ఈ అన్నం తింటే అస్సలు లావెక్కరట | Red Rice Is The Best Choice For Weight Loss | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ ఎందుకు దండగా.. ఎర్ర బియ్యం ఉండగా

Feb 20 2020 1:13 PM | Updated on Feb 20 2020 2:17 PM

Red Rice Is The Best Choice For Weight Loss - Sakshi

బయట ఎన్ని తిన్నా, ఎంత తిన్నా ఇంటికి వచ్చాక కొద్దిగానైనా సరే మళ్లీ అన్నం ముద్ద నోటిలోకి దిగాల్సిందే చాలామందికి. కానీ అన్నం ఎక్కువగా తింటే లావెక్కుతారని చాలామంది మితంగా తింటూ ఆకలిని చంపుకుంటూ పొట్టను ఇబ్బందులకు గురి చేస్తారు. అలాంటి వారికి ఈ విషయం తప్పకుండా శుభవార్తే అవుతుంది. తెల్ల బియ్యం, గోధుమ బియ్యం, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం.. వీటిన్నటినీ మీరు ఇంతకుముందు మీరు వినే ఉంటారు. అయితే ఇందులో ఎర్ర బియ్యం తింటే లావెక్కరంట. పైగా పోషకాలు కూడా మెండుగా ఉండటంతో ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదట. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి దీన్ని మించిన ఔషధం లేదంటున్నారు వైద్యులు. మరి అదెలాగో.. దీని ప్రయోజనాలేంటో ఓసారి చదివేద్దాం..

► వైఫైలా రక్షిస్తుంది: ఎర్ర బియ్యంలో ఆంటీయాక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇది మనకు వ్యాధులు రాకుండా, సంక్రమించకుండా నిరోధిస్తుంది. అంతేకాక ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దోహదపడే సెలెనీయం గాయాలను త్వరగా మాన్పేందుకు సహకరిస్తుంది.
► డయాబెటిస్‌ పటాపంచలు: మధుమేహాన్ని పారద్రోలే గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఎర్రబియ్యంలో ఉన్నాయి. ఇది తక్కువ మోతాదులోనే కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర లెవల్‌ను బ్యాలెన్సింగ్‌ చేస్తూ డయాబెటిస్‌ దరిచేరకుండా దోహదపడుతుంది.
► ఆస్తమాకు గుడ్‌బై: మెగ్నీషియం అనే మరో పోషకాన్ని కలిగి ఉన్న ఈ బియ్యంతో ఆక్సిజన్‌ సరఫరా సులువుగా జరుగుతుంది. నిత్యం దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నట్లైతే ఆస్తమా పటాపంచలవుతుంది.
స్పీడయ్యే జీర్ణక్రియ: ఫైబర్‌ మెండుగా ఉన్న ఎర్ర బియ్యం తినడానికి మాత్రమే కాదు.. జీర్ణం అవడం కూడా సులువుగానే ఉంటుంది. త్వరగా జీర్ణమై మీ కడుపును ఎలాంటి అసౌకర్యానికి గురి చేయదు.
► అతి ఆకలికి చాన్సే లేదు: కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు పెరుతామన్న భయం కూడా అవసరం లేదు. పైగా ఏదైనా తినాలంటే మనసొప్పకపోవడంతో మళ్లీ ఆకలి అనే మాటే ఎత్తరు. దీంతో మితంగానే తింటూ మీ బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
►  గుండెకు రక్షణ: కొవ్వును తగ్గించి హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. చైనీయులు గుండె సంబంధిత వ్యాధుల కోసం తయారు చేసే కొన్ని రకాల ఔషధాల మాదిరిగానే ఇది కూడా పనిచేయడం విశేషం. హానికరమైన చెడు కొవ్వును తగ్గించి గుండెకు రక్తసరఫరా మెరుగయ్యేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రైస్‌ తినేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా తక్కువే.
► కీళ్ల నొప్పులు దరిచేరవు: ఎముకలకు ఇది మంచి ఔషధం. కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉండటంతో కీళ్లు పటిష్టంగా ఉంటాయి. ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకుంటే కీళ్ల సంబంధిత వ్యాధులు దరిచేరవు.

ఉపయోగించడం ఎలా?
ఎర్ర బియ్యాన్ని వండటానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏమీ లేదు. సాధారణ బియ్యాన్ని వండినట్టే దీన్ని కూడా సిద్ధం చేస్తాం. ముందుగా మనకు కావాల్సిన మోతాదులో ఎర్ర బియ్యాన్ని తీసుకుని గంట సేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున నీళ్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా నీళ్లను మరిగించి తర్వాత అందులో బియ్యం వేసి తక్కువ మంటపై ఉంచాలి. మరో 20 నిమిషాల్లో వేడి వేడి అన్నం సిద్ధమైపోతుంది.

కాబట్టి నిస్సందేహంగా దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కానీ ఒక విషయం.. ఏదైనా సరే, ‘మితంగా తింటే అమృతం-అమితంగా తింటే విషం’. కాబట్టి దీన్ని మోతాదు మించి తినకుండా ఉంటేనే బెటర్‌. ఎక్కువ తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవించకపోయినప్పటికీ కొద్దిగా అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement