పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

Pediatric Counseling - Sakshi

బాబుకు తరచూ జలుబు... సలహా ఇవ్వండి
మా బాబుకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. చల్లటి పదార్థాలు, పానీయాలు వద్దన్నా మానడు. ఒక్కోసారి ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతుంటాడు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటి ప్రభావం సరిగ్గా లేదు. బాబు ఆరోగ్య విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలో తెలియజేయండి. – ఎమ్‌. సుభానీ, నెల్లూరు
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. అందులోనూ మీ బాబుకు ఉన్నది సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌గా చెప్పవచ్చు. పిల్లల్లో సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌  లక్షణాలు ఆరేళ్ల వయసు తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో జలుబు, ముక్కు దురద, కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఊపిరి తీసుకోవడంలో కష్టం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ సమస్య చాలా సాధారణం.

దీనికి నిర్దిష్టమైన కారణం చెప్పలేకపోయినప్పటికీ వంశపారంపర్యంగా కనిపించడంతో పాటు వాతావరణ, పర్యావరణ మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. పూల మొక్కలు, దుమ్ము, ధూళి, పుప్పొడి, రంగులు, డిటర్జెంట్స్‌ వంటివి శరీరానికి సరిపడకపోవడం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలు. మీ బాబుకు యాంటీహిస్టమైన్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, ఇంట్రానేసల్‌ స్టెరాయిడ్‌ స్ప్రేస్‌ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. చల్లటి పదార్థాలు తగ్గించడం, సరిపడనివాటికి దూరంగా ఉంచడంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది.

బాబు మాటిమాటికీ మూత్రానికి లేస్తున్నాడు...
మా బాబు వయసు పన్నెండేళ్లు. రాత్రిళ్లు చాలాసార్లు మూత్రవిసర్జనకు లేస్తుంటాడు. పగటి వేళ కూడా చాలాసార్లు వెళ్తుంటాడు. ఇప్పటికీ పక్కతడుపుతున్నాడు. ఈ సమస్యతో వాడికీ, మాకూ చాలా ఇబ్బందిగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – సులక్షణ, సిద్ధిపేట
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్‌డ్‌ ఫ్రీక్వెన్సీ ఆఫ్‌ యూరినేషన్‌ అని చెప్పవచ్చు. దాంతోపాటు యూరిన్‌ ఎక్కువగా రావడాన్ని బట్టి చూస్తే పాలీయూరియా అన్న కండిషన్‌ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్,ఎండోక్రైన్‌ సమస్యలు, యూరినరీ బ్లాడర్‌ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, సైకలాజికల్‌ సమస్యలు, మలబద్ధకం వంటివి ముఖ్యమైనవి.

మీ బాబు విషయంలో అతడి సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోవడానికి కంప్లీట్‌ యూరిన్‌ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్‌ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్‌ ఆఫ్‌ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

దాంతో పాటు వాళ్లు మూత్రవిసర్జన చేసే సమయంలో అసంపూర్తిగా కాకుండా పూర్తిగా చేసేలా చూడాలి. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే మీవాడి సమస్యకు కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌  చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి.

- డా. రమేశ్‌బాబు దాసరి ,సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top