ఇల్లు ఖాళీ చెయ్‌

Special Story About Rehana Fathima From Kerala - Sakshi

మంచి ఉద్యోగం. మాట వినే జీవిత సహచరుడు. రత్నాల్లాంటి పిల్లలు. లోకంతో ఇక పని ఏముందీ? కానీ రెహానా.. లోకంతోనే పని పెట్టుకుంది. దారులు వేసే పని! లోకం ఊరుకుంటుందా? ‘ఇల్లు ఖాళీ చెయ్‌’ అంది.

సూర్య గాయత్రి అనే పేరంటే ఇష్టం రెహానా ఫాతిమాకు! అది ఆమె కలం పేరు కాదు. ఆమెకే ఇంకో పేరు. తనకై తను పెట్టుకున్నది. సంఘ సంస్కర్త చలం గారి భాషలో.. ఈ సాయిబుల పిల్లకు హైందవం, మహమ్మదీయం అనేవి లేవు. ‘నువ్వు తక్కువ, నేను ఎక్కువ’ అంటుండే మగ సమాజం మీద అస్సలు మంచి ఉద్దేశం లేదు. మొదట అడుగుతుంది.. ‘ఏమిటిది!’ అని. ‘నీకేంటి చెప్పేది?’ అన్నట్లు చూస్తే, తనేమిటో చూపిస్తుంది. తను అంటే తను కాదు. స్త్రీశక్తిగా తను. ‘తత్వమసి’ అనే భావనను నమ్ముతుంది రెహానా. ఎందుకు, ఎవరికి నమస్కారం పెడుతున్నావో తెలుసుకుని నమస్కారం పెట్టమని అర్థం తత్వమసి అంటే. వేదాల్లోని మహావాక్యమిది. స్త్రీని తక్కువ చేసే ఏ విశ్వాసానికీ, సంప్రదాయానికీ రెహానా మర్యాద ఇవ్వదు.

సంఘ సంస్కర్తనని చలం ఏనాడూ చెప్పుకోలేదు. తను చెప్పదలచింది రాసుకుంటూ పోయారు. రెహానా ఫాతిమాను కూడా ‘మహిళా హక్కుల ఉద్యమకారిణి’ అని మనం అంటున్నాం కానీ.. రైట్స్‌ యాక్టివిస్ట్‌నని ఆమె ఎక్కడా చెప్పుకోలేదు. ఆమెను అనుమానించడానికి, అవమానించడానికి, అరెస్టు చేయించడానికి ఒక పేరు కావాలి. అందుకే ‘అల్ట్రా–లెఫ్ట్‌ ఉమన్‌ యాక్టివిస్ట్‌’ అన్నారు! యాక్టివిస్ట్‌ అంటే సరిపోతుంది. ఉమన్‌ యాక్టివిస్ట్‌ అన్నారంటే.. ఉమన్‌ అసలు యాక్టివిస్ట్‌గా ఉండటం ఏంటి అని! ఆలయాల్లోకి ప్రవేశం లేనట్లే.. స్త్రీకి ప్రశ్నించే, నిరసించే, ధిక్కరించే, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉండకూడదని!!

ప్రస్తుతం రెహానా కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె ఎక్కడికీ పారిపోలేదు. కొచ్చిలోనే తన అపార్ట్‌మెంట్‌లోనే.. భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. పెద్ద కేసే పెట్టారు పోలీసులు ఆమె మీద. సెక్షన్‌ 67 (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటింగ్‌ సెక్సువల్లీ ఎక్స్‌ప్లిసిట్‌), సెక్షన్‌ 75 (పనిష్మెంట్‌ ఫర్‌ క్రూయల్టీ టు చైల్డ్‌) ఆఫ్‌ జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌. íపిల్లల్ని హింసించి, పెద్దల్ని చెడగొడుతోందని అరుణ్‌ ప్రకాశ్‌ అనే లాయర్‌ ఫిర్యాదు ఇస్తే పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. కొడుకు, కూతురు తన ఒంటిమీద పెయింటింగ్‌ వేస్తున్న వీడియోను జూన్‌ 19న యూట్యూబ్‌లో, తర్వాత తన ఫేస్‌బుక్‌లో పెట్టుకుంది రెహానా. ఆ వీడియోపైనే లాయర్‌ అభ్యంతరం. 

సమాజం కొన్ని దారులు వేసి ఉంచినప్పుడు ఆ దారుల్లోనే వెళ్లి వస్తుంటే పోలీసులు ఎవరినీ వెతకరు. ‘అల్ట్రా ఉమన్‌’ అనే పేర్లూ రావు. జీవితం సాఫీగా సాగిపోతుంది. రెహానా సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. బి.కాం. చదివింది. ఎం.సి.ఎ. చేసింది. లోకం దారుల్లో ఏదో తేడా కనిపించింది తనకు. దారులు శుభ్రంగా ఉన్నాయి కానీ, మనుషులు నీరసంగా, నిరోమయంగా నడుస్తున్నారు. ముఖ్యంగా మహిళలు.. ‘ఏదారెటు పోతుందో ఎవరికి ఎరుక..’ అని నిస్తేజంగా.. లేని దారుల కోసం కళ్లు తిప్పి చూడటం గమనించింది. ‘మీ ఆశల దారిని నేను నిర్మిస్తాను’ అని పలుగు, పార అందుకుంది. మొదటి దారి ‘కిస్‌ ఆఫ్‌ లవ్‌’. 2014లో. భారతీయ సంస్కృతిని పరిరక్షించే ‘మోరల్‌ పోలిసింగ్‌’కి వ్యతిరేకంగా కొచ్చి కిస్‌ ఆఫ్‌ లవ్‌ ప్రొటెస్ట్‌లో ధైర్యంగా నిలబడింది.

యువతీయువకుల నిరసన ఉద్యమ చుంబనాలకు, కౌగిలింతలకు మద్దతు ఇచ్చింది. రెండో దారి 2016లో. త్రిచూర్‌లో ఓనమ్‌ పండుగకు సాంప్రదాయికంగా అందరూ మగవాళ్లే ఉండే బృందంలో కలిసిపోయి ‘టైగర్‌ డాన్స్‌’ చేసింది. మూడో దారి 2018లో. కోళికోడ్‌లోని ఫరూక్‌ ట్రెయినింగ్‌ కాలేజ్‌ నుంచి వేసింది. కాలేజ్‌లో మగ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గారొకరు మహిళల బ్రెస్ట్‌పై కామెంట్‌ చేశారు. ‘స్త్రీలను తమరు ఇలాగే కదా చూసేది..’ అని అతడి కామెంట్‌లో ఉన్న విధంగా.. నేకెడ్‌ బ్రెస్ట్‌ మీద రెండు వాటర్‌ మిలాన్స్‌ను ఉంచుకుని, ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ప్రొఫెసర్‌ గారి తల కుర్చీలోకి కుచించుకుపోయింది. నాలుగో దారి శబరిమలకు వేసిన దారి. అదే ఏడాది. 

రెహానా ఇప్పుడు వేసింది ఐదో దారి. అయితే ఆ దారిని తన పిల్లల చేత వేయించింది. కంటి ఇన్‌ఫెక్షన్‌తో ఆమె మంచంపై పడుకుని ఉంటే ఆమె ఒంటిపైన అప్పుడే టీనేజ్‌లోకి వస్తున్న కొడుకు, అతడికన్నా చిన్నదైన కూతురు.. ఫీనిక్స్‌ పక్షిని పెయింట్‌ చేశారు. ఆ వీడియో ఆమెపై కంప్లయింట్‌కు కారణం అయింది. అందుకు సమాధానంగా.. ‘స్త్రీ దేహం గోప్యనీయమైనదే భానన కలగకుండా సహజంగా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్త్రీ పట్ల విపరీతాలకు పాల్పడరు’ అని రెహానా అన్నమాట స్త్రీలకైతే ఆర్థం కాకుండా పోదు. రెహానాపై పోలీసులు కేసు పెట్టారని తెలియగానే ఆమె ఉంటున్న తమ క్వార్టర్స్‌ను నెల లోపు ఖాళీ చేసేయాలని బి.ఎస్‌.ఎన్‌. ఎల్‌. సంస్థ నోటీసులు పంపింది. రెహానా ఆ సంస్థ ఉద్యోగే. సోషల్‌ మీడియాలో ఆమె పెడుతున్న పోస్ట్‌లు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణంతో గత మే నెలలోనే బి.ఎస్‌.ఎన్‌.ల్‌. ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. ఈ తొలగింపులను, బెదిరింపులను లెక్క చెయ్యకుండా మళ్లీ ఇంకో దారిని వేసే ప్రయత్నంలో ఉండటం చూస్తే.. రెహానాను ఉద్యమకారిణి అనాలనే అనిపిస్తుంది.. అది ఆమెకు ఇష్టం లేకున్నా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top