 
													సంవత్సరంలోని పన్నెండు నెలల్లో అత్యంత శోభాయమానమైన, విశిష్టమైన నెల రమజాన్. ఇందులోని ప్రారంభదశ– అంటే మొదటి పదిరోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తుంది. రెండవదశ క్షమాపణ, మన్నింపునకు సంబంధించినది. ఈదశలో దేవుడు దాసుల తప్పుల్ని క్షమించి, తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. ఇకమూడవది, నరకాగ్ని నుండి విముక్తిదశ. ఈ చివరిదశలో అల్లాహ్ అసంఖ్యాకమందిని నరకజ్వాలల భయం నుండి విముక్తి కల్పిస్తాడు.
ఇది చాలా కీలకమైన దశ. దీని ప్రాశస్త్యం చాలా గొప్పది. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజానుకు ఎంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ నెలలోని మూడుదశల్లో చివరి పదిరోజులకు అలాంటి ప్రాముఖ్యమే ఉంది. ఈ చివరి పదిరోజుల్లోని ఒకరాత్రిలో ‘షబెఖద్ర్’ ఉంది. దీన్ని ‘లైలతుల్ ఖద్ర్’ అని కూడా అంటారు. ఇది వెయ్యి నెలలకన్నా ఎక్కువ విలువైనది. ఈ రాత్రిలోనే పవిత్రఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ విషయాన్ని అల్లాహ్ ఇలా ప్రకటించాడు: ‘మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము.
ఆ రాత్రి ఘనత ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకన్నా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా శుభోదయం వరకు పూరి ్తశాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి’. (పవిత్రఖురాన్ 97– 1,5) ఖురాన్‌లో మరొకచోట ఇలా ఉంది.: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్. అది సమస్త మానవాళికీ మార్గదర్శక జ్యోతి. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన సూచనలు అందులో ఉన్నాయి.’(2–185)
ఖురాన్ అవతరణే ఘనతకు మూలం
మానవజాతికి సన్మార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని రమజాన్ నెలలో –  ప్రత్యేకించి చివరిభాగంలోని ’లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈరాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత ఏర్పడ్డాయి. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన వెయ్యి నెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనతో సమానమంటే దీనిప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి పదిరోజుల్లోని బేసిరాత్రుల్లోఆరాధనలు అధికంగా చెయ్యాలని ప్రవక్త ఉపదేశించారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులన్న మాట.
ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఈ రాత్రి ఆరాధనల్లో గడుపుతారో వారు నిజంగానే ధన్యులు. వారి గత అపరాధాలన్నీ మన్నించబyì  పునీతులవుతారు. మరెవరైతే షబేఖద్ర్‌లో ఆరాధనలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, ఆ శుభరాత్రిని పోగొట్టుకుంటారో అలాంటివారికి మించిన దౌర్భాగ్యులు, దురదృష్టవంతులు మరెవరూ ఉండరు. మహా ప్రవక్త వారి ప్రవచనాలద్వారా మనకు ఈవిషయాలు తెలుస్తున్నాయి.
అందుకని ఈ పవిత్ర మాసంలో, ముఖ్యంగా చివరి పదిరోజుల్లోనైనా చిత్తశుధ్ధితో, ఆత్మసంతోషంతో ఆరాధనలు, సదాచారాలు అధికంగా చేసి దైవప్రసన్నత పొందడానికి ప్రయత్నించాలి.’ ‘ఏతెకాఫ్’  ’ఫిత్రా’ లకు కూడా ఇదే అనువైన కాలం. చివరిపదిరోజులు ఏతెకాఫ్ పాటించడానికి ప్రయత్నించాలి. అంటే మొత్తం పదిరోజులపాటు రేయింబవళ్ళుమసీదులోనే ఆరాధనలో గడపాలన్నమాట. అత్యవసరాలైన మానవసహజ అవసరాలకు మాత్రమే మసీదునుండి బయటికి వెళ్ళే అనుమతి ఉంది.
అన్నపానీయాలు కూడా మసీదుకే తెప్పించుకోవాలి. ఈవిధంగా రమజాన్ చివరిదినాల్లో పండుగకు కొన్నిరోజుల ముందు ఫిత్రాలు కూడా చెల్లిస్తే, పేదసాదల పండుగ అవసరాలు తీరతాయి. వారు కూడా సంతోషంగా పండుగసంబురాల్లో పాలుపంచుకునే అవకాశాలు మెరుగుపడతాయి. కొందరిసంతోషం కాకుండా అందరి ఆనందమేకదా పండుగ.
అల్లాహ్ అందరికీ ఇతోధికంగా పుణ్యకార్యాలు ఆచరించి, ఇహపర సాఫల్యాలకు అర్హతసాధించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
