పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

Pediatric Counseling - Sakshi

వర్షాల సీజన్‌లో పిల్లలకు వాంతులు, విరేచనాలు అవుతుంటే...
మా ఇంట్లో స్కూలుకు వెళ్లే చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దాంతో వారికి ఈ సీజన్‌లో సాధారణంగా కనిపించే వాంతులు, విరేచనాలు అవుతాయేమోనని భయంగా ఉంది. మా ఊరు పట్టణానికి కాస్తంత దూరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ప్రథమ చికిత్స చేయాలో చెప్పండి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి. – డి. వాసంతి, మోతే
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయినప్పుడు వారు తమ శరీరాల నుంచి నీటితో పాటు ఖనిజలవణాలను కోల్పోతారు. దాంతో వారు నీరసపడటం, స్పృహ కోల్పోవడంతో పాటు ఒక్కోసారి ఫిట్స్‌ బారిన కూడా పడవచ్చు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే వారు కోల్పోయిన నీటిని వెంటనే భర్తీ చేయడం అవసరం. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకు ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీ–హైడ్రేషన్‌ సొల్యూషన్‌) ఇవ్వడం వల్ల వారు కోల్పోయిన ఖనిజలవణాలు భర్తీ అవుతాయి. ఇవి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మందుల షాప్‌లో దొరుకుతాయి. ఎంత పౌడర్, ఎన్ని నీళ్లలో కలపాలన్న సూచనలు పాకెట్‌ మీద రాసి ఉంటుంది.

అయితే ఆ ఓఆర్‌ఎస్‌ ద్రవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం ఉందా లేదా చూసుకోవాలి. ఒకసారి కలుపుకున్న ద్రవాన్ని 24 గంటల పాటు వాడవచ్చు. ప్రతి ఒక్కరూ ముందుగానే ఇంట్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ ఉంచడం మంచిది. ఈ ద్రవాన్ని ప్రతి విరేచనం తర్వాత 30 ఎమ్‌ఎల్‌ నుంచి 50 ఎమ్‌ఎల్‌ వరకు తాగించాలి. అయితే పెద్ద విరేచనం అయితే 100 ఎమ్‌ఎల్‌ పట్టించాలి. వాంతులు అవుతుంటే వాంతి అయిన 15–30 నిమిషాలు ఆగి 5 నిమిషాలకు ఒక స్పూన్‌ చొప్పున  ఓఆర్‌ఎస్‌ను నెమ్మదిగా తాగిస్తూ ఉండాలి.

కొబ్బరినీళ్లు కూడా ఇవ్వవచ్చు. అయితే పాలు తాగే పిల్లల విషయంలో వాంతి, లేదా విరేచనం అయ్యింది కదా అని తల్లిపాలు మానవద్దు. కొంతమంది తెలియక విరేచనాలు ఆపడానికి మందుల షాపు నుంచి మందులు కొని పిల్లలకు వేస్తారు. ఇలాంటి చర్యల వల్ల ప్రమాదం. పిల్లల్లో ఇన్ఫెక్షన్‌ ఉంటే... అది కడుపులోనే ఉండిపోయి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే డాక్టర్లు సూచించిన మందులనే వాడాలి.

వాంతులు, విరేచనాలు ఆగకపోయినా / చిన్నారి విపరీతంగా నీరసపడిపోయినా / విపరీతమైన కడుపునొప్పి ఉన్నా / తీవ్రమైన జ్వరం వచ్చినా / రక్తవిరేచనాలు అవుతున్నా లేదా జిగట విరేచనాలు అవుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాంతులు అవుతున్నప్పుడు వెంటనే ఆహారం ఇవ్వాలని చూడవద్దు. మందుగా ఓఆర్‌ఎస్‌ లేదా కొబ్బరినీళ్ల వంటివి బాగా ఇచ్చాక వాంతులు ఆగి, ఆకలిగా అనిపిస్తున్నప్పుడు మాత్రమే తేలిగ్గా ఉండే ఆహారం ఇవ్వాలి. విరేచనాలు అవుతుండగా చక్కెర / తేనె / గ్లూకోజ్‌ / చాక్లెట్లు / బిస్కెట్లు / పాలు / జ్యూస్‌లు ఇవ్వవద్దు. పాలుతాగే పిల్లల్లో తల్లిపాలు మానవద్దు. బాగా మెత్తగా ఉడికించిన అన్నం, ఇడ్లీ, గంజి, మజ్జిగ, సగ్గుబియ్యం జావ, సూప్‌లు (ఇంట్లో చేసినవి) ఇవ్వవచ్చు.

చిన్న పిల్లలకు దెబ్బలు తగిలినప్పుడు...
మా ఇంట్లో ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే వయసు చిన్నారులు ఉన్నారు. వారు బాగా అల్లరి పిల్లలు. వీళ్లూ, మా పొరుగువాళ్లూ బాగా ఆడుతూ ఉంటారు. తరచూ చిన్నచిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉండటమూ మామూలే. ఇలాంటి సమయంలో హాస్పిటల్‌కు వెళ్లేలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్‌. సురేఖ, కేతేపల్లి
దెబ్బ తగిలినప్పుడు బిడ్డను కూర్చోబెట్టి శుభ్రమైన బట్టతోగాని, గాజుగుడ్డతో గాని రక్తం కారడం ఆగేవరకు గాయం మీద తేలిగ్గా అదిమిపట్టి ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో గాయాన్ని కడగండి. శుభ్రమైన గాజుగుడ్డను యాంటీసెప్టిక్‌ సొల్యూషన్‌ (డెట్టాల్‌ / బీటాడిన్‌)లో ముంచి దెబ్బ చుట్టూ తుడవండి.

నేరుగా దెబ్బమీద తుడిస్తే బిడ్డల గాయం బాగా మండుతుంది. వారు తట్టుకోలేకపోవచ్చు. అందుకు ముందుగా దెబ్బకు దగ్గరగా తుడవడం మొదలుపెట్టి దూరంగా వెళ్లాలి. తర్వాత శుభ్రమైన పొడి గాజుగుడ్డతో దెబ్బచుట్టూ పైపైన అద్దండి. గాయానికి గాలి తగలనిస్తే త్వరగా తగ్గుతుంది. పిల్లవాడు బయటికి ఆడుకోవడానికి వెళ్లినప్పుడు మాత్రం బ్యాండ్‌ఎయిడ్‌తో కవర్‌ చేయవచ్చు.

ఇలా దెబ్బతగిలినప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు
గాయం నుంచి రక్తస్రావం అవుతుంటే... దెబ్బ తగిలిన అవయవ భాగాన్ని ఎత్తి పట్టుకుంటే రక్తస్రావం తొందరగా ఆగుతుంది.
 దెబ్బ మీద చేతులతో కడగవద్దు. ట్యాప్‌ నీళ్ల కిందగానీ లేదా మగ్గులోంచి నీళ్లు ధారగా పోస్తూ గానీ కడగండి.
 యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ పూసి, దానిమీద బ్యాండ్‌ఎయిడ్‌ పెట్టవచ్చు.
 దెబ్బను తుడవడానికి నూలు వాడకండి. అది గాయానికి అంటుకుపోయే ప్రమాదం ఉంది.
 డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైతే టీటీ ఇంజెక్షన్‌ తీసుకోవాలి. అయితే షెడ్యూల్‌ ప్రకారం టీకాలు వేయిస్తూ, టీటీ టీకా ఇటీవలే తీసుకొని ఉంటే... చిన్న చిన్న దెబ్బలకు టీటీ ఇంజెక్షన్‌ అవసరం లేదు.
 దెబ్బలో ఏదైనా గట్టిగా ఇరుక్కొని ఉంటే దాన్ని బలవంతంగా లాగవద్దు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌కు చూపించడమే మంచిది.
పంచదార, పేస్ట్, టీపొడి లాంటివి దెబ్బమీద అంటించవద్దు.
చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవారు మీ ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌లో గాజుపీస్‌లు, యాంటీసెప్టిక్‌ సొల్యూషన్, బ్యాండ్‌ఎయిడ్, యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ వంటివి ఎప్పుడూ అందుబాటులోఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

- డాక్టర్‌ శివరంజని సంతోష్‌ ,సీనియర్‌ పీడియాట్రీషియన్, రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top