గృహమే కదా స్వర్గసీమ

Special Story About Wife And Husband Relationship In House - Sakshi

ఏప్రిల్‌ 14 వరకూ ఇల్లు కదలకూడదు. లాక్‌డౌన్‌. ఆ తర్వాత ఆ తేదీ పొడిగింపు జరగవచ్చు. జరక్కపోనూ వచ్చు. ఇంట్లో ఉండటం బోర్‌ అని కొందరు అంటున్నారు. అరె ఇంట్లో ఉండటం ఇంత బాగుంటుందా అని కొందరు కనుగొంటున్నారు. ఇంటిని ఇష్టపడటమే ఇప్పుడు అందరూ చేయవలసింది. ఇంటిలో సమయాన్ని ఆనందమయం చేసుకోవడమే ఇప్పుడు అవసరమైనది. ఈ నేపథ్యంలో ఇంటి చుట్టూ ఉండే కొన్ని పాటలను, ఇంటిలోపలి పదనిసనలను గుర్తు చేసుకుందాం.

ఇంటికి వాకిలి ఉంటుంది. వాకిలికి తోరణం ఉంటుంది. గుమ్మం దాటితే ఇల్లాలి చిర్నవ్వు స్వాగతం ఉంటుంది. పరుగు పరుగున పిల్లలు వచ్చి ఇచ్చే చల్లని కావలింత ఉంటుంది. వారి సమక్షాన ఇంటిలో విశ్రమిస్తే శాంతి ఉంటుంది. స్వర్గం వేరే ఎక్కడో ఎందుకు ఉంటుంది? ప్రయత్నించాలిగాని అది మన ముంగిట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. అందుకే సినీ కవి– ‘గృహమే కదా స్వర్గ సీమ’ అన్నాడు.
జపమేల తపమేల
వ్రతపూజలేల
సాధించితే ప్రేమ సామ్రాజ్యమౌ
గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నాడు.
‘వేరే ఏ పనీ లేనప్పుడు వెళ్లదగ్గ ఒకే ఒక్క చోటు– ఇల్లు’ అని గ్రాఫిటీలో ఎవరో రాశారు. ఇంటిని లోకువ చేసేవారున్నారు. చులకనగా చూసేవారున్నారు. ‘కొంప’ అని వ్యాఖ్యానించేవారున్నారు. కాని అది చల్లని ‘నివాసము’ అని గ్రహించినవారు, ‘లోగిలి’గా, ‘కుటీరం’గా, ‘నిలయం’గా భావించేవారు దాని విలువను కాపాడుకుంటూ వచ్చారు. దాన్ని పొదరిల్లుగా మలుచుకుని సుఖపడ్డవారున్నారు.
మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది
పొదరిల్లు మాది...
పిల్లలు మట్టిలో ఆడుకుంటూ మొదట చేసేపని ఇల్లు కట్టడమే. అది ఒక అసంకల్పిత చర్య. మనిషికి భద్రత ఇచ్చేది, బతుకుని ఇచ్చేది గూడే కనుక అది అలా వేలాది సంవత్సరాలుగా జన్యువులలో ఇమిడిపోయింది. 
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు
వయసుకొచ్చిన జంట పెళ్లి గురించి ఆలోచిస్తుంది సరే, ఆ వెంటనే ఆలోచించేది ఇంటి గురించే కదా. తాము కలిసి గడపబోయే తావు గురించే కదా. ‘సంసారం సంసారం ప్రేమసుధాపూరం నవజీవన సారం’ అని జీవితాన్ని మొదలెట్టాలన్నా, ‘హాయిగా ఆలుమగలు కాలం గడపాలి’ అని పాడుకోవాలన్నా, ‘ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో’ అని ఒకచోట ఉండిపోవాలన్నా, ‘కాపురం కొత్త కాపురం... ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం’ అంటూ కాపురం పెట్టాలన్నా వారికి కావలసింది ఇల్లే. ఒంటరి మనిషి అసంపూర్ణుడు. అతడు తోడు తీసుకొని ‘ఒక ఇంటివాడైనప్పుడే’ పరిపూర్ణుడు. అందుకే కవి–
పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని
చల్లగా కాలం గడపాలోయ్‌
ఎల్లరు సుఖమును చూడాలోయ్‌... అన్నాడు.
మన దేశంలో అమ్మాయి భర్తతో పాటు భర్త ఇంటికి వచ్చి కోడలు అవుతుంది. ఇల్లు నిర్మించుకుంటుంది. అయితే ఈ ‘ఇంటి సౌఖ్యం’ తెలిసిన మగవారు కూడా ఉంటారు. వీరు ఇల్లరికం వెళతారు. అంతేనా? తామూ ఇక ఇంటివారమైనందుకు పాట కూడా పాడతారు...
ఇల్లరికంలో ఉన్న మజా
అది అనుభవిస్తేనే తెలియునులే
భలే చాన్సులే
ఇక ఇంట్లో జరిగే సరసాలు, విరసాలకు అంతు ఉండదు. ఆమె అలిగితే ‘రావోయి చందమామా మా వింతగాథ వినుమా’ అని చంద్రుడితో చెప్పుకోవాలి. అతను అలిగితే ‘అలిగిన వేళనే చూడాలి’ అని బుజ్జగించాలి. ఆమెను ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పొగడాలి. అతణ్ణి ‘కోవెల ఎరగని దైవం కలడని’ అని ప్రశంసించాలి. అప్పుడే ఆ ఇల్లు పాజిటివ్‌ ఎనర్జీతో, శాంతితో, ఉత్సవంతో నిండుతుంది. పిల్లలు తోడవుతారు. 
పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో..జో.. జో అని ఆరిందాలా జోలపాడి నిద్రపుచ్చి మురిపెం పుట్టిస్తారు.

ఇల్లు ఎంత అందమైనది. పట్టించుకోకపోతే అక్కడ ఏ అందమూ కనిపించదు. తరచి చూస్తూ ప్రతి చిన్న విషయమూ సుందరమైనదే. అలా పెరటిలోకి నడిస్తే, బాల్కనీలోకి తొంగి చూస్తే పూలతో నవ్వే మొక్క కనిపిస్తుంది. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యపరుస్తుంది. డాబా మీదకు వెళ్లి నిలిచినప్పుడు ఒంటికి తెమ్మెర తాకి ‘ఎచటి నుంచి వీచెనో ఈ చల్లనిగాలి’ అని పాడుకోబుద్ధవుతుంది. నేటి ఖాళీ రోడ్ల చివరన ఆకాశంలో ఉదయించే చంద్రుణ్ణి చూసి ‘మామా చందమామ వినరావా నా కథ’ అని నివేదించుకోవాలనిపిస్తుంది. ఇంటి విలువ తెలిసొచ్చిన ‘కరోనా’ రోజులివి. ఇల్లే ఆది, అంతం అని తెలియచేసిన రోజులు కూడా. మన కుటుంబ సభ్యులే శాశ్వత శ్రేయోభిలాషులు. సహ ప్రయాణికులు. వారితో కలిసి ఉండటమే భాగ్యము. వారి మనసెరిగి ప్రవర్తించడమే భోగం. ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఇల్లు క్షేమంగా ఉంటే సమాజం క్షేమం. సమాజం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది.
కనుక ఇప్పుడు ఇంటిని తిట్టుకోకూడదు.
ప్రేమించాలి. ఇంట్లో ఉండే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
పాలూ మీగడ పెరుగూ ఆవడ
ఒకటికి ఒకటై రెండూ తోడై
కలసిన జోడా నేనూ మా ఆవిడ – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top