పచ్చని పంటలే ఆ ఇంటి చిరునామా!

Organic food for cultivating home crops - Sakshi

ఇంటి పంట

కాంక్రీట్‌ జంగిల్‌లా మారిపోతున్న నగరంలోని ఆ ఇంటికి వెళ్తే మాత్రం.. పచ్చదనం పలకరిస్తుంది. పూల పరిమళాలు రారమ్మని పిలుస్తుంటాయి. రెండంతస్తులు ఎక్కితే చాలు.. విభిన్న రకాల పూలు, పళ్లు, ఆకు కూరలు, కూరగాయలతో ఏదైనా పొలంలోకి వచ్చామా అని సంభ్రమాశ్చర్యాలకు లోనైపోతారు. ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు ఏవీ బయట కొనుగోలు చేసే అవసరమేలేకుండా మిద్దెపైనే పండిస్తున్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో మేడపై సేంద్రీయ వనాన్ని పెంచుతున్న విశాఖ నగరానికి చెందిన పద్మావతి.

టెర్రస్‌ల పైన సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ, పూల మొక్కలను మక్కువతో పెంచుతూ.. కాంక్రీటు జంగిల్‌లో కూడా నిండు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న ఇంటిపంటల సాగుదారుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ తర్వాత విశాఖపట్నం నగరంలోనే ఎక్కువగా ఉన్నారు. ఈ జాబితాలో ఒకరు రాంభక్త పద్మావతి. విశాఖ నగరంలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న పద్మావతి, ఆర్‌ కె ప్రసాద్‌ దంపతుల ఇల్లు పచ్చని చెట్లతో నిండి కళకళలాడుతూ ఉంటుంది.

ఎమ్మే బీఈడీ, ఎంసీఏ చదివిన పద్మావతికి ఉద్యోగం, సంపాదనపై కన్నా పర్యావరణంపైన, సేంద్రియ ఆహారంపైనే మక్కువ. రచయిత్రిగా సాహితీ రంగంలోనూ రాణిస్తున్న ఆమెకు బాల్యం నుంచే మొక్కల పెంపకంపై అమితాసక్తి. ఆమె అభిరుచికి అనుగుణంగా భర్త ప్రసాద్‌ కాంట్రాక్టర్‌ కావడంతో మూడో అంతస్థుపైన టెర్రస్‌ను మొక్కల పెంపకానికి అనువుగా సిమెంటు తొట్లు నిర్మించారు. సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీల్లోనూ మొక్కలు పెంచుతూ మేడనే ఓ వనంగా మార్చేశారు.

కాలుష్య రహితమైన సౌర విద్యుత్తును ఒడిసిపట్టుకోవడానికి కొన్ని సౌర ఫలకాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ఎప్పుడో మరీ అవసరమైనప్పుడు తప్ప కూరగాయలను బయట కొనలేదని పద్మావతి తెలిపారు. మునగ, వంగ తదితర కూరగాయలతో పాటు అరటి, నిమ్మ తదితర పండ్ల మొక్కలనూ సాగు చేస్తున్నారు. వంట గదిలో రెండు కుండీల్లో పుదీనా, కొత్తిమీర పెంచుతున్నారు. టెర్రస్‌పైన, పెంట్‌ హౌస్‌ ముందు తోటకూర, గోంగూర, బచ్చలి, పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, మెంతికూర, మొదలైన ఆకుకూరలను సాగు చేస్తున్నారు.

వంకాయ, టమాటా, చిక్కుడు, బీర, దోస, సొర, మిరపకాయలు, అల్లం మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. ఇంటికి సమీపంలో పశువులు పెంచుతున్న వారి వద్ద నుంచి గోమూత్రం, ఆవు పేడను కొనుగోలు చేసి ఎరువుగా వినియోగిస్తున్నారు. చీడపీడల నివారణకు వేపనూనె, గోమూత్రం, వేపాకు పొడి తదితరాలను నీటిలో కలిపి పద్మావతి పిచికారీ చేస్తున్నారు. ఏపుగా పెరిగిన అరటి గెలలు, మునగ చెట్లు వారి ఇంటిపై పచ్చదనానికి కొండగుర్తుగా దూరం నుంచి కూడా కనిపిస్తుంటాయి.  

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే..!
‘నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోయింది. నాకు బాధేసింది. అందుకే.. మా ఇంటి వరకూ పర్యావరణం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనతోనే మొక్కల పెంపకం ప్రారంభించాను. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించడంతో ఆకుకూరలు, కూరగాయలతోపాటు ఇలా ప్రతి మొక్కను పెంచసాగాను. మేడపై విస్తారంగా పచ్చదనం పరచుకోవడంతో వేసవిలోనూ ఇల్లు చల్లగా ఉంటోంది. మొక్కలు చూసి మా ఇంటి అడ్రస్‌ కూడా సులభంగా గుర్తుపడుతున్నారు.
– రాంభక్త పద్మావతి, రామ్‌నగర్, విశాఖపట్నం

– కరుకోల గోపీకిశోర్‌ రాజా, సాక్షి, విశాఖ సిటీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top