కొత్త జీవితానికి శుభాకాంక్షలు

Special Story About New Year Life In Sakshi Family

కొత్త సంవత్సరం వచ్చేది పాతవి వదిలిపెట్టడానికి.12 నెలల– 52 వారాల– 365 రోజుల గత జీవితాన్ని అందులోని అప్రియమైన సంగతులను వదిలి ముందుకు సాగడానికి.కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడం అంటే ఉన్న బంధాన్ని కొత్తగా నిర్వచించుకోవడమే.గొడవలున్న తేదీలను మార్క్‌ చేసిన పాత కేలండర్‌ని పారేద్దాం.సంతోషాలను ప్లాన్‌ చేసుకున్న కొత్త కేలండర్‌ను స్వాగతిద్దాం.హ్యాపీ న్యూ ఇయర్‌.

భార్యతో టైమ్‌ స్పెండ్‌ చేయలేని సక్సెస్‌ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్‌ కాదు. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్‌ కోసం ఇప్పటి లైఫ్‌లోని కంఫర్ట్‌ను పాడుచేసుకుంటున్నారు. లైఫ్‌ పార్టనర్‌ను టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ.

జనవరి 1 మరో రెండు వారాలు ఉందనగా ఆమె ఫోన్‌ చేయడం మొదలుపెట్టింది. ‘చూడండి. ఏదైనా ఉంటే మీరు క్లినిక్‌కు వచ్చి మాట్లాడండి. ఫోన్‌లో మీ కేస్‌ను అసెస్‌ చేయడం కుదరదు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌. ‘కాదు డాక్టర్‌. నాకు మీ దగ్గరకు రావాలంటే భయం. సైకియాట్రి క్లినిక్‌లకు వచ్చేంతగా నేనింకా ప్రిపేర్‌ కాలేదు. మిమ్మల్ని కలవాలి అనుకున్న వెంటనే నా మనసు నీకేమైనా పిచ్చా.. సైకియాట్రిస్ట్‌లను పిచ్చివాళ్లే కలుస్తారు అనడం మొదలెట్టింది’ సైకియాట్రిస్ట్‌కు నవ్వు వచ్చింది. ‘మీరు సినిమాలు ఎక్కువ చూస్తారులాగుంది’ అన్నాడు. ‘అవును. మీకెలా తెలుసు’ ‘సినిమాల్లో పిచ్చివాళ్లను రకరకాలుగా చూపిస్తుంటారు. పిచ్చి అంటే చెట్టెక్కి కూచుని వింత చేష్టలు చేయడం మాత్రమే అని వారి అవగాహన. చూడండి... జలుబు అనారోగ్యమే. కేన్సర్‌ అనారోగ్యమే. రెండూ శరీరానికి వస్తాయి. మనసు విషయంలో కూడా జలుబు స్థాయి ఉంటుంది... కేన్సర్‌ అంత తీవ్రస్థాయి ఉంటుంది. జలుబుకు టేబ్లెట్‌ వేసుకునే మనం మనసులో చిన్న గుబులు వచ్చినప్పుడో, వ్యాకులత పెరిగినప్పుడో, నిర్ణయాల్లో నిలకడ లేనప్పుడో, మనసుకు తగిలిన గాయాలు ఎంతకీ మానలేకపోయినప్పుడో ఎందుకు మందులు వాడము? ఎందుకు సైకియాట్రిస్ట్‌ సలహా తీసుకోము? చెప్పండి’ అటువైపు నిశ్శబ్దం ఆవహించింది. ఆ మరుసటి రోజే ఆమె క్లినిక్‌కు వచ్చింది.

‘నా భర్తకు జనవరి 1న గుడ్‌బై చెప్దామనుకుంటున్నాను డాక్టర్‌’ అందామె. ముప్పై ఐదేళ్లుంటాయి. చామనఛాయలో కొద్దిపాటి బొద్దుగా ఉంది. ఇద్దరు పిల్లలట. అమ్మాయిలు. ‘ఏమిటి.. ఆ డేట్‌ ప్రత్యేకత?’ ‘ఏం లేదు.. కొత్త సంవత్సరం కదా. లైఫ్‌ను కొత్తగా స్టార్ట్‌ చేద్దామని’ ‘అంటే ఇంకో రెండువారాల్లో’ ‘రెండు వారాల్లోనే’ ‘ఆలోచిద్దాం. ముందు మీ సమస్య ఏమిటో చెప్పండి’ అన్నాడు సైకియాట్రిస్ట్‌ సర్దుకుని కూచుంటూ. ఆమె పేరు రాధ. ఊరు కొత్తగూడెం. డెంటిస్ట్రీ చేసింది. పెళ్లయ్యాక హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యింది. అతని పేరు మహేంద్ర. సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌. నల్గొండ సొంత ఊరు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిలో మహేంద్ర చదువు, ఉద్యోగం మొదటి నుంచి పై చేయి అయ్యాయి.

అతను, అత్తామామలు రాధ చదువు గురించి  గొప్ప భావనలో లేరు. డెంటిస్ట్రీ చేసినవాళ్లు చాలామంది ఉంటారని, డాక్టరు కాలేనివారు పంటి డాక్టర్లు అవుతారని, ఆ ప్రొఫెషన్‌లో పెద్ద ఎదుగుదల ఉండదని వారు అందరూ కల్పించిన అభిప్రాయంలో ఉన్నారు. రాధకు డెంటిస్ట్‌గా రాణించాలన్న కోరిక మొదట్లోనే దెబ్బతిన్నట్టయ్యింది. అప్పటికే తను కొత్తగూడెంలో రెండేళ్లు జూనియర్‌ డెంటిస్ట్‌గా ఒక క్లినిక్‌లో పని చేసింది. కాని ఆమె పని తీరు సీనియర్‌ కంటే బాగుండేదని పేషెంట్లు అనేవారు. ఆమె ప్రాక్టీసు విషయం తేలకముందే– ‘నేను చేసుకోవడమే ఆలస్యంగా చేసుకున్నాను. పిల్లలను పోస్ట్‌పోన్‌ చేయొద్దు’ అన్నాడు మహేంద్ర. ఇద్దరు పిల్లలు వెంటవెంటనే పుట్టారు. వారి బాగోగుల్లో ఏడెనిమిదేళ్లు గడిచిపోయాయి.

రాధకు అంతా బాగున్నట్టే అనిపిస్తోంది కానీ ఏమిటో అసౌకర్యం. మహేంద్ర చెడ్డవాడు కాదు. అతనికి పని పిచ్చి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో సీనియర్‌ లెవల్‌లో ఉండటం వల్ల టీమ్‌ను మేనేజ్‌ చేయడం ఒక సమస్యగా, తన పైవారిని హ్యాండిల్‌ చేయడం మరో సమస్యగా సతమతం అయ్యేవాడు. ఉదయం ఎనిమిదిన్నరకు క్యాబ్‌ ఎక్కితే రాత్రి పదికి వచ్చేవాడు. వచ్చినా మళ్లీ ల్యాప్‌టాప్‌ను ముందు పెట్టుకునేవాడు. అత్తామామలు నల్గొండలోనే ఉండిపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో రాధకు తోడు మిగిలింది పనిమనిషే. ఆ పనిమనిషి కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఒక ఇల్లు కాకపోతే మరో ఇల్లు సులభంగా దొరుకుతుందని లెక్కలేనితనం. పిల్లలకు నలతగా ఉన్నా, చటుక్కున హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలన్నా, వాళ్లను సముదాయించాలన్నా రాధకు చాలా కష్టమయ్యేది. వారికి వండటం, తనకు వండుకోవడం, భర్తకు వండిపెట్టడం... ఇవన్నీ చిన్నగా కనిపించే పెద్ద పనులు.

‘నాకు కష్టంగా ఉంది’ అని మహేంద్రతో అంటే ‘ఓపిక పట్టు’ అని అంటాడు. ‘నా కెరీర్‌ కూడా వదులుకున్నాను. ఇంట్లో ఉండి మాత్రం ఏమి బావుకున్నాను’ అని ఆమెకు అనిపించసాగింది. ఫలితంగా తీవ్రమైన డిప్రెషన్‌. చిరాకు. మూడీనెస్‌. కళ్లకింద వలయాలు. పిల్లలను గదమాయించడం. అసలేమిటో అర్థం కానంత హైరానా. చీటికిమాటికి ఏడుపు ముంచుకురావడం. పోయిన జనవరి 1న ‘నెక్ట్స్‌ జనవరి1 నాటికి నువ్వు మన లైఫ్‌ను సెట్‌ చేయాలి’ అని భర్తతో అంది. అతను ‘అలాగే’ అనగలిగాడు కానీ అలా చేయలేకపోయాడు. మళ్లీ జనవరి 1 వచ్చింది. అతనితో అలాగే ఉండిపోతే ఇంకో జనవరి వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉంటుందని ఆమెకు అనిపించింది. ‘అందుకని వదిలేద్దామనుకుంటున్నాను డాక్టర్‌. పేషెంట్ల పళ్లు రిపేర్‌ చేస్తూ నా బతుకు నేను బాగు చేసుకుంటాను’ అందామె. సైకియాట్రిస్ట్‌ పొడుగ్గా ఊపిరి వదిలాడు. జనవరి 1 రావడానికి ఉన్న రెండు వారాల్లో మహేంద్రను మూడుసార్లు పిలిపించాడు సైకియాట్రిస్ట్‌.

‘భార్యతో టైమ్‌ స్పెండ్‌ చేయలేని సక్సెస్‌ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్‌ కాదు. కుటుంబం కోసం కష్టపడుతున్నాననుకుంటున్నారు మీరు. కాని కుటుంబాన్ని కోల్పోయేంతగా పడే కష్టంలో అర్థం లేదు. మీ పని తగ్గించుకోవాలి. మీ వైఫ్‌కు ఆమె పని ఆమెను చేయనివ్వాలి. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్‌ కోసం ఇప్పటి లైఫ్‌లోని కంఫర్ట్‌ను పాడు చేసుకుంటున్నారు. లైఫ్‌ పార్టనర్‌ను టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ’ అని రాధ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం చెప్పాడు అతనితో. మహేంద్ర మొదట షాక్‌ తిన్నా మెల్లగా సర్దుకున్నాడు. అతను తీసుకున్న కొత్త సంవత్సర నిర్ణయాల్లో ప్రధానమైనది భార్యను గౌరవించే ఇల్లుగా తన ఇంటిని మార్చుకోవడం. అది అతను రాధకు చెప్పాడు. అందుకు సైకియాట్రిస్ట్‌ కూడా బలం చేకూర్చాడు. రాధ డిసెంబర్‌ 31 రాత్రిని తన అపార్ట్‌మెంట్‌లో అందరితో కలిసి భర్తా పిల్లల తోడుగా జరుపుకుంది. కొత్త సంవత్సరం ఆమెకు నిజంగానే కొత్తది.  హ్యాపీ న్యూ ఇయర్‌. కథనం: సాక్షి ఫ్యామిలి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top