భారతం డయనోరారంగ

Sahitya Maramaralu, Madugula Nagaphani Sharma Dwishatavadanam - Sakshi

సాహిత్య మరమరాలు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 1995లో జరిగిన ద్విశతావధానంలో అవధాని మాడుగుల నాగఫణిశర్మను ఓ పృచ్ఛకుడు దత్తపదిలో భాగంగా ఒనిడా, డయనోరా, ఆస్కార్, ఆప్టానికా పదాలతో భారతార్థంలో ఓ పద్యం చెప్పమని కోరారు. అప్పుడు– అరణ్య, అజ్ఞాతవాసాలను పూర్తి చేసిన తరువాత శ్రీకృష్ణుడు కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునితో జరిపిన సంభాషణలో భాగంగా ఈ పదాలను ఉపయోగించి నాగఫణిశర్మ ఈ పద్యం చెప్పారు.

ఓ నీడా! నిను చూచి తీపి కలిగెన్‌ 
యుద్ధోద్యమ ప్రక్రియన్‌ _ హానిం గూర్చెడు నీ కుమారుడయ నోరారంగ కానందంబు
ఘటించు యుద్ధమున కాస్కారంబు లేకున్నచో _ నీవా యుద్ధము నాపటానికా నిదానింపంగబో కౌరవా!

ఓ కురుశ్రేష్ఠా, నీవు నీడలాంటివాడవు. ఛాయామాత్రుడివి. నీ పుత్రుని మీద తీపితో ఎలా చెబితే అలా వింటున్నావు. నేను నోరారా చెబుతున్నాను. నీ కుమారుడు నీకే కాదు, తనకే కాదు, యావత్‌ సామ్రాజ్యానికీ ప్రజలకూ చెడు చేస్తున్నాడు. యుద్ధానికి ఆస్కారం లేకుండా ఆపటానికి ప్రయత్నిస్తే నీకు ఆనందాన్ని కలిగిస్తాను, అంటాడు కృష్ణుడు.ఈ పద్యాన్ని ఆస్వాదించిన ఆహూతులంతా కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పంపినవారు: వాండ్రంగి కొండలరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top