’ అని వ్యవహరిస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top