షారుక్‌ఖాన్‌ శిష్యుడు

Special story on  Bollywood actor Sushant Singh Rajput - Sakshi

యంగ్‌ బాలీవుడ్‌ –7 / సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

గురువులకు శిష్యులు దొరకడం విశేషం కాదు. శిష్యులకు గురువు దొరకడమే విశేషం. ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ చూసి చిన్నప్పుడు హీరో కావాలనుకున్నాడు సుశాంత్‌. షారుక్‌లా ఢిల్లీలో చదువుకున్నాడు. షారుక్‌లా థియేటర్‌ చేశాడు. షారుక్‌లా టీవీల్లో యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి షారూక్‌లా హీరో అయ్యాడు. సినిమాలు కుర్రాళ్లను పాడు చేస్తాయని కొందరు అనొచ్చు. సినిమాలు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లను కూడా ఇస్తాయి.

మహేంద్ర సింగ్‌ ధోని బయో పిక్‌ తీయాలి. కుర్రాడు చాకులా ఉండాలి. తెర మీద బ్యాట్‌ పట్టుకుని నిలుచుంటే ఖడ్గం పట్టుకున్న వీరుడిలా ఉండాలి. చూపు నిశితంగా ఉండాలి. దృష్టి లగ్నమై ఉండాలి. అతడు అచ్చు క్రీడాకారుడిలా ఉండాలి. అదే సమయంలో అందరికీ నచ్చే హీరోలా కూడా ఉండాలి. ఇన్ని అర్హతలు ఉన్నవాడు ఎవరు? అని వెతికితే వచ్చిన పేరు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అని తేలింది. ‘నాకు ఇంకో అర్హత కూడా ఉంది’ అన్నాడు సుశాంత్‌. ‘ఏమిటది?’ అని అడిగితే ‘ధోని బిహారి. నేనూ బిహారి. మాది పాట్న’ అని జవాబు. ఒక ప్రాంతపు ఆత్మ ఆ ప్రాంతం వాడికే తెలుస్తుంది అన్నట్టుగా సుశాంత్‌ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. సూపర్‌ హిట్‌ కొట్టాడు. అయితే ఆ హిట్‌ ఊరికే వచ్చి చేతుల్లో పడింది మాత్రం కాదు.

తల్లి మరణం
జీవితం ఒక దెబ్బ కొట్టడానికి ఎంచుకునే క్షణాలు అనూహ్యంగా ఉంటాయి. సుశాంత్‌ జూనియర్‌ ఇంటర్‌లో ఉండగా తల్లి చనిపోయింది. తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు మంది సంతానం. మొదటి నలుగురు ఆడపిల్లలు. చివర పుట్టింది సుశాంత్‌. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కనుక సహజంగానే అమ్మ ముద్దునంతా ప్రేమనంతా పొందుతూ పెరిగాడు. తల్లిదండ్రులు ఐదుమందినీ సమానంగా పెంచారు. సుశాంత్‌ అక్క నీతు సింగ్‌ స్టేట్‌ లెవల్‌ క్రికెట్‌ ప్లేయర్‌గా ఎదిగింది. ఒక అక్క క్రిమినల్‌ లాయర్‌. సుశాంత్‌ కూడా ఏదైనా ప్రత్యేకమైనది సాధిస్తాడని తల్లి అనుకునేది.

ఆమె ఆశించినట్టే సుశాంత్‌ చిన్నప్పటి నుంచి స్టేజ్‌ ఎక్కి డాన్సులు చేయడం, సినిమా యాక్టర్లని ముఖ్యంగా షారుక్‌ఖాన్‌ని ఇమిటేట్‌ చేయడం చేసేవాడు. తాను భవిష్యత్తులో ఏం చేసినా తల్లి గర్వపడేలా చేస్తానని అనుకునేవాడు. అటువంటిది ఆమె మరణం అతనికి, కుటుంబానికి పెనుఘాతంలా మారింది. ఎంతగా అంటే ఆమె జ్ఞాపకాలు ఉన్న పాట్నా నగరాన్నే వాళ్లు విడిచిపెట్టి వెంటనే ఢిల్లీకి మారిపోయారు. సుశాంత్‌ సీనియర్‌ ఇంటర్‌ ఢిల్లీలో చదివాడు. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లో 7వ ర్యాంక్‌ సాధించి ఢిల్లీ ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరాడు. అన్నీ సరిగ్గా జరిగి ఉంటే అతడిప్పుడు ఏ అమెరికాలోనో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా మిగిలి ఉండేవాడు. కాని విధి కొందరి నుదుటన లిఖించేది వేరు.

డాన్స్‌ సుశాంత్‌ డాన్స్‌
సుశాంత్‌కు చిన్నప్పటి నుంచి డాన్స్‌ పిచ్చి. ఢిల్లీలో ఇంజనీరింగ్‌ చదువుతూనే కొరియోగ్రాఫర్‌ షమిత్‌ దగ్గర డాన్స్‌ క్లాసులకు చేరాడు. చాలా వెంటనే డాన్స్‌ నేర్చుకున్నాడు. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో గ్రూప్‌ డాన్సర్‌లలో ఒకడిగా డాన్స్‌ చేశాడు. చాలా షోస్‌లో పాల్గొన్నాడు. షమిత్‌ ఇతణ్ణి గమనించి నీలో ఏదో టాలెంట్‌ ఉంది యాక్టింగ్‌లో ట్రయ్‌ చెయ్‌ అని చెప్పాడు. వెంటనే సుశాంత్‌ ఢిల్లీలో యాక్టింగ్‌ నేర్పించే  బేరీ జోన్స్‌ దగ్గర యాక్టింగ్‌ క్లాసుల్లో చేరాడు. మెల్లగా ఇదే తన చోటని అతనికి అర్థమైపోయింది. థర్డ్‌ ఇయర్‌ ఇంజనీరింగ్‌లో ఉండగా తండ్రికి చెప్పేశాడు– నాన్నా ఇంక చదవను.. ముంబై వెళ్లిపోతాను అని. తండ్రి ఎస్‌ చెప్పలేదు. అలాగని నో కూడా చెప్పలేదు. సుశాంత్‌ ముంబై చేరుకున్నాడు.

కొనసాగిన భిక్షాటన
విద్యను అర్థించాలి. గురువు నుంచి భిక్షలా పొందాలి. సుశాంత్‌ ముంబై చేరగానే స్టుడియోల చుట్టూ తిరక్కుండా మళ్లీ అక్కడి థియేటర్‌ గ్రూప్‌ అయిన ‘ఏక్‌జుటా’లో చేరాడు. ఒకటిన్నర సంవత్సరం నాటకాలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు అతడు టీవీవాళ్ల దృష్టిలో పడ్డాడు. అది కూడా బాలాజీ టెలిఫిల్మ్స్‌ వారి దృష్టిలో. తన హీరో షారుక్‌ ఖాన్‌లానే సుశాంత్‌ కూడా మొదట టీవీ హీరో అయ్యాడు. అతడు నటించిన ‘పవిత్ర రిష్టా’ పెద్ద హిట్‌. 300 ఎపిసోడ్స్‌లో నటించి ఇంటింటి హీరో అయ్యాడు. ఆ తర్వాత రెండు డాన్స్‌ షోలలో పాల్గొన్నాడు. కాని ఆ అనుభవమంతా కెమెరాను అర్థం చేసుకోవడానికి అతనికి పనికొచ్చింది. ఒక్కసారి అది తెలిసిపోయాక ఇక అక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదని గ్రహించి సినిమాల వైపు దృష్టి పెట్టాడు. అలా అతడికి వచ్చిన తొలి సినిమా ‘కాయ్‌ పొ చె’.

భిన్నమైన ఎంపిక
సుశాంత్‌ చేసిన భిన్నమైన ఆలోచన ఏమిటంటే ఆడే పాడే కమర్షియల్‌ హీరోలాగా కనిపించాలని అనుకోకపోవడం. అందుకే అతడు ‘కాయ్‌ పొ చె’లో అతడొక పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. క్రికెట్‌ రంగంలో రాజకీయాల వల్ల బలైన ఒక బ్యాట్స్‌మెన్‌లా అతడి నటన అందరికీ నచ్చింది. ఆ వెంటనే యువత ఒక ప్రయోగంగా చూస్తున్న లివ్‌ఇన్‌ రిలేషన్‌ను చర్చించే ‘సుద్ధ దేశీ రొమాన్స్‌’లో  హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్‌ అయ్యింది. అప్పుడు అతనికి రాజ్‌ కుమార్‌ హిరాణి రూపంలో జాక్‌పాట్‌ తగిలింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘పికె’లో ముఖ్యపాత్రకు అంటే అనుష్కకు ప్రియుడిగా నటించాడు. ఆ సినిమా అతడి ప్రెజెన్స్‌ను బాలీవుడ్‌లో స్థిరపరిచింది. మిస్టర్‌ ధోని విజయం అతడికి పదేళ్ల కెరీర్‌ ఇచ్చింది.

ఫ్లాపుల తర్వాత
సుశాంత్‌ నటించిన ‘రాబ్తా’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచరియా’ సరిగ్గా ఆడలేదు. కాని అతడు ధైర్యం చేసి ముసలిపాత్రలో కనిపించడానికి సిద్ధపడి నటించిన తాజా చిత్రం ‘చిచోరే’ సూపర్‌హిట్‌ అయ్యింది. వంద కోట్లు వసూలు చేసింది. అందులో అతడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన కుమారుడికి తాను జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్‌ ఎదుర్కొన్నాడో చెప్పి ధైర్యం నింపుతాడు. అది ప్రేక్షకులకు నచ్చింది.

సుశాంత్‌ సోలో హీరోగా నటించిన రెండు సినిమాలు ‘డ్రైవ్‌’, ‘దిల్‌ బేచారా’ 2020లో ప్రేక్షకులను పలకరించనున్నాయి. సుశాంత్‌ మితభాషి. ప్రొఫెషనల్‌ యాక్టర్‌. తన పని తాను చూసుకొనే స్వభావం ఉన్నవాడు. టీవీలో తనతో కలిసి నటించిన అంకితా లోఖండేతో ఆరేళ్లు సహజీవనం చేశాడు. అయితే వారు విడిపోయారు. బాలీవుడ్‌ యువసైన్యంలో సుశాంత్‌ ఒక ముఖ్యమైన యోధుడుగా ఉన్నాడు. ఇతడు మరిన్ని జైత్రయాత్రలు తప్పక చేస్తాడు.

– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top